రాజధానికి మరో రింగ్ రోడ్డు | Another ring road to the capital | Sakshi
Sakshi News home page

రాజధానికి మరో రింగ్ రోడ్డు

Published Thu, Jun 12 2014 6:14 AM | Last Updated on Thu, Aug 30 2018 4:49 PM

రాజధానికి మరో రింగ్ రోడ్డు - Sakshi

రాజధానికి మరో రింగ్ రోడ్డు

- ఆర్ అండ్ బీ సమీక్షలో కేసీఆర్ కీలక సూచనలు
- హైదరాబాద్ చుట్టూ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వేస్
- హైవేలతో అనుసంధానం.. ట్రాఫిక్ జామ్‌లకు చెక్
- కొత్త రింగు రోడ్ ఆధారంగా శాటిలైట్ టౌన్‌షిప్‌లు
- రామగుండం దాకా ఎక్స్‌ప్రెస్ వేగా రాజీవ్ రహదారి

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లే ప్రధాన జాతీయ రహదారులకు అనుసంధానంగా ఎలివేటెడ్ (ఫ్లై ఓవర్) ఎక్స్‌ప్రెస్ వేలను నిర్మించే అంశాన్ని పరిశీలించాల్సిందిగా రోడ్లు భవనాల శాఖను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశించారు. జిల్లాల నుంచి నగరానికి వ చ్చే వాహనాలు శివారులోకి వచ్చినప్పటి నుంచి తీవ్ర ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకుంటున్న నేపథ్యంలో ఎలివేటెడ్ (ఫ్లై ఓవర్లతో కూడిన) ఎక్స్‌ప్రెస్ వేల నిర్మాణమే దీనికి పరిష్కారంగా కనిపిస్తోందన్నారు. ఈ అంశాన్ని కూడా పరిశీలంచాలని సూచించారు. దాంతోపాటు, ప్రమాదాలకు నిలయంగా మారిన రాజీవ్ రహదారిని హైదరాబాద్ నుంచి రామగుండం వరకు ఎక్స్‌ప్రెస్ వేగా మార్చాలని ఆదేశించారు.

బుధవారం సాయంత్రం ఆయన రోడ్లు భవనాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల ప్రతిపాదనలను పరిశీలించడంతో పాటు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌కు దారితీసే అన్ని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ చిక్కులు తొలగించాలని ఆదేశించారు. ‘‘దీనికి రోడ్ల విస్తరణే మార్గం. కానీ నగరంలో అంతమేర స్థల సేకరణ అసాధ్యమని, పైగా కంటోన్మెంట్ ప్రాంతాల్లో భూ సేకరణ కుదరదు. కాబట్టి ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వేల నిర్మాణం ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది’’ అని సీఎం పేర్కొన్నారు. అధికారులు కూడా ఈ విషయమై కొన్ని నిర్మాణాత్మక సూచనలు చేశారు.

సికింద్రాబాద్ పరేడ్ మైదానం నుంచి కంటోన్మెంట్ ప్రాంతం మీదుగా తూముకుంట దాకా ఫ్లై ఓవర్ మాదిరిగా (ఎలివేటెడ్) ఎక్స్‌ప్రెస్ వే నిర్మించి రాజీవ్ రహదారితో అనుసంధానించవచ్చు. అలాగే పరేడ్ మైదానం నుంచి కొంపల్లి దాకా నిర్మించి నిజామాబాద్ హైవేతో, ఉప్పల్ నుంచి బోడుప్పల్ దాకా నిర్మించి వరంగల్ హైవేతో అనుసంధానించి అక్కడి ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించవచ్చు. ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేవారి సౌలభ్యం కోసం నిర్మించిన పీవీ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే తరహాలో ఇవి ఉపయోగపడతాయి’’ అని వివరించారు. అయితే ఈ రోడ్లను ఫ్లై ఓవర్లుగా నాలుగు లేన్లతో నిర్మించాలంటే ఖర్చు భారీగా ఉంటుందని కేసీఆర్ అన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందజేస్తే తుది నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నారు.

 ఇక ప్రస్తుతం హైదరాబాద్ చుట్టూ ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఔటర్ రింగురోడ్డుకు అదనంగా కొత్తగా మరో ఔటర్ రింగురోడ్డును నిర్మించే ప్రతిపాదనను ఆర్ అండ్ బీ అధికారులు ముఖ్యమంత్రి ముందుంచారు. నగరం చుట్టూ విస్తరించి ఉన్న జిల్లా కేంద్రాలను అనుసంధానించేలా 60 నుంచి 100 కిలోమీటర్ల పరిధిలో ఈ రోడ్డుంటుంది. దీన్ని ఆధారం చేసుకుని కొత్తగా శాటిలైట్ టౌన్లను నిర్మిస్తే నగరంపై జనాభా భారం తగ్గుతుంది’’అని వారు వివరించారు. ఇది కూడా మంచి ఆలోచనేనన్న కేసీఆర్, పూర్తి వివరాలతో నివేదిక అందజేస్తే పరిశీలిస్తానని చెప్పారు. ప్రస్తుతం నిర్మిస్తున్న అన్ని రోడ్లనూ సకాలంలో పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.
 
పంచాయతీరాజ్ రోడ్లకు మహర్దశ
 20 వేల కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న పంచాయతీరాజ్ రోడ్లను ఆర్‌అండ్‌బీ తీసుకుని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. వాటిని జిల్లా కేంద్రాల వరకు 1,672 కి.మీ. విస్తీర్ణంలో నాలుగు లేన్లుగా, మండల కేంద్రాలకు 7,287 కి.మీ. విస్తీర్ణంలో రెండు లేన్లుగా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించి రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని ఆదేశించారు. ‘‘జిల్లాలో వృథాగా ఉన్న అతిథి గృహాలను మరమ్మతులు చేసి అధికారిక కార్యకలాపాలకు వినియోగించుకునేలా సిద్ధం చేయండి. దీనికి సంబంధించి పూర్తి ప్రణాళికను అందజేయండి’’ అని ఆదేశించారు. ఆర్‌అండ్‌బీలో సిబ్బంది కొరతనూ ఆరా తీశారు. పనులు సక్రమంగా జరగాలంటే ఎందరు సిబ్బంది కావాలో నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. సమావేశంలో సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇన్‌చార్జి ముఖ్యకార్యదర్శి అజయ్ మిశ్రా, ఈఎన్‌సీలు భిక్షపతి, రవీందర్‌రావు, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement