New Development Bank
-
27తో ఎన్డీబీ టెండర్ల ప్రక్రియ పూర్తి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం, న్యూడెవలప్‌మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) సంయుక్తంగా రూ. 6,400 కోట్లతో చేపట్టిన రహ దారుల అభివృద్ధి పనుల్లో తొలి దశకు సంబంధించిన రూ.1,860 కోట్ల విలువైన టెండర్ల ప్రక్రియ ఈ నెల 27తో పూర్తి కానుంది. మొత్తం మూడు ప్యాకేజీల కింద 13 జిల్లాల్లో గ్రామీణ రోడ్ల అభివృద్ధికి టెండర్లు పిలిచారు. తొలిదశలో రూ.1,860.21 కోట్లతో 13 ప్యాకేజీలకు ఈ–టెండర్లు పిలవగా 14 సంస్థల నుంచి 25 బిడ్లే వచ్చాయి. సీఎం వైఎస్ జగన్ ఆర్ అండ్ బీ అధికారులతో సమీక్షించి.. కాంట్రాక్టర్లలో పోటీతత్వం పెంచేందుకు టెండర్లను రద్దు చేసి మళ్లీ పిలవాలని ఆదేశించారు. దీంతో గత నెలలో రీ టెండర్లు పిలవగా.. కాంట్రాక్టర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా టెండర్ల నిబంధనలు సవరించింది. గతంలో బ్యాంకు గ్యారెంటీలు (బీజీలు) జాతీయ బ్యాంకుల నుంచి మాత్రమే స్వీకరిస్తామని నిబంధనల్లో పేర్కొన్నారు. ఈసారి