Funding Shortage
-
ఎడ్‌టెక్‌కు తగ్గిన ఫండింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దశాబ్ద కాలంలో భారతీయ ఎడ్టెక్ రంగం నూతన గరిష్టాలను నమోదు చేసింది. ప్రస్తుతం ఈ రంగం నిధుల కొరతను ఎదుర్కొంటోంది. 2021లో దాని గరిష్ట స్థాయితో పోలిస్తే ఈ ఏడాది 47% తగ్గుదల ఉంది. అయితే అభివృద్ధి చెందుతున్న పోకడలు, మార్కెట్ స్థితిస్థాపకత ద్వారా ఈ రంగంలో దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రాక్ఎక్స్ఎన్ ఫీడ్ జియో రిపోర్ట్: ఎడ్టెక్ ఇండియా 2024 ప్రకారం భారతీయ ఎడ్టెక్ పర్యావరణ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా మూడవ అత్యధిక నిధులతో కొనసాగుతోంది. ప్రస్తుతం నిధుల సవాళ్లు ఉన్నప్పటికీ దాని సామర్థ్యాన్ని గణాంకాలు నొక్కి చెబుతున్నాయి. గరిష్టం నుంచి క్షీణత.. భారతీయ ఎడ్టెక్ రంగం 2024 సంవత్సరంలో ఇప్పటి వరకు 215 మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది. 2023లో పరిశ్రమ 321 మిలియన్ డాలర్లను అందుకుంది. అయితే ఈ మొత్తాలు 2021లో సేకరించిన 4.1 బిలియన్ డాలర్ల అత్యున్నత స్థాయితో పోలి్చతే చాలా తక్కువగా ఉంది. 2022లో మొదలైన క్షీణత 2023 వరకు కొనసాగింది. 2022లో ఈ రంగం 87 శాతం క్షీణించింది. ఇది స్థూల ఆర్థికపర ఎదురుగాలులు, పెట్టుబడిదారుల హెచ్చరిక, సంప్రదాయ అభ్యాస నమూనాలకు తిరిగి మారడం వంటి కారణాలతో కూడిన సవాళ్ల వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. పుంజుకునే సంకేతాలు.. ఇన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ ఈ రంగం పుంజుకునే సంకేతాలను చూపుతోంది. 2024 మొదటి అర్ధ భాగంలో ఎడ్టెక్ రంగంలోకి వచ్చిన నిధులు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 96 శాతం దూసుకెళ్లి 164 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2023 జనవరి–జూన్‌లో ఇది 81.9 మిలియన్ డాలర్లుగా ఉంది. ఈ వృద్ధి స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ 2021 క్యూ3లో ఎడ్టెక్ పరిశ్రమ అందుకున్న 2.48 బిలియన్ డాలర్ల త్రైమాసిక గరిష్టంతో పోలిస్తే చాలా తక్కువ. మార్కెట్ సవాళ్లు ఉన్నప్పటికీ.. నిధుల హెచ్చుతగ్గుల మధ్య కీలక కంపెనీలు వ్యూహాత్మక ఎత్తుగడలను కొనసాగించాయి. ఆన్లైన్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ అవాన్స్ 120 మిలియన్ డాలర్ల నిధులను పొందింది. న్యాయ విద్య స్టార్టప్ అయిన లాసీకో 2024లో పబ్లిక్ ఇష్యూకు వెళ్లింది. దీంతో ఈ ఏడాది ఎడ్టెక్ రంగంలో ముఖ్యమైన మైలురాళ్లు నమోదయ్యాయి. ఈ పరిణామాలు విస్తృత మార్కెట్ సవాళ్లు ఉన్నప్పటికీ పెట్టుబడిని ఆకర్షించడానికి, వృద్ధిని పెంచడానికి రుణాలు, ప్రత్యేక శిక్షణా ప్లాట్‌ఫామ్‌ల వంటి ఎడ్టెక్లోని సముచిత విభాగాల సామర్థ్యాన్ని నొక్కిచెప్పాయి. 2024లో ఒకటి మాత్రమే.. అన్అకాడమీ, ఎరుడిటస్, అప్‌గ్రాడ్ వంటి ప్రముఖ ఎడ్టెక్ కంపెనీలు భారత మార్కెట్లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. అన్అకాడమీ ఏకంగా 3.44 బిలియన్ డాలర్ల విలువతో అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఈ రంగంలో 2023 నుండి కొత్త యునికార్న్ ఉద్భవించలేదు. పెట్టుబడిదారుల విశ్వాసం ఇంకా పూర్తిగా కోలుకోలేదని ఇది సూచిస్తోంది. ఈ రంగంలో కొనుగోళ్లు 2021లో ఏకంగా 31 నమోదయ్యాయి. 2023లో ఈ సంఖ్య 13కు పరిమితమైంది. 2024లో ఒకటి మాత్రమే నమోదు కావడం నిరాశ కలిగిస్తోంది. మారుతున్న పెట్టుబడుల తీరు.. భారతీయ ఎడ్టెక్ రంగంలో నిధుల ల్యాండ్‌స్కేప్ నాటకీయంగా మారిపోయింది. లేట్ స్టేజ్ నిధులు 2021లో గరిష్ట స్థాయికి చేరుకుని 3.9 బిలియన్ డాలర్లు నమోదయ్యాయి. 2023లో 187 మి.డాలర్లు, 2024లో ఇప్పటి వరకు 166 మిలియన్ డాలర్లకు పడిపోయింది. ప్రారంభ దశ పెట్టుబడులు 2022లో 654 మి.డాలర్ల నుండి 85 శాతం తగ్గి ఆ తర్వాతి సంవత్సరంలో 96.4 మి.డాలర్లకు వచ్చి చేరాయి. 2021లో 175 మి.డాలర్లకు చేరుకున్న సీడ్ స్టేజ్ ఫండింగ్ 2024లో కేవలం 8.5 మి.డాలర్లకు పడిపోయింది. అన్ని దశలలో తగ్గుతున్న పెట్టుబడులనుబట్టి ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు అవగతమవుతోంది. స్థూల ఆర్థిక అనిశి్చతులు, మహమ్మారి అనంతర విద్యా విధానంలో మార్పులు ఇందుకు కారణం. యూఎస్ తర్వాత మనమే.. ప్రస్తుత నిధుల సవాళ్లు ఉన్నప్పటికీ భారతీయ ఎడ్టెక్ రంగం గ్లోబల్ లీడర్‌గా ఉంది. ఆరు యునికార్న్‌లతో విజయవంతంగా కొనసాగుతోంది. యూనికార్న్‌ల సంఖ్య పరంగా యూఎస్ తర్వాత రెండవ స్థానంలో భారత్ నిలిచింది. మారుతున్న వినియోగదారుల అవసరాలు, అంచనాలకు అనుగుణంగా ఆఫ్‌లైన్, ఆన్లైన్ విద్యా నమూనాల ఏకీకరణ ద్వారా ఈ రంగం భవిష్యత్తు వృద్ధి ఆధారపడి ఉంది. ఆర్టిఫీíÙయల్ ఇంటెలిజెన్స్, తరగతి గదులలో వాయిస్ టెక్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను స్వీకరించడం ఆవిష్కరణను ప్రోత్సహిస్తుంది. అలాగే వృద్ధికి కొత్త మార్గాలను సృష్టిస్తోంది. ఉదాహరణకు వ్యక్తిగతీకరించిన అభ్యాసం, స్మార్ట్ అసెస్మెంట్లు, ఏఐ ఆధారిత అడాప్టివ్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఈ రంగంలో ప్రముఖంగా మారుతున్నాయి. విస్తరణకు అనుకూలమైన విధానండిజిటల్ విద్య, ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యాలను నొక్కిచెప్పే జాతీయ విద్యా విధానం–2020 వంటి విధాన మద్దతు భవిష్యత్ విస్తరణకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తోంది. సంప్రదాయ, డిజిటల్ వేదికలలో ఉత్తమమైన వాటిని మిళితం చేసే హైబ్రిడ్ లెరి్నంగ్ మోడల్స్ ప్రమాణికంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలలో ఈ విధానం విద్య సౌలభ్యాన్ని, నాణ్యతను పెంపొందిస్తుంది. దీర్ఘకా లిక దృక్పథం సానుకూలంగానే ఉన్నప్పటికీ భారతీయ ఎడ్‌టెక్‌కు ముందున్న మార్గం సవాళ్లతో నిండి ఉంది అని ట్రాక్ఎక్స్ఎన్ నివేదిక చెబుతోంది. -
స్టార్టప్‌లకు నిధుల కొరత
న్యూఢిల్లీ: స్టార్టప్‌లకు నిధుల మద్దతు తగ్గింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనంతో దేశంలో స్టార్టప్‌లకు నిధుల సాయం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రెండేళ్ల కనిష్ట స్థాయి అయిన 2.7 బిలియన్ డాలర్లకు (రూ.21,870 కోట్లు) పరిమితమైంది. 205 డీల్స్ నమోదయ్యాయి. ఈ మేరకు పీడబ్ల్యూసీ ఓ నివేదికను విడుదల చేసింది. జూలై–సెప్టెంబర్ కాలంలో కేవలం రెండు స్టార్టప్‌లు యూనికార్న్ హోదా సాధించాయి. యూనికార్న్ హోదా పొందే విషయంలో అంతర్జాతీయంగా ఉన్న ధోరణే మన దగ్గరా కనిపించింది. అంతర్జాతీయంగా చూస్తే సెప్టెంబర్ క్వార్టర్లో 20 స్టార్టప్‌లు యూనికార్న్ హోదా పొందగా, ఇందులో 45 శాతం కంపెనీలు సాస్ విభాగం నుంచే ఉన్నాయి. ఇక డెకాకార్న్ స్థాయికి ఒక్కటీ చేరుకోలేదు. అన్ని విభాగాల్లోనూ క్షీణత.. ఆరంభ దశ, వృద్ధి దశ, తదుపరి దశ ఇలా అన్ని విభాగాల్లోని స్టార్టప్‌లకు సెప్టెంబర్ త్రైమాసికంలో నిధుల మద్దతు తగ్గింది. ఆరంభ స్థాయి డీల్స్ విలువ సెప్టెంబర్ త్రైమాసికంలో 21 శాతంగా ఉంది. అంతకుముందు మూడు నెలల కాలంలో ఆరంభ స్థాయి డీల్స్ విలువ 12 శాతంతో పోలిస్తే రెట్టింపైంది. ముఖ్యంగా స్టార్టప్‌లకు వెంచర్ క్యాపిటల్ సంస్థలు (వీసీలు) మద్దతుగా నిలుస్తున్నాయి. వృద్ధి దశ, తదుపరి దశ స్టార్టప్‌లకు సెప్టెంబర్ త్రైమాసికంలో 79 శాతం నిధులు వెళ్లాయి. ‘‘స్టార్టప్‌లకు నిధుల మార్కెట్లో మందగమనం ఎంత కాలం కొనసాగుతుందో తెలియదు. వ్యవస్థాపకులు, ఇన్వెస్టర్లు డీల్స్ విషయంతో జాగ్రత్త పాటిస్తున్నారు’’ అని పీడబ్ల్యూసీ ఇండియా డీల్స్ పార్ట్నర్ అమిత్ నవకా పేర్కొన్నారు. కాగా, ఇన్వెస్టర్లు గణనీయమైన నిధులు సమీకరించారని, ఈ నిధులు ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌లోకి రానున్నాయని నివేదిక అంచనా వేసింది. ఒక్కో డీల్ 4-5 డాలర్లు.. సెప్టెంబర్ క్వార్టర్లో ఒక్కో డీల్ టికెట్ విలువ సగటున 4–5 మిలియన్ డాలర్లు (రూ.32.5-40.5 కోట్లు)గా ఉంంది. సెప్టెంబర్ క్వార్టర్లో 38 విలీనాలు, కొనుగోళ్ల (ఎంఅండ్ఏ) డీల్స్ నమోదయ్యాయి. ఇందులో 30 దేశీ డీల్స్ ఉన్నాయి. సాస్, ఎడ్యుటెక్ స్టార్టప్‌లలో ఎక్కువ ఎం అండ్ఏ లు నమోదయ్యాయి. ఎడ్యుటెక్ కంపెనీ ‘అప్‌గ్రాడ్’ నాలుగు కంపెనీలను సొంతం చేసుకుని మొదటి స్థానంలో నిలిచింది. -
పురోగమనంలో యస్ బ్యాంకు
న్యూఢిల్లీ: యస్ బ్యాంకు యాజమాన్య బాధ్యతలను ఎస్బీఐ సహా ఇతర ఇన్వెస్టర్లు తీసుకున్న తర్వాత.. పనితీరు మెరుగుపడుతోందని ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్‌కుమార్ అన్నారు. నిధుల సంక్షోభంలో పడిపోయిన యస్ బ్యాంకును ఆదుకున్న సమయంలో ఎస్బీఐ సారథిగా రజనీ‹Ùకుమార్ ఉన్న విషయం గమనార్హం. యస్ బ్యాంకుపై ఓ వార్తా సంస్థతో రజనీష్‌కుమార్ తాజాగా మాట్లాడారు. ‘‘యస్ బ్యాంకు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో స్థిరపడేందుకు కనీసం మూడేళ్ల సమయం అయినా ఇచ్చి చూడాలి. ఎస్బీఐ ఆదుకున్న సమయంలో యస్ బ్యాంకు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అప్పటి నుంచి మంచి పురోగతే చూపించింది’’ అని రజనీష్ కుమార్ వివరించారు. ‘ద కస్టోడియన్ ఆఫ్ ట్రస్ట్’ పేరుతో రజనీష్‌కుమార్ తాను రచించిన పుస్తకంలోనూ యస్ బ్యాంకుకు సంబంధించి నాటి జ్ఞాపకాలను ప్రస్తావించారు. యస్ బ్యాంకును చివరి క్షణంలో ఆదుకునేందుకు ఎస్బీఐ విముఖంగా ఉన్నప్పటికీ.. నాటి పరిస్థితుల్లో తప్పలేదని పేర్కొన్నారు. ‘‘ఆరు బ్యాంకులను (ఐదు అనుబంధ బ్యాంకులు సహా) ఎస్బీఐలో విలీనం చేసుకున్న అనంతరం మరో బ్యాంకును ఆదుకునే పరిస్థితి ఎస్బీఐకి రాదనుకున్నాను. ఎస్బీఐ అంతకుముందు చివరిగా 1995లో కాశినాథ్ సేత్ బ్యాంకును ఆదుకుంది’’ అని రజనీష్ తెలిపారు. ఆ విషయంలో ఒత్తిడి వచ్చింది.. ‘‘యస్ బ్యాంకులో పెట్టుబడులకు సంబంధించి ఇతర ఇన్వెస్టర్లను 2020 మార్చి 13 నాటికి గుర్తించే విషయమై నాడు నాపై ఒత్తిడి ఉంది. దేశంలో నాలుగో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు విఫలమైతే అది దేశ ఆరి్థక వ్యవస్థపై ప్రభావానికి దారితీయకుండా ఆర్బీఐ నుంచి ఒత్తిడి వచి్చంది’’ అని రజనీష్ నాటి సంక్షోభానికి సంబంధించి తాను ఎదుర్కొన్న అనుభవాలను తన పుస్తకంలో బయటపెట్టారు. 2020 మార్చి 5న యస్ బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించడం తెలిసిందే. మొదట ఒక్కో ఖాతాదారు రూ.50,000 వరకు ఉపసంహరించుకునేందుకు అనుమతించింది. మార్చి 13 నాటికి యస్ బ్యాంకు పునరుద్ధరణ ప్రణాళికను ఆర్బీఐ ప్రకటించి, 18 నుంచి మారటోరియంను ఎత్తివేసింది. నాటి ప్రణాళిక ప్రకారం యస్ బ్యాంకులో ఎస్బీఐ తన పెట్టుబడులను మొదటి మూడేళ్లలో 26 శాతానికంటే దిగువకు తగ్గించుకోకూడదు. ఇతర ఇన్వెస్టర్లు, అప్పటికే వాటాలు కలిగి ఉన్న వారు తమ వాటాల్లో 75 శాతాన్ని మూడేళ్లపాటు విక్రయించుకోకుండా లాకిన్ విధించారు. 100 షేర్లలోపు ఉన్న వారికి మాత్రం మినహాయింపునిచ్చారు. ‘‘నాడు ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, ఫెడరల్ బ్యాంకులు సైతం పెట్టుబడులతో ముందుకు వచ్చాయి. చివర్లో ఐడీఎఫ్సీ ఫస్ట్‌బ్యాంకు తరఫున వీ వైద్యనాథన్ సైతం రూ.150 కోట్ల పెట్టుబడులతో ముందుకు రావడం ఆశ్చర్యపరిచింది. కానీ, అప్పటికీ నిర్దేశిత లక్ష్యానికి మరో రూ.10,000 కోట్ల పెట్టుబడులు కావాల్సి ఉంది. దాంతో బంధన్ బ్యాంకు ఘోష్‌కు కాల్ చేయగా.. మరో రూ.250కోట్లను ఇన్వెస్ట్ చేసేందుకు అంగీకరించారు. చాలా స్వల్ప వ్యవధిలోనే యస్‌బ్యాంకును విజయవంతంగా ఒడ్డెక్కించడం అన్నది ప్రభుత్వం, ఆర్బీఐ చక్కని సమన్వయానికి నిదర్శనం’’ అన్నారు. -
ఐడియాలున్నా ఫండింగ్ లేదు!
ఈ ఏడాది తొలి ఆరునెలల్లోనే మహిళల స్టార్టప్‌కు ఫండింగ్ 24 శాతం వరకు పడిపోయిందని ‘మేకర్స్ ఇండియా’ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఆ తగ్గిన మొత్తం విలువ సుమారు 2 వేల 60 కోట్ల రూపాయలు! మహిళల స్టార్టప్‌లపై నమ్మకం లేక డబ్బు పెట్టేవాళ్లు ఇలా ముఖం చాటేయవచ్చు కానీ, అవే ముఖాలు ఆశ్చర్యంతో తమ వైపు తిరిగి చూసేలా మహిళలు తమ వ్యాపార దక్షతను చాటుతుండటం విశేషం. ‘బయోకాన్’ సంస్థ ఒక ఆలోచనగా ఆవిర్భవించే నాటికి కిరణ్ మజుందార్ షా వయసు ఇరవై ఐదేళ్లు. అప్పటికే ఆమెకు మంచి ‘బ్య్రూ–మాస్టర్’గా పేరుంది. ‘బయోకాన్’ జీవ ఔషధాల పరిశోధనా సంస్థ కనుక ‘బ్య్రూ–మాస్టర్’గా ఆమెకు ఉన్న అనుభవం తప్పక తోడ్పడుతుంది. అనుభవం సరే. డబ్బు మాటేమిటి? ఎవరైనా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావాలి. ఎవరూ రాలేదు! ఒక మహిళ శక్తి సామర్థ్యాలను నమ్మి బయో టెక్నాలజీ రంగంలోని ఒక అంకుర సంస్థకు (టెక్–స్టార్టప్) రుణం ఇచ్చేందుకు ఒక్క బ్యాంకు కూడా ఆనాడు తొందరపడలేదు. కిరణ్ మజుందార్ షా కొన్ని మాత్రం ముందుకు వచ్చాయి కానీ, రుణం ఇవ్వడానికి ఆమె తండ్రి ఆమెకు షూరిటీగా ఉండాలన్న షరతు విధించాయి. యునైటెడ్ బ్రూవరీస్లో ఆయన హెడ్ బ్య్రూ–మాస్టర్. తండ్రి చేత సంతకాలు పెట్టించడం కిరణ్ మజుందార్‌కు ఇష్టం లేదు. చివరికి ఓ ‘ఏంజెల్ ఇన్వెస్టర్’ ఆమెకు దొరికారు. అంటే.. బంధువుల్లోనే ఒకరు. అలా బెంగళూరులో బయోకాన్ ప్రారంభం అయింది. ప్రస్తుతం ఆ సంస్థ నికర విలువ సుమారు 33 వేల కోట్ల రూపాయలు! ∙∙ గుర్గావ్లోని ప్రసిద్ధ ‘విన్‌గ్రీన్స్ ఫామ్స్’ సంస్థ రైతులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుంటుంది. పర్యావరణ సమతౌల్యం కోసం వంద రకాలైన పంటలను పండిస్తుంది. ఆహార, ఆరోగ్య ఉత్పత్తులను విక్రయిస్తుంది. ఆ సంస్థ వ్యవస్థాపకురాలు అంజు శ్రీవాత్సవ. మొదట్లో సిబ్బందికి జీతాలు ఇవ్వడానికే ఆమెకు కష్టమైపోయింది. పది లక్షల రూపాయల పెట్టుబడితో 2008లో ప్రారంభం అయింది ‘విన్ గ్రీన్స్ ఫామ్స్’. అంజు శ్రీవాత్సవ కిరణ్ మజుందార్లానే అంజు శ్రీవాత్సవ కూడా విన్గ్రీన్స్కు అవసరమైన పెట్టుబడి కోసం తలకు మించిన ప్రయత్నాలు చేయవలసి వచ్చింది. మహిళ అన్న ఒకే ఒక కారణంగా వెంచర్ క్యాపిటలిస్టులు (డబ్బు పెట్టేవారు) వెనకాడారు. కనీసం ఆమెకు తెలిసినవాళ్లలో ఏంజెల్ ఇన్వెస్టర్లైనా లేరు. తన తిప్పలు తనే పడ్డారు. సంస్థను పైకి తెచ్చారు. పెట్టుబడి డబ్బు కోసం వెళ్లినప్పుడు ఖాళీ చేతులు చూపించిన వారికి ఇప్పుడు ఆమె నెలకు 8 కోట్ల రూపాయల ఆదాయాన్ని చూపిస్తున్నారు! ∙∙ ‘నిరమయి’ పేరు వినే ఉంటారు. వినూత్న వైద్య ఆరోగ్య చికిత్స సాధనాలు, విధానాల పరిశోధనా సంస్థ. నిరమయి వ్యవస్థాపకురాలు గీతా మంజూనాథ్. సంస్థ బెంగళూరులో ఉంటుంది. రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించేందుకు చేసే మామోగ్రఫీ కన్నా కూడా చౌకగా నిరమయి కనిపెట్టిన వ్యాధి నిర్థారణ విధానం ఆ సంస్థకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఈ సంస్థ ఆవిష్కరణలన్నీ స్వయంగా మంజూనాథ్ పర్యవేక్షణలోనే జరుగుతాయి. బయోటెక్నాలజీలో 25 ఏళ్ల అనుభవం ఆమెది. అయితే ‘‘మహిళల స్టార్టప్‌లకు అంత తేలిగ్గా ఏమీ ఫండింగ్ దొరకదు’’ అని మంజూనాథ్ అంటారు. నాలుగేళ్ల క్రితమే మొదలైన ‘నిరమయి’.. సవాళ్లను ఎదుర్కొంటూ ఇప్పుడిప్పుడు కోట్ల రూపాయల రాబడిని పొందుతున్న కంపెనీగా వెంచర్ క్యాపిటలిస్టుల గుర్తింపు తెచ్చుకుంది. గత ఏడాది 16 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించుకోగలిగింది. ∙∙ స్టార్టప్‌ను నడపడం బ్రహ్మవిద్యేమీ కాదని మహిళల నేతృత్వంలోని బయోకాన్, విన్‌గ్రీన్స్, నిరమయి వంటి విజయవంతమైన కంపెనీలు నిరూపిస్తున్నప్పటికీ మహిళల స్టార్టప్‌లకు ఫండింగ్ దొరకడం అన్నది మాత్రం ఇప్పటికీ పెద్ద విషయం గానే ఉంది! 2020 తొలి ఆరునెలల్లోనే మహిళల స్టార్టప్ కు ఫండింగ్ 24 శాతం వరకు పడిపోయిందని ‘మేకర్స్ ఇండియా’ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాదిని వదిలేసి చూసినా ఇండియాలో వెంచర్ క్యాపిటలిస్టుల ఫండింగ్‌లో కేవలం 2 శాతం కన్నా తక్కువ మాత్రమే మహిళల స్టార్టప్‌లు పొందగలుగుతున్నాయి. కారణం తెలిసిందే. ఐటీ రంగంలో మహిళల వ్యాపార దక్షతలపై ఇన్వెస్టర్లకు నమ్మకం లేకపోవడమే. మహిళల పేరుపై వ్యక్తిగత ఆస్తులు ఉండకపోవడం కూడా మరొక కారణం. గీతా మంజునాథ్ ‘వెంచర్స్ ఇంటెలిజెన్స్’ సంస్థ ఇటీవల జరిపిన సర్వేలో ఫండింగ్ ఉన్న మహిళల స్టార్టప్‌లు 2018లో 9.2 రెండు శాతంగా ఉంటే, ఈ ఏడాది నవంబరుకు 14.3 శాతానికి పెరిగాయట! మరి ఈ పెరుగుదల ఎలా సాధ్యం అయింది? ఎలా అంటే.. ఆ స్టార్టప్ ల సహ వ్యవస్థాపకులుగా పురుషులు ఉండటం. పురుషుల భాగస్వామ్యం ఉన్నప్పుడే (తండ్రి గానీ, భర్త గానీ, మరొకరు గానీ) మహిళల స్టార్టప్‌లకు నిధులు సమకూర్చేందుకు బ్యాంకులు, వెంచర్ కేపిటలిస్టు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. మహిళలకు ఫండింగ్ దొరకపోవడానికి కారణాలను వెతుక్కోవడం కాదు ఇదంతా. ఫండింగ్ లభించకపోయినా మహిళలు వెనకంజ వేయకుండా వ్యాపార రంగంలో అద్భుతమైన ఫలితాలను సాధించి చూపుతున్నారని చెప్పడం. -
డీహెచ్ఎఫ్ఎల్ 4,800 కోట్ల డిపాజిట్ల క్లెయిమ్‌లకు ఆమోదం
ముంబై: నిధుల సంక్షోభంలో ఉన్న దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్) ఇప్పటి వరకు రూ.4,800 కోట్ల డిపాజిట్ల చెల్లింపుల క్లెయిమ్‌లను ఆమోదించినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. సమారు 55,000 మంది డిపాజిట్ హోల్డర్లు రూ.5,200 కోట్ల డిపాజిట్లకు సంబంధించి క్లెయిమ్‌లను డిసెంబర్ 17 నాటికి దాఖలు చేయగా.. రూ.4,800 కోట్ల క్లెయిమ్‌లను అనుమతించినట్టు వెల్లడించాయి. వీరిలో రిటైలర్లతోపాటు యూపీ పవర్ కార్పొరేషన్ ఉద్యోగులు సైతం ఉన్నారు. వీటితో పాటు అన్ని రకాల క్లెయిమ్‌లు (రుణదాతలు సహా) కలపి రూ.93,105 కోట్లుగా ఉన్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. -
మాంద్యం మింగేసింది
సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఆర్థిక మాంద్యం నేపథ్యంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత.. ఇంటర్ ఫలితాల్లో లోపాలపై తీవ్ర వివాదం... న్యాయ చిక్కులతో బెడిసికొట్టిన కొత్త సచివాలయం, శాసనసభ భవన సముదాయాల నిర్మాణం, ఆర్టీసీ కార్మికుల సుదీర్ఘ సమ్మె... దిశ హత్యాచారం, నలుగురు నిందితుల ఎన్కౌంటర్.. వెరసి ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం కొన్ని ఒడిదుడుకులకు, సంచలనాలకు వేదికైంది. అదే సమయంలో ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభం కావడం ప్రభుత్వ అతిపెద్ద విజయంగా, తీపిగుర్తుగా మిగిలింది. 2019 సంవత్సరం మరో మూడు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ఈ ఏడాది రాష్ట్రంలో చోటుచేసుకున్న కీలక పరిణామాలు, రాష్ట్రానికి ఎదురైన క్లిష్ట పరిస్థితులపై కథనం. ఆర్థిక మాంద్యం దెబ్బ ఆర్థిక మాంద్యం ప్రభావం రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పడింది. ఫిబ్రవరిలో రూ. 1,82,087 కోట్ల భారీ అంచనాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఆర్థిక మాంద్యం దెబ్బకు పూర్తిస్థాయి బడ్జెట్‌ను సెప్టెంబర్‌లో రూ. 1,46,492.30 కోట్లకు తగ్గించుకుంది. అయినా ఇప్పటికే అమల్లో ఉన్న రైతుబంధు వంటి ప్రతిష్టాత్మక పథకాలకు తీవ్ర నిధుల కొరత ఏర్పడింది. పెద్ద మొత్తంలో కాంట్రాక్టర్ల బిల్లులు పేరుకుపోయాయి. గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన కొత్త హామీల అమలు కూడా ఆర్థిక మాంద్యం వల్ల ప్రశ్నార్థకమైంది. రైతులకు రూ. లక్షలోపు రుణ మాఫీ, నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు పీఆర్సీ, ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు వంటి హామీల అమలు కోసం రాష్ట్ర ప్రజలు ఏడాదంతా నిరీక్షించాల్సి వచ్చింది. రైతుబంధు ఆర్థిక సాయం, ఆసరా పెన్షన్ల పెంపు హామీలను అమల్లోకి తెచ్చినా సకాలంలో పంపిణీ చేయలేకపోయింది. గత ఖరీఫ్‌లో 45 లక్షల మంది రైతులకు రైతుబంధు కింద రూ. 5,460 కోట్లు చెల్లించగా 8 లక్షల మందికి రూ. 1,500 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఇక రబీకి సంబంధించి చెల్లింపులు ఇంకా ప్రారంభం కాలేదు. నిధుల కొరత వల్ల కొత్తగా అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సవరించిన అంచనాల్లో రూ. 10 వేల కోట్లను భూముల అమ్మకం ద్వారా సమీకరించుకోవాలని నిర్ణయించినా కోకాపేట భూముల అమ్మకంపై హైకోర్టు స్టే విధించడంతో అది నెరవేరట్లేదు. ఇంటర్ ఫలితాల్లో ‘ఫెయిల్’ ఇంటర్మీడియెట్ ఫలితాల ప్రకటనలో దొర్లిన తప్పులు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. రిజల్ట్స్ ప్రాసెసింగ్ కాంట్రాక్టు దక్కించుకున్న గ్లోబరీనా సంస్థ చేసిన తప్పిదాల కారణంగా పాసైన విద్యార్థులు సైతం ఫెయిలైనట్లు ఫలితాలొచ్చాయి. దీంతో తీవ్ర మానసిక వేదనకు 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపింది. ఈ విషయంలో ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదనే విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫలితాలపై విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రతిపక్షాలు ఆందోళనలు నిర్వహించడం, ఈ వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల సంఘం, సుప్రీంకోర్టు స్పందించడం ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పడేసింది. ‘కాళేశ్వరం’ జాతికి అంకితం.. రాష్ట్రంలోని 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ జూన్ 21న ప్రారంభించి జాతికి అంకితం చేశారు. వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసి ఆయకట్టుకు నీరు అందించేలా యుద్ధప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయి. 52 రోజుల పాటు.. అక్టోబర్ 5 నుంచి 52 రోజులపాటు సాగిన ఆర్టీసీ సమ్మె యావత్ రాష్ట్రాన్ని కుదిపేసింది. సమ్మె విరమణకు కార్మిక సంఘాల జేఏసీ, డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభు త్వం నిరాకరించడంతో 50 వేల మంది కార్మికులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. ఐదుగురు కార్మికుల బలవన్మరణాలతో కలిసి మొత్తం 38 మంది కార్మికులు సమ్మె కాలంలో మరణించారు. చివరకు కార్మిక జేఏసీ సమ్మె విరమించడం, కార్మికులను ప్రభుత్వం బేషరతుగా విధుల్లో చేర్చుకోవడంతో ఈ వివాదం సద్దుమణిగింది. సమ్మె విరమించిన కార్మికులపై సీఎం కేసీఆర్ హామీల వర్షం కురిపించడం ఊరట కలిగించింది. ఆర్టీసీ పరిరక్షణ కోసం కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున చార్జీల పెంపును ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. సచివాలయం లేని రాష్ట్రం కొత్త సచివాలయం, అసెంబ్లీ భవన సముదాయాల నిర్మాణం కోసం ప్రభుత్వం చారిత్రక ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చేసి అక్కడే రూ. 400 కోట్లతో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలనితీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చి రూ. 100 కోట్లతో కొత్త సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించాలని తీసుకున్న నిర్ణయంపై స్టే విధించింది. ప్రభుత్వం హుటాహుటిన సచివాలయ భవనాలను ఖాళీ చేయించడంతో పాలనపరంగా కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. సచివాలయ శాఖల్లో కొన్నింటిని సమీపంలోని బీఆర్కేఆర్ భవన్‌కు తరలించగా మిగిలిన శాఖలను వేర్వేరు చోట్లలో ఉన్న ప్రభుత్వ భవనాలకు చేర్చారు. చెట్టుకొకరు పుట్టకొకరు అన్న చందంగా సచివాలయ శాఖల పరిస్థితి తయారైంది. -
‘జీ’ డీల్‌కు ఇన్వెస్కో సై
ముంబై: నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న జీ గ్రూప్‌నకు ఊరటనిచ్చేలా అమెరికాకు చెందిన ఇన్వెస్కో ఓపెన్‌హైమర్ ఫండ్ మరింత ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చింది. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీ)లో ప్రమోటర్ల నుంచి మరో 11 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు అంగీకరించింది. ఈ డీల్ విలువ రూ. 4,224 కోట్లుగా ఉండనుంది. ఇన్వెస్కో ఓపెన్‌హైమర్‌లో భాగమైన డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ ఈ వాటాలను కొనుగోలు చేయనుంది. 2002 నుంచి జీ లో ఇన్వెస్టరుగా కొనసాగుతున్న ఇన్వెస్కో ఫండ్‌కు ప్రస్తుతం ఇందులో 7.74 శాతం వాటాలు ఉన్నాయి. ‘ఇన్వెస్కో ఓపెన్‌హైమర్ డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ .. జీ లో మరింతగా ఇన్వెస్ట్ చేసేందుకు అంగీకరించింది. ప్రమోటర్ల నుంచి మరో 11 శాతం దాకా వాటాలను రూ. 4,224 కోట్లకు కొనుగోలు చేయడానికి అంగీకరించింది‘ అని జీ ఒక ప్రకటనలో తెలిపింది. తమ సంస్థపై ఇన్వెస్కో ఫండ్‌కున్న నమ్మకాన్ని తాజా పెట్టుబడులు తెలియజేస్తున్నాయని జీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పునీత్ గోయెంకా పేర్కొన్నారు. ఈ డీల్‌తో జీ లో ప్రమోటర్ల వాటా 23 శాతానికి తగ్గుతుంది. 2019 జూన్ నాటికి జీ లో ప్రమోటర్ల వాటా 35.79 శాతంగా ఉంది. ఇందులో 63.98 శాతం వాటాలు మ్యూచువల్ ఫండ్స్, ఇతర ఆర్థిక సంస్థల దగ్గర తనఖాలో ఉన్నాయి. బుధవారం షేరు ముగింపు ధరను బట్టి జీ మార్కెట్ విలువ రూ. 34,717 కోట్లు కాగా.. ఇందులో ప్రమోటర్ల వాటాల విలువ సుమారు రూ. 13,000 కోట్లుగా అంచనా. ఏడాదిగా ప్రమోటర్ల ప్రయత్నాలు.. సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందంటూ ఎస్సెల్ గ్రూప్ ప్రమోటరు సుభాష్ చంద్ర ఈ ఏడాది జనవరిలో రాసిన బహిరంగ లేఖతో కంపెనీ వాస్తవ స్థితిగతులు అధికారికంగా బైటపడ్డాయి. ఇన్ఫ్రా రంగంలో భారీగా పెట్టిన పెట్టుబడులు, వీడియోకాన్‌కు చెందిన డీ2హెచ్ వ్యాపారం కొనుగోలు లావాదేవీలు ప్రతికూలంగా మారాయని చంద్ర పేర్కొన్నారు. అయితే, బ్యాంకర్లు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్ నుంచి పొందిన రుణాలన్నీ పూర్తిగా తీర్చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సెప్టెంబర్ దాకా ఎటువంటి చర్యలూ తీసుకోకుండా రుణదాతలతో కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. వాస్తవానికి భారీగా పేరుకుపోతున్న రుణభారాన్ని తగ్గించుకునే దిశగా గ్రూప్ సంస్థల్లో వాటాలను విక్రయించేందుకు గతేడాది నవంబర్ నుంచీ ఎస్సెల్ గ్రూప్ ప్రమోటర్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. రుణాల రీపేమెంట్‌కు 2019 సెప్టెంబర్‌ను గడువుగా నిర్దేశించుకున్నారు. జీ లో తమకున్న వాటాల్లో దాదాపు 50 శాతం వాటాలు వ్యూహాత్మక భాగస్వామికి విక్రయించేందుకు ప్రమోటర్లు గతేడాది నవంబర్ నుంచి ప్రయత్నిస్తున్నారు. జీ లోనూ, ఇతరత్రా మీడియాయేతర అసెట్స్‌లో వాటాల కొనుగోలుకు వివిధ భాగస్వాముల నుంచి సానుకూల స్పందన కూడా వస్తున్నట్లు ఎస్సెల్ గ్రూప్ చెబుతూ వస్తోంది. తాజాగా ఇన్వెస్కో ఓపెన్‌హైమర్‌తో ఒప్పందం కుదరడం సంస్థకు కొంత ఊరటనివ్వనుంది. రూ. 7,000 కోట్లకు తగ్గనున్న రుణభారం.. బుధవారం నాటి జీ షేరు ముగింపు ధరతో పోలిస్తే ఇన్వెస్కో 10 శాతం ప్రీమియం చెల్లించనుంది. ఈ డీల్‌తో గ్రూప్ రుణ భారం రూ. 11,000 కోట్ల నుంచి రూ. 7,000 కోట్లకు తగ్గనుందని జీ సీఈవో, ఎండీ పునీత్ గోయెంకా తెలిపారు. జనవరిలో రూ. 13,000 కోట్లుగా ఉన్న రుణభారాన్ని అంతర్గత వనరుల సమీకరణ తదితర చర్యల ద్వారా ప్రస్తుతం రూ. 11,000 కోట్లకు తగ్గించుకున్నట్లు వివరించారు. షేరు 5 శాతం డౌన్.. బుధవారం మార్కెట్లు ముగిశాక డీల్ వెల్లడైంది. బీఎస్ఈలో జీ షేరు 5.2 శాతం క్షీణించి రూ. 361.45 వద్ద ముగిసింది. మిగతా అసెట్స్ విక్రయంపై దృష్టి.. రుణాల చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రమోటర్లకు అవసరమైన ఆర్థిక వెసులుబాటు ఈ డీల్‌తో లభించగలదని జీ మాతృసంస్థ ఎస్సెల్ గ్రూప్ పేర్కొంది. ఇతరత్రా అసెట్స్ విక్రయం దిశగా ఇది ముందడుగని తెలిపింది. మీడియాయేతర అసెట్స్‌నూ విక్రయించాలని ఎస్సెల్ గ్రూప్ యత్నిస్తున్న సంగతి తెలిసిందే. ‘తాజా పరిస్థితుల నేపథ్యంలో నిర్దేశించుకున్న సెప్టెంబర్ గడువులోగా రుణాల రీపేమెంట్ ప్రక్రియను పూర్తి చేయగలం‘ అని ఎస్సెల్ గ్రూప్ ధీమా వ్యక్తం చేసింది. -
ఎన్‌బీఎఫ్‌సీలకు బాసట..
న్యూఢిల్లీ: నిధుల సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకు (ఎన్బీఎఫ్సీ) కొంత ఊరటనిచ్చే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారు. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న ఎన్‌బీఎఫ్‌సీల నుంచి అత్యుత్తమ రేటింగ్ ఉన్న అసెట్స్‌ను ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) కొనుగోలు చేస్తే కేంద్రం వన్‌టైమ్ పాక్షిక రుణ హామీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1 లక్ష కోట్ల మేర విలువ చేసే ఎన్‌బీఎఫ్‌సీల అసెట్స్ కొనుగోలు చేసే ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం వన్‌టైమ్ ప్రాతిపదికన పాక్షికంగా హామీనిస్తుంది. ఒకవేళ నష్టం వాటిల్లితే 10 శాతం దాకా హామీ ఉంటుంది‘ అని మంత్రి తెలిపారు. వినియోగ డిమాండ్‌ను నిలకడగా కొనసాగించడంలోనూ, చిన్న..మధ్య తరహా పరిశ్రమలకు అవసరమైన మూలధనం సమకూర్చడంలోను ఎన్ బీఎఫ్సీలు కీలకపాత్ర పోషిస్తున్నాయని ఆమె చెప్పారు. గతేడాది సెప్టెంబర్‌లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ కంపెనీలు డిఫాల్టు అయినప్పట్నుంచీ ఎన్‌బీఎఫ్‌సీలకు కష్టాలు మొదలైన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఎన్బీఎఫ్సీలు రిజర్వ్ బ్యాంక్ నియంత్రణలో ఉంటున్నాయి. అయినప్పటికీ వాటి నియంత్రణ విషయంలో ఆర్బీఐకి పరిమిత స్థాయిలోనే అధికారాలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్ బీఎఫ్సీలను ఆర్బీఐ మరింత పటిష్టంగా నియంత్రించే విధంగా ఫైనాన్స్ బిల్లులో మరిన్ని చర్యలుంటాయని సీతారామన్ తెలిపారు. డీఆర్ఆర్ తొలగింపు.. పబ్లిక్ ఇష్యూల ద్వారా ఎన్బీఎఫ్సీలు నిధుల సమీకరణకు సంబంధించి డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ (డీఆర్ఆర్) నిబంధనను ఎత్తివేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుతం డెట్ పబ్లిక్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించే ఎన్బీఎఫ్సీలు డీఆర్ఆర్ కింద కొంత మొత్తాన్ని పక్కన పెట్టడంతో పాటు ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా స్పెషల్ రిజర్వ్ కింద మరికాస్త పక్కన పెట్టాల్సి ఉంటోంది. మరోవైపు, గృహ రుణాల రంగంపై నియంత్రణాధికారాలను ఎన్‌హెచ్‌బీ నుంచి ఆర్బీఐకి బదలాయించాలని ప్రతిపాదిస్తున్నట్లు ఆమె వివరించారు. పెన్షను రంగ నియంత్రణ సంస్థ పీఎఫ్ఆర్డీఏ నుంచి నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) ట్రస్టును విడదీయనున్నట్లు తెలిపారు. -
ప్రియాంకతో కాంగ్రెస్ నిధుల సమస్య తీరొచ్చు!
వాషింగ్టన్: ప్రియాంక గాంధీ వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ద్వారా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందనేది ఇప్పటి వరకు స్పష్టం కానప్పటికీ.. ఆమె రంగప్రవేశంతో ఆ పార్టీ వనరులు, నిధుల లేమి నుంచి బయటపడే అవకాశముందని నిపుణులు అంటున్నారు. నిధుల విషయంలో అధికార బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ చాలా వెనుకబడి ఉందని వారు చెబుతున్నారు. ‘కాంగ్రెస్‌లో కొత్తగా ప్రచార బాధ్యతలు చేపట్టిన ప్రియాంక ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చు. కానీ, ఎన్నికల్లో గెలుపునకు అవసరమైన నిధుల కొరత తీర్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి’ అని కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్‌కు చెందిన రాజకీయ విశ్లేషకుడు మిలన్ వైష్ణవ్ అంటున్నారు. ప్రఖ్యాత ‘ఫారిన్ పాలసీ’ మేగజైన్‌కు రాసిన తాజా వ్యాసంలో ఆయన ఈ విషయం పేర్కొన్నారు. ‘కాస్ట్స్ ఆఫ్ డెమోక్రసీ: పొలిటికల్ ఫైనాన్స్ ఇన్ ఇండియా’ పుస్తకం సహ రచయిత కూడా అయిన వైష్ణవ్.. ‘ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి నిధులు అందకపోవడంతో రాష్ట్ర విభాగాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. 2014 ఎన్నికల తర్వాత జరిగిన పలు ఎన్నికల్లో చాలా తక్కువ విజయాలు సాధించిన ఆ పార్టీ తీవ్ర నిరాశలో కూరుకుపోయి ఉంది. దేశ రాజకీయాలకు కీలక బిందువైన ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పట్టించుకోకుండా ముఖ్యమైన ఎస్పీ–బీఎస్పీ పార్టీల కూటమి ఏర్పడటం మరో దెబ్బ. ఎంతో కీలకమైన ఇలాంటి పరిస్థితుల్లో ప్రియాంక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 41 లోక్‌సభ సీట్లున్న తూర్పు ఉత్తరప్రదేశ్ ఇన్చార్జి బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం వచ్చింది. మిగతా పక్షాలతో కలిసి ఎన్నికల్లో బీజేపీపై పైచేయి సాధించటానికి ఆ పార్టీకి అవకాశం వచ్చింది. అయితే, శ్రేణుల్లో ఉత్తేజం నింపడం, మిత్రుల్ని సంపాదించుకోవడం మాత్రమే కాదు ఎన్నికల్లో గెలుపునకు డబ్బు ఎంతో కీలకం. ఆ పార్టీకి నిధుల కొరత ఉంది. ప్రియాంక రాకతో అది తీరే అవకాశం ఉంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. -
పార్లమెంటుకు అబద్ధం చెప్పారు
న్యూఢిల్లీ: హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)కు నిధుల కొరత ఏర్పడిందన్న అంశం అధికార, ప్రతిపక్షాల మధ్య మరో మాటల యుద్ధానికి దారితీసింది. హెచ్ఏఎల్కు రూ. లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇచ్చామని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు అబద్ధం చెప్పారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ప్రాజెక్టులకు సాక్ష్యాలు చూపలేకపోతే ఆమె మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు రాహుల్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలనీ, హెచ్ఏఎల్, ప్రభుత్వం మధ్య రూ. లక్ష కోట్ల విలువైన ఒప్పందాలు జరిగినట్లుగా తానెప్పుడూ చెప్పలేదని నిర్మల స్పష్టం చేశారు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తూ యద్ధ విమానాలు, హెలికాప్టర్లు, జెట్ ఇంజిన్లు తదితరాలను తయారు చేసే ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఏఎల్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉందంటూ శనివారం ఓ వార్తా కథనం రావడం తెలిసిందే. సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వలేని స్థితిలో రూ. వెయ్యి కోట్లు అప్పు చేయాల్సి వచ్చిందనీ, ప్రభుత్వం నుంచి తమకు ఒక్క ప్రాజెక్టు కూడా రాలేదని హెచ్ఏఎల్ ఉన్నతాధికారులు చెప్పినట్లుగా ఈ కథనం వెల్లడించింది. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రాజెక్టులో భారత్‌లో ఆఫ్సెట్ భాగస్వామిగా ప్రభుత్వరంగ, అనుభవం ఉన్న హెచ్ఏఎల్ను కాదనీ, కొత్తదైన ప్రైవేటు సంస్థ రిలయన్స్ డిఫెన్స్‌ను ఎంపిక చేయడంపై ఇప్పటికే కేంద్రంపై కాంగ్రెస్ తీవ్రంగా విమర్శలు చేస్తుండటం తెలిసిందే. అంబానీకి ప్రయోజ నం చేకూర్చేందుకే ప్రధాని మోదీ రిలయన్స్‌ను ఈ ప్రాజెక్టుకు ఎంపిక చేసి, ప్రభుత్వ సంస్థల ఉసురు తీస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. పార్లమెంటు ముందు దస్త్రాలు ఉంచండి హెచ్ఏఎల్కు రూ. లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇచ్చిన దానికి సంబంధించిన దస్త్రాలను సోమవారం నిర్మల పార్లమెంటుకు సమర్పించాలనీ, లేని పక్షంలో ఆమె రాజీనామా చేయాలని రాహుల్ ఆదివారం డిమాండ్ చేశారు. ‘ఒక్క అబద్ధం చెబితే దాన్ని కప్పిపుచ్చడానికి మరెన్నో అబద్ధాలు చెబుతూ ఉండాలి. మోదీ రఫేల్ ‘అబద్ధం’ను కప్పిపుచ్చేందుకు ఇప్పుడు రక్షణ మంత్రి పార్లమెంటుకే అబద్ధం చెప్పారు’ అని రాహుల్ ట్వీట్ చేశారు. హెచ్ఏఎల్ను కాదని రిలయన్స్‌కు రఫేల్ ప్రాజెక్టు ఇచ్చినందుకు కాంగ్రెస్ మొదటి నుంచి కేంద్రంపై విమర్శలు చేస్తోంది. శనివారం కూడా మోదీ తన సూటు–బూటు స్నేహితుడి (అనిల్ అంబానీ)కి సాయం చేసేందుకు హెచ్ఏఎల్ను బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. హెచ్ఏఎల్ ఏమంటోంది.. హెచ్ఏఎల్ ఈ అంశంపై స్పందిస్తూ.. 83 తేలికపాటి యుద్ధవిమానాలు, 15 తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ల ప్రాజెక్టులపై కీలక దశల్లో ఉన్నాయనీ, త్వరలో తమ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని తెలిపింది. మార్చి వరకు ఖర్చుల కోసం రూ. 962 కోట్లను ప్రస్తుతం అప్పుగా తీసుకున్నామంది. పూర్తిగా చదివి మాట్లాడాలి: నిర్మల వార్తా కథనాన్ని పూర్తిగా చదివిన తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడాలని నిర్మల హితవు చెప్పారు. ఆ కథనంలోనే ఉన్న వివరాలను ఆమె ఉటంకిస్తూ ‘ఈ ఒప్పందాలు పూర్తయినట్లుగా నిర్మల పార్లమెంటుకు చెప్పలేదు. ఆ దిశగా పనులు జరుగుతున్నాయని మాత్రమే ఆమె వెల్లడించినట్లు లోక్‌సభ రికార్డులు చెబుతున్నాయి’ అని పేర్కొన్నారు. రాహుల్ దేశాన్ని తప్పుదారి పట్టిస్తుండటం సిగ్గుచేటని ఆమె అన్నారు. ఆ తర్వాత నిర్మల కార్యాలయం ఓ ట్వీట్ చేస్తూ ‘రాహుల్ గాంధీ, మీరు ఏబీసీల నుంచి అన్నీ నేర్చుకోవాలి. ప్రజలను తప్పుదారి పట్టిం చేందుకు ఉత్సాహం చూపుతున్న మీలాంటి వారే పూర్తిగా కథనాన్ని చదవకుండానే, అదే కథనం ఆధారంగా ఆరోపణలు చేస్తారు. అబద్ధం చెబుతున్నది మీరే రాహుల్. 2014–18 మధ్య హెచ్ఏఎల్, ప్రభుత్వం మధ్య రూ. 26,570.8 కోట్ల ఒప్పందాలు జరిగాయి. మరో రూ. 73 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను కూడా ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఇప్పుడు మీరు దేశ ప్రజలకు పార్లమెంటులో క్షమాపణ చెప్పి మీ పదవికి రాజీనామా చేస్తారా?’ అంటూ ఘాటుగా స్పందించింది. -
‘మనీ’వేదన!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: నిధులకు కటకట ఏర్పడింది. పలు రకాల బిల్లుల చెల్లింపునకు జాప్యం జరుగుతోంది. కొద్ది రోజులుగా ఖజానా శాఖలో బిల్లులు ఆమోదం కాకపోవడంతో పలువురు ఉద్యోగులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో బిల్లులు సమర్పించిన వివిధ శాఖలు, ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. డబ్బులు రావాల్సిన ఇతరులు కూడా ట్రెజరీకి వచ్చి వెళ్తున్నారు. జిల్లాలోని 5 ట్రెజరీల పరిధిలో సుమారు రూ.7కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రాధాన్యతా క్రమంలో నిధులు విడుదల చేస్తున్నారని, అత్యవసర సేవలకు అధికారులు ముందస్తు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం. జిల్లాలోని ఖమ్మం, మధిర, సత్తుపల్లి, నేలకొండపల్లిలో సబ్ ట్రెజరీలతోపాటు వైరాలో డివిజనల్ సబ్ ట్రెజరీ కార్యాలయం ఉంది. వీటి ద్వారా అటు ఉద్యోగులతోపాటు ఇతర పథకాలకు సంబంధించిన బిల్లులు ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రావాల్సి ఉంటే మంజూరు చేస్తారు. సహజంగా ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు, ఇతరులు తమకు రావాల్సిన నగదుకు సంబంధించిన బిల్లులు ట్రెజరీలో అందిస్తే.. నాలుగైదు రోజుల్లో ఆ బిల్లులకు సంబంధించిన నగదును చెల్లిస్తారు. ప్రస్తుతం ఆ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాల్సిన పలు బిల్లులు ట్రెజరీ కార్యాలయాల్లోనే పెండింగ్‌లో ఉన్నాయి. దాదాపు 20 రోజులుగా పలు బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో సంబంధిత ఉద్యోగులు, ఇతరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూ.7కోట్ల బిల్లులు పెండింగ్‌లోనే.. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జీపీఎఫ్, మెడికల్, సరెండర్ లీవులు, వాహనాల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం రూ.2కోట్ల వరకు ఉన్నట్లు తెలిసింది. వ్యవసాయ శాఖలో ట్రాక్టర్లకు సంబంధించి సబ్సిడీలు సుమారు రూ.5కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. ఇవి నాలుగైదు నెలలుగా పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో సుమారు 13వేల మంది ఉద్యోగులు ఉండగా.. పెన్షనర్లు 6వేల మంది వరకు ఉన్నారు. వీరికి సంబంధించిన పలు బిల్లులు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. సర్వర్ బిజీ అంటూ.. బిల్లులు రావాల్సిన పలువురు ఉద్యోగులు, ఇతర వ్యక్తులు ప్రతిరోజు ట్రెజరీకి వచ్చి తమ బిల్లుల పరిస్థితి ఏమిటంటూ ఆరా తీస్తుండగా.. సంబంధిత అధికారులు మాత్రం ఆయా బిల్లుల వివరాలను వెబ్సైట్లో నమోదు చేసేందుకు ఉపక్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే సర్వర్ బిజీ బిజీ అంటూ వస్తోంది. దీంతో ట్రెజరీ పనులన్నీ పెండింగ్‌లో పడుతున్నాయి. ఇదిలా ఉండగా.. మరోసారి పాస్ అయిన బిల్లులకు కూడా సకాలంలో నగదు పడడం లేదు. అయితే ఆర్థిక శాఖ వద్ద అవసరానికి తగినన్ని నిధులు లేకపోవడం వల్లే ఇలా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అన్నింటికీ నగదు మంజూరు చేసే వెసులుబాటు లేకపోవడం కారణంగానే బిల్లులు పాస్ కావడం లేదని సమాచారం. అత్యవసర సేవలకే ప్రాధాన్యం.. అత్యవసరమైన బిల్లులకు మాత్రమే త్వరగా నిధులు మంజూరవుతున్నాయి. హాస్టల్ బిల్లులు, మధ్యాహ్న భోజనం, పెన్షన్లు వంటి వాటికి తొలి ప్రాధాన్యం ఇస్తూ.. వాటిని వెనువెంటనే పరిష్కరిస్తున్నారు. వీటికి నిధులు విడుదల చేసే సమయంలో మిగిలిన అంశాలకు సంబంధించిన బిల్లులను నిలుపుదల చేస్తున్నట్లు సమాచారం. అయితే బిల్లులు అత్యవసరంగా విడుదల కావాల్సిన పరిస్థితులు ఉంటే ట్రెజరీ శాఖ అధికారులు.. ఉన్నతాధికారులను సందర్శించి.. స్థానిక సమస్యలను విన్నవించి వారి బిల్లులను పాస్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. సమస్యలు పరిష్కరిస్తున్నాం.. పెండింగ్ బిల్లుల సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తున్నాం. ఒక్కోసారి ఆన్లైన్ సమస్య వచ్చినప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. వారు ఇచ్చిన సూచనల మేరకు బిల్లులను త్వరితగతిన అందేలా చూస్తున్నాం. – బి.రవికుమార్, డిప్యూటీ డైరెక్టర్, ఖజానా శాఖ, ఖమ్మం -
ఆర్ అండ్ బీలో నిధుల కటకట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ నిధుల కొరతతో సతమతమవుతోంది. ప్రస్తుతం ఖజానా ఖాళీ కావడంతో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో ఆర్ అండ్ బీకి సుమారు రూ. 5,600 కోట్లు కేటాయించినా ఈ ఆర్థిక సంవత్సరం మొదలైనప్పటి నుంచి నిధులు సరిగా విడుదల చేయలేదు. అయితే శాఖ అవసరాల కోసం రూ. 3 వేల కోట్లు రుణం తెచ్చుకోవాలని సూచించింది. దీంతో అధికారులు అప్పులవేట మొదలుపెట్టారు. ఈ అంశంపై పలుమార్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చలు జరిపారు. బ్యాంకు రుణానికి పూచీకత్తు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో అధికారులు పలు బ్యాంకులను ఆశ్రయించారు. అంత పెద్దమొత్తంలో అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు తొలుత సంశయించినా చివరకు మే నెలలో కన్సార్షియంగా ఏర్పడ్డాయి. ఇందులో ఆంధ్రా బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, విజయా బ్యాంకుతోపాటు మరో రెండు బ్యాంకులు ఉన్నాయి. విలీనం నేపథ్యంలో విజయా బ్యాంకు కన్సార్షియం నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ప్రస్తుత కన్సార్షియంలో ఆంధ్రా బ్యాంకు లీడ్ బ్యాంక్‌గా ఉంది. ఇంకా మంజూరు కాని రుణం... మే నెలలో బ్యాంకుల కన్సార్షియం ఏర్పడినా ఆర్ అండ్ బీకి ఇంతవరకూ రుణం మంజూరు కాలేదు. సెప్టెంబర్‌లో అసెంబ్లీ రద్దవడంతో కన్సార్షియం రుణం మంజూరు విషయంలో డైలామాలో పడింది. ఇప్పుడున్న ఆపద్ధర్మ ప్రభుత్వం హామీతో రుణం మంజూరు చేయడంపై బ్యాంకుల మధ్య అభిప్రాయభేదాలున్నట్లు సమాచారం. అందుకే రుణం మంజూరు పెండింగ్‌లో పడింది. ఆర్ అండ్ బీ అధికారులు విశ్వప్రయత్నాలు చేసినా అప్పు పుట్టకపోవడంతో బిల్లులు మంజూరు చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో కాంట్రాక్టర్లు సెప్టెంబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ పనులు ఆపేశారు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరుకల్లా పెండింగ్ బిల్లుల సమస్యలు పరిష్కరిస్తామని సెప్టెంబర్ 6న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చారు. దీంతో అన్యమనస్కంగానే కాంట్రాక్టర్లు తిరిగి పనులు మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ నెలాఖరు నాటికి బిల్లులు మంజూరు కాకపోతే తమ అప్పులు మరింత పెరిగిపోతాయని కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. -
ప్రశ్నార్థకంగా ‘కుడా’ భవితవ్యం
హైదరాబాద్ : కులీకుతుబ్‌షా నగరాభివృద్ధి సంస్థ (కుడా) ఉనికి కోల్పోతోంది. గత కొంత కాలంగా నిధులు విడుదల కాకపోవడంతో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరుగక కుడా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఉద్యోగులకు చేతిలో పని లేకుండా పోయింది. పనులు లేక దారుషిఫాలోని కుడా ప్రధాన కార్యాలయం వెలవెలబోతోంది. అధికారులతో పాటు సిబ్బంది గదులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. పాతబస్తీ అభివృద్ధి కోసం దివంగత ముఖ్యమంత్రి టి. అంజయ్య 1981లో దారుషిఫాలో ‘కుడా’ను ఏర్పాటు చేశారు. 1981-82 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 25 లక్షలతో ఏర్పాటైన కుడాకు అంచెలంచెలుగా బడ్జెట్ పెరుగుతూ అప్పట్లో రూ. 9 కోట్లకు చేరుకుంది. పాతబస్తీలోని మలక్‌పేట్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా, నాంపల్లి, కార్వాన్, గోషామహాల్ తదితర నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడమే లక్ష్యంగా కుడా పని చేసింది. పెరిగిన అవసరాల దృష్ట్యా ఏటా బడ్జెట్ పెరగాల్సి ఉన్నా కేటాయించిన నిధులే సకాలంలో విడుదల కాకపోవడంతో కుడా భవిష్యత్ ప్రశ్నార్దకంగా మారింది. ప్రత్యేక తెలంగాణలో కుడా పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని భావించిన సిబ్బంది, పాతబస్తీ ప్రజలకు నిరాశే మిగిలింది. కుడాకు నిధుల కేటాయింపుపై పాతబస్తీ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేయకపోవడం కూడా ఇందుకు ఒక కారణం. దీంతో ఫిర్యాదులు, సమస్యలతో వచ్చే వారికి నిరాశే ఎదురవుతోంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ చార్మినార్ జోన్ జోనల్ కమిషనర్‌తో పాటు ఉన్నతాధికారులు సమీక్షా సమావేశాలు నిర్వహించేందుకు మాత్రమే ప్రస్తుతం కుడా కార్యాలయాన్ని వాడుకుంటున్నారు. -
ఐక్యరాజ్యసమితిలో నిధులకు కటకట!
ఐక్యరాజ్యసమితి: ప్రపంచశాంతి పరిరక్షణకు ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి(ఐరాస) ప్రస్తుతం తీవ్రమైన నిధుల కొరతను ఎదుర్కొంటోంది. అమెరికా, సౌదీ, ఈజిప్ట్, ఇజ్రాయెల్ సహా 81 దేశాలు తమ నిధుల వాటాను చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. సభ్య దేశాలన్నీ తమ వాటా నగదును చెల్లించాలని ఐరాస ప్రధాన కార్యదర్శి గ్యుటెరస్ విజ్ఞప్తి చేశారు. ‘ఇలాంటి నగదు కొరత ఇప్పటివరకూ ఎన్నడూ సంభవించలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే త్వరలోనే ఐరాసలో నగదు నిల్వలు ఖాళీ అయిపోతాయి’ అని సభ్యదేశాలకు లేఖ రాశారు. ఈ ఏడాది జూలై 26 నాటికి భారత్ సహా 112 దేశాలు ఐరాసకు బడ్జెట్‌కు తమ వాటాను చెల్లించాయి. ఇందులో భాగంగా భారత్ రూ.122.9 కోట్లను ఐరాసకు ఇచ్చింది. ఐరాస బడ్జెట్లో 22 శాతాన్ని(రూ.8,157 కోట్లు) అందిస్తున్న అమెరికా.. ప్రపంచశాంతి పరిరక్షక దళాల నిర్వహణకు అందే నిధుల్లో 28.5 శాతం (రూ.15,455 కోట్లు) భరిస్తోంది. -
అటకెక్కిన ‘సాక్షర భారత్’!
♦ రెండేళ్లుగా నిధులు విడుదల చేయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ♦ నిలిచిపోయిన కార్యక్రమాలు.. మూతబడుతున్న కేంద్రాలు సాక్షి, హైదరాబాద్: సాక్షర భారత్ కార్యక్రమంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు ప్రాజెక్టుకు రెండేళ్లుగా నిధులు విడుదల చేయక పోవడంతో అమలు చేయాల్సిన కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఫలితంగా గ్రామస్థాయిలో సాక్షర భారత్ కేంద్రాలు దాదాపు మూతపడ్డాయి. నిరక్షరా స్యులైన వయోజనులకు కనీస విద్య అందించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం సాక్షర భారత్‌ను 2010లో అమల్లోకి తెచ్చింది. ఇందుకు గ్రామస్థాయి లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి.. వాటి నిర్వహ ణకు గ్రామ సమన్వయకర్తలను నియమించారు. రాష్ట్రంలో 443 మండలాల్లో 17,500 కేంద్రాలు ప్రారంభించారు. గ్రామ స్థాయి సమన్వయకర్తలకు రూ.2 వేలు, మండల సమన్వయకర్తలకు రూ.6 వేల గౌరవ వేతనం ప్రక టించారు. ప్రాజెక్టుకు ని ధులు కేటాయించక పోవడంతో అనేక కేంద్రాలకు తాళం పడింది. మండల, గ్రామ సమన్వయకర్తలకు గౌరవ వేతనమూ అందక వారు విధులకు హాజర వడం లేదు. స్వయం సహాయక సంఘాలు, ఉపాధి హామీ కూలీల్లో ఎక్కువగా నిరక్షరాస్యులున్నారని, కాబట్టి కార్యక్రమాన్ని గ్రామీణాభివృద్ధి శాఖకు అనుసంధానం చేయాలని సమన్వయకర్తలు కోరు తున్నారు. వేతనాలు, కార్యక్రమం అమలుపై ప్రభు త్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళన చేస్తామని, ఆగస్టులో దీనికి కార్యాచరణ ప్రకటిస్తామని గ్రామ సమన్వయకర్తల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శు లు సురేందర్, వెంకటయ్య పేర్కొన్నారు. -
అతుకులు.. గతుకులు
జిల్లాలో రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఏ రోడ్డు చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.. ప్రతి రోడ్డు చరిత్ర సమస్తం అతుకు గతుకుల మయం అన్న చందంగా తయారైంది పరిస్థితి. పల్లెసీమలు ప్రగతికి పట్టుగొమ్మలు అంటూ ఊదరగొట్టే పాలకులు గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు నిధులు మంజూరు చేయడం లేదు. అధికారులు పంపిన ప్రతిపాదనలు సైతం చెత్తబుట్టల్లో చేరిపోతున్నాయి. వెరసి ఈ రహదారుల్లో ప్రజలకు ‘నడక’యాతన తప్పడం లేదు. - అస్తవ్యస్తంగా గ్రామీణ రహదారులు - ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్‌లకు తక్కువగా నిధులు - ప్రతిపాదనలకే పరిమితమైన సోములవారిపల్లె కాజ్వే - సోమశిలకు బ్యాక్ వాటర్ వస్తే 20 గ్రామాలకు ఇబ్బందులు - నందలూరు-నాగిరెడ్డిపల్లె మధ్య పూర్తికాని రహదారి - అటకెక్కిన నంద్యాల - పలమనేరు నాలుగులేన్ల రహదారి సాక్షి కడప: పల్లె సీమలు ప్రగతిబాట పట్టాలంటే ప్రధానంగా రహదారులే కీలకం. గ్రామాలకు రోడ్డు మార్గం ఉంటే ఉంటే చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు.. ఇతర అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల దరి చేరేందుకు మార్గం సుగమమవుతుంది. స్వాతంత్య్రం సిద్ధించి 68 ఏళ్లు దాటుతున్నా నేటికీ గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేందుకు సరైన రోడ్లు లేవు. ప్రత్యేకంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆర్‌అండ్‌బీకి నిధుల వరద కురిసింది. అప్పట్లో ప్రతి పల్లెకూ తారు రోడ్డు సౌకర్యం కల్పిస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. గ్రామాల్లో తారు రోడ్ల మరమ్మతులకు కూడా టీడీపీ సర్కార్ నిధులు విదల్చడం లేదని పలువురు వాపోతున్నారు. అనేక చోట్ల ఇప్పటికీ అతుకు గతుకుల రోడ్లల్లో ప్రయాణం సాగించాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంతకుమునుపే రోడ్డు పనులు పూర్తి చేసినా బిల్లులు రాక అవస్థలు పడుతున్న కాంట్రాక్టర్లు కూడా చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు బిల్లులను ప్రభుత్వానికి నివేదిస్తున్నా పూర్తి స్థాయిలో రావడం లేదు. పైగా జిల్లాలో అనేక చోట్ల రోడ్లు, కాజ్‌వేలకు ప్రతిపాదనలు పంపినా కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు కేటాయించడం లేదు. ప్రతిపాదనలకు పరిమితమైన సోములవారిపల్లె కాజ్వే ప్రొద్దుటూరు మండలంలోని సోములవారిపల్లె కాజ్వే కూలిపోయి చాలా రోజులు అవుతునా ఇప్పటి వరకు ప్రభుత్వం దాని ఊసే ఎత్తడం లేదు. పెన్నానదిపై సోములవారిపల్లె వద్ద కాజ్వే నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినా ఇంత వరకు దిక్కుదివానం లేదు. కాజ్వే లేకపోవడంతో వాహనదారులతోపాటు ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ప్రొద్దుటూరు పరిధిలోని మీనాపురం రోడ్డు కూడా అధ్వానంగా తయారైంది. ఇక్కడి రోడ్డుపై ప్రయాణించడం కష్టం కావడంతో ఆ మార్గంలో వెళ్లే ప్రజలే రోడ్డుపై ఉన్న గులకరాళ్లను ఎత్తివేసుకుని వెళ్తున్నారు. సోమశిలకు పూర్తి నీరు వస్తే 20 గ్రామాలకు ఇక్కట్లు అట్లూరు మండల పరిధిలోని సగిలేరు లో లెవెల్ వంతెనతో ప్రజలకు తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయి. సోమశిల బ్యాక్ వాటర్ 72 టీఎంసీలు ఉన్నప్పుడు సగిలేరు ప్రాజెక్టులోకి నీరు వచ్చి లోలెవెల్ కాజ్‌వేపై ప్రవహిస్తున్నాయి. దాదాపు రెండు అడుగుల మేర నీరు రావడంతో రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి. అట్లూరు మండలంలోని వేమలూరు, ముతుకూరు, కామసముద్రం, మాడపూరు, మన్నెంవారిపల్లి, కమలకూరు పంచాయతీలలోని దాదాపు 20 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాజ్‌వేపై నీరు ప్రవహిస్తున్న సమయంలో అట్లూరుకు రావాల్సి వస్తే ... ప్రజలు బద్వేలు మీదుగా ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో 32 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తేనే మండల కేంద్రానికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో కాజ్వే ఎత్తు పెంచాలని ప్రజలు కోరుతున్నారు. సగంలోనే ఆగిపోయిన నందలూరు ఆర్ఎస్ రోడ్డు రాజంపేట పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు పలు చోట్ల అస్తవ్యస్తంగా ఉన్నాయి. ప్రత్యేకంగా సుండుపల్లి-పీలేరు మార్గంలో మెటల్ రోడ్డు అధ్వానంగా తయారైంది. అలాగే నందలూరు-నాగిరెడ్డిపల్లె మధ్య నుంచి రైల్వేస్టేషన్‌కు వెళ్లే రోడ్డు పూర్తి చేయకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించి సగం వరకు మాత్రమే పూర్తి చేశారు. మిగతా సగం పూర్తి చేయకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. అటకెక్కిన నాలుగులేన్ల రహదారి దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో నంద్యాల-పలమనేరు మధ్య నాలుగు లేన్ల రహదారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రూ.1100 కోట్ల వ్యయంతో టెండర్ల వరకు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. అయితే వైఎస్సార్ మరణం తర్వాత ప్రాజెక్టు అటకెక్కింది. నంద్యాల నుంచి కోవెలకుంట్ల, జమ్మలమడుగు, పులివెందుల, కదిరి మీదుగా పలమనేరుకు కలిపి బెంగుళూరు జాతీయ రహదారికి కలిపేలా ప్రణాళిక రూపొందించారు. అయితే వైఎస్సార్ మరణం తర్వాత కిరణ్ సర్కార్ విస్మరించింది. దానికి సంబంధించిన ఫైళ్లను పక్కన పడేశారు. తక్కువగా నిధులు జిల్లాలో పల్లె సీమల్లో రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు సంబంధించి నిధులు సక్రమంగా రావడం లేదు. టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా నిధులు విడుదల చేయడం లేదు. ఆర్‌అండ్‌బీతోపాటు పంచాయతీరాజ్‌కు కూడా నిధులు విడుదల కాకపోవడంతో పనులకు బ్రేక్ పడుతోంది. చాలా చోట్ల గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. పనులు చేయాలంటే కాంట్రాక్టర్లు కూడా బెంబేలెత్తే పరిస్థితి ఏర్పడుతోంది. జిల్లాలో అధ్వానంగా తయారైన రహదారులకు మోక్షం కల్పించేందుకు పాలకులు, అధికారులు తగినన్ని నిధులు విడుదల చేసి అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది.