సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలు ఏర్పాటుతో వైద్య విద్యలో నూతన శకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాంది పలికారు. ఉమ్మడి రాష్ట్రానికి ముందు, తర్వాత చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ వైద్య కళాశాలలను ప్రైవేటు కాలేజీలకు దీటుగా నిర్వహించడంలో భాగంగా ప్రభుత్వం సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల విధానాన్ని ప్రవేశపెట్టనుంది.
ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు బుధవారం జారీ చేశారు. ఈ వైద్య కళాశాలల్లో మొత్తం సీట్లలో 15 శాతం ఆల్ ఇండియా కోటాకు కేటాయిస్తారు. మిగిలిన వాటిని మూడు విభాగాలుగా చేశారు వాటిలో 50 శాతం జనరల్ విభాగం, 35 శాతం సెల్ఫ్ ఫైనాన్స్, 15 శాతం ఎన్‌ఆర్‌ఐ కోటా కింద భర్తీ చేయనున్నారు.
జనరల్ విభాగంలో ఏడాదికి రూ.15 వేలు, సెల్ఫ్ ఫైనాన్స్‌లో రూ.12 లక్షలు, ఎన్‌ఆర్‌ఐ విభాగంలో రూ. 20 లక్షలు చొప్పున ఫీజులు నిర్ణయించారు. సెల్ఫ్ ఫైనాన్స్, ఎన్‌ఆర్‌ఐ సీట్ల ద్వారా వచ్చే ఫీజులను ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ కార్పొరేషన్ (ఏపీ మెర్క్)లో డిపాజిట్ చేస్తారు. ఈ నిధులతో ప్రభుత్వ వైద్య కళాశాలల అభివృద్ధి చేపడతారు.
రూ.12,300 కోట్లతో
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రూ.16 వేల కోట్లతో నాడు–నేడు కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వ వైద్య విద్యా రంగం రూపురేఖలు మారుస్తున్నారు. ఇందులో భాగంగా రూ.8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న వైద్య కళాశాలల బలోపేతానికి రూ.3,820 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇలా మొత్తం రూ.12.300 కోట్లు ప్రభుత్వ వైద్య కళాశాలలకు వెచ్చిస్తున్నారు.
విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాలలో నిర్మించిన నూతన కళాశాలలను ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లె, పాడేరు కళాశాలలు ప్రారంభించడానికి చర్యలు చేపట్టారు. ఈ వైద్య కళాశాలలన్నింటికీ కొత్తగా పోస్టులు మంజూరు చేశారు. మిగిలిన 7 వైద్య కళాశాలలు 2025–26లో ప్రారంభించాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment