సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ నిధుల కొరతతో సతమతమవుతోంది. ప్రస్తుతం ఖజానా ఖాళీ కావడంతో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో ఆర్ అండ్ బీకి సుమారు రూ. 5,600 కోట్లు కేటాయించినా ఈ ఆర్థిక సంవత్సరం మొదలైనప్పటి నుంచి నిధులు సరిగా విడుదల చేయలేదు. అయితే శాఖ అవసరాల కోసం రూ. 3 వేల కోట్లు రుణం తెచ్చుకోవాలని సూచించింది. దీంతో అధికారులు అప్పులవేట మొదలుపెట్టారు.
ఈ అంశంపై పలుమార్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చలు జరిపారు. బ్యాంకు రుణానికి పూచీకత్తు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో అధికారులు పలు బ్యాంకులను ఆశ్రయించారు. అంత పెద్దమొత్తంలో అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు తొలుత సంశయించినా చివరకు మే నెలలో కన్సార్షియంగా ఏర్పడ్డాయి. ఇందులో ఆంధ్రా బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, విజయా బ్యాంకుతోపాటు మరో రెండు బ్యాంకులు ఉన్నాయి. విలీనం నేపథ్యంలో విజయా బ్యాంకు కన్సార్షియం నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ప్రస్తుత కన్సార్షియంలో ఆంధ్రా బ్యాంకు లీడ్ బ్యాంక్‌గా ఉంది.
ఇంకా మంజూరు కాని రుణం...
మే నెలలో బ్యాంకుల కన్సార్షియం ఏర్పడినా ఆర్ అండ్ బీకి ఇంతవరకూ రుణం మంజూరు కాలేదు. సెప్టెంబర్‌లో అసెంబ్లీ రద్దవడంతో కన్సార్షియం రుణం మంజూరు విషయంలో డైలామాలో పడింది. ఇప్పుడున్న ఆపద్ధర్మ ప్రభుత్వం హామీతో రుణం మంజూరు చేయడంపై బ్యాంకుల మధ్య అభిప్రాయభేదాలున్నట్లు సమాచారం. అందుకే రుణం మంజూరు పెండింగ్‌లో పడింది. ఆర్ అండ్ బీ అధికారులు విశ్వప్రయత్నాలు చేసినా అప్పు పుట్టకపోవడంతో బిల్లులు మంజూరు చేయలేని పరిస్థితి నెలకొంది.
దీంతో కాంట్రాక్టర్లు సెప్టెంబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ పనులు ఆపేశారు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరుకల్లా పెండింగ్ బిల్లుల సమస్యలు పరిష్కరిస్తామని సెప్టెంబర్ 6న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చారు. దీంతో అన్యమనస్కంగానే కాంట్రాక్టర్లు తిరిగి పనులు మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ నెలాఖరు నాటికి బిల్లులు మంజూరు కాకపోతే తమ అప్పులు మరింత పెరిగిపోతాయని కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment