
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో వైద్య విద్యారంగంలో పెను మార్పులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ రంగంలోనే ఏకంగా 16 బోధనాస్పత్రుల్ని (మెడికల్ కాలేజీలు) నిర్మించేందుకు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య విద్యను ప్రైవేట్ పరం చేస్తున్న తరుణంలో సీఎం వైఎస్ జగన్ ఓ వైపు ప్రజా సంక్షేమంతో పాటు మరోవైపు సామాజిక పెట్టుబడిలో భాగంగా మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేపడుతున్నారు. గత చంద్రబాబు సర్కారు వైద్య విద్యారంగాన్ని ప్రైవేట్‌కు వదిలేసి.. ప్రైవేట్ రంగం చేయాల్సిన ఫైబర్ నెట్, సెటాప్ బాక్సుల ఏర్పాటు, టవర్స్ నిర్మాణం వంటివి ప్రభుత్వ రంగంలో చేపట్టగా.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వైద్య విద్యా రంగాన్ని ప్రభుత్వ బాధ్యతగా తీసుకోవడం ద్వారా భావితరాలకు బాటలు వేస్తున్నారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇక్కడే గత ప్రభుత్వ ఆలోచనలకు ఈ ప్రభుత్వ ఆలోచనలకు స్పష్టమైన తేడా కనిపిస్తోందని పేర్కొంటున్నాయి.
తండ్రి ఆశయాన్ని నెరవేర్చేలా..
► దివంగత సీఎం వైఎస్సార్ ఉమ్మడి ఏపీలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆకస్మిక మరణం తరువాత వచ్చిన ప్రభుత్వాలు మెడికల్ కాలేజీల ఏర్పాటును పట్టించుకోకపోగా.. వైద్య విద్యా రంగాన్ని ప్రైవేట్ పరం చేయడానికి ప్రాధాన్యత ఇచ్చాయి.
► ఇప్పుడు వైద్య విద్యారంగాన్ని ప్రభుత్వ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సీఎం జగన్ నిర్ణయించి.. జిల్లాకో మెడికల్ కాలేజీ నిర్మించాలన్న తండ్రి ఆశయాన్ని వాస్తవ రూపంలోకి తెచ్చేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.
► పార్లమెంటరీ నియోజకవర్గాన్ని జిల్లా చేయాలనే ఆలోచనతోనే నియోజకర్గానికో మెడికల్ కాలేజీ నిర్మించేలా చర్యలు చేపట్టారు.
ఆగస్టులో టెండర్లు!
► మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించి డిజైన్ల రూపకల్పన, సవివరమైన ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను రూపొదించే పనిలో యంత్రాంగం ఇప్పటికే నిమగ్నమైంది.
► వీలైనంత త్వరగా డిజైన్లు, డీపీఆర్‌లను పూర్తి చేసి ఆగస్టులో టెండర్లు పిలిచేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
► భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కాలేజీల విస్తరణకు సైతం అవకాశం ఉండేలా.. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రమాణాలతో బోధనాస్పత్రుల నిర్మాణం చేయనున్నారు.
► మూడేళ్లలో వీటి నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధారించుకుంది.
అనుబంధంగా నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు
► బోధనాస్పత్రులకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలతో పాటు పారా మెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు చేపడుతున్నారు.
► వీటిలో అడ్వాన్స్‌డ్ హెల్త్‌కేర్, మెడికల్ టూరిజం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణపై యంత్రాంగం దృష్టి సారించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో 2,050 మెడికల్ సీట్లు ఉండగా.. కొత్తగా నిర్మించే ఒక్కో బోధనాస్పత్రిలో 100 సీట్ల చొప్పున 1,600 సీట్లు రానున్నాయి.
► రాష్ట్రంలో సుమారు 95% కుటుంబాలను వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.2,100 కోట్లను కేటాయించారు.
► ఈ నేపథ్యంలో ఒకేసారి పెద్దఎత్తున పెట్టుబడి పెట్టి ప్రభుత్వ రంగంలో ప్రజారోగ్యాన్ని బలోపేతం చేయనుండటంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలందరికీ మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
50 ఎకరాల సువిశాల ప్రాంగణం ఉండేలా..
► ప్రస్తుతం ఉన్న 11 బోధనాస్పత్రుల రూపురేఖలను మార్చడంతో పాటు రూ.12 వేల కోట్లతో కొత్తగా మరో 16 బోధనాస్పత్రుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం.
► ఒక్కో ఆస్పత్రిని 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
► ఇప్పటికే మచిలీపట్నం, అరకులో కాలేజీల నిర్మాణానికి అవసరమైన స్థలాలను సిద్ధం చేశారు. నర్సారావుపేట, నంద్యాల, పులివెందుల, ఏలూరు, విజయనగరం, అనకాపల్లి, రాజమహేంద్రవరం, హిందూపూర్, రాజంపేట, అమలాపురం, నరసాపురం, బాపట్ల, మార్కాపురం, చిత్తూరులో కాలేజీలకు అనువైన స్థలాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.
► ఇదిలావుంటే.. ఆదోనిలో మరో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. ఈ విషయంలోనూ అధికారిక నిర్ణయం తీసుకుంటే రాష్ట్రంలో నిర్మించే మొత్తం కాలేజీల సంఖ్య 17కు చేరుతుంది.
వైద్య విద్యకు మంచి రోజులు
ఇప్పటివరకూ రాష్ట్రంలో ప్రైవేట్ వైద్య కళాశాలలు, ప్రైవేట్ మెడికల్ సీట్లే ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో ప్రైవేట్ వైద్య కళాశాలల కంటే ప్రభుత్వ కాలేజీల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. వైద్య విద్య పేదవారికి కూడా అందుబాటులోకి వస్తుంది. ఒకేసారి 16 మెడికల్ కాలేజీలు నిర్మించడమనేది బహుశా దేశ చరిత్రలో ఇక్కడే మొదటిసారి చేస్తున్నారు. వీటి నిర్మాణం పూర్తయితే స్పెషాలిటీ సేవలు పేదలందరికీ అందుబాటులోకి వస్తాయి.
– డాక్టర్ కె.వెంకటేష్, వైద్య విద్యా సంచాలకులు
Comments
Please login to add a commentAdd a comment