ఏపీ మెడికల్ హబ్‌గా మారేందుకు వైఎస్ జగన్ కృషి, కానీ..
వైద్య ఆరోగ్య రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కూటమి సర్కార్
ఆరోగ్యశ్రీ కాస్త ఇప్పుడు అనారోగ్యశ్రీగా..
పులివెందుల కాలేజీపై ఉద్దేశపూర్వకంగానే చర్యలు
ఆరోగ్య మంత్రి సత్య యాదవ్‌పై విడదల రజిని సెటైర్లు
గుంటూరు, సాక్షి: ప్రైవేటీకరణ అనేది కూటమి సర్కార్ ఫిలాసఫీ అని, అందుకే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయాలని ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. ఏపీ మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మంగళవారం గుంటూరు ఆమె మీడియాతో మాట్లాడారు.
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ గొప్ప ఆలోచన. గ్రామాల్లోకి సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను పంపి పేదలకు వైద్యం అందించాం. మా హయాంలో ఎలాంటి సౌకర్యాలు అందించామో ప్రజలకు తెలుసు. ఏపీని మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ పని చేశారు. కానీ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురద జల్లాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
కూటమి ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖను నిర్వీర్యం చేస్తోంది. ఆరోగ్యశ్రీని ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా అనారోగ్యశ్రీగా మార్చేశారు. ప్రజలకు అసౌకర్యాలు కలగకూడదని 104, 108 సర్వీసులు తీసుకొచ్చాం. ఆ సేవలను కూడా అటకెక్కించారు.
ఏపీకి 17 మెడికల్‌కాలేజీలు తీసుకొచ్చాం. మెడికల్ కాలేజీల కోసం రూ.8,500 కోట్లు ఖర్చు చేశాం. మిగిలిన మెడికల్ కాలేజీలను పూర్తి చేయలేక మాపై బురద జల్లాలని చూస్తున్నారు. కాలేజీలకు పర్మిషన్ రాలేదని సంబంధిత మంత్రి మాట్లాడుతున్నారు. ఆయన తెలిసి మాట్లాడుతున్నారో.. తెలీక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు.
మొత్తం 17 కాలేజీల్లో పులివెందుల కాలేజీ కూడా ఉంది. కానీ, ఆ ఒక్క కాలేజీ మీద అంత కక్ష ఎందుకు?. పులివెందుల కాలేజీకి మెడికల్ సీట్లు వద్దని లేఖ రాయడం దేనికి?. అని నిలదీశారామె.
.. పులివెందుల మెడికల్ కాలేజ్‌కు హాస్టల్స్ లేవని ఇప్పుడున్న మంత్రి చెప్తున్నారు. కానీ, ప్రభుత్వం దృష్టి పెట్టి ఉంటే ఈపాటికి పనులన్నీ పూర్తి అయ్యేవి.(ఈ ఏడాది జనవరి లో హాస్టల్ నిర్మాణానికి సంబంధించిన ఫోటోలను మీడియా ముందు రజిని ప్రదర్శించారు)
కూటమి ప్రభుత్వం ఒక పథకం ప్రకారం సోషల్ మీడియా పై కేసులు పెట్టి ఇబ్బంది పెడుతోంది. కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని విడదల రజిని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment