స్వగ్రామం దొమ్మేరులో నేడు అంత్యక్రియలు
ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపు
వైఎస్సార్‌సీపీలో సీఈసీ సభ్యుడిగా బాధ్యతలు
కొవ్వూరు: వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు (71) మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో ఎన్‌టీ రామారావుపై అభిమానంతో రాజకీయాల్లోకి వచ్చారు. వరుసగా 1983, 1985 (మధ్యంతర ఎన్నికలు), 1989, 1994, 2004లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీలు వేరైనప్పటికీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో కృష్ణబాబుకు అత్యంత సాన్నిహిత్యం ఉండేది. దీంతో ఆయన మరణానంతరం 2012లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్‌సీపీలో చేరారు.
జిల్లా రాజకీయాల్లోనూ, గోపాలపురం, పోలవరం నియోజకవర్గాల్లో పునర్విభజన అనంతరం కొవ్వూరులోనూ కృష్ణబాబు రాజకీయంగా తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన భార్య నాగమణి గతంలోనే మరణించారు. కృష్ణబాబుకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ సలహాదారు, పార్టీ కొవ్వూరు నియోజకవర్గ పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న ఎస్.రాజీవ్‌కృష్ణ ఆయన అల్లుడు.
కృష్ణబాబు మృతి పట్ల రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, కొవ్వూరు మునిసిపల్ చైర్‌పర్సన్ భావన రత్నకుమారితోపాటు పలువురు రాష్ట్ర, జిల్లాస్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన స్వగ్రామమైన దొమ్మేరులో బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment