న్యూఢిల్లీ: స్టార్టప్‌లకు నిధుల మద్దతు తగ్గింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనంతో దేశంలో స్టార్టప్‌లకు నిధుల సాయం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రెండేళ్ల కనిష్ట స్థాయి అయిన 2.7 బిలియన్ డాలర్లకు (రూ.21,870 కోట్లు) పరిమితమైంది. 205 డీల్స్ నమోదయ్యాయి. ఈ మేరకు పీడబ్ల్యూసీ ఓ నివేదికను విడుదల చేసింది. జూలై–సెప్టెంబర్ కాలంలో కేవలం రెండు స్టార్టప్‌లు యూనికార్న్ హోదా సాధించాయి. యూనికార్న్ హోదా పొందే విషయంలో అంతర్జాతీయంగా ఉన్న ధోరణే మన దగ్గరా కనిపించింది. అంతర్జాతీయంగా చూస్తే సెప్టెంబర్ క్వార్టర్‌లో 20 స్టార్టప్‌లు యూనికార్న్ హోదా పొందగా, ఇందులో 45 శాతం కంపెనీలు సాస్ విభాగం నుంచే ఉన్నాయి. ఇక డెకాకార్న్ స్థాయికి ఒక్కటీ చేరుకోలేదు.
అన్ని విభాగాల్లోనూ క్షీణత..
ఆరంభ దశ, వృద్ధి దశ, తదుపరి దశ ఇలా అన్ని విభాగాల్లోని స్టార్టప్‌లకు సెప్టెంబర్ త్రైమాసికంలో నిధుల మద్దతు తగ్గింది. ఆరంభ స్థాయి డీల్స్ విలువ సెప్టెంబర్ త్రైమాసికంలో 21 శాతంగా ఉంది. అంతకుముందు మూడు నెలల కాలంలో ఆరంభ స్థాయి డీల్స్ విలువ 12 శాతంతో పోలిస్తే రెట్టింపైంది. ముఖ్యంగా స్టార్టప్‌లకు వెంచర్ క్యాపిటల్ సంస్థలు (వీసీలు) మద్దతుగా నిలుస్తున్నాయి. వృద్ధి దశ, తదుపరి దశ స్టార్టప్‌లకు సెప్టెంబర్ త్రైమాసికంలో 79 శాతం నిధులు వెళ్లాయి. ‘‘స్టార్టప్‌లకు నిధుల మార్కెట్లో మందగమనం ఎంత కాలం కొనసాగుతుందో తెలియదు. వ్యవస్థాపకులు, ఇన్వెస్టర్లు డీల్స్ విషయంతో జాగ్రత్త పాటిస్తున్నారు’’ అని పీడబ్ల్యూసీ ఇండియా డీల్స్ పార్ట్‌నర్ అమిత్ నవకా పేర్కొన్నారు. కాగా, ఇన్వెస్టర్లు గణనీయమైన నిధులు సమీకరించారని, ఈ నిధులు ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌లోకి రానున్నాయని నివేదిక
అంచనా వేసింది.
ఒక్కో డీల్ 4-5 డాలర్లు..
సెప్టెంబర్ క్వార్టర్‌లో ఒక్కో డీల్ టికెట్ విలువ సగటున 4–5 మిలియన్ డాలర్లు (రూ.32.5-40.5 కోట్లు)గా ఉంంది. సెప్టెంబర్ క్వార్టర్‌లో 38 విలీనాలు, కొనుగోళ్ల (ఎంఅండ్‌ఏ) డీల్స్ నమోదయ్యాయి. ఇందులో 30 దేశీ డీల్స్ ఉన్నాయి. సాస్, ఎడ్యుటెక్ స్టార్టప్‌లలో ఎక్కువ ఎం అండ్‌ఏ లు నమోదయ్యాయి. ఎడ్యుటెక్ కంపెనీ ‘అప్‌గ్రాడ్’ నాలుగు కంపెనీలను సొంతం చేసుకుని మొదటి స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment