‘జీ’ డీల్‌కు ఇన్వెస్కో సై | Invesco Oppenheimer to pay Rs 4,224 crore for 11 persant stake in ZEE group | Sakshi
Sakshi News home page

‘జీ’ డీల్‌కు ఇన్వెస్కో సై

Published Thu, Aug 1 2019 4:31 AM | Last Updated on Thu, Aug 1 2019 4:31 AM

Invesco Oppenheimer to pay Rs 4,224 crore for 11 persant stake in ZEE group - Sakshi

ముంబై: నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న జీ గ్రూప్‌నకు ఊరటనిచ్చేలా అమెరికాకు చెందిన ఇన్వెస్కో ఓపెన్‌హైమర్‌ ఫండ్‌ మరింత ఇన్వెస్ట్‌ చేసేందుకు ముందుకొచ్చింది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (జీ)లో ప్రమోటర్ల నుంచి మరో 11 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు అంగీకరించింది. ఈ డీల్‌ విలువ రూ. 4,224 కోట్లుగా ఉండనుంది. ఇన్వెస్కో ఓపెన్‌హైమర్‌లో భాగమైన డెవలపింగ్‌ మార్కెట్స్‌ ఫండ్‌ ఈ వాటాలను కొనుగోలు చేయనుంది. 2002 నుంచి జీ లో ఇన్వెస్టరుగా కొనసాగుతున్న ఇన్వెస్కో ఫండ్‌కు ప్రస్తుతం ఇందులో 7.74 శాతం వాటాలు ఉన్నాయి.

‘ఇన్వెస్కో ఓపెన్‌హైమర్‌ డెవలపింగ్‌ మార్కెట్స్‌ ఫండ్‌ .. జీ లో మరింతగా ఇన్వెస్ట్‌ చేసేందుకు అంగీకరించింది. ప్రమోటర్ల నుంచి మరో 11 శాతం దాకా వాటాలను రూ. 4,224 కోట్లకు కొనుగోలు చేయడానికి అంగీకరించింది‘ అని జీ ఒక ప్రకటనలో తెలిపింది. తమ సంస్థపై ఇన్వెస్కో ఫండ్‌కున్న నమ్మకాన్ని తాజా పెట్టుబడులు తెలియజేస్తున్నాయని జీ మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈవో పునీత్‌ గోయెంకా పేర్కొన్నారు. ఈ డీల్‌తో జీ లో ప్రమోటర్ల వాటా 23 శాతానికి తగ్గుతుంది. 2019 జూన్‌ నాటికి జీ లో ప్రమోటర్ల వాటా 35.79 శాతంగా ఉంది. ఇందులో 63.98 శాతం వాటాలు మ్యూచువల్‌ ఫండ్స్, ఇతర ఆర్థిక సంస్థల దగ్గర తనఖాలో ఉన్నాయి. బుధవారం షేరు ముగింపు ధరను బట్టి జీ మార్కెట్‌ విలువ రూ. 34,717 కోట్లు కాగా.. ఇందులో ప్రమోటర్ల వాటాల విలువ సుమారు రూ. 13,000 కోట్లుగా అంచనా.  

ఏడాదిగా ప్రమోటర్ల ప్రయత్నాలు..
సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందంటూ ఎస్సెల్‌ గ్రూప్‌ ప్రమోటరు సుభాష్‌ చంద్ర ఈ ఏడాది జనవరిలో రాసిన బహిరంగ లేఖతో కంపెనీ వాస్తవ స్థితిగతులు అధికారికంగా బైటపడ్డాయి. ఇన్‌ఫ్రా రంగంలో భారీగా పెట్టిన పెట్టుబడులు, వీడియోకాన్‌కు చెందిన డీ2హెచ్‌ వ్యాపారం కొనుగోలు లావాదేవీలు ప్రతికూలంగా మారాయని చంద్ర పేర్కొన్నారు. అయితే, బ్యాంకర్లు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి పొందిన రుణాలన్నీ పూర్తిగా తీర్చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సెప్టెంబర్‌ దాకా ఎటువంటి చర్యలూ తీసుకోకుండా రుణదాతలతో కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. 

వాస్తవానికి భారీగా పేరుకుపోతున్న రుణభారాన్ని తగ్గించుకునే దిశగా గ్రూప్‌ సంస్థల్లో వాటాలను విక్రయించేందుకు గతేడాది నవంబర్‌ నుంచీ ఎస్సెల్‌ గ్రూప్‌ ప్రమోటర్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. రుణాల రీపేమెంట్‌కు 2019 సెప్టెంబర్‌ను గడువుగా నిర్దేశించుకున్నారు. జీ లో తమకున్న వాటాల్లో దాదాపు 50 శాతం వాటాలు వ్యూహాత్మక భాగస్వామికి విక్రయించేందుకు ప్రమోటర్లు గతేడాది నవంబర్‌ నుంచి ప్రయత్నిస్తున్నారు. జీ లోనూ, ఇతరత్రా మీడియాయేతర అసెట్స్‌లో వాటాల కొనుగోలుకు వివిధ భాగస్వాముల నుంచి సానుకూల స్పందన కూడా వస్తున్నట్లు ఎస్సెల్‌ గ్రూప్‌ చెబుతూ వస్తోంది. తాజాగా ఇన్వెస్కో ఓపెన్‌హైమర్‌తో ఒప్పందం కుదరడం సంస్థకు కొంత ఊరటనివ్వనుంది.

రూ. 7,000 కోట్లకు తగ్గనున్న రుణభారం..
బుధవారం నాటి జీ షేరు ముగింపు ధరతో పోలిస్తే ఇన్వెస్కో 10 శాతం ప్రీమియం చెల్లించనుంది. ఈ డీల్‌తో గ్రూప్‌ రుణ భారం రూ. 11,000 కోట్ల నుంచి రూ. 7,000 కోట్లకు తగ్గనుందని జీ సీఈవో, ఎండీ పునీత్‌ గోయెంకా తెలిపారు. జనవరిలో రూ. 13,000 కోట్లుగా ఉన్న రుణభారాన్ని అంతర్గత వనరుల సమీకరణ తదితర చర్యల ద్వారా ప్రస్తుతం రూ. 11,000 కోట్లకు తగ్గించుకున్నట్లు వివరించారు.   
షేరు 5 శాతం డౌన్‌.. బుధవారం మార్కెట్లు ముగిశాక డీల్‌ వెల్లడైంది. బీఎస్‌ఈలో జీ షేరు 5.2 శాతం క్షీణించి రూ. 361.45 వద్ద ముగిసింది.

మిగతా అసెట్స్‌ విక్రయంపై దృష్టి..
రుణాల చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రమోటర్లకు అవసరమైన ఆర్థిక వెసులుబాటు ఈ డీల్‌తో లభించగలదని జీ మాతృసంస్థ ఎస్సెల్‌ గ్రూప్‌ పేర్కొంది. ఇతరత్రా అసెట్స్‌ విక్రయం దిశగా ఇది ముందడుగని తెలిపింది. మీడియాయేతర అసెట్స్‌నూ విక్రయించాలని ఎస్సెల్‌ గ్రూప్‌ యత్నిస్తున్న సంగతి తెలిసిందే. ‘తాజా పరిస్థితుల నేపథ్యంలో నిర్దేశించుకున్న సెప్టెంబర్‌ గడువులోగా రుణాల రీపేమెంట్‌ ప్రక్రియను పూర్తి చేయగలం‘ అని ఎస్సెల్‌ గ్రూప్‌ ధీమా వ్యక్తం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement