buildings Department
-
రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలకు చెక్
సాక్షి, అమరావతి: రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలను నివారించేందుకు రోడ్లు, భవనాల శాఖ సన్నద్ధమైంది. రాష్ట్రంలో కొత్తగా ఆరు రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్వోబీ)లు నిర్మించనుంది. రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలను అరికట్టేందుకు పెద్ద సంఖ్యలో ఆర్వోబీల నిర్మాణంపై కార్యాచరణను వేగవంతం చేసింది. ఇప్పటికే 22 ఆర్వోబీలు నిర్మాణంలో ఉన్నాయి. 2022–23లో రూ.724 కోట్లతో మరో ఆరు ఆర్వోబీల నిర్మాణాలకు ఆర్ అండ్ బీ శాఖ ఆమోదం తెలిపింది. ప్రధానంగా విజయవాడ – నరసాపురం – నిడదవోలు మార్గంలో ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్‌ల వద్ద ఆర్వోబీల నిర్మాణాన్ని ప్రతిపాదించారు. ఎందుకంటే ఇప్పటికే విజయవాడ–మచిలీపట్నం మధ్య డబ్లింగ్ పనులు పూర్తి చేశారు. ఇక మచిలీపట్నం – నరసాపురం – నిడదవోలు మార్గంలో డబ్లింగ్ పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. దీంతో ఆ మార్గంలో రైళ్లు, గూడ్సు రైళ్ల తాకిడి పెరగనుంది. ఈ నేపథ్యంలో ఆ మార్గంలో రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఆర్వోబీల నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చారు. కేంద్ర ఉపరితల, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ ఖరారు చేసిన వార్షిక ప్రణాళికలో భాగంగా సేతుభారతం ప్రాజెక్టు కింద వీటిని నిర్మిస్తారు. వాటికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు రూపొందించే ప్రక్రియను ఆర్ అండ్ బీ శాఖ చేపట్టింది. అనంతరం భూసేకరణ చేసి టెండర్లు పిలవనుంది. రెండు లేన్లుగా ఆర్వోబీలు ఈ ఆరు ఆర్వోబీలను రెండు లేన్లుగా నిర్మించనున్నారు. విజయవాడ–భీమవరం సెక్షన్లో గుడివాడ వద్ద రూ.110 కోట్లతో 4.7 కి.మీ, కైకలూరు వద్ద రూ.125 కోట్లతో 1.3 కి.మీ, పాలకొల్లు వద్ద రూ.65 కోట్లతో 1.9 కి.మీ.భీమవరం–నరసాపురం సెక్షన్లో పెన్నాడ అగ్రహారం–శృంగవృక్షం రైల్వేస్టేషన్ల మధ్య రూ.150 కోట్లతో 1.5 కి.మీ. భీమవరం–ఉండి రైల్వేస్టేషన్ల మధ్య రూ.200 కోట్లతో 1.90 కి.మీ, అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలో రూ.74 కోట్లతో 1.5 కి.మీలలో ఆర్వోబీలను నిర్మించనున్నారు. -
మీ వాడిగా ఉంటా.. మీకు తోడుగా ఉంటా
పెడన : ‘మీ వాడిగా ఉంటా.. మీకు తోడుగా ఉంటా.. సమస్యలు ఏమైనా నేరుగా నా దృష్టికి తీసుకురండి.. ఇంతగా ఆదరాభిమానాలు చూపుతున్న మీకు కృతజ్ఞతలు.. అంటూ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పెడన ఆనందం వ్యక్తం చేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మొదటిసారి పెడన పట్టణానికి వచ్చిన జోగి రమేష్ మంగళవారం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా పురప్రజలు బ్రహ్మరథం పట్టారు. బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు బారులుతీరి నీరాజనాలు పలికారు. అనంతరం పట్టణంలోనికి ప్రవేశించిన మంత్రి వర్యులకు 23వ వార్డులో పురపాలక చైర్పర్సన్ బళ్ల జ్యోత్స్నరాణి, వైస్ చైర్మన్లు ఎండీ ఖాజా, బైలపాటి జ్యోతి, ఫ్లోర్ లీడర్ కటకంప్రసాద్‌లతో పాటు పలువురు కౌన్సిలర్లు, పట్టణ అధ్యక్షుడు బండారు మల్లికార్జునరావులు స్వాగతం పలికారు. ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ నుంచి పార్టీ కార్యాలయం వరకు ర్యాలీగా నడుచుకుంటూ చేరుకున్నారు. మార్గం మధ్యలో చిన్నారులను, వృద్ధులను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చేనేత కార్మికుల నేత సరుల వద్దకు చేరి వారి కష్టంలో కాసేపు పాలు పంచుకున్నారు. మండల కన్వీనర్ కొండవీటి నాగబాబు, ఎంపీపీ రాజులపాటి వాణి, మాజీ ఎంపీపీ అచ్యుతరావు, మార్కెట్ యార్డు చైర్పర్సన్ గరికిపాటి చారుమతి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. నిలిచిన రోడ్ షో.. మంత్రి రోడ్డు షో పెడన నుంచి బలిపర్రు, నందమూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో కొనసాగాల్సి ఉండగా.. పెడన పార్టీ కార్యాలయం వరకు వచ్చిన తర్వాత గూడూరు మండలం కోకనారాయణపాలేనికి చెందిన సర్పంచ్ బండి రమేష్ ఆకస్మికంగా గుండెపోటుతో చనిపోవడంతో ర్యాలీని అర్ధంతరంగా నిలిపేశారు. -
14న ఎన్డీబీ రీ టెండర్లకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) సాయంతో రాష్ట్రంలో రహదారులు, వంతెనల పునర్నిర్మాణ పనులకు సంబంధించి రీ టెండర్లకు రహదారులు, భవనాలశాఖ ఈ నెల 14న నోటిఫికేషన్ జారీ చేయనుంది. నాలుగు జిల్లాలకు మాత్రమే టెండరు నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ టెండర్లలో రెండు నిబంధనలకు సవరణ చేస్తూ శనివారం రవాణా, ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులిచ్చారు. మొత్తం రూ.6,400 కోట్లతో చేపట్టనున్న ఈ పనులకు సంబంధించి.. తొలిదశలో రూ.1,860 కోట్లతో 13 ప్యాకేజీలకు ఈ–టెండర్లు పిలవగా 14 సంస్థల నుంచి 25 బిడ్లు మాత్రమే వచ్చాయి. సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆర్అండ్బీ ముఖ్య అధికారులతో సమీక్షించి కాంట్రాక్టర్లలో పోటీతత్వం పెంచేందుకు టెండర్లను రద్దుచేసి మళ్లీ పిలవాలని ఆదేశించడంతో ఎన్డీబీ టెండర్లు రద్దయిన సంగతి తెలిసిందే. తొలి దశగా ఇప్పుడు నాలుగు జిల్లాల్లో రూ.682.16 కోట్ల పనులకు సంబంధించి మళ్లీ టెండర్లు పిలవనున్నారు. నిబంధనల్లో రెండింటిని సవరించారు. ఇందుకు న్యూ డెవలప్మెంట్ బ్యాంకు అనుమతి తీసుకున్నారు. జ్యుడిషియల్ ప్రివ్యూ అనుమతి తీసుకుని జీవో జారీ చేశారు. సవరించిన నిబంధనలివే.. ► టెండరు నిబంధనల్లో గతంలో బ్యాంకు గ్యారెంటీలు జాతీయ బ్యాంకుల నుంచే స్వీకరిస్తామన్నారు. ఈ దఫా రూరల్ బ్యాంకులు/కో–ఆపరేటివ్ బ్యాంకులు మినహా మిగిలిన షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల నుంచి స్వీకరిస్తారు. ► హార్డ్ కాపీని బిడ్ల దాఖలుకు ముందే ఇవ్వాలన్న నిబంధనను.. బ్యాంకు ఆథరైజేషన్‌తో రివర్స్ టెండర్లు నిర్వహించేలోగా ఇవ్వవచ్చని పేర్కొన్నారు. -
ఐదింటిపై మూడో కన్ను
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల్లోనే కాదు.. రాజధాని నిర్మాణం, పురపాలక, పంచాయతీరాజ్, రహదారులు భవనాల శాఖల పరిధిలో చేపట్టిన పనుల్లో కూడా జరిగిన అక్రమాల నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు థర్డ్ పార్టీ విచారణ పరిధిని పెంచడంతోపాటు సభ్యుల సంఖ్యను కూడా 5కు పెంచింది. రిటైర్డు ఈఎన్సీలు రోశయ్య, బి.నారాయణరెడ్డి, సుబ్బరాయశర్మ, ఐఐటీ ప్రొఫెసర్ సూర్యప్రకాశ్, నాక్ డైరెక్టర్ పీటర్లను థర్డ్ పార్టీ సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ కానున్నాయి. పేదల ఇళ్లలోనూ కమీషన్ల పర్వం.. టీడీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టుల తరహాలోనే తాత్కాలిక సచివాలయం, శాశ్వత పరిపాలన భవనాలు, రహదారుల అంచనా వ్యయాలను భారీగా పెంచేసి ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు కట్టబెట్టి భారీగా కమీషన్లు వసూలు చేసుకున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు అంచనా వ్యయాన్ని సగటున కి.మీ.కి రూ.59 కోట్లుగా నిర్ణయించి కాంట్రాక్టర్లకు అప్పగించడమే దీనికి తార్కాణం. తాత్కాలిక సచివాలయం, శాశ్వత భవనాల నిర్మాణ పనుల్లోనూ ఇదే రీతిలో అంచనాలు పెంచేశారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో వాటర్ గ్రిడ్, ఏఐడీబీ (ఆసియా మౌలిక సదుపాయాల అభివృద్ధి బ్యాంకు) రుణంతో చేపట్టిన రహదారుల పనుల్లోనూ అంచనా వ్యయాన్ని పెంచేసి భారీగా దోచుకున్నారు. రహదారులు, భవనాల శాఖ పరిధిలో చేపట్టిన రహదారులు, భవనాల నిర్మాణ పనుల్లోనూ అదే మాదిరిగా దోపిడీ జరిగింది. పురపాలక శాఖలో ప్రధానంగా పీఏంఏవై పథకం కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని రూ.20,535 కోట్ల నుంచి రూ.38,265.88 కోట్లకుపైగా పెంచేసి లబ్ధిదారులపై రూ.17,730.88 కోట్ల రుణభారాన్ని మోపి టీడీపీ పెద్దలు కమీషన్లు వసూలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్రమాలను థర్డ్ పార్టీ ద్వారా నిగ్గు తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. థర్డ్ పార్టీ విచారణకు మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఖరారు చేసింది. అవి ఇలా ఉన్నాయి.. - శాఖలవారీగా, ప్రాజెక్టుల వారీగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లను థర్డ్ పార్టీ పరిశీలించాలి. - ఒక ప్రాజెక్టు డీపీఆర్ ఆధారంగా అంచనా వ్యయాన్ని ఖరారు చేశారా? లేక డీపీఆర్‌ను రూపొందించకుండా అంచనా వ్యయాన్ని ఖరారు చేశారా? అన్నది తేల్చాలి. - అంచనా వ్యయాన్ని ఖరారు చేసేటప్పుడు పనుల పరిమాణాన్ని అవసరం లేకున్నా అమాంతం పెంచేశారా? లేదా అనే అంశాన్ని పరిశీలించాలి. - ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) విధానంలో టెండర్ పిలిస్తే ఐబీఎం(ఇంటర్నల్ బెంచ్ మార్క్ కమిటీ)ను, లంప్సమ్(ఎల్ఎస్)–ఓపెన్ విధానంలో టెండర్ పిలిస్తే చీఫ్ ఇంజనీర్స్ కమిటీలను సంప్రదించి అంచనా వ్యయాన్ని ఖరారు చేశారా? లేదా? అనే అంశాన్ని పరిశీలించాలి. - టెండర్ నోటిఫికేషన్ జారీ చేసేటప్పుడు ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు మాత్రమే టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించేలా నిబంధనలు విధించారా? అనే అంశాన్ని తేల్చాలి. - నిబంధనలను అడ్డుపెట్టుకుని కాంట్రాక్టర్లను కట్టడి చేయడం, కుమ్మక్కు చేయడం వల్ల అధిక ధరలకు పనులు కట్టబెట్టారా? లేదా? దీనివల్ల ఖజానాకు ఎంత నష్టం? అన్నది పరిశీలించాలి. - ఇప్పటివరకు చేసిన పనుల నాణ్యతను పరిశీలించాలి. నాణ్యతకు, పరిమాణానికి, బిల్లుల చెల్లింపులకు తేడాలుంటే వాటిని ప్రత్యేకంగా గుర్తించాలి. - శాఖల వారీగా, ప్రాజెక్టుల వారీగా ఈ అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. -
ఆర్ అండ్ బీలో నిధుల కటకట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ నిధుల కొరతతో సతమతమవుతోంది. ప్రస్తుతం ఖజానా ఖాళీ కావడంతో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో ఆర్ అండ్ బీకి సుమారు రూ. 5,600 కోట్లు కేటాయించినా ఈ ఆర్థిక సంవత్సరం మొదలైనప్పటి నుంచి నిధులు సరిగా విడుదల చేయలేదు. అయితే శాఖ అవసరాల కోసం రూ. 3 వేల కోట్లు రుణం తెచ్చుకోవాలని సూచించింది. దీంతో అధికారులు అప్పులవేట మొదలుపెట్టారు. ఈ అంశంపై పలుమార్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చలు జరిపారు. బ్యాంకు రుణానికి పూచీకత్తు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో అధికారులు పలు బ్యాంకులను ఆశ్రయించారు. అంత పెద్దమొత్తంలో అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు తొలుత సంశయించినా చివరకు మే నెలలో కన్సార్షియంగా ఏర్పడ్డాయి. ఇందులో ఆంధ్రా బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, విజయా బ్యాంకుతోపాటు మరో రెండు బ్యాంకులు ఉన్నాయి. విలీనం నేపథ్యంలో విజయా బ్యాంకు కన్సార్షియం నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ప్రస్తుత కన్సార్షియంలో ఆంధ్రా బ్యాంకు లీడ్ బ్యాంక్‌గా ఉంది. ఇంకా మంజూరు కాని రుణం... మే నెలలో బ్యాంకుల కన్సార్షియం ఏర్పడినా ఆర్ అండ్ బీకి ఇంతవరకూ రుణం మంజూరు కాలేదు. సెప్టెంబర్‌లో అసెంబ్లీ రద్దవడంతో కన్సార్షియం రుణం మంజూరు విషయంలో డైలామాలో పడింది. ఇప్పుడున్న ఆపద్ధర్మ ప్రభుత్వం హామీతో రుణం మంజూరు చేయడంపై బ్యాంకుల మధ్య అభిప్రాయభేదాలున్నట్లు సమాచారం. అందుకే రుణం మంజూరు పెండింగ్‌లో పడింది. ఆర్ అండ్ బీ అధికారులు విశ్వప్రయత్నాలు చేసినా అప్పు పుట్టకపోవడంతో బిల్లులు మంజూరు చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో కాంట్రాక్టర్లు సెప్టెంబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ పనులు ఆపేశారు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరుకల్లా పెండింగ్ బిల్లుల సమస్యలు పరిష్కరిస్తామని సెప్టెంబర్ 6న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చారు. దీంతో అన్యమనస్కంగానే కాంట్రాక్టర్లు తిరిగి పనులు మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ నెలాఖరు నాటికి బిల్లులు మంజూరు కాకపోతే తమ అప్పులు మరింత పెరిగిపోతాయని కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. -
వంతెన తెచ్చింది..జలం.. జీవం
చెక్‌డ్యాం నమూనాతో వంతెనల నిర్మాణం - ఈ వారధులతో 365 రోజులూ జలసిరి - తొలిసారిగా తెలంగాణలో అమలు - వాగుల్లో నీటి నిల్వతో వట్టిపోయిన బోర్లకు జీవం - సాగు, తాగు నీటికి ప్రయోజనకరం సాక్షి, హైదరాబాద్ : దుర్భిక్షంతో అల్లాడే ప్రాంతాల్లో ప్రతి నీటి చుక్కా వృథా కాకుండా కాపాడుకోవాలి. ఇటీవల మరాట్వాడా నీటి కరువు దీన్ని తేల్చి చెప్పింది. రాష్ట్రంలో ఇలాంటి దుస్థితిని కొంతవరకు అడ్డుకునేందుకు రోడ్లు, భవనాల శాఖ చేపట్టిన ప్రయోగం సత్ఫలితాలనిస్తుందన్న భరోసా కల్పిస్తోంది. వాగులు, వంకలపై నిర్మించే వంతెనల నమూనాలో చిన్నపాటి మార్పులు చేయటం ద్వారా నీటిని నిల్వ చేసే పథకాలుగా మార్చటమే ఈ ప్రయోగం ఉద్దేశం. పొరుగునే ఉన్న కర్ణాటకతోపాటు రాజస్థాన్‌లాంటి కొన్ని రాష్ట్రాలు ఈ ప్రయోగంతో సత్ఫలితాలు సాధించాయి. ఈ నేపథ్యంలో రోడ్లు, భవనాల శాఖ కొత్తగా చెక్‌డ్యాం నమూనాతో వంతెనల నిర్మాణం చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 500 వంతెనలు నిర్మించే పని ప్రారంభించిన ఆర్అండ్బీ శాఖ.. అందులో 174 వంతెనలను చెక్‌డ్యాం నమూనాలో చేపట్టాలని నిర్ణయించింది. గత వానాకా లం నాటికే చాలా వంతెనలను అందుబాటులోకి తేవాలని భావించినా.. నిధుల విడుదలలో జాప్యం, పనుల్లో ఆలస్యం, ప్రణాళిక లేమి వల్ల సాధ్యం కాలేదు. తర్వాత కాస్త వేగం పెంచటంతో ఈ వానాకాలం నాటికి 35 వంతెనలు పూర్తి చేయగలిగారు. ఇవి సత్ఫలితాలిస్తాయని తాజా వానలతో స్పష్టమైంది. మిగతావి పూర్తయితే వచ్చే వానాకాలంలో దాదాపు 174 ప్రాంతాల్లో ఇవి చిన్నపాటి నీటి నిల్వ ప్రాజెక్టులుగా సేవలందించనున్నాయి. పాత కాజ్‌వేలను కూల్చకుండా.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త వెంతెనలు నిర్మిస్తున్నందున పాత కాజ్‌వేలు, చిన్న వంతెనలతో పనిలేదు. అయితే వాటిని కూల్చివేయకుండా తూములు కాంక్రిట్‌తో మూసి చెక్డ్యాంలుగా మార్చాలని నిర్ణయించారు. నదులపై, చెరువులకు చేరువగా నిర్మించే వంతెనలు మినహా మిగతావన్నీ నీటి నిల్వకు ఉపయోగపడేలా నిర్మించాలని భావిస్తున్నారు. సాధారణంగా వాగుల్లోని నీళ్లు పారుతూముందుకు సాగి వానలు తగ్గగానే ఎండిపోతాయి. కానీ ఈ కట్టడాలున్న చోట్ల నీళ్లు కొంతమేర నిలిచి సమీపంలోని బోర్లను ఎండిపోకుండా చేయగలుగుతాయి. కొన్ని చోట్ల నేరుగా వ్యవసాయానికి నీటిని అందిస్తాయి. ఇది ఆదిలాబాద్ జిల్లాలో బాసర–లక్సెట్టిపేట మధ్య మహ్మదాబాద్ వాగుపై నిర్మించిన వంతెన. శిథిలమైన వంతెనను తొలగించి రూ.2.7 కోట్లతో దీన్ని నిర్మించారు. 3.7 మీటర్ల ఎత్తు, 53 మీటర్ల పొడవుతో వంతెనకు చెక్‌డ్యాంను జత చేశారు. ఇటీవలి వర్షాలతో ఇప్పుడు అక్కడ కిలోమీటర్ మేర దాదాపు 800 క్యూబిక్ మీటర్ల నీళ్లు ఉన్నాయి. దీంతో సమీప గ్రామాల్లోని బోర్లు పూర్తిస్థాయిలో రీఛార్జి అయ్యాయి. 500 చోట్ల వంతెనలు నిర్మిస్తాం.. 170 వంతెనలను చెక్‌డ్యాం నమూనాలో పూర్తి చేయబోతున్నాం. వచ్చే వానాకాలం నాటికి అవి సిద్ధమవుతాయి. మొత్తం 500 వంతెనలు ఈ నమూనాలో సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. భవిష్యత్తులో ఎత్తిపోతల పథకాలు పూర్తయి వాగుల్లోకి నీటి ప్రవాహం పెరిగితే, చెక్‌డ్యాం నమూనా వంతెనలు ఉన్నచోట 365 రోజులు నీటి నిల్వ ఉంటుంది. ఇది భూగర్భ జలాలను పెంచటంతోపాటు నేరుగా సాగు, తాగునీటికి ఉపయోగపడతాయి. – మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వరంగల్ జిల్లా ఆకేరు వాగుపై కల్లెడ–పర్వతగిరి మధ్య నిర్మించిన కొత్త వంతెన ఇది. వంతెన దిగువన 120 మీటర్ల పొడవు, 3.8 మీటర్ల ఎత్తుతో అడ్డుగోడ నిర్మించి చెక్‌డ్యాం ప్రయోజనాన్ని కల్పించారు. ఇటీవలి వర్షాలకు వంతెన దిగువన రెండు కిలోమీటర్ల మేర నీళ్లు నిలిచాయి. వానాకాలం ముగిసిన తర్వాత కూడా కొంతకాలం నీళ్లు నిలిచే ఉండనుండటంతో సమీప గ్రామాల్లోని బోర్లలో నీటి నిల్వ పెరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న మొత్తం వంతెనలు 511 వంతెనలకు అయ్యే ఖర్చు (అంచనా) 2,495కోట్లు తొలి విడతలో చెక్‌డ్యాం నమూనాకు ప్లాన్ చేసిన వంతెనలు: 174 వీటికయ్యే ఖర్చు రూ.520 కోట్లు ఇప్పటికి సిద్ధమైన వంతెనలు: 35 సాధారణ వంతెనను చెక్‌డ్యాం నమూనాలోకి మార్చటం వల్ల అదనంగా అయ్యే వ్యయం:10 శాతం నుంచి 15 శాతం వరకు మాత్రమే -
రహదారులకు నిధుల వరద
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యే క దృష్టి సారించిన రాష్ట్ర సర్కారు జిల్లాలోని ప్రధాన రహదారుల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసింది. రోడ్లు, భవనాల శాఖ పరిధిలోని రహదారుల విస్తరణ, మరమ్మతుల కోసం రూ.కోట్లలో నిధులు కేటాయిస్తూ పరిపాలన అనుమతులిచ్చింది. తెలంగాణలోనే అత్యధిక నిధులు ఆదిలాబాద్ జిల్లాకు మంజూరు కావడం గమనార్హం. రానున్న మూడేళ్లలో మొత్తం రూ.1,230.32 కోట్లను జిల్లాలోని రహదారుల అభివృద్ధికి వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల మూడు ఉత్తర్వులు (జీవో నెం.129, 130, 131) జారీ అయ్యాయి. ఈ నిధులతో మూడు రకాల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. కేవలం రహదారులే కాదు, వాటిపై ఉన్న బ్రిడ్జీల నిర్మాణం, అభివృద్ధిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసమూ నిధులు కేటాయించింది. భౌగోళికంగా జిల్లా ఎక్కువ విస్తీర్ణంలో ఉండడం, రహదారుల పొడవు అత్యధికంగా ఉండటంతో రాష్ట్రంలోనే అత్యధికంగా నిధులు మంజూరయ్యాయి. అదేవిధంగా కొన్ని దశాబ్దాల కాలంగా జిల్లాలోని రహదారులు అభివృద్ధికి నోచుకోలేదు. పాలకుల నిర్లక్ష్యంతో వీటిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఈసారి ఆదిలాబాద్ జిల్లా రహదారులకు ప్రభుత్వం పెద్దపీట వేయడం గమనార్హం. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు ఉన్న రహదారులను రెండు లైన్ల రహదారులుగా విస్తరిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఇందులో భాగంగా జిల్లాలోని 23 మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి అనుసంధానించే రహదారులు 21 ఉన్నాయి. ఇవి ప్రస్తుతం సింగల్ లేన్ రహదారులు. వీటిని రెండు లైన్లుగా విస్తరించాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.514.30 కోట్లు అవసరమని ఆర్అండ్బీ అధికారులు గతంలో ప్రాథమిక అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు ప్రభుత్వం ఈ నిధులను కేటాయించింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేటగిరి రహదారుల కోసం రూ.2,585 కోట్లు మంజూరైతే, ఒక్క ఆదిలాబాద్ జిల్లాకే ఇంత మొత్తంలో నిధులు రావడం గమనార్హం. రెండు లేన్లుగా విస్తరణ.. ఈ శాఖ పరిధిలోని 18 సింగిల్ లేన్ రహదారులను డబుల్ లేన్లుగా మార్చేందుకు కూడా ప్రత్యేకంగా నిధులు మంజూరయ్యాయి. 22 మండలాల పరిధిలో 18 రహదారులకు రూ.284.77 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల విస్తరణకు రూ.3,704.32 కోట్లు మంజూరు చేసింది. బ్రిడ్జీల నిర్మాణానికి కూడా.. కేవలం రహదారులే కాదు, వాటిపై ఉండే బ్రిడ్జీల నిర్మాణానికి కూడా పెద్ద మొత్తంలో నిధులు మంజూరయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా రూ.1,974 కోట్లను కేటాయించిన సర్కారు, ఇందులో జిల్లాలోని బ్రిడ్జీలకు రూ.431.25 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో అవసరమైన చోట నూతన బ్రిడ్జీల నిర్మాణాలు చేపడతారు. శిథిలావస్థలో ఉన్న వంతెనలకు పూర్తిస్థాయిలో మరమ్మతు చేస్తారు. చిన్న బ్రిడ్జీలను రెండు లేన్ల రహదారులకు సరిపడా వెడల్లుగా నిర్మిస్తారు. పర్యవేక్షక ఇంజినీర్‌గా రాజిరెడ్డి నియామకం రూ.కోట్లలో అభివృద్ధి పనులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సర్కారు జిల్లాలో ఏడాదిగా ఖాళీగా ఉన్న ఆర్అండ్బీ పర్యవేక్షక ఇంజినీర్ పోస్టును కూడా భర్తీ చేసింది. ఆ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో పనిచేస్తున్న జి.రాజిరెడ్డిని ఆదిలాబాద్ జిల్లా పర్యవేక్షక ఇంజినీర్‌గా నియమించింది. ఇటీవలే ఆయన ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నారు. జిల్లాకు మంజూరైన అభివృద్ధి పనులపై డీపీఆర్‌ను రూపొందిస్తున్నామని, సాంకేతిక అనుమతి వచ్చిన వెంటనే ఈ పనులకు టెండర్లు పిలుస్తామని రాజిరెడ్డి పేర్కొన్నారు. -
రాజధానికి మరో రింగ్ రోడ్డు
- ఆర్ అండ్ బీ సమీక్షలో కేసీఆర్ కీలక సూచనలు - హైదరాబాద్ చుట్టూ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వేస్ - హైవేలతో అనుసంధానం.. ట్రాఫిక్ జామ్‌లకు చెక్ - కొత్త రింగు రోడ్ ఆధారంగా శాటిలైట్ టౌన్‌షిప్‌లు - రామగుండం దాకా ఎక్స్‌ప్రెస్ వేగా రాజీవ్ రహదారి సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లే ప్రధాన జాతీయ రహదారులకు అనుసంధానంగా ఎలివేటెడ్ (ఫ్లై ఓవర్) ఎక్స్‌ప్రెస్ వేలను నిర్మించే అంశాన్ని పరిశీలించాల్సిందిగా రోడ్లు భవనాల శాఖను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశించారు. జిల్లాల నుంచి నగరానికి వ చ్చే వాహనాలు శివారులోకి వచ్చినప్పటి నుంచి తీవ్ర ట్రాఫిక్ జామ్లలో చిక్కుకుంటున్న నేపథ్యంలో ఎలివేటెడ్ (ఫ్లై ఓవర్లతో కూడిన) ఎక్స్‌ప్రెస్ వేల నిర్మాణమే దీనికి పరిష్కారంగా కనిపిస్తోందన్నారు. ఈ అంశాన్ని కూడా పరిశీలంచాలని సూచించారు. దాంతోపాటు, ప్రమాదాలకు నిలయంగా మారిన రాజీవ్ రహదారిని హైదరాబాద్ నుంచి రామగుండం వరకు ఎక్స్‌ప్రెస్ వేగా మార్చాలని ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆయన రోడ్లు భవనాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల ప్రతిపాదనలను పరిశీలించడంతో పాటు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌కు దారితీసే అన్ని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ చిక్కులు తొలగించాలని ఆదేశించారు. ‘‘దీనికి రోడ్ల విస్తరణే మార్గం. కానీ నగరంలో అంతమేర స్థల సేకరణ అసాధ్యమని, పైగా కంటోన్మెంట్ ప్రాంతాల్లో భూ సేకరణ కుదరదు. కాబట్టి ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వేల నిర్మాణం ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది’’ అని సీఎం పేర్కొన్నారు. అధికారులు కూడా ఈ విషయమై కొన్ని నిర్మాణాత్మక సూచనలు చేశారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానం నుంచి కంటోన్మెంట్ ప్రాంతం మీదుగా తూముకుంట దాకా ఫ్లై ఓవర్ మాదిరిగా (ఎలివేటెడ్) ఎక్స్‌ప్రెస్ వే నిర్మించి రాజీవ్ రహదారితో అనుసంధానించవచ్చు. అలాగే పరేడ్ మైదానం నుంచి కొంపల్లి దాకా నిర్మించి నిజామాబాద్ హైవేతో, ఉప్పల్ నుంచి బోడుప్పల్ దాకా నిర్మించి వరంగల్ హైవేతో అనుసంధానించి అక్కడి ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించవచ్చు. ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేవారి సౌలభ్యం కోసం నిర్మించిన పీవీ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే తరహాలో ఇవి ఉపయోగపడతాయి’’ అని వివరించారు. అయితే ఈ రోడ్లను ఫ్లై ఓవర్లుగా నాలుగు లేన్లతో నిర్మించాలంటే ఖర్చు భారీగా ఉంటుందని కేసీఆర్ అన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందజేస్తే తుది నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం హైదరాబాద్ చుట్టూ ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఔటర్ రింగురోడ్డుకు అదనంగా కొత్తగా మరో ఔటర్ రింగురోడ్డును నిర్మించే ప్రతిపాదనను ఆర్ అండ్ బీ అధికారులు ముఖ్యమంత్రి ముందుంచారు. నగరం చుట్టూ విస్తరించి ఉన్న జిల్లా కేంద్రాలను అనుసంధానించేలా 60 నుంచి 100 కిలోమీటర్ల పరిధిలో ఈ రోడ్డుంటుంది. దీన్ని ఆధారం చేసుకుని కొత్తగా శాటిలైట్ టౌన్లను నిర్మిస్తే నగరంపై జనాభా భారం తగ్గుతుంది’’అని వారు వివరించారు. ఇది కూడా మంచి ఆలోచనేనన్న కేసీఆర్, పూర్తి వివరాలతో నివేదిక అందజేస్తే పరిశీలిస్తానని చెప్పారు. ప్రస్తుతం నిర్మిస్తున్న అన్ని రోడ్లనూ సకాలంలో పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ రోడ్లకు మహర్దశ 20 వేల కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న పంచాయతీరాజ్ రోడ్లను ఆర్అండ్బీ తీసుకుని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. వాటిని జిల్లా కేంద్రాల వరకు 1,672 కి.మీ. విస్తీర్ణంలో నాలుగు లేన్లుగా, మండల కేంద్రాలకు 7,287 కి.మీ. విస్తీర్ణంలో రెండు లేన్లుగా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించి రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని ఆదేశించారు. ‘‘జిల్లాలో వృథాగా ఉన్న అతిథి గృహాలను మరమ్మతులు చేసి అధికారిక కార్యకలాపాలకు వినియోగించుకునేలా సిద్ధం చేయండి. దీనికి సంబంధించి పూర్తి ప్రణాళికను అందజేయండి’’ అని ఆదేశించారు. ఆర్‌అండ్‌బీలో సిబ్బంది కొరతనూ ఆరా తీశారు. పనులు సక్రమంగా జరగాలంటే ఎందరు సిబ్బంది కావాలో నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. సమావేశంలో సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇన్చార్జి ముఖ్యకార్యదర్శి అజయ్ మిశ్రా, ఈఎన్సీలు భిక్షపతి, రవీందర్రావు, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.