వంతెన తెచ్చింది..జలం.. జీవం | Construction of bridges with Check Dam | Sakshi
Sakshi News home page

వంతెన తెచ్చింది..జలం.. జీవం

Published Sat, Jul 15 2017 2:42 AM | Last Updated on Thu, Aug 30 2018 4:49 PM

వంతెన తెచ్చింది..జలం.. జీవం - Sakshi

వంతెన తెచ్చింది..జలం.. జీవం

చెక్‌డ్యాం నమూనాతో వంతెనల నిర్మాణం
- ఈ వారధులతో 365 రోజులూ జలసిరి 
తొలిసారిగా తెలంగాణలో అమలు
వాగుల్లో నీటి నిల్వతో వట్టిపోయిన బోర్లకు జీవం 
సాగు, తాగు నీటికి ప్రయోజనకరం
 
సాక్షి, హైదరాబాద్‌ : దుర్భిక్షంతో అల్లాడే ప్రాంతాల్లో ప్రతి నీటి చుక్కా వృథా కాకుండా కాపాడుకోవాలి. ఇటీవల మరాట్వాడా నీటి కరువు దీన్ని తేల్చి చెప్పింది. రాష్ట్రంలో ఇలాంటి దుస్థితిని కొంతవరకు అడ్డుకునేందుకు రోడ్లు, భవనాల శాఖ చేపట్టిన ప్రయోగం సత్ఫలితాలనిస్తుందన్న భరోసా కల్పిస్తోంది. వాగులు, వంకలపై నిర్మించే వంతెనల నమూనాలో చిన్నపాటి మార్పులు చేయటం ద్వారా నీటిని నిల్వ చేసే పథకాలుగా మార్చటమే ఈ ప్రయోగం ఉద్దేశం. పొరుగునే ఉన్న కర్ణాటకతోపాటు రాజస్థాన్‌లాంటి కొన్ని రాష్ట్రాలు ఈ ప్రయోగంతో సత్ఫలితాలు సాధించాయి.

ఈ నేపథ్యంలో రోడ్లు, భవనాల శాఖ కొత్తగా చెక్‌డ్యాం నమూనాతో వంతెనల నిర్మాణం చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 500 వంతెనలు నిర్మించే పని ప్రారంభించిన ఆర్‌అండ్‌బీ శాఖ.. అందులో 174 వంతెనలను చెక్‌డ్యాం నమూనాలో చేపట్టాలని నిర్ణయించింది. గత వానాకా లం నాటికే చాలా వంతెనలను అందుబాటులోకి తేవాలని భావించినా.. నిధుల విడుదలలో జాప్యం, పనుల్లో ఆలస్యం, ప్రణాళిక లేమి వల్ల సాధ్యం కాలేదు. తర్వాత కాస్త వేగం పెంచటంతో ఈ వానాకాలం నాటికి 35 వంతెనలు పూర్తి చేయగలిగారు. ఇవి సత్ఫలితాలిస్తాయని తాజా వానలతో స్పష్టమైంది. మిగతావి పూర్తయితే వచ్చే వానాకాలంలో దాదాపు 174 ప్రాంతాల్లో ఇవి చిన్నపాటి నీటి నిల్వ ప్రాజెక్టులుగా సేవలందించనున్నాయి.
 
పాత కాజ్‌వేలను కూల్చకుండా..
రాష్ట్రవ్యాప్తంగా కొత్త వెంతెనలు నిర్మిస్తున్నందున పాత కాజ్‌వేలు, చిన్న వంతెనలతో పనిలేదు. అయితే వాటిని కూల్చివేయకుండా తూములు కాంక్రిట్‌తో మూసి చెక్‌డ్యాంలుగా మార్చాలని నిర్ణయించారు. నదులపై, చెరువులకు చేరువగా నిర్మించే వంతెనలు మినహా మిగతావన్నీ నీటి నిల్వకు ఉపయోగపడేలా నిర్మించాలని భావిస్తున్నారు. సాధారణంగా వాగుల్లోని నీళ్లు పారుతూముందుకు సాగి వానలు తగ్గగానే ఎండిపోతాయి. కానీ ఈ కట్టడాలున్న చోట్ల నీళ్లు కొంతమేర నిలిచి సమీపంలోని బోర్లను ఎండిపోకుండా చేయగలుగుతాయి. కొన్ని చోట్ల నేరుగా వ్యవసాయానికి నీటిని అందిస్తాయి.
 
ఇది ఆదిలాబాద్‌ జిల్లాలో బాసర–లక్సెట్టిపేట మధ్య మహ్మదాబాద్‌ వాగుపై నిర్మించిన వంతెన. శిథిలమైన వంతెనను తొలగించి రూ.2.7 కోట్లతో దీన్ని నిర్మించారు. 3.7 మీటర్ల ఎత్తు, 53 మీటర్ల పొడవుతో వంతెనకు చెక్‌డ్యాంను జత చేశారు. ఇటీవలి వర్షాలతో ఇప్పుడు అక్కడ కిలోమీటర్‌ మేర దాదాపు 800 క్యూబిక్‌ మీటర్ల నీళ్లు ఉన్నాయి. దీంతో సమీప గ్రామాల్లోని బోర్లు పూర్తిస్థాయిలో రీఛార్జి అయ్యాయి.
 
500 చోట్ల వంతెనలు నిర్మిస్తాం..
170 వంతెనలను చెక్‌డ్యాం నమూనాలో పూర్తి చేయబోతున్నాం. వచ్చే వానాకాలం నాటికి అవి సిద్ధమవుతాయి. మొత్తం 500 వంతెనలు ఈ నమూనాలో సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. భవిష్యత్తులో ఎత్తిపోతల పథకాలు పూర్తయి వాగుల్లోకి నీటి ప్రవాహం పెరిగితే, చెక్‌డ్యాం నమూనా వంతెనలు ఉన్నచోట 365 రోజులు నీటి నిల్వ ఉంటుంది. ఇది భూగర్భ జలాలను పెంచటంతోపాటు నేరుగా సాగు, తాగునీటికి ఉపయోగపడతాయి.
– మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
 
వరంగల్‌ జిల్లా ఆకేరు వాగుపై కల్లెడ–పర్వతగిరి మధ్య నిర్మించిన కొత్త వంతెన ఇది. వంతెన దిగువన 120 మీటర్ల పొడవు, 3.8 మీటర్ల ఎత్తుతో అడ్డుగోడ నిర్మించి చెక్‌డ్యాం ప్రయోజనాన్ని కల్పించారు. ఇటీవలి వర్షాలకు వంతెన దిగువన రెండు కిలోమీటర్ల మేర నీళ్లు నిలిచాయి. వానాకాలం ముగిసిన తర్వాత కూడా కొంతకాలం నీళ్లు నిలిచే ఉండనుండటంతో సమీప గ్రామాల్లోని బోర్లలో నీటి నిల్వ పెరగనుంది.
 
రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న మొత్తం వంతెనలు  511
 వంతెనలకు అయ్యే ఖర్చు (అంచనా)  2,495కోట్లు
తొలి విడతలో చెక్‌డ్యాం నమూనాకు ప్లాన్‌ చేసిన వంతెనలు: 174
వీటికయ్యే ఖర్చు రూ.520 కోట్లు
ఇప్పటికి సిద్ధమైన వంతెనలు: 35
సాధారణ వంతెనను చెక్‌డ్యాం నమూనాలోకి మార్చటం వల్ల  అదనంగా అయ్యే వ్యయం:10 శాతం నుంచి 15 శాతం వరకు మాత్రమే

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement