మీ వాడిగా ఉంటా.. మీకు తోడుగా ఉంటా | Minister Jogi Ramesh Rally In The Constituency | Sakshi
Sakshi News home page

ఇంతగా ఆదరాభిమానాలు చూపుతున్న మీకు కృతజ్ఞతలు

Published Wed, Apr 13 2022 1:25 PM | Last Updated on Wed, Apr 13 2022 1:40 PM

Minister Jogi Ramesh Rally In The Constituency - Sakshi

పెడన : ‘మీ వాడిగా ఉంటా.. మీకు తోడుగా ఉంటా.. సమస్యలు ఏమైనా నేరుగా నా దృష్టికి తీసుకురండి.. ఇంతగా ఆదరాభిమానాలు చూపుతున్న మీకు కృతజ్ఞతలు.. అంటూ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ పెడన ఆనందం వ్యక్తం చేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మొదటిసారి పెడన పట్టణానికి వచ్చిన జోగి రమేష్‌ మంగళవారం రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా పురప్రజలు బ్రహ్మరథం పట్టారు. బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు బారులుతీరి నీరాజనాలు పలికారు.

అనంతరం పట్టణంలోనికి ప్రవేశించిన మంత్రి  వర్యులకు 23వ వార్డులో పురపాలక చైర్‌పర్సన్‌ బళ్ల జ్యోత్స్నరాణి, వైస్‌ చైర్మన్లు ఎండీ ఖాజా, బైలపాటి జ్యోతి, ఫ్లోర్‌ లీడర్‌ కటకంప్రసాద్‌లతో పాటు పలువురు కౌన్సిలర్లు, పట్టణ అధ్యక్షుడు బండారు మల్లికార్జునరావులు స్వాగతం పలికారు. ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ నుంచి పార్టీ కార్యాలయం వరకు ర్యాలీగా నడుచుకుంటూ చేరుకున్నారు. మార్గం మధ్యలో చిన్నారులను, వృద్ధులను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చేనేత కార్మికుల నేత సరుల వద్దకు చేరి వారి కష్టంలో కాసేపు పాలు పంచుకున్నారు. మండల కన్వీనర్‌ కొండవీటి నాగబాబు, ఎంపీపీ రాజులపాటి వాణి, మాజీ ఎంపీపీ అచ్యుతరావు, మార్కెట్‌ యార్డు చైర్‌పర్సన్‌ గరికిపాటి చారుమతి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 

నిలిచిన రోడ్‌ షో.. 
మంత్రి రోడ్డు షో పెడన నుంచి బలిపర్రు, నందమూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో కొనసాగాల్సి ఉండగా.. పెడన పార్టీ కార్యాలయం వరకు వచ్చిన తర్వాత గూడూరు మండలం కోకనారాయణపాలేనికి చెందిన సర్పంచ్‌ బండి రమేష్‌ ఆకస్మికంగా గుండెపోటుతో చనిపోవడంతో ర్యాలీని అర్ధంతరంగా నిలిపేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement