
సాక్షి, అమరావతి: న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఎన్‌డీబీ) సాయంతో రాష్ట్రంలో రహదారులు, వంతెనల పునర్నిర్మాణ పనులకు సంబంధించి రీ టెండర్లకు రహదారులు, భవనాలశాఖ ఈ నెల 14న నోటిఫికేషన్ జారీ చేయనుంది. నాలుగు జిల్లాలకు మాత్రమే టెండరు నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ టెండర్లలో రెండు నిబంధనలకు సవరణ చేస్తూ శనివారం రవాణా, ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులిచ్చారు. మొత్తం రూ.6,400 కోట్లతో చేపట్టనున్న ఈ పనులకు సంబంధించి.. తొలిదశలో రూ.1,860 కోట్లతో 13 ప్యాకేజీలకు ఈ–టెండర్లు పిలవగా 14 సంస్థల నుంచి 25 బిడ్లు మాత్రమే వచ్చాయి.
సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆర్‌అండ్‌బీ ముఖ్య అధికారులతో సమీక్షించి కాంట్రాక్టర్లలో పోటీతత్వం పెంచేందుకు టెండర్లను రద్దుచేసి మళ్లీ పిలవాలని ఆదేశించడంతో ఎన్‌డీబీ టెండర్లు రద్దయిన సంగతి తెలిసిందే. తొలి దశగా ఇప్పుడు నాలుగు జిల్లాల్లో రూ.682.16 కోట్ల పనులకు సంబంధించి మళ్లీ టెండర్లు పిలవనున్నారు. నిబంధనల్లో రెండింటిని సవరించారు. ఇందుకు న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు అనుమతి తీసుకున్నారు. జ్యుడిషియల్ ప్రివ్యూ అనుమతి తీసుకుని జీవో జారీ చేశారు. సవరించిన నిబంధనలివే..
► టెండరు నిబంధనల్లో గతంలో బ్యాంకు గ్యారెంటీలు జాతీయ బ్యాంకుల నుంచే స్వీకరిస్తామన్నారు. ఈ దఫా రూరల్ బ్యాంకులు/కో–ఆపరేటివ్ బ్యాంకులు మినహా మిగిలిన షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల నుంచి స్వీకరిస్తారు.
► హార్డ్ కాపీని బిడ్ల దాఖలుకు ముందే ఇవ్వాలన్న నిబంధనను.. బ్యాంకు ఆథరైజేషన్‌తో రివర్స్ టెండర్లు నిర్వహించేలోగా ఇవ్వవచ్చని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment