re-tender
-
27తో ఎన్డీబీ టెండర్ల ప్రక్రియ పూర్తి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం, న్యూడెవలప్‌మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) సంయుక్తంగా రూ. 6,400 కోట్లతో చేపట్టిన రహ దారుల అభివృద్ధి పనుల్లో తొలి దశకు సంబంధించిన రూ.1,860 కోట్ల విలువైన టెండర్ల ప్రక్రియ ఈ నెల 27తో పూర్తి కానుంది. మొత్తం మూడు ప్యాకేజీల కింద 13 జిల్లాల్లో గ్రామీణ రోడ్ల అభివృద్ధికి టెండర్లు పిలిచారు. తొలిదశలో రూ.1,860.21 కోట్లతో 13 ప్యాకేజీలకు ఈ–టెండర్లు పిలవగా 14 సంస్థల నుంచి 25 బిడ్లే వచ్చాయి. సీఎం వైఎస్ జగన్ ఆర్ అండ్ బీ అధికారులతో సమీక్షించి.. కాంట్రాక్టర్లలో పోటీతత్వం పెంచేందుకు టెండర్లను రద్దు చేసి మళ్లీ పిలవాలని ఆదేశించారు. దీంతో గత నెలలో రీ టెండర్లు పిలవగా.. కాంట్రాక్టర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా టెండర్ల నిబంధనలు సవరించింది. గతంలో బ్యాంకు గ్యారెంటీలు (బీజీలు) జాతీయ బ్యాంకుల నుంచి మాత్రమే స్వీకరిస్తామని నిబంధనల్లో పేర్కొన్నారు. ఈసారి రూరల్ బ్యాంకులు/కోపరేటివ్ బ్యాంకులు మినహా మిగిలిన షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల నుంచి బీజీలు స్వీకరించారు. హార్డ్ కాపీని బిడ్ల దాఖలుకు ముందే ఇవ్వాలన్న నిబంధనను.. బ్యాంకు ఆథరైజేషన్‌తో రివర్స్ టెండర్లు నిర్వహించేలోగా ఇవ్వొచ్చని సవరించారు. రీ టెండర్లకు సంబంధించి కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో ఆర్అండ్బీ అధికారులు ప్రీ బిడ్ సమావేశాలను నిర్వహిస్తున్నారు. టెండర్ల నిర్వహణ ఇలా.. ఈ నెల 13తో పశ్చిమగోదావరి, కృష్ణా, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు టెండర్ల గడువు ముగుస్తుంది. దాఖలైన టెండర్లను టెక్నికల్ ఎవాల్యుయేషన్ చేస్తారు. అర్హత సాధించిన కాంట్రాక్టు సంస్థలకు రివర్స్ టెండర్లు నిర్వహిస్తారు. అనంతరం ఫైనాన్స్ కమిటీకి పంపించి టెండర్లు ఖరారు చేస్తారు. ఈ నెల 18న కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాలకు టెండర్ల గడువు ముగుస్తుంది. ఆ తర్వాత రివర్స్ టెండర్లు నిర్వహిస్తారు. ఈ నెల 27న విజయనగరం, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలకు టెండర్ల గడువు ముగుస్తుంది. ఈ నెలాఖరుకు టెండర్లను ఖరారు చేస్తారు. ఆ తర్వాత కాంట్రాక్టు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటారు. రెండేళ్లలో పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. స్పందన బాగుంది.. గతంలో కంటే రీ టెండర్లకు మంచి స్పందన వచ్చింది. ప్రీ బిడ్ సమావేశాలు జరుగుతున్నాయి. గతంలో 25 బిడ్లు దాఖలయ్యాయి. ఈసారి ఎక్కువ సంఖ్యలో దాఖలయ్యే అవకాశాలున్నాయి. పోటీతత్వం పెంచేందుకు ఎక్కువ మంది కాంట్రాక్టర్లు ఈ టెండర్లలో పాల్గొనేలా చర్యలు తీసుకున్నాం. దీనివల్ల మరిన్ని రోడ్లు అభివృద్ధి చేయొచ్చు. – వేణుగోపాల్‌రెడ్డి, ఆర్ అండ్ బీ ఇంజనీర్ ఇన్ చీఫ్ -
19న ఎన్డీబీ రెండో విడత రీ టెండర్లు
సాక్షి, అమరావతి: న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) సాయంతో రాష్ట్రంలో రహదార్లు, వంతెనల పునర్నిర్మాణ పనులకు సంబంధించి రెండో విడత రీ టెండర్ల ప్రకటనను ఈ నెల 19న జారీచేయనున్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలో రూ.792.76 కోట్ల పనులకు రీ టెండర్ ప్రకటన ఇవ్వనున్నారు. తొలివిడత రీ టెండర్లకు విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో రూ.682.16 కోట్ల పనులకు ఈ నెల 14న నోటిఫికేషన్ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ టెండర్లలో రెండు నిబంధనలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల కిందట ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం రూ.6,400 కోట్లతో చేపట్టనున్న ఈ పనులకు సంబంధించి మొదటి విడతగా రూ.1,860 కోట్లతో 13 ప్యాకేజీలకు గతంలో ఈ–టెండర్లు పిలవగా 14 సంస్థల నుంచి 25 బిడ్లు మాత్రమే వచ్చాయి. సీఎం వైఎస్ జగన్ ఆర్అండ్బీ ముఖ్య అధికారులతో సమీక్షించి కాంట్రాక్టర్లలో పోటీతత్వం పెంచేందుకు టెండర్లను రద్దుచేసి మళ్లీ పిలవాలని ఆదేశించడంతో ఎన్డీబీ టెండర్లను రద్దుచేసిన విషయం తెలిసిందే. -
14న ఎన్డీబీ రీ టెండర్లకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) సాయంతో రాష్ట్రంలో రహదారులు, వంతెనల పునర్నిర్మాణ పనులకు సంబంధించి రీ టెండర్లకు రహదారులు, భవనాలశాఖ ఈ నెల 14న నోటిఫికేషన్ జారీ చేయనుంది. నాలుగు జిల్లాలకు మాత్రమే టెండరు నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ టెండర్లలో రెండు నిబంధనలకు సవరణ చేస్తూ శనివారం రవాణా, ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులిచ్చారు. మొత్తం రూ.6,400 కోట్లతో చేపట్టనున్న ఈ పనులకు సంబంధించి.. తొలిదశలో రూ.1,860 కోట్లతో 13 ప్యాకేజీలకు ఈ–టెండర్లు పిలవగా 14 సంస్థల నుంచి 25 బిడ్లు మాత్రమే వచ్చాయి. సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆర్అండ్బీ ముఖ్య అధికారులతో సమీక్షించి కాంట్రాక్టర్లలో పోటీతత్వం పెంచేందుకు టెండర్లను రద్దుచేసి మళ్లీ పిలవాలని ఆదేశించడంతో ఎన్డీబీ టెండర్లు రద్దయిన సంగతి తెలిసిందే. తొలి దశగా ఇప్పుడు నాలుగు జిల్లాల్లో రూ.682.16 కోట్ల పనులకు సంబంధించి మళ్లీ టెండర్లు పిలవనున్నారు. నిబంధనల్లో రెండింటిని సవరించారు. ఇందుకు న్యూ డెవలప్మెంట్ బ్యాంకు అనుమతి తీసుకున్నారు. జ్యుడిషియల్ ప్రివ్యూ అనుమతి తీసుకుని జీవో జారీ చేశారు. సవరించిన నిబంధనలివే.. ► టెండరు నిబంధనల్లో గతంలో బ్యాంకు గ్యారెంటీలు జాతీయ బ్యాంకుల నుంచే స్వీకరిస్తామన్నారు. ఈ దఫా రూరల్ బ్యాంకులు/కో–ఆపరేటివ్ బ్యాంకులు మినహా మిగిలిన షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల నుంచి స్వీకరిస్తారు. ► హార్డ్ కాపీని బిడ్ల దాఖలుకు ముందే ఇవ్వాలన్న నిబంధనను.. బ్యాంకు ఆథరైజేషన్‌తో రివర్స్ టెండర్లు నిర్వహించేలోగా ఇవ్వవచ్చని పేర్కొన్నారు. -
కాంట్రాక్టర్ ఎక్సెస్ వేస్తే ‘రీ టెండరే’
సాక్షి, అమరావతి: టెండర్లలో సంబంధిత పనికి ముందుగా అధికారులు నిర్ధారించిన దానికన్నా కాంట్రాక్టర్ అధిక ధరకు కోట్ చేస్తే.. మరోసారి అదే పనికి రీ టెండర్లు నిర్వహించాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు టెండర్ల ప్రక్రియలో పారదర్శకత పెంపొందించడంతోపాటు ప్రజాధనాన్ని ఆదా చేసేందుకు ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు, ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థల రుణాలతో చేపట్టే పనుల్లో చాలా వరకు కేంద్ర ప్రభుత్వం, ఆయా సంస్థల నియమ నిబంధనల మేరకే టెండర్లు నిర్వహించాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ఆయా పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించాలంటే నిబంధనలు ఆటంకంగా మారాయి. ► గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి సంబంధించి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) మూడో దశ అమల్లో రాష్ట్రానికి ఈ ఏడాది కొత్తగా 3,285 కి.మీ రోడ్డు పనులు మంజూరయ్యాయి. ► ఈ పనులకయ్యే ఖర్చును 60–40 శాతం చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. ► 935 కి.మీ పొడవునా రూ.535 కోట్లతో చేపట్టే 129 రోడ్ల పనులకు అన్ని అనుమతులు పూర్తయి టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. ► ఇందులో రూ.150 కోట్ల విలువ చేసే 39 పనులకు పంచాయతీరాజ్ విభాగం టెండర్ పూర్తి చేసింది. వీటిలో 30 పనులకు కాంట్రాక్టర్లు పని అంచనా విలువ మీద 5% దాకా అధిక రేటుకు కోట్ చేశారు. ► పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించాలంటే కేంద్ర నిబంధనలు అడ్డొస్తున్నాయని అధికారులు చెప్పారు. ► దీంతో ఆ 30 పనులకు మరోసారి టెండర్లు పిలవాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో అధిక ధర కోట్ చేసిన ఆ 30 పనులకు అధికారులు తిరిగి రెండో విడత టెండర్లు నిర్వహించే ప్రక్రియను చేపట్టారు. ► ప్రభుత్వ తాజా నిర్ణయంతో రూ.150 కోట్లు విలువ చేసే పనుల్లోనే రూ.7.5 కోట్ల మేర ప్రజాధనం ఆదా కాగా.. 3,285 కి.మీ పొడవునా చేపట్టే పనుల్లో దాదాపు రూ.85 కోట్లకు పైబడి ఆదా చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. -
ఏకలవ్య భవనాలకు రీ-టెండర్లు!
గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ ఎస్ఈ సుబ్బారావు పార్వతీపురం: రాష్ట్రంలో ఐటీడీఏకి చెందిన 8 ఏకలవ్య పాఠశాలల భవనాల నిర్మాణాలకు రీ-టెండర్లు పిలవనున్నామని గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ ఎస్ఈ ఎ.వి.సుబ్బారావు తెలిపారు. సోమవారం ఆయన ఐటీడీఏ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఒక్కో పాఠశాల నిర్మాణానికి సుమారు రూ.12 కోట్లు చొప్పున 8 పాఠశాలలకు రూ.84 కోట్లు కేటాయించారని చెప్పారు. ఈ పనులకు పిలిచిన టెండర్లను క్యాన్సిల్ చేయడంతో సంబంధిత కాంట్రాక్టర్ కోర్టును ఆశ్రయించారన్నారు. త్వరలో అది పరిష్కరించబడుతుందన్నారు. అనంతరం రీ-టెండర్లు పిలవాలని ప్రభుత్వం ఆదేశించింద ని తెలిపారు. అలాగే ఆశ్రమ పాఠశాలలకు కొత్తభవనాలు, మరమ్మత్తులు చేపడతామన్నారు. ఇటీవల బాసంగి పనుల రాద్ధాంతంపై విలేకరులు ప్రశ్నించగా.. నిర్వాసిత బాసంగిలో 36 పనులకు గాను ఇప్పటికీ ఓ మహిళా సంఘానికి 3 పనులు కేటాయించామన్నారు. మిగతా 33 పనులు వీటీడీఏలు, అక్కడ ఇంకా ఏమైనా మహిళా సంఘాలుంటే వాటికి ఆ పనులు అప్పగిస్తామన్నారు. అలాగే ఎస్డీఎఫ్లో భాగంగా రూ.18 కోట్లతో ఐటీడీఏ పరిధిలో రోడ్లు నిర్మాణానికి అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు పొందామని, వాటికితోడు ఉపాధిలో రూ.85కోట్లు మ్యాచింగ్ గ్రాంట్‌కు అనుమతులు కోరామన్నారు. -
కొలిక్కి వచ్చిన ‘మంజీర’!
గజ్వేల్, న్యూస్‌లైన్: గజ్వేల్ నియోజకవర్గంలో చేపట్టిన ‘మంజీర’ మంచినీటి పథకం టెండర్ల ప్రక్రియలో నెలకొన్న జాప్యానికి తెర పడనుంది. సాధారణ ఎన్నికల ‘కోడ్’ ముంచుకొస్తున్న వేళ.. అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ పథకానికి ఏడాదిన్నర క్రితం ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ (నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్) పథకం కింద రూ.40 కో ట్లు మంజూరుకాగా.. ఇందులో రెండు నెలల క్రితం రూ.10 కోట్లకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయ్యింది. మిగతా రూ.30 కోట్లకు సంబంధించిన టెండర్ల ప్రక్రియలో జాప్యం నెలకొనగా ఈ వ్యవహారం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. మరో 15 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తిచేసే దిశగా హైదరాబాద్‌లోని ఇంజినీరింగ్ చీఫ్(ఈఎన్సీ) వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. ‘మంజీర’ పథకం పను లు పూర్తి చేయడానికి మంజూరైన నిధులతో తూప్రాన్, వర్గల్, ములుగు, గజ్వేల్, జగదేవ్‌పూర్ మండలాల్లోని 129 గ్రామాల్లో పైప్‌లైన్ విస్తరణ పనులు చేపట్టాల్సి ఉంది. అంతేగాకుండా పలుచోట్ల ఓహెచ్‌బీఆర్ ట్యాంకుల నిర్మాణం జరగనుంది. కానీ కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం స్టేట్ టెక్నికల్ కమిటీ అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉండగా ఈ ప్రక్రియలో నెలలతరబడి జాప్యం నెలకొంది. ఫలితంగా ప్రభుత్వం మంజూరుచేసిన రూ.40 కోట్లల్లో కేవలం రూ.10 కోట్లకు సంబంధించి మాత్రమే ఈ ప్రక్రియ పనులు సాగుతున్నాయి. మిగిలిన రూ.30కోట్ల వినియోగానికి కూడా ప్రభుత్వం ఆమోదం పలికింది. ఇందుకు సంబంధించి ఇటీవల హైదరాబాద్‌లోని ఈఎన్సీ కార్యాలయ వర్గాలు టెండర్లను నిర్వహించినా సాంకేతిక లోపాల కారణంగా దీనిని నిలిపివేశారు. రీ-టెండర్ ప్రక్రియ వేగవతం ‘మంజీర’ పథకానికి సంబంధించి రీ-టెండర్ ప్రక్రియను వేగంగా పూర్తిచేయడానికి అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే నర్సారెడ్డి సైతం ఇందుకు సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంతో రీ-టెండర్ పక్రియను చేపడుతున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ గడువు కూడా పూర్తయ్యింది. మరో 15 రోజుల్లో టెండర్‌ను పూర్తిచేసి నిధులను వినియోగించే అవకాశం కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నారు. ఈ వ్యవహారంపై స్థానిక ఆర్డబ్ల్యూఎస్ ఇన్చార్జి డిప్యూటీఈఈ మోహన్‌రెడ్డి ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ కొద్దిరోజుల్లోనే టెండర్ ప్రక్రియ పూర్తయి నిధులు విడుదలయ్యే అవకాశాలున్నాయని చెప్పారు.