buying shares
-
పెట్టుబడికి సోషల్ రూట్..?
ఇటీవలి స్టాక్ మార్కెట్ రికార్డుల ర్యాలీ కొత్త ఇన్వెస్టర్లను పెద్ద ఎత్తున ఆకర్షిస్తోంది. కొత్త డీమ్యాట్ ఖాతాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. డీమ్యాట్ ఖాతాల సంఖ్య 2023 జూలై నాటికి 12.3 కోట్లు దాటిపోయింది. 2020 మార్చి నాటికి ఉన్న 4 కోట్లతో పోలిస్తే మూడేళ్లలోనే మూడు రెట్లు పెరిగాయి. అంటే మార్కెట్లోకి కొత్త ఇన్వెస్టర్ల రాక ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. (టేబుల్–గడిచిన 12 నెలల్లో డీమ్యాట్ ఖాతాల తీరు). తమ పెట్టుబడులు అనతి కాలంలోనే భారీ రాబడులు ఇవ్వాలనే ఆకాంక్ష కొత్త ఇన్వెస్టర్లలో సహజంగానే కనిపిస్తుంటుంది. ఫలితంగా మలీ్టబ్యాగర్ల కోసం జల్లెడ పడుతుంటారు. గతంలో అయితే స్టాక్స్‌లో పెట్టుబడి కోసం కుటుంబ సభ్యులు, బంధు మిత్రులను విచారించే వారు. సోషల్ మీడియా వ్యాప్తితో నేటితరం ఇన్వెస్టర్ల ప్రపంచం మరింత విస్తృతం అయింది. ఎన్నో యూట్యూబ్, ఫేస్బుక్, టెలీగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాలు తెరుచుకుంటున్నాయి. ఎంతో మంది నిపుణుల అవతారం ఎత్తుతున్నారు. ఫలానా స్టాక్స్ కొనుగోలు చేయాలనే టిప్స్‌కు ఆదరణ ఎక్కువగా కనిపిస్తోంది. అయినప్పటికీ పెట్టుబడులకు సంబంధించి కనీస ప్రాథమిక సూత్రాలను విస్మరించకూడదు. నియంత్రణల పరిధిలో లేని సామాజిక మాధ్యమ వేదికలపై చెప్పే సమాచారానికి, ఇచ్చే సలహాలకు జవాబుదారీ ఏది? ఏది నిజం, ఏది తప్పుదారి? తెలుసుకోవడం ఎలా? ఇది అవగాహనపైనే తెలుస్తుంది. ఈ దిశలో సాయపడేదే సోషల్ ఇన్వెస్టింగ్. ఆచరణ ముఖ్యం ఒకరి నుంచి నేర్చుకోవడం, ఆచరణలో పెట్టడం ఈ రెండు వేర్వేరు. సోషల్ ఇన్వెస్టింగ్ ప్లాట్‌ఫామ్‌లు ట్రేడింగ్, పెట్టుబడి గురించి తెలుసుకునేందుకు సాయపడతాయి. ‘‘ఇన్వెస్టర్‌కు ఒక ప్రణాళిక ఉండాలి. దానికి కట్టుబడి ఉండాలి. రిటైల్ ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది తాము పెట్టుబడులు పెట్టే మ్యూచువల్ ఫండ్స్ కంటే నేరుగా స్టాక్స్‌లో తక్కువ రాబడులు సంపాదిస్తున్నట్టు ఆ మధ్య నిర్వహించిన ఒక సర్వేలో తెలిసింది. దీనికి ఇన్వెస్టర్లు మార్కెట్లో అనుకూల సమయం కోసం వేచి చూసి, ఇన్వెస్ట్ చేయడం కారణం కావచ్చు. లేదంటే మ్యూచువల్ ఫండ్స్‌ను అనుకూలం కాని సమయంలో విక్రయించి, కొనుగోళ్లు చేస్తుండొచ్చు. ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టిన తర్వాత వార్తలు, ప్రతికూల విశ్లేషణలు చూసి చలించిపోకుండా, ఫండ్స్ మాదిరిగా స్థిరమైన వైఖరి అనుసరించాలి. సోషల్ ఇన్వెస్టింగ్ ప్లాట్ఫామ్లో తోటి ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియో చూసి పెట్టుబడులు పెట్టినట్టయితే.. మార్కెట్ల పతనాల్లో ఎంత స్థిరంగా, దృఢంగా ఉండగలరన్నది కీలకం అవుతుంది. ఆ సమయంలో భయపడి విక్రయించారంటే రాబడులు గణనీయంగా తగ్గిపోతాయి. నష్టాలూ ఎదురు చూడొచ్చు’’అని సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ దీపేశ్ రాఘవ్ వివరించారు. మార్గదర్శిగానే.. ఇన్వెస్టింగ్ వేదికలను మార్గదర్శిగానే చూడాలి. గుడ్డిగా అనుసరించడం సరికాదు. ఈ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా తగినంత అవగాహన, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకున్న తర్వాత, విడిగా ప్రతీ ఇన్వెస్టర్ తన వైపు నుంచి లోతైన అధ్యయనం చేయాలి. ఆ తర్వాతే తనకు అనుకూలమైన పెట్టుబడుల వ్యూహాలను అనుసరించాలి. ఇతరులు కేవలం తమ అనుభవాన్ని పంచుతారే కానీ, జవాబుదారీగా ఉండరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సోషల్ ఇన్వెస్టింగ్ ప్లాట్‌ఫామ్‌లు స్టాక్స్, ట్రేడింగ్ గురించి నేర్చుకునే వేదికలే. ఇన్వెస్టర్లు ఎవరికి వారే తమ వంతుగా పెట్టుబడుల లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఎవరో పోర్ట్‌ఫోలియో కాపీ చేసి ఇన్వెస్ట్ చేసిన తర్వాత, నష్టాలు వచ్చాయని పరిహారం డిమాండ్ చేయలేరు. గుడ్డిగా అనుసరించడం సరికాదు.. కొత్త ఇన్వెస్టర్లు ఉచిత లేదా చెల్లింపుల వేదికల ద్వారా స్టాక్స్‌లో పెట్టుబడులు, ట్రేడింగ్‌కు మొగ్గు చూపించే ముందు.. ఆయా వేదికలు తమ లక్ష్యాలు, రిస్క్, రాబడుల ఆకాంక్షలకు సరిపోయే వేనా? అన్నది ఒక్కసారి తరిచి చూసుకోవాలి. ‘‘తాము అనుసరించే తోటి ఇన్వెస్టర్ల ప్రొఫైల్‌ను జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే వారు ఎక్కువ రిస్క్ తీసుకోవచ్చు. వారి పోర్ట్‌ఫోలియో తీవ్ర అస్థిరతలతో కూడుకుని ఉండొచ్చు. ‘‘ప్రతి వ్యక్తి లక్ష్యాలు, అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. మీ స్నేహితులు లేదా ఇతరులు వారి కోణం నుంచి సాధారణ సూచనలు ఇవ్వొచ్చు. అది విడిగా ప్రతి ఇన్వెస్టర్‌కు అనుకూలమైనదని చెప్పలేం. మీ ప్రస్తుత పోర్ట్‌ఫోలియో, భవిష్యత్ నగదు అవసరాలు, రిస్క్ సామర్థ్యం ఇలాంటివి ఏవీ ఎదుటి వారికి తెలియవు’’అని సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ పారుల్ మహేశ్వరి పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టే ముందు పోర్ట్‌ఫోలియోను ఒక్కసారి పరిశీలించుకోవాలని సూచించారు. తమకు సరిపోలని ఉత్పత్తులు, సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ట్రేడింగ్‌లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇన్వెస్టింగ్లో రిస్క్ తక్కువ. ఈ రెండింటిలో తమకు ఏది అనుకూలమో ఇన్వెస్టర్లే తేల్చుకోవాలి. సోషల్ ఇన్వెస్టింగ్ అంటే..? ఎన్నో తరాల నుంచి ఇది ఉన్నదే సోషల్ ఇన్వెస్టింగ్ (ఇన్వెస్టర్ల సమూహం/సమాజం). గతంలో స్నేహితులు, కుటుంబ సభ్యుల వరకే ఇది పరిమితం. ఇప్పుడు టెక్నాలజీ ఫలితంగా మరింత పెద్దదిగా అవతరించింది. ట్రేడర్లు, ప్రపంచవ్యాప్త నిపుణులు, ఇన్వెస్టర్లు ఇందులో భాగమవుతున్నారు. సోషల్ ఇన్వెస్టింగ్ యాప్స్, ప్లాట్‌ఫామ్‌లు ఇప్పుడు ప్రత్యేకంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఏవి అసలైనవో, ఏవి నకిలీవో గుర్తించేందుకు ఇవి దారి చూపిస్తున్నాయి. సీనియర్ ట్రేడర్లు, తమ మాదిరే ఆకాంక్షలతో కూడిన ఇన్వెస్టర్లతో చాట్, సంప్రదింపులకు ఇవి వేదికలుగా నిలుస్తున్నాయి. ట్రేడింగ్, పెట్టుబడులకు సంబంధించిన విజ్ఞానం పంచుకునేందుకు వారధిగా పనిచేస్తున్నాయి. అనుభవజు్ఞలైన ట్రేడర్ల పోస్ట్‌లు, పోర్ట్‌ఫోలియోను వీటి ద్వారా తెలుసుకోవచ్చు. ఎప్పటికప్పుడు తాజా సమాచారానికితోడు, పెట్టుబడుల సలహాలు కూడా వీటిపై అందుకోవచ్చు. యూఎస్, యూరప్‌లో అయితే ఇన్వెస్టర్లు, నిపుణుల ట్రేడ్ పోర్ట్‌ఫోలియోను ఇతరులు కాపీ చేసుకోవచ్చు. అమెరికాకు చెందిన ఈటోరో కూడా ప్రముఖ సోషల్ ఇన్వెస్టింగ్ పోర్టల్. ధ్రువీకరించిన ట్రేడర్ల పోర్ట్‌ఫోలియోలను ఈ వేదికపై పరిశీలించొచ్చు. కానీ, మన దేశంలో ఇంకా ఈ విధమైన అవకాశం అందుబాటులోకి రాలేదు. మన దగ్గర సోషల్ ఇన్వెస్టింగ్ అన్నది ఒక చిన్న ఇన్వెస్టర్ల సమూహంగానే ప్రస్తుతం ఉంది. ‘‘సోషల్ ఇన్వెస్టింగ్ అన్నది విస్తృతమైన పదం. ఒక ఉమ్మడి వేదికగా వ్యక్తుల మధ్య సంప్రదింపులకు వీలు కలి్పంచేది. స్టాక్ ఫండమెంటల్స్ (ఆర్థిక మూలాలు), కంపెనీ లాభ, నష్టాల నివేదిక విశ్లేషణ, కీలక రేషియోలు, సాంకేతిక సూచికలు, మార్కెట్ ధోరణులపై సంప్రదింపులకు అవకాశం కలి్పస్తుంది. ఇన్వెస్టర్లు తాము అనుసరించే ట్రేడింగ్ విధానాలు, పోర్ట్‌ఫోలియోను వీటిపై ఇతరులతో పంచుకుంటారు’’అని స్మాల్‌కేస్ సీఈవో వసంత్ కామత్ తెలిపారు. నేర్చుకునే మార్గం.. ‘‘కరోనా సమయంలో మార్కెట్లు కనిష్ట స్థాయిలను చవిచూశాయి. దాంతో అవి ఆకర్షణీయంగా మారాయి. సెబీ కేవైసీ నిబంధనలను సరళతరం చేసింది. దీంతో ఆన్లైన్లోనే వేగంగా ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలు ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడింది. దీనికితోడు యువ జనాభా ఎక్కువ మంది ఇంటికి పరిమితం కావడం పెద్ద ఎత్తున డీమ్యాట్ ఖాతాల ప్రారంభానికి దారితీసింది’’అని ప్రభుదాస్ లీలాధర్ రిటైల్ బ్రోకింగ్ సీఈవో సందీప్ రాయ్చురా తెలిపారు. ముంబైకి చెందిన ఉత్కర్‡్ష (32) కూడా కరోనా సమయంలో మార్కెట్లోకి ప్రవేశించిన వారిలో ఒకరు. సహజంగా వ్యాపారవేత్త అయిన ఆయన ఇప్పుడు స్టాక్స్‌లో చురుగ్గా ట్రేడింగ్ చేస్తున్నారు. తొలుత మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు డీమ్యాట్ ఖాతాను ఉపయోగించుకున్నారు. స్టాక్స్‌లో ట్రేడింగ్ చేయాలని 2021 మార్చిలో ఆయన నిర్ణయించుకున్నారు. కానీ ఇందుకు సంబంధించిన సమాచారం ఎలా తెలుసుకోవాలో ఆయనకు తోచలేదు. ఆ సమయంలో మలీ్టబ్యాగర్లు అంటూ పెన్నీ స్టాక్స్ గురించి యూట్యూబ్ చానళ్లు, ట్విట్టర్ పోస్ట్‌లలో టిప్స్ కనిపించేవి. అయినా సరే వాటి ట్రాప్‌లో ఆయన పడిపోలేదు. గడిచిన రెండేళ్ల కాలంలో ఈ తరహా అనధికారిక, రిజిస్ట్రేషన్ లేని అడ్వైజర్లు, సామాజిక మాధ్యమ వేదికల అణచివేతకు సెబీ కఠిన చర్యలు తీసుకోవడం గమనించొచ్చు. ఉత్కర్‡్ష స్వతహాగా కొంత అవగాహన కలిగి ఉండడంతో విశ్వసనీయత లేని ఇలాంటి బూటకపు చానళ్ల బారిన పడకుండా, సోషల్ ఇన్వెస్టింగ్ ఫోరమ్‌లలో చేరాడు. అన్నీ కాదు కానీ, కొన్ని ఉపయోగకరమైనవి అని కొంత కాలానికి ఆయనకు అర్థమైంది. కొందరు అనుభవం కలిగిన స్టాక్ ట్రేడర్లు స్టాక్స్, ఫండ్స్, పెట్టుబడి సూత్రాల గురించి చెప్పడం తనకు నిజంగా సాయపడినట్టు ఉత్కర్‡్ష వెల్లడించారు. వీటి సాయంతో ట్రేడింగ్‌పై అవగాహన మరింత పెరిగింది. ఇప్పటికీ ఈ సామాజిక మాధ్యమ ఫోరమ్‌ల సాయంతో స్టాక్స్ ట్రెండ్స్ గురించి ఆయన తెలుసుకుంటూనే ఉంటారు. సోషల్ ఇన్వెస్టింగ్ అంటే ఇదే. ‘‘మార్కెట్లోని సీనియర్, అనుభవజ్ఞులైన ట్రేడర్ల నుంచి కొత్త ఇన్వెస్టర్లు, ట్రేడర్లు నేర్చుకునే వేదికగానే సోషల్ ఇన్వెస్టింగ్‌ను చూడాలి. మరొకరిని కాపీ కొట్టడం కాకుండా.. స్టాక్ పరిశోధన, వార్తలు, ట్రేడింగ్ విధానాలను రూపొందించుకోవడానికి మార్గంగా నిలుస్తుంది’’అని స్మాల్‌కేస్ వసంత్ కామత్ వివరించారు. ఒక్క ఉత్కర్‡్ష అనే కాదు లక్షలాది మందికి నేడు ఇలాంటి సామాజిక మాధ్యమ వేదికలు ఇన్వెస్టింగ్‌కు మెరుగైన దారి చూపిస్తున్నాయనడంలో సందేహం లేదు. కాకపోతే నిజమైన–మోసపూరిత వేదికల మధ్య వ్యత్యాసం తెలుసుకోవాలి. సామాజిక మాధ్యమ వేదికలు ఇప్పుడు పోస్ట్‌లకు వచ్చే వ్యూస్ ఆధారంగా, ప్రకటనల ఆదాయాన్ని యూజర్లతో పంచుకుంటున్నాయి. దీంతో సీనియర్ ట్రేడర్లు తమ అనుభవాన్ని, ట్రేడింగ్, పెట్టుబడి విధానాలను తోటి యూజర్లతో పంచుకోవడం వల్ల వారికి అదొక ఆదాయ వనరుగానూ మారుతోంది. దీంతో కొత్త ఇన్వెస్టర్లు నేర్చుకునే అవకాశాలు, వేదికలు పెరిగాయి. -
సీఎంఎస్ ఇన్ఫోలో తగ్గిన వాటా
న్యూఢిల్లీ: నగదు నిర్వహణ, చెల్లింపుల కంపెనీ సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్‌లో ప్రమోటర్ సంస్థ దాదాపు 14 శాతం వాటాను విక్రయించింది. ప్రమోటర్ కంపెనీ సియాన్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ 13.7 శాతం వాటాకు సమానమైన 2.12 కోట్ల షేర్లను విక్రయించింది. ఎన్ఎస్ఈ బల్క్ డీల్ వివరాల ప్రకారం ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా షేరుకి 300.23 సగటు ధరలో వాటాను దాదాపు రూ. 638 కోట్లకు అమ్మివేసింది. వేల్యూక్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్స్, ఎస్బీఐ ఎంఎఫ్, ఐఐఎఫ్ఎల్ ఎంఎఫ్, 306 వన్ ఎంఎఫ్, నార్జెస్ బ్యాంక్, అబుధాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ సీఎంఎస్ షేర్లను కొనుగోలు చేశాయి. ఈ లావాదేవీల తదుపరి సీఎంఎస్ ఇన్ఫోలో సియాన్ ఇన్వెస్ట్మెంట్ వాటా 60.24 శాతం నుంచి 46.54 శాతానికి తగ్గింది. వాటా విక్రయ వార్తలతో సీఎంఎస్ ఇన్ఫో షేరు ఎన్ఎస్ఈలో 6 శాతం పతనమై రూ. 307 వద్ద ముగిసింది. -
సంవర్థన మదర్సన్‌లో సుమిటోమో వాటా విక్రయం
న్యూఢిల్లీ: సంవర్థన మదర్సన్ ఇంటర్నేషనల్‌లో ప్రమోటర్ సంస్థ, జపాన్‌కు చెందిన సుమిటోమో వైరింగ్ సిస్టమ్స్ 3.4 శాతం వాటాను విక్రయించింది. బహిరంగ మార్కెట్లో జరిగిన ఈ విక్రయ వాటాల విలువ రూ.1,612 కోట్లు. మొత్తం 23 కోట్ల షేర్లను, ఒక్కో షేరుకు సగటున రూ.70.10కి సుమిటోమో వైరింగ్ సిస్టమ్స్ విక్రయించింది. కోప్తాల్ మారిషస్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్, సొసైట్ జనరల్ వాటాలను కొనుగోలు చేశాయి. వడ్డీ రేట్లు పెరుగుతున్న తరుణంలో రుణ భారం తగ్గించుకోవాలన్న ప్రణాళికలో భాగంగా ఈ వాటాలను సుమిటోమో విక్రయించినట్టు సంవర్థన మదర్సన్ తెలిపింది. సుమిటోమో వైరింగ్ సిస్టమ్స్, దాని అనుబంధ సంస్థ హెచ్‌కే వైరింగ్ సిస్టమ్స్‌కు సంవర్థన మదర్సన్‌లో మొత్తం 17.72 శాతం వాటాలున్నాయి. తాజాగా 3.4 శాతం వాటాలు విక్రయించిన తర్వాత, ఇంకా 14.32 శాతం వాటా కలిగి ఉన్నాయి. -
అదానీ గ్రూప్ గూటిలో ఎన్డీటీవీ
న్యూఢిల్లీ: వార్తా చానళ్ల దిగ్గజం న్యూఢిల్లీ టెలివిజన్ (ఎన్డీటీవీ)లో అదానీ గ్రూప్ తాజాగా 27.26 శాతం వాటాను సొంతం చేసుకుంది. వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌ల నుంచి ఈ వాటాను కొనుగోలు చేసినట్లు అదానీ గ్రూప్ పేర్కొంది. దీంతో మీడియా సంస్థలో అదానీ గ్రూప్ వాటా 64.71 శాతానికి ఎగసింది. వెరసి ఎన్డీటీవీపై పూర్తి నియంత్రణను సాధించింది. గత వారం రాయ్ జంట తమకుగల 27.26 శాతం వాటాను అదానీ గ్రూప్‌నకు విక్రయించనున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎన్డీటీవీలో రాయ్‌లకు సంయుక్తంగా 32.26 శాతం వాటా ఉంది. తాజా లావాదేవీ తదుపరి రాయ్‌ల వాటా(2.5 % చొప్పున) 5 శాతానికి పరిమితమైంది. షేరుకి రూ. 342.65 ధరలో 1.75 కోట్ల షేర్లను చేజిక్కించుకున్నట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. మైనారిటీ వాటాదారులకు చెల్లించిన(ఓపెన్ ఆఫర్) ధరతో పోలిస్తే ఇది 17 శాతం అధికంకాగా.. తద్వారా రాయ్ జంట రూ. 602 కోట్లు అందుకుంది. అనుబంధ సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్ ద్వారా వాటా కొనుగోలును పూర్తి చేసినట్లు అదానీ గ్రూప్ తెలియజేసింది. రాయ్‌ల రాజీనామాలు యాజమాన్య నియంత్రణ పూర్తిస్థాయిలో చేతులు మారిన నేపథ్యంలో వ్యవస్థాపకులు ప్రణవ్ రాయ్, రాధికా రాయ్‌సహా మరో నలుగురు డైరెక్టర్లు బోర్డుకు రాజీనామా చేసినట్లు ఎన్డీటీవీ పేర్కొంది. అంతేకాకుండా కనీస వాటా మాత్రమే మిగిలిన మాజీ ప్రమోటర్లు కంపెనీలో తమను పబ్లిక్ కేటగిరీ వాటాదారులుగా పరిగణించమంటూ బోర్డుని అభ్యర్థించారు. ఇందుకు బోర్డు అనుమతించగా.. స్టాక్ ఎక్సే్ఛంజీలు, వాటాదారులు ఆమోదముద్ర వేయవలసి ఉన్నట్లు ఎన్డీటీవీ తెలియజేసింది. బోర్డు నుంచి తప్పుకున్న డైరెక్టర్లలో డారియస్ తారాపోర్వాలాతోపాటు, స్వతంత్ర డైరెక్టర్లు కౌశిక్ దత్తా, ఇంద్రాణి రాయ్, జాన్ మార్టిన్ ఓలోన్ ఉన్నారు. ఇప్పటివరకూ ప్రణవ్ రాయ్, రాధికా రాయ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ కోచైర్పర్శన్ పదవిలో ఉన్న విషయం విదితమే. మరోవైపు అమన్ కుమార్ సింగ్‌ను నాన్‌ఎగ్జిక్యూటివ్ అదనపు డైరెక్టర్‌గా, సునీల్ కుమార్‌ను స్వతంత్ర నాన్‌ఎగ్జిక్యూటివ్ అదనపు డైరెక్టర్‌గా బోర్డు ఎంపిక చేసినట్లు ఎన్డీటీవీ వెల్లడించింది. ఈ వార్తల నేపథ్యంలో ఎన్డీటీవీ షేరు 2.6% లాభపడి రూ. 348 వద్ద ముగిసింది. -
డచ్ టెల్కోపై రిలయన్స్ కన్ను
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా నెదర్లాండ్స్‌కు చెందిన టెలికం సంస్థ కొనుగోలుపై దృష్టి పెట్టింది. టీ–మొబైల్ నెదర్లాండ్స్ బీవీలో మెజారిటీ వాటాలను దక్కించుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇందుకు సంబంధించి ఒక నెల రోజుల్లోగా.. సుమారు 5.7 బిలియన్ డాలర్ల డీల్‌ను ఆఫర్ చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ లావాదేవీకి అవసరమయ్యే నిధులను సమీకరించుకునేందుకు రిలయన్స్ ఇప్పటికే రుణదాతలను షార్ట్‌లిస్ట్ చేసే ప్రక్రియ మొదలుపెట్టిందని వివరించాయి. డీల్‌కు కావాల్సిన రుణాన్ని అందించేందుకు పలు దిగ్గజ విదేశీ బ్యాంకులు సిండికేట్‌గా ఏర్పడుతున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. టీ–మొబైల్ నెదర్లాండ్స్ కొనుగోలుపై రిలయన్స్ గత మూడు నెలలుగా కసరత్తు చేస్తోందని, అప్పట్నుంచి చర్చలు గణనీయంగా పురోగమించాయని వివరించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన టెలికం దిగ్గజం జియో డైరెక్టర్‌గా ఉన్న ఆకాశ్ అంబానీ (రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తనయుడు) వ్యక్తిగతంగా ఈ లావాదేవీని పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నాయి. టీ–మొబైల్ కొనుగోలుతో జియోకి యూరప్ టెలికం మార్కెట్లో అడుగుపెట్టేందుకు వీలవుతుంది. అలాగే, ఇతర మార్కెట్లలోకి విస్తరించడం ద్వారా వ్యాపారపరమైన రిసు్కలను కూడా తగ్గించుకునేందుకు దోహదపడగలదని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. టీ–మొబైల్ కథ ఇదీ.. జర్మనీకి చెందిన డాయిష్ టెలికం ఏజీ .. 2000 సంవత్సరంలో బెల్గాకామ్ ఎస్ఏ, టెలి డాన్మార్క్తో జాయింట్ వెంచర్ కంపెనీలో కొంత వాటాలను కొనుగోలు చేయడం ద్వారా నెదర్లాండ్స్ మార్కెట్లోకి ప్రవేశించింది. మిగతా వాటాలను కూడా దక్కించుకున్న తర్వాత టీ–మొబైల్ నెదర్లాండ్స్ కింద తిరిగి పేరు మార్చింది. 2019లో టెలీ2 ఏబీ కార్యకలాపాలను టీ–మొబైల్ నెదర్లాండ్స్ విలీనం చేసుకుంది. టీ–మొబైల్ నెదర్లాండ్స్‌లో డాయిష్ టెలికంనకు 75 శాతం, టెలీ2కి మిగతా వాటా ఉంది. ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో అతి పెద్ద టెలికం సంస్థ అయిన టీ–మొబైల్‌కు 57 లక్షల పైచిలుకు కస్టమర్లు ఉన్నారు. మరో అనుబంధ సంస్థ ద్వారా డాయిష్ టెలికంనకు, అమెరికాలోని టీ–మొబైల్లో కూడా చెప్పుకోతగ్గ స్థాయిలో వాటాలు ఉన్నాయి. అమెరికాలో టెలికం స్పెక్ట్రం కొనుగోలు చేసేందుకు 2015లోనే టీ–మొబైల్ నెదర్లాండ్స్‌ను విక్రయించాలని డాయిష్ టెలికం భావించింది. కానీ, తర్వాత ఆ ప్రతిపాదన విరమించుకుంది. టీ–మొబైల్ నెదర్లాండ్స్‌కు బ్రిటన్‌లో కూడా గణనీయంగా వ్యాపార కార్యకలాపాలు ఉన్నాయి. -
ఫార్మ్ఈజీ చేతికి థైరోకేర్
ముంబై: డయాగ్నొస్టిక్ సేవల కంపెనీ థైరోకేర్ టెక్నాలజీస్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనున్నట్లు డిజిటల్ హెల్త్‌కేర్ స్టార్టప్ ఫార్మ్ ఈజీ తాజాగా పేర్కొంది. ఇందుకు రూ. 4,546 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా థైరోకేర్ టెక్నాలజీస్ చైర్మన్, ఎండీ ఎ.వేలుమణితో ఫార్మ్ ఈజీ మాతృ సంస్థ ఏపీఐ హోల్డింగ్స్ తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా థైరోకేర్‌లో 66.1 శాతం వాటాను యూనికార్న్ హోదాను పొందిన ఫార్మ్ఈజీ సొంతం చేసుకోనుంది. ఇందుకు ఒక్కో షేరుకి రూ. 1,300 చొప్పున చెల్లించనున్నట్లు ఫార్మ్ఈజీ తెలియజేసింది. ఈ నేపథ్యంలో 25 ఏళ్లుగా దేశవ్యాప్త డయాగ్నొస్టిక్ సేవలను విస్తరించిన కంపెనీని 7 సంవత్సరాల వయసుగల ఒక స్టార్టప్ కొనుగోలు చేస్తుండటం ప్రస్తావించదగ్గ విషయమని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫార్మ్ఈజీ ఇటీవలే మెడ్‌లైఫ్‌ను సైతం సొంతం చేసుకున్న విషయం విదితమే. 26 శాతం వాటాకు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన థైరోకేర్ టెక్నాలజీస్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకోనుండటంతో మైనారిటీ వాటాదారులకు ఫార్మ్ఈజీ ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించవలసి ఉంటుంది. సెబీ నిబంధనల ప్రకారం థైరోకేర్ వాటాదారుల నుంచి ఫార్మ్ఈజీ 26 శాతం వాటాను కొనుగోలు చేయవలసి ఉంటుంది. ఇందుకు మరో రూ. 1,788 కోట్లు వెచ్చించవలసి ఉంటుంది. దీంతో మొత్తం రూ. 6,334 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఇక మరోవైపు వేలుమణి ఏపీఐ హోల్డింగ్స్‌లో 5 శాతం వరకూ వాటా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
సెన్సెక్స్ 400- నిఫ్టీ 100 పాయింట్లు అప్
రెండు రోజుల కన్సాలిడేషన్ తదుపరి దేశీ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ 400 పాయింట్లు జంప్‌చేయగా.. నిఫ్టీ లాభాల సెంచరీ చేసింది. ప్రస్తుతం సెన్సెక్స్ 475 పాయింట్లు జంప్‌చేసి 38,543ను తాకగా.. నిఫ్టీ 129 పాయింట్లు ఎగసి 11,377 వద్ద ట్రేడవుతోంది. మరో భారీ సహాయక ప్యాకేజీపై అమెరికా ప్రభుత్వం చర్చలు చేపట్టిన నేపథ్యంలో బుధవారం యూఎస్ మార్కెట్లు 1.2-0.7 శాతం మధ్య ఎగశాయి. ఇక ప్రస్తుతం ఆసియాలోనూ సానుకూల ట్రెండ్ నెలకొంది. దేశీయంగా అవసరమైతే మరో ప్యాకేజీని ప్రకటించేందుకు వెనుకాడబోమంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేయడంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. మీడియా జోరు ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. మీడియా, బ్యాంకింగ్, రియల్టీ, ఐటీ, ఆటో, మెటల్ 3.7-1 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో బజాజ్ ఆటో, ఇండస్ఇండ్, యాక్సిస్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ, ఐసీఐసీఐ, ఎయిర్టెల్, ఎంఅండ్ఎం, ఇన్ఫోసిస్ 3.6-1.3 శాతం మధ్య లాభపడ్డాయి. కేవలం ఓఎన్జీసీ, నెస్లే, సిప్లా అదికూడా 3-0.4 శాతం మధ్య డీలాపడ్డాయి. పీవీఆర్ జూమ్ డెరివేటివ్ కౌంటర్లలో పీవీఆర్ 15 శాతం దూసుకెళ్లగా, బంధన్ బ్యాంక్, డీఎల్ఎఫ్, శ్రీరామ్ ట్రాన్స్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, ఎల్అండ్టీ ఫైనాన్స్, నాల్కో, ఆర్బీఎల్ బ్యాంక్, ఎంజీఎల్, కెనరా బ్యాంక్ 4-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క ఐడియా, ఎస్కార్ట్స్, పీఎన్బీ, అపోలో హాస్పిటల్స్ మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో 3.2-0.7 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,167 లాభపడగా.. 312 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. -
ఆర్థిక వృద్ధికి ఎయిర్‌పోర్టుల ఊతం
న్యూఢిల్లీ: స్థానిక ఆర్థిక అభివృద్ధికి విమానాశ్రయాలు శక్తిమంతమైన చోదకాలుగా పనిచేస్తాయని అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ పేర్కొన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలను పెద్ద నగరాలకు అనుసంధానం చేయడంలో కీలకపాత్ర పోషించగలవని ఆయన చెప్పారు. ముంబై విమానాశ్రయంలో మెజారిటీ వాటాల కొనుగోలు అనంతరం తమ ఎయిర్‌పోర్ట్‌ల వ్యాపార విభాగం మరింతగా విస్తరిస్తుందని అదానీ తెలిపారు. గ్రూప్‌లోని ఇతర వ్యాపారాలకు కూడా ఇది వ్యూహాత్మక అవకాశాలు సృష్టించగలదని ఆయన వివరించారు. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (ఎంఐఏఎల్)లో జీవీకే ఎయిర్పోర్ట్ డెవలపర్స్‌కు చెందిన 50.50 శాతం వాటాలతో పాటు మైనారిటీ షేర్‌హోల్డర్ల వాటాలను కూడా కొనుగోలు చేస్తున్నట్లు అదానీ ఎయిర్‌పోర్ట్స్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నిస్సందేహంగా అంతర్జాతీయ స్థాయి ఎయిర్‌పోర్టు. దీనితో పాటు నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మా ఆరు విమానాశ్రయాల పోర్ట్‌ఫోలియోకు తోడవుతుంది. ఈ పరిణామం మా ఇతర వ్యాపారాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకునేందుకు కూడా ఉపయోగపడగలదు‘ అని అదానీ ఒక ప్రకటనలో వివరించారు. 21 శతాబ్దంలోని టాప్ 5 అంతర్జాతీయ మెట్రోపాలిటన్ నగరాల్లో ఒకటిగా ముంబై మారనున్న నేపథ్యంలో దేశీయంగా ఇది ప్రధాన ఎయిర్‌పోర్ట్‌గా మార్చగలదని ఆయన పేర్కొన్నారు. విమాన ప్రయాణికుల సంఖ్య అయిదు రెట్లు పెరుగుతుందన్న అంచనాలతో దేశీయంగా 200 పైచిలుకు ఎయిర్‌పోర్టులు అదనంగా నిర్మించే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. టాప్ 30లోని ఒక్కో నగరానికి రెండు విమానాశ్రయాలు అవసరమవుతాయని అదానీ తెలిపారు. ఇందుకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేసేందుకు అదానీ ఎయిర్‌పోర్ట్స్ సర్వసన్నద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. -
రిలయన్స్ ‘ఫార్మా’ షాపింగ్ !
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) వివిధ రంగాల్లోకి వేగంగా విస్తరిస్తోంది. తాజాగా ఈ–ఫార్మసీ విభాగంలో మరో సంస్థను దక్కించుకుంది. నెట్‌మెడ్స్‌లో మెజారిటీ వాటాలు (60 శాతం) కొనుగోలు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ డీల్ విలువ రూ. 620 కోట్లు. దీనితో వైటలిక్ హెల్త్‌లో 60 శాతం, దాని అనుబంధ సంస్థల్లో 100 శాతం (అన్నింటినీ కలిపి నెట్‌మెడ్స్‌గా వ్యవహరిస్తారు) వాటాలు ఆర్ఐఎల్కు దక్కుతాయి. డిజిటల్ విభాగం జియో ద్వారా కాకుండా రిటైల్ విభాగం ద్వారా ఆర్ఐఎల్ ఈ కొనుగోలు జరిపింది. ఈ–ఫార్మసీ విభాగానికి సంబంధించి ఆర్ఐఎల్ గతేడాదే సి–స్క్వేర్ అనే సంస్థను కొనుగోలు చేసింది. ఫార్మా రంగ డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లకు ఇది సాఫ్ట్వేర్ అందిస్తోంది. గడిచిన మూడేళ్లుగా ఆర్ఐఎల్ దాదాపు 3.1 బిలియన్ డాలర్ల విలువ చేసే కొనుగోళ్లు జరిపింది. ఈ డీల్స్‌లో 13 శాతం రిటైల్, 80 శాతం టెలికం.. మీడియా .. టెక్నాలజీ, మరో 6 శాతం ఇంధన రంగానికి చెందినవి ఉన్నాయి. గ్రూప్‌లో భాగమైన జియోమార్ట్ కేవలం నిత్యావసరాలకు మాత్రమే పరిమితం కాకుండా ఔషధాలు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ తదితర ఉత్పత్తులను కూడా డెలివరీ చేయనున్నట్లు గత నెల జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆర్ఐఎల్ వెల్లడించింది. ఆ దిశగా నెట్‌మెడ్స్ కొనుగోలు కంపెనీకి ఉపయోగపడనుంది. కన్సల్టింగ్ నుంచి ఔషధాల దాకా అన్నీ ఒకే చోట.. పటిష్టమైన డిజిటల్, ఈ–కామర్స్ వ్యవస్థను రూపొందించుకోవడంపై కంపెనీ మరింతగా దృష్టి పెడుతోందనడానికి ఈ కొనుగోలు నిదర్శనమని కన్సల్టెన్సీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. ‘ప్రస్తుతం ఆర్ఐఎల్ తమ ఆన్లైన్ యాప్ జియోహెల్త్ హబ్ ద్వారా డిజిటల్ కన్సల్టేషన్, డయాగ్నొస్టిక్ టెస్టుల సర్వీసులు అందిస్తోంది. నెట్‌మెడ్స్ కొనుగోలుతో ఔషధాల డెలివరీ విభాగంలోకి కూడా దిగినట్లవుతుంది. టెలీకన్సల్టేషన్ అనంతరం, ప్రిస్క్రిప్షన్‌ను యాప్‌లో పొందుపర్చవచ్చు. ఆ తర్వాత పేషెంట్లకు అటు వైద్య పరీక్షలు ఇటు డాక్టరు సూచించిన ఔషధాలకు కలిపి కస్టమైజ్డ్ ఆఫర్లాంటివి ఇవ్వచ్చు‘ అని క్రెడిట్ సూసీ పేర్కొంది. సాధారణగా డెలివరీ ఖర్చులు ఉంటాయి కాబట్టి ఆన్లైన్ ఫార్మసీలో మార్జిన్లు తక్కువగా ఉంటాయని, కాకపోతే దేశీయంగా భారీ మార్కెట్ కావడం వల్ల వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపింది. ఆన్లైన్ ఫార్మసీ మార్కెట్‌ను ఆర్ఐఎల్ గణనీయంగా విస్తరించే అవకాశం ఉందని వివరించింది. రిటైల్ నెట్వర్క్ ఊతం.. దేశీయంగా మొత్తం ఔషధాల మార్కెట్ ఏకంగా 18–19 బిలియన్ డాలర్ల భారీ పరిమాణంలో ఉండగా ఆన్లైన్ ఔషధ మార్కెట్ వాటా ప్రస్తుతం సుమారు 3–3.5 శాతం స్థాయికే పరిమితమైంది. ప్రస్తుతం ఉన్న సంస్థలు సత్వర డెలివరీ సేవలు ఇవ్వలేకపోతుండటం, కస్టమర్లకు ఔషధాలు చేరాలంటే కనీసం 24–48 గంటల దాకా సమయం పట్టేస్తుండటం ఈ విభాగానికి ప్రతికూలాంశంగా ఉంటోంది. అయితే, దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లు ఉండటం ఆర్ఐఎల్కు లాభించే అంశమని క్రెడిట్ సూసీ పేర్కొంది. ‘భారీ సంఖ్యలో రిటైల్ నెట్వర్క్ ఉన్నందున డెలివరీ సమయాన్ని ఆర్ఐఎల్ గణనీయంగా తగ్గించడానికి వీలుంది. కంపెనీపరంగా డెలివరీ వ్యయాలూ తక్కువగా ఉంటాయి. తద్వారా మార్కెట్‌ను పెంచుకోవచ్చు‘ అని క్రెడిట్ సూసీ పేర్కొంది. నిత్యావసరాలకు సంబంధించి కిరాణా దుకాణాలకు అగ్రిగేటర్‌గా వ్యవహరిస్తున్నట్లే మధ్యకాలికంగా చిన్నా, చితకా మెడికల్ హాల్స్‌కు కూడా ఆర్ఐఎల్ అగ్రిగేటర్‌గా వ్యవహరించే అవకాశం ఉందని తెలిపింది. 