సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం, న్యూడెవలప్‌మెంట్ బ్యాంకు (ఎన్‌డీబీ) సంయుక్తంగా రూ. 6,400 కోట్లతో చేపట్టిన రహ దారుల అభివృద్ధి పనుల్లో తొలి దశకు సంబంధించిన రూ.1,860 కోట్ల విలువైన టెండర్ల ప్రక్రియ ఈ నెల 27తో పూర్తి కానుంది. మొత్తం మూడు ప్యాకేజీల కింద 13 జిల్లాల్లో గ్రామీణ రోడ్ల అభివృద్ధికి టెండర్లు పిలిచారు. తొలిదశలో రూ.1,860.21 కోట్లతో 13 ప్యాకేజీలకు ఈ–టెండర్లు పిలవగా 14 సంస్థల నుంచి 25 బిడ్‌లే వచ్చాయి. సీఎం వైఎస్ జగన్ ఆర్ అండ్ బీ అధికారులతో సమీక్షించి.. కాంట్రాక్టర్లలో పోటీతత్వం పెంచేందుకు టెండర్లను రద్దు చేసి మళ్లీ పిలవాలని ఆదేశించారు. దీంతో గత నెలలో రీ టెండర్లు పిలవగా.. కాంట్రాక్టర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా టెండర్ల నిబంధనలు సవరించింది. గతంలో బ్యాంకు గ్యారెంటీలు (బీజీలు) జాతీయ బ్యాంకుల నుంచి మాత్రమే స్వీకరిస్తామని నిబంధనల్లో పేర్కొన్నారు. ఈసారి రూరల్ బ్యాంకులు/కోపరేటివ్ బ్యాంకులు మినహా మిగిలిన షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల నుంచి బీజీలు స్వీకరించారు. హార్డ్ కాపీని బిడ్ల దాఖలుకు ముందే ఇవ్వాలన్న నిబంధనను.. బ్యాంకు ఆథరైజేషన్‌తో రివర్స్ టెండర్లు నిర్వహించేలోగా ఇవ్వొచ్చని సవరించారు. రీ టెండర్లకు సంబంధించి కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రీ బిడ్ సమావేశాలను నిర్వహిస్తున్నారు.
టెండర్ల నిర్వహణ ఇలా..
ఈ నెల 13తో పశ్చిమగోదావరి, కృష్ణా, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు టెండర్ల గడువు ముగుస్తుంది. దాఖలైన టెండర్లను టెక్నికల్ ఎవాల్యుయేషన్ చేస్తారు. అర్హత సాధించిన కాంట్రాక్టు సంస్థలకు రివర్స్ టెండర్లు నిర్వహిస్తారు. అనంతరం ఫైనాన్స్ కమిటీకి పంపించి టెండర్లు ఖరారు చేస్తారు. ఈ నెల 18న కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాలకు టెండర్ల గడువు ముగుస్తుంది. ఆ తర్వాత రివర్స్ టెండర్లు నిర్వహిస్తారు. ఈ నెల 27న విజయనగరం, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలకు టెండర్ల గడువు ముగుస్తుంది. ఈ నెలాఖరుకు టెండర్లను ఖరారు చేస్తారు. ఆ తర్వాత కాంట్రాక్టు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటారు. రెండేళ్లలో పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
స్పందన బాగుంది..
గతంలో కంటే రీ టెండర్లకు మంచి స్పందన వచ్చింది. ప్రీ బిడ్ సమావేశాలు జరుగుతున్నాయి. గతంలో 25 బిడ్లు దాఖలయ్యాయి. ఈసారి ఎక్కువ సంఖ్యలో దాఖలయ్యే అవకాశాలున్నాయి. పోటీతత్వం పెంచేందుకు ఎక్కువ మంది కాంట్రాక్టర్లు ఈ టెండర్లలో పాల్గొనేలా చర్యలు తీసుకున్నాం. దీనివల్ల మరిన్ని రోడ్లు అభివృద్ధి చేయొచ్చు.
– వేణుగోపాల్‌రెడ్డి, ఆర్ అండ్ బీ ఇంజనీర్ ఇన్ చీఫ్
Comments
Please login to add a commentAdd a comment