మార్చిలోపు జీవీకే ఎయిర్‌పోర్ట్ ఐపీవో! | GVK Power & Infrastructure Ltd. IPO | Sakshi
Sakshi News home page

మార్చిలోపు జీవీకే ఎయిర్‌పోర్ట్ ఐపీవో!

Published Fri, Nov 27 2015 1:23 AM | Last Updated on Sun, Sep 3 2017 1:04 PM

మార్చిలోపు జీవీకే ఎయిర్‌పోర్ట్ ఐపీవో!

మార్చిలోపు జీవీకే ఎయిర్‌పోర్ట్ ఐపీవో!

ఎయిర్‌పోర్ట్ వ్యాపారంపైనే ప్రధానంగా దృష్టి
 ఐదేళ్లలో 20 కోట్ల ప్రయాణికుల
 నిర్వహణ సామర్థ్య లక్ష్యం

 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విద్యుత్, ఇన్‌ఫ్రా రంగంలో పోటీ అధికంగా ఉండటంతో విమానాశ్రయాల అభివృద్ధి, నిర్వహణ వ్యాపారంపై అధికంగా దృష్టిసారించాలని  నిర్మాణ రంగ కంపెనీ జీవీకే ఇన్‌ఫ్రా నిర్ణయించింది. వచ్చే ఐదేళ్లలో ఎయిర్‌పోర్ట్ విభాగంలో ప్రపంచంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. వచ్చే ఐదేళ్లలో తమ ఎయిర్‌పోర్టుల ద్వారా ఏటా 20 కోట్ల మంది ప్రయాణించే స్థాయికి వ్యాపారాన్ని వృద్ధి చేయాలని జీవీకే నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశీయ, అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోవడంపై కంపెనీ దృష్టిసారించింది.
 
  ఇప్పటికే జీవీకే ఇండోనేషియాలో రెండు విమానాశ్రయాలను, దేశంలో ముంబై, బెంగళూరు విమానాశ్రయాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు ఇప్పుడు నవీ ముంబైలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఎయిర్‌పోర్ట్ బిడ్డింగ్‌లో కూడా జీవీకే పాల్గొంది. అలాగే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపడుతున్న చిన్న విమానాశ్రయాల అభివృద్ధిలో కూడా తాము పాలుపంచుకోనున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. విద్యుత్, రహదారుల ప్రాజెక్టులకు బిడ్డింగ్ పిలిస్తే 30 కంపెనీల వరకు పోటీపడుతున్నాయని, అదే ఎయిర్‌పోర్ట్ విభాగంలో పోటీ తక్కువగా ఉండటంతో దీనిపై అధికంగా దృష్టిసారిస్తున్నట్లు గతంలో జీవీకే గ్రూపు వైస్ చైర్మన్ జీ.వీ. సంజయ్ రెడ్డి పేర్కొన్న సంగతి తెలిసిందే.  
 
 ప్రస్తుతం ప్రైవేటు రంగంలో జీవీకే, జీఎంఆర్ కంపెనీలు స్వంతంగా నాలుగు విమానాశ్రయాలను నిర్వహిస్తున్నాయి. కానీ ఇప్పుడు నవీ ముంబై ఎయిర్‌పోర్ట్ కాంట్రాక్టుకు హిరనందానీ, టాటా రియల్టీ సంస్థలు విదేశీ భాగస్వామ్య కంపెనీలతో కలిసి బిడ్డింగ్ దాఖలు చేయడం విశేషం.విమానాశ్రయాలపై అధికంగా దృష్టిసారిస్తున్న జీవీకే గ్రూపు ఎయిర్‌పోర్ట్ విభాగాన్ని లిస్టింగ్ చేయడం ద్వారా నిధులు సేకరించడానికి రంగం సిద్ధం చేసుకుంది. నవీ ముంబై ఎయిర్‌పోర్ట్ బిడ్డింగ్ వ్యవహారం తేలిన వెంటనే ఐపీవో ముసాయిదా పత్రాలను దాఖలు చేయడానికి కంపెనీ వేచి చూస్తున్నట్లు  సమాచారం.
 
 ఈ ఆర్థిక సంవత్సరంలోపు(2016 మార్చిలోగా) ఐపీవోకి రావడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు జీవీకే ఇన్‌ఫ్రా సీఎఫ్‌వో ఇసాక్ జార్జ్ తెలిపారు. దీనికి సంబంధించి ముసాయిదా పత్రాలు కూడా సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే సెబీకి దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఐపీవో ద్వారా కనీసం రూ. 3,500 కోట్లు సమీకరించాలన్నది కంపెనీ ఆలోచన. నవీ ముంబై బిడ్డింగ్ వ్యవహారం మరో 4 రోజుల్లో తేలనున్నట్లు సమాచారం. ఇప్పటికే ముంబై ఎయిర్‌పోర్టు నిర్వహిస్తున్న జీవీకేకి నవీ ముంబై ఎయిర్‌పోర్ట్ బిడ్డింగ్‌లో ఫస్ట్ రైట్ ఆఫ్ రెఫ్యూజల్ అవకాశం ఉండటంతో తమకే ఈ బిడ్డింగ్ వస్తుందన్న నమ్మకంతో కంపెనీ వర్గాలున్నాయి. దేశంలో తొలిసారిగా రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న నగరంగా ముంబై రికార్డులకు ఎక్కనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement