National investment
-
‘వెపా’ ప్రెసిడెంట్‌గా ఇన్వెస్ట్ ఇండియా ఎన్నిక
న్యూఢిల్లీ: పెట్టుబడుల ప్రోత్సాహక ఏజెన్సీలకు సంబంధించిన వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీస్ (వైపా) ప్రెసిడెంట్‌గా ఇన్వెస్ట్ ఇండియా ఏకగ్రీవంగా ఎన్నికైంది. భారత్‌పై అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని అధికార వర్గాలు తెలిపాయి. 2021–23 కాలానికి వైపా స్టీరింగ్ కమిటీలో ప్రెసిడెంట్‌గా ఇన్వెస్ట్ ఇండియా ఉండనుండగా, ఈజిప్ట్.. స్విట్జర్లాండ్ వైస్–ప్రెసిడెంట్లుగా వ్యవహరించనున్నాయి. బ్రెజిల్, దక్షిణ కొరియా మొదలైన తొమ్మిది దేశాలు ప్రాంతీయ డైరెక్టర్లుగా ఉంటాయి. స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేసే వైపా మండలిలో ఐక్యారాజ్య సమితికి చెందిన వివిధ సంస్థలు, వరల్డ్ బ్యాంక్ మొదలైన వాటికి సభ్యత్వం ఉంది. భారత్‌లో పెట్టుబడుల అవకాశాలు పరిశీలిస్తున్న ఇన్వెస్టర్లకు తోడ్పడేందుకు జాతీయ పెట్టుబడి ప్రోత్సాహక, సమన్వయ ఏజెన్సీగా ఇన్వెస్ట్ ఇండియా ఏర్పాటైంది. వ్యాపారాలను స్వాగతించేందుకు పలు కీలకమైన ఆర్థిక సంస్కరణల అమలుకు భారత్ నిరంతరం చర్యలు తీసుకుంటోందని అధికారులు తెలిపారు. దీనితో దాదాపు 30 లక్షల ఉద్యోగాలు కలి్పంచేందుకు అవకాశమున్న 155 బిలియన్ డాలర్ల పైగా సూచనప్రాయ పెట్టుబడులకు ఇన్వెస్ట్ ఇండియా సమన్వయకర్తగా వ్యవహరిస్తోందని వివరించారు. -
ఫార్మాసిటీకి ‘నిమ్జ్’ హోదా
సాక్షి, హైదరాబాద్: ఫార్మా రంగం విస్తరణ, నూతన పెట్టుబడులు ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ‘హైదరాబాద్ ఫార్మాసిటీ’కి జాతీయ పెట్టుబడులు, ప్రోత్సాహక మండలి (నిమ్జ్) హోదా ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం తుది ఆమోదం తెలిపింది. 2015లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మాసిటీకి నిమ్జ్ హోదా ఇచ్చేందుకు కేంద్ర పరిశ్రమల శాఖ పరిధిలోని పరిశ్రమల ప్రోత్సాహక విధాన విభాగం (డిప్) 2016 జనవరి 22న సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఫార్మాసిటీకి సంబంధించిన టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్టు (సాంకేతిక ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదిక)తో పాటు అభివృద్ధి ప్రణాళిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సమరి్పంచింది. ఈ నివేదికలను కూలంకషంగా పరిశీలించిన కేంద్ర పరిశ్రమల శాఖ ఫార్మాసిటీకి నిమ్జ్ హోదా కలి్పంచాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఈ నెల 10న తుది ఆమోదం తెలపడంతో పాటు, రాష్ట్రానికి సమాచారం అందించింది. నిమ్జ్ హోదాకు పూర్తి స్థాయిలో ఆమోదం లభించిన నేపథ్యంలో ఫార్మాసిటీలో బాహ్య, అంతర్గత మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం నుంచి గ్రాంటు రూపంలో సాయం అందుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. నిధుల వేటలో రాష్ట్ర ప్రభుత్వం ఫార్మాసిటీ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.16,395 కోట్లు కాగా, నిమ్జ్ హోదా ద్వారా మౌలిక సదుపాయాలకు రూ.6 వేల కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఫార్మాసిటీలో బాహ్య, అంతర్గత మౌలిక, సాంకేతిక సదుపాయాలకు రూ.6 వేల కోట్లు ఇవ్వాలని ‘డిప్’కు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రతిపాదనలు సమర్పించింది. తొలి విడతలో రూ.1,500 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తంచేసినా నిధులు విడుదల కాలేదు. దీంతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అక్టోబర్ 19న ఫార్మాసిటీ అభివృద్ధికి నిధులు ఇవ్వాలంటూ మరోమారు ప్రతిపాదనలు సమరి్పంచారు. ఫార్మాసిటీ తొలి దశ అభివృద్ధిలో భాగంగా రోడ్లు, నీటి సరఫరా తదితర బాహ్య సదుపాయాలకు రూ.1,318 కోట్లు, అంతర్గత సదుపాయాల కోసం రూ.2,100 కోట్లు, మొత్తంగా రూ.3,418 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. కేంద్రం చేపట్టిన ‘మేకిన్ ఇండియా’లో భాగంగా ప్రపంచ శ్రేణి ఫార్మాసిటీని అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి కూడా ఈ అంశాన్ని ఇటీవల లోక్‌సభలో ప్రస్తావించారు. 5.6 లక్షల మందికి ఉపాధి రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో 19,333 ఎకరాల్లో ఏర్పాటు చేసే హైదరాబాద్ ఫార్మాసిటీ ద్వారా 5.6 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. మౌలిక సదుపాయాలు కల్పిస్తే రూ.64 వేల కోట్ల పెట్టుబడులకు అవకాశం ఉందని భావిస్తోంది. దీంతో మౌలిక సదుపాయాల కల్పనను త్వరితగతిన పూర్తి చేసేందుకు టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ‘హైదరా బాద్ ఫార్మాసిటీ లిమిటెడ్’ పేరిట స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) కూడా ఏర్పాటు చేశారు. ఫార్మాసిటీలో అంతర్గత మౌలిక సౌకర్యాల కు అవసరమైన నిధుల కోసం ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుకు ప్రతిపాదనలు సమరి్పంచింది. ఫార్మాసిటీని ప్రధాన రహదారులతో అనుసంధానిస్తూ సుమారు రూ.400 కోట్లతో రహదారుల విస్తరణ, విద్యుత్ లైన్ల ఏర్పాటు వంటి పనులు కూడా ఎస్పీవీ చేపట్టింది. -
జీవీకే ఎయిర్‌పోర్టులో 49% వాటా విక్రయం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను నిర్వహిస్తున్న జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్‌లో 49 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు దిగ్గజ కంపెనీలు ముందుకొచ్చినట్టు సమాచారం. ఇందుకోసం అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఏడీఐఏ), నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్(ఎన్ఐఐఎఫ్) కన్సార్షియంతో కెనడాకు చెందిన పబ్లిక్ సెక్టార్ పెన్షన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ (పీఎస్పీ ఇన్వెస్ట్మెంట్స్) చేతులు కలుపుతోంది. కన్సా ర్షియంలో ఈ కంపెనీలన్నిటికీ సమాన వాటా ఉండ నుంది. డీల్ విలువ సుమారు రూ.6,000 కోట్లుగా తెలుస్తోంది. ఎన్ఐఐఎఫ్, ఏడీఐఏలు ఈక్విటీ, డెట్ రూపంలో నిధులు సమకూర్చనున్నాయి. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను (ఎంఐఏఎల్) రూ.12,000 కోట్లుగా విలువ కట్టినట్టు సమాచారం. కొత్త ఇన్వెస్టర్లు జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ బోర్డులో చేరనున్నారు. సంస్థ కార్యకలాపాల్లోనూ పాలుపంచుకోనున్నారు. రుణ భారం తగ్గించుకోవడానికే..: ముంబైలోని చత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఎంఐఏఎల్ నిర్వహిస్తోంది. ఎంఐఏఎల్‌లో జీవీకే వాటా 50.5% కాగా, బిడ్ సర్వీసెస్ డివిజన్‌కు (మారిషస్) 13.5%, ఏసీఎస్ఏ గ్లోబల్‌కు 10%, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీకి 26% వాటా ఉంది. ముంబై విమానాశ్రయాన్ని 2006 నుంచి నిర్వహిస్తున్న జీవీకే.. నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టును రూ.16,704 కోట్లతో నిర్మిస్తోంది. డెవలప్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ ప్రాతిపదికన చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఎంఐఏఎల్‌కు 74%, సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు(సిడ్కో) మిగిలిన వాటా ఉంది. 2020 మధ్యలో ఈ కొత్త విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఇటీవల ప్రకటించారు. కాగా, జీవీకే రూ.5,750 కోట్ల వరకు రుణ భారాన్ని తగ్గించుకోవడానికి ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎన్ఐఐఎఫ్, ఏడీఐఏతో నాన్ బైండింగ్ ఒప్పందాన్ని చేసుకుంది. తాజా డీల్‌తో వచ్చిన నిధులతో ఎంఐఏఎల్‌లో బిడ్వెస్ట్, ఏసీఎస్‌ఏలకు ఉన్న వాటాలను జీవీకే కొనుగోలు చేయనుంది. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యెస్ బ్యాంకుల్లో సంస్థకున్న రుణ భారాన్ని తగ్గించుకోనుంది. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్స్ బిజినెస్‌కు రూ.8,000 కోట్ల అప్పు ఉంది. -
ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా మెదక్ నిమ్జ్!
* టీఎస్ఐఐసీకి అనుబంధంగా ఏర్పాటు * పారిశ్రామిక పార్కు అభివృద్ధి బాధ్యత నూతన కంపెనీకి.. * 18 నెలల్లో 12,635 ఎకరాలు నూతన కంపెనీకి బదిలీ సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లాలో జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తుది ఆమోదం తెలిపిన నేపథ్యంలో... భారీ పారిశ్రామిక పార్కు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మౌలిక వసతుల కల్పన, ప్లాట్ల కేటాయింపును పర్యవేక్షించేందుకు ప్రత్యేక సంస్థ (స్పెషల్ పర్పస్ వెహికిల్)ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ)కి అనుబంధంగా మెదక్ నిమ్జ్ జోన్ లిమిటెడ్ పేరిట ఈ కంపెనీ ఏర్పాటైంది. ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా ఏర్పాటైనా.. మాతృసంస్థ టీఎస్ఐఐసీ వంద శాతం ప్రభుత్వ సంస్థ కావడంతో నూతన కంపెనీ కార్యకలాపాలన్నీ ప్రభుత్వ పర్యవేక్షణలోనే కొనసాగుతాయి. భూమి అప్పగింతకు సన్నాహాలు నిమ్జ్ ఏర్పాటుకు మెదక్ జిల్లా జహీరాబాద్, న్యాలకల్ మండలాల్లో 12,635 ఎకరాలను గుర్తించారు. మూడు దశల్లో 18 నెలల వ్యవధిలో భూసేకరణ పూర్తి చేయాలని... తొలి దశలో కనీసం మూడు వేల ఎకరాలు అప్పగిస్తేనే నిమ్జ్ హోదా దక్కుతుందని కేంద్ర పారిశ్రామిక పెట్టుబడులు, ప్రోత్సాహక విభాగం (డిప్) స్పష్టీకరించింది. మొత్తం భూసేకరణకు రూ.2,450 కోట్లు అవసరమని అంచనా వేయగా.. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.134 కోట్ల మేర విడుదల చేసింది. తొలి విడతకు సంబంధించి మూడు వేల ఎకరాల భూసేకరణ పూర్తి కావడంతో... దానిని మెదక్ నిమ్జ్ జోన్ లిమిటెడ్‌కు అప్పగించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. ఇక పనులు వేగవంతం రాష్ట్రంలో పారిశ్రామిక పార్కుల్లో మౌలిక సౌకర్యాల కల్పన, నిర్వహణ తదితరాలు టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో జరుగుతాయి. కానీ నిమ్జ్ వంటి భారీ పారిశ్రామిక పార్కు అభివృద్ధి సవాలుతో కూడుకున్నది కావడంతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని డిప్ షరతు విధించింది. ఈ మేరకు ‘మెదక్ నిమ్జ్ లిమిటెడ్’ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నుంచి టీఎస్ఐఐసీకి భూ బదిలీ జరిగిన వెంటనే పార్కు అభివృద్ధికి సంబంధించిన సంపూర్ణ నివేదిక తయారీ, పర్యావరణ అనుమతులు, లే ఔట్ రూపకల్పన, కాంట్రాక్టు సంస్థల ఎంపిక తదితర కార్యకలాపాలన్నీ మెదక్ నిమ్జ్ జోన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరుగుతాయి. అయితే పాలనా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు టీఎస్ఐఐసీ అధికారులనే కేటాయిస్తారా, లేక ప్రత్యేక అధికారులను నియమిస్తారా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఎన్నో ప్రయోజనాలు నిమ్జ్ హోదా దక్కే పారిశ్రామిక వాడలకు కేంద్రం భారీ ఎత్తున రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఆ పారిశ్రామిక వాడకు ప్రధాన మార్గాలతో అనుసంధానం, మౌలిక సౌకర్యాల కల్పనకు అయ్యే వ్యయాన్ని కేంద్రం వంద శాతం గ్రాంటు రూపంలో అందిస్తుంది. దీంతోపాటు అక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తుంది. మెదక్ నిమ్జ్‌ను ఉదాహరణగా తీసుకుంటే మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.3వేల కోట్లు గ్రాంటు రూపంలో, అందులో ఏర్పాటయ్యే పరిశ్రమలకు రూ.4వేల కోట్ల మేర ప్రోత్సాహకాలు, రాయితీ రూపంలో అందే వీలుంది. ఈ నిమ్జ్‌తో 2022 నాటికి సుమారు రూ.40వేల కోట్ల పెట్టుబడులతో మూడు లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని అంచనా. కేంద్ర నిబంధనల మేరకు ఏదైనా పారిశ్రామిక వాడకు నిమ్జ్ హోదా దక్కాలంటే 50 చదరపు కిలోమీటర్ల పరిధిలో కచ్చితంగా 5 వేల హెక్టార్ల (సుమారు 12,500 ఎకరాల) స్థలం ఉండాలి.