670 పట్టణాల్లో నెట్‌మెడ్స్.. నెట్‌మెడ్స్ దేశీయంగా ప్రిస్క్రిప్షన్, ఓటీసీ (ఓవర్ ది కౌంటర్), ఆరోగ్యం, వెల్నెస్ ఉత్పత్తులను ఆన్లైన్ ఫార్మసీ ద్వారా అందిస్తోంది. ఫార్మా రిటైలింగ్, తయారీలో సుదీర్ఘానుభవం ఉన్న ప్రమోటర్లు దీన్ని ఏర్పాటు చేశారు. 2018 ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆదాయాలు 1 మిలియన్ డాలర్లకు పైగా నమోదైనట్లు ఆర్ఐఎల్ తెలిపింది. నెట్‌మెడ్స్ ప్రస్తుతం 670 నగరాలు, పట్టణాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. 70,000 పైచిలుకు ప్రిస్క్రిప్షన్, లైఫ్‌స్టయిల్ ఔషధాలు .. వెల్నెస్, ఆరోగ్యం, వ్యక్తిగత సంరక్షణకు సంబంధించి వేల కొద్దీ సంఖ్యలో నాన్–ప్రిస్క్రిప్షన్ ఉత్పత్తులను అందిస్తోంది. యాప్ ద్వారా డాక్టర్ కన్సల్టేషన్ సేవలు కూడా అందిస్తోంది. -
ఆ ప్రతిపాదనేదీ పరిశీలనలో లేదు
న్యూఢిల్లీ: గూగుల్ తమ కంపెనీలో వాటాలు కొనుగోలు చేస్తోందన్న వార్తలపై వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) స్పందించింది. ప్రస్తుతానికి అలాంటి ప్రతిపాదనేదీ తమ బోర్డు పరిశీలనలో లేదని వివరించింది. ‘కార్పొరేట్ వ్యూహం ప్రకారం షేర్హోల్డర్లకు మరిన్ని ప్రయోజనాలు కలిగించే అవకాశాలన్నింటినీ సంస్థ నిరంతరం మదింపు చేస్తూనే ఉంటుంది. తప్పనిసరిగా వెల్లడించాల్సిన ప్రతిపాదనలేవైనా ఉంటే తప్పకుండా నిబంధనల ప్రకారం వెల్లడిస్తాం‘ అని వొడాఫోన్ ఐడియా పేర్కొంది. వీఐఎల్‌లో గూగుల్ దాదాపు 5% వాటా కొనుగోలు చేస్తోందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. గూగుల్ పెట్టుబడుల వార్తలతో శుక్రవారం వీఐఎల్ షేరు ఒకానొక దశలో 35 శాతం మేర ఎగబాకి సుమారు 13 శాతం ఎగిసి రూ. 6.56 వద్ద క్లోజయ్యింది. -
పెట్టుబడులు జియో
న్యూఢిల్లీ: వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్ 2.32 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం విలువ రూ. 11,367 కోట్లు. ఆసియాలో కేకేఆర్ చేసిన అత్యంత భారీ ఇన్వెస్ట్మెంట్ ఇదే. ఆసియా ప్రైవేట్ ఈక్విటీ, గ్రోత్ టెక్నాలజీ ఫండ్స్ ద్వారా కేకేఆర్ ఈ మొత్తం ఇన్వెస్ట్ చేస్తోంది. ‘ఈ డీల్ ప్రకారం జియో ప్లాట్‌ఫామ్స్ సంస్థ విలువ రూ. 5.16 లక్షల కోట్లుగా ఉంటుంది‘ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక ప్రకటనలో తెలిపింది. నాలుగు వారాల్లో అయిదో డీల్.. జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడులకు సంబంధించి గడిచిన నాలుగు వారాల్లో ఇది అయిదో డీల్. తొలుత సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ ఏప్రిల్ 22న రూ. 43,574 కోట్లతో 9.99 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకే దిగ్గజ టెక్ ఇన్వెస్టరు సిల్వర్ లేక్ సుమారు రూ. 5,655 కోట్లతో 1.15 శాతం వాటాలు దక్కించుకుంది. ఇక మే 8న అమెరికాకు చెందిన విస్టా ఈక్విటీ పార్ట్నర్స్ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌లో 2.32 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ. 11,367 కోట్లు వెచ్చించింది. అటుపైన మే 17న అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ దాదాపు రూ. 6,598.38 కోట్లతో 1.34 శాతం వాటా దక్కించుకుంది. వీటి మొత్తం పెట్టుబడులు రూ. 78,562 కోట్లు అని రిలయన్స్ తెలిపింది. ‘అంతర్జాతీయం ఇన్వెస్టింగ్ దిగ్గజాల్లో ఒకటైన కేకేఆర్.. జియో లో పెట్టుబడులు పెట్టడాన్ని స్వాగతిస్తున్నాను. దేశ ప్రజలందరికీ లబ్ధి చేకూర్చేలా భారతీయ డిజిటల్ వ్యవస్థను తీర్చిదిద్దే క్రమంలో కేకేఆర్ అనుభవం ఉపయోగపడగలదు. – రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కేకేఆర్ కథ ఇదీ.. 1976లో ప్రారంభమైన కేకేఆర్ సంస్థ టెక్నాలజీ రంగంలో పలు కంపెనీల్లో దాదాపు 30 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టింది. బైట్‌డ్యాన్స్, గోజెక్, బీఎంసీ సాఫ్ట్వేర్ తదితర సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. కేకేఆర్ టెక్నాలజీ పోర్ట్‌ఫోలియోలో మీడియా, టెలికం, టెక్నాలజీ రంగాలకు చెందిన 20 పైగా కంపెనీలు ఉన్నాయి. 2006 నుంచి భారత్‌లో కూడా కేకేఆర్ ఇన్వెస్ట్ చేస్తోంది. దేశ డిజిటల్ వ్యవస్థ రూపురేఖల్ని జియో ప్లాట్‌ఫామ్స్ మారుస్తున్న తీరు కేవలం కొద్ది కంపెనీలకు మాత్రమే సాధ్యపడుతుంది. భారత్, ఆసియా పసిఫిక్ దేశ టెక్నాలజీ దిగ్గజ కంపెనీలకు తోడ్పాటు అందిస్తామనేందుకు జియోలో పెట్టుబడులే నిదర్శనం‘ – కేకేఆర్ సహ వ్యవస్థాపకుడు హెన్రీ క్రావిస్ -
జియో ప్లాట్‌ఫామ్స్‌లో నాలుగో భారీ పెట్టుబడి
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో మరో విదేశీ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టనున్నది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 1.34 శాతం వాటా కోసం అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ, జనరల్ అట్లాంటిక్ రూ.6,598 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నది. నాలుగు వారాల్లో ఇది నాలుగో డీల్, ఈ నాలుగు ఒప్పందాల ద్వారా జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ.67,195 కోట్ల పెట్టుబడులు వస్తాయి. జనరల్ అట్లాంటిక్ డీల్ పరంగా చూస్తే, జియో ప్లాట్‌ఫామ్స్ ఈక్విటీ విలువ రూ.4.91 లక్షల కోట్లుగాను, ఎంటర్ప్రైజ్ విలువ రూ.5.16 లక్షల కోట్లుగానూ ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. మరిన్ని డీల్స్: కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఇప్పటిదాకా 14.8% వాటా ను విక్రయించింది. వ్యూహాత్మక, ఫైనాన్షియల్ ఇన్వెస్టర్లకు 20% వాటాను ఈ కంపెనీ విక్రయించనున్నదని సమాచారం. అందుకని భవిష్యత్తులో మరిన్ని డీల్స్ ఉండొచ్చని అంచనా. వచ్చే ఏడాది మార్చికల్లా రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను రుణరహిత కంపెనీగా తీర్చిదిద్దడం తమ లక్ష్యమని కంపెనీ చైర్మన్ ముకేశ్ అంబానీ గత ఏడాది ఆగస్టులో పేర్కొన్నారు. తాజా డీల్స్‌తో పాటు రూ.53,125 కోట్ల రైట్స్ ఇష్యూ ద్వారా ఈ లక్ష్యం ఈ ఏడాది డిసెంబర్‌కే సాకారం కానున్నది. మార్చి నాటికి రిలయన్స్ నికర రుణ భారం రూ.1,75,259 కోట్లు. -
జీఎంఆర్‌లో ఫ్రాన్స్ సంస్థకు వాటాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్రాన్స్‌కు చెందిన గ్రూప్ ఏడీపీ తమ ఎయిర్పోర్ట్ వ్యాపార విభాగంలో 49 శాతం వాటాలు కొనుగోలు చేయనున్నట్లు జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెల్లడించింది. ఈ డీల్ విలువ రూ. 10,780 కోట్లు ఉంటుందని పేర్కొంది. దీని ప్రకారం జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ (జీఏఎల్) విలువ సుమారు రూ. 22,000 కోట్లుగా ఉండనుంది. నిర్దిష్ట మైలురాళ్లను సాధించిన పక్షంలో మరో రూ. 4,475 కోట్లు లభించగలవని, దీంతో మొత్తం వేల్యుయేషన్ రూ. 26,475 కోట్ల స్థాయిలో ఉండగలదని జీఎంఆర్ గ్రూప్ తెలిపింది. డీల్ ప్రకారం జీఎంఆర్ గ్రూప్ నుంచి రూ. 9,780 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేయనున్న గ్రూప్ ఏడీపీ.. మరో రూ. 1,000 కోట్లు ఈక్విటీ కింద జీఏఎల్‌లో ఇన్వెస్ట్ చేయనుంది. ‘తొలి విడతలో రూ. 5,248 కోట్లు తక్షణమే జీఎంఆర్ గ్రూప్‌కు లభిస్తాయి. రుణభారాన్ని మరింత తగ్గించుకునేందుకు ఈ నిధులను వినియోగించనున్నాం‘ అని జీఎంఆర్ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. ఒప్పందం ప్రకారం.. ఎయిర్‌పోర్ట్స్ వ్యాపార విభాగంపై జీఎంఆర్‌కు నియంత్రణ కొనసాగుతుంది. ఏడీపీకి జీఏఎల్,కీలక అనుబంధ సం స్థల బోర్డుల్లో ప్రాతినిధ్యం, ఇతర హక్కులు లభిస్తాయి. మరిన్ని అంతర్జాతీయ మార్కెట్లలో ప్రవేశించేందుకు గ్రూప్ ఏడీపీతో భాగస్వామ్యం దోహదపడగలదని జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జీఎం రావు తెలిపారు. మరోవైపు, తమ వ్యూహంలో భాగంగానే జీఏఎల్‌లో వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు గ్రూప్ ఏడీపీ చైర్మన్ అగస్టిన్ డి రొమానెట్ పేర్కొన్నారు. 33.6 కోట్ల ప్రయాణికులు.. జీఏఎల్, గ్రూప్ ఏడీపీ కలిసి 2019లో దాదాపు 33.65 కోట్ల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేసినట్లు జీఎంఆర్ పేర్కొంది. ఇది ప్రపంచంలోనే అత్యధికమని వివరించింది. గ్రూప్ ఏడీపీ సంస్థ.. విమానాశ్రయాల అభివృద్ధి, నిర్వహణ వ్యాపార కార్యకలాపాలు సాగిస్తోంది. ప్యారిస్‌లోని చార్లెస్ డి గాల్, ఒర్లి మొదలైనవి వీటిలో ఉన్నాయి. రూ.1,075 కోట్లు సమీకరించిన జీఎంఆర్ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ అనుబంధ కంపెనీ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. సీనియర్ సెక్యూర్డ్ నోట్స్ జారీ ద్వారా రూ.1,075 కోట్లు సమీకరించినట్లు జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ గ్రంధి కిరణ్ కుమార్ తెలిపారు. -
‘జీ’ డీల్‌కు ఇన్వెస్కో సై
ముంబై: నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న జీ గ్రూప్‌నకు ఊరటనిచ్చేలా అమెరికాకు చెందిన ఇన్వెస్కో ఓపెన్‌హైమర్ ఫండ్ మరింత ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చింది. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీ)లో ప్రమోటర్ల నుంచి మరో 11 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు అంగీకరించింది. ఈ డీల్ విలువ రూ. 4,224 కోట్లుగా ఉండనుంది. ఇన్వెస్కో ఓపెన్‌హైమర్‌లో భాగమైన డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ ఈ వాటాలను కొనుగోలు చేయనుంది. 2002 నుంచి జీ లో ఇన్వెస్టరుగా కొనసాగుతున్న ఇన్వెస్కో ఫండ్‌కు ప్రస్తుతం ఇందులో 7.74 శాతం వాటాలు ఉన్నాయి. ‘ఇన్వెస్కో ఓపెన్‌హైమర్ డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ .. జీ లో మరింతగా ఇన్వెస్ట్ చేసేందుకు అంగీకరించింది. ప్రమోటర్ల నుంచి మరో 11 శాతం దాకా వాటాలను రూ. 4,224 కోట్లకు కొనుగోలు చేయడానికి అంగీకరించింది‘ అని జీ ఒక ప్రకటనలో తెలిపింది. తమ సంస్థపై ఇన్వెస్కో ఫండ్‌కున్న నమ్మకాన్ని తాజా పెట్టుబడులు తెలియజేస్తున్నాయని జీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పునీత్ గోయెంకా పేర్కొన్నారు. ఈ డీల్‌తో జీ లో ప్రమోటర్ల వాటా 23 శాతానికి తగ్గుతుంది. 2019 జూన్ నాటికి జీ లో ప్రమోటర్ల వాటా 35.79 శాతంగా ఉంది. ఇందులో 63.98 శాతం వాటాలు మ్యూచువల్ ఫండ్స్, ఇతర ఆర్థిక సంస్థల దగ్గర తనఖాలో ఉన్నాయి. బుధవారం షేరు ముగింపు ధరను బట్టి జీ మార్కెట్ విలువ రూ. 34,717 కోట్లు కాగా.. ఇందులో ప్రమోటర్ల వాటాల విలువ సుమారు రూ. 13,000 కోట్లుగా అంచనా. ఏడాదిగా ప్రమోటర్ల ప్రయత్నాలు.. సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందంటూ ఎస్సెల్ గ్రూప్ ప్రమోటరు సుభాష్ చంద్ర ఈ ఏడాది జనవరిలో రాసిన బహిరంగ లేఖతో కంపెనీ వాస్తవ స్థితిగతులు అధికారికంగా బైటపడ్డాయి. ఇన్ఫ్రా రంగంలో భారీగా పెట్టిన పెట్టుబడులు, వీడియోకాన్‌కు చెందిన డీ2హెచ్ వ్యాపారం కొనుగోలు లావాదేవీలు ప్రతికూలంగా మారాయని చంద్ర పేర్కొన్నారు. అయితే, బ్యాంకర్లు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్ నుంచి పొందిన రుణాలన్నీ పూర్తిగా తీర్చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సెప్టెంబర్ దాకా ఎటువంటి చర్యలూ తీసుకోకుండా రుణదాతలతో కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. వాస్తవానికి భారీగా పేరుకుపోతున్న రుణభారాన్ని తగ్గించుకునే దిశగా గ్రూప్ సంస్థల్లో వాటాలను విక్రయించేందుకు గతేడాది నవంబర్ నుంచీ ఎస్సెల్ గ్రూప్ ప్రమోటర్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. రుణాల రీపేమెంట్‌కు 2019 సెప్టెంబర్‌ను గడువుగా నిర్దేశించుకున్నారు. జీ లో తమకున్న వాటాల్లో దాదాపు 50 శాతం వాటాలు వ్యూహాత్మక భాగస్వామికి విక్రయించేందుకు ప్రమోటర్లు గతేడాది నవంబర్ నుంచి ప్రయత్నిస్తున్నారు. జీ లోనూ, ఇతరత్రా మీడియాయేతర అసెట్స్‌లో వాటాల కొనుగోలుకు వివిధ భాగస్వాముల నుంచి సానుకూల స్పందన కూడా వస్తున్నట్లు ఎస్సెల్ గ్రూప్ చెబుతూ వస్తోంది. తాజాగా ఇన్వెస్కో ఓపెన్‌హైమర్‌తో ఒప్పందం కుదరడం సంస్థకు కొంత ఊరటనివ్వనుంది. రూ. 7,000 కోట్లకు తగ్గనున్న రుణభారం.. బుధవారం నాటి జీ షేరు ముగింపు ధరతో పోలిస్తే ఇన్వెస్కో 10 శాతం ప్రీమియం చెల్లించనుంది. ఈ డీల్‌తో గ్రూప్ రుణ భారం రూ. 11,000 కోట్ల నుంచి రూ. 7,000 కోట్లకు తగ్గనుందని జీ సీఈవో, ఎండీ పునీత్ గోయెంకా తెలిపారు. జనవరిలో రూ. 13,000 కోట్లుగా ఉన్న రుణభారాన్ని అంతర్గత వనరుల సమీకరణ తదితర చర్యల ద్వారా ప్రస్తుతం రూ. 11,000 కోట్లకు తగ్గించుకున్నట్లు వివరించారు. షేరు 5 శాతం డౌన్.. బుధవారం మార్కెట్లు ముగిశాక డీల్ వెల్లడైంది. బీఎస్ఈలో జీ షేరు 5.2 శాతం క్షీణించి రూ. 361.45 వద్ద ముగిసింది. మిగతా అసెట్స్ విక్రయంపై దృష్టి.. రుణాల చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రమోటర్లకు అవసరమైన ఆర్థిక వెసులుబాటు ఈ డీల్‌తో లభించగలదని జీ మాతృసంస్థ ఎస్సెల్ గ్రూప్ పేర్కొంది. ఇతరత్రా అసెట్స్ విక్రయం దిశగా ఇది ముందడుగని తెలిపింది. మీడియాయేతర అసెట్స్‌నూ విక్రయించాలని ఎస్సెల్ గ్రూప్ యత్నిస్తున్న సంగతి తెలిసిందే. ‘తాజా పరిస్థితుల నేపథ్యంలో నిర్దేశించుకున్న సెప్టెంబర్ గడువులోగా రుణాల రీపేమెంట్ ప్రక్రియను పూర్తి చేయగలం‘ అని ఎస్సెల్ గ్రూప్ ధీమా వ్యక్తం చేసింది. -
కొనుగోళ్ల జోష్ : లాభాల్లోకి సూచీలు
సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి. ఫ్లాట్ ప్రారంభంనుంచి హెచ్చుతగ్గుల మధ్య కదులుతూ ఉన్నట్టుండి జోరందుకున్నాయి. కొనుగోళ్లు పెరగడంతో సెన్సెక్స్ లాభాల సెంచరీ చేసింది. 150 పాయింట్లకుపైగా ఎగిసింది. నిఫ్టీ సైతం 30 పాయింట్లు పుంజుకుని 11,618 వద్ద ట్రేడవుతోంది. అయితే హైయ్యర్ లెవల్స్ వద్ద తిరిగి అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. దీంతో సెన్సెక్స్ ప్రస్తుతం 73 పాయింట్ల లాభాలకు పరిమితమైంది. మరోవైపు సోమవారం వరుసగా నాలుగో రోజు అమెరికా మార్కెట్లు సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. మెటల్, బ్యాంక్స్, రియల్టీ పాజిటివ్‌గా ఐటీస్వల్ప నష్టాలతో కొనసాగుతోంది. టాటా మోటార్స్, వేదాంతా, ఎన్టీపీసీ, టాటా స్టీల్, ఎయిర్టెల్, ఐసీఐసీఐ, యాక్సిస్, ఓఎన్జీసీ, పవర్‌గ్రిడ్, సిప్లా లాభాల్లో, టీసీఎస్, ఐబీ హౌసింగ్, విప్రో, ఎంఅండ్ఎం, బజాజ్ ఆటో, యూపీఎల్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, హీరో మోటో, ఇండస్ఇండ్ నష్టాలతో సాగుతున్నాయి. -
టాటా మోటార్స్‌లో నేడు భారీ బ్లాక్ డీల్!
• రూ.500 ధరకు 5 కోట్ల షేర్లు కొనుగోళ్లు • డీల్ విలువ రూ.2,500 కోట్లు న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌లో భారీ బ్లాక్‌డీల్ నేడు(మంగళవారం) జరగనున్నది. ఒక ‘రహస్య’ క్లయింట్ కోసం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ 5 కోట్ల (1.73 శాతం వాటా) షేర్లను రూ.499.8 ధరకు (సోమవారం ముగింపు ధర రూ.455కు ఇది 10 శాతం ప్రీమియమ్) కొనుగోలు చేయనున్నదని సమాచారం. ఈ డీల్ విలువ రూ.2,500 కోట్లు. సైరస్ మిస్త్రీని డైరెక్టర్ పదవి నుంచి తొలగించేందుకు ఈ నెల 22న టాటా మోటార్స్ అసాధారణ సర్వ సభ్య సమావేశం(ఈజీఎమ్) జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఈజీఎమ్‌లో ఓటింగ్‌లో పై చేయి సాధించడానికే టాటా సన్స్ ఈ షేర్లను కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. అయితే టాటా సన్స్ ప్రతినిధి ఈ విషయాన్ని ద్రువీకరించలేదు. ఈ డీల్ నేపథ్యంలో అమెరికా మార్కెట్లో టాటా మోటార్స్ ఏడీఆర్ దాదాపు 4 శాతం ఎగసింది. రివర్స్ బుక్ బుల్డింగ్ విధానంలో ఈ షేర్ల కొనుగోలు జరుగుతుందని అంచనా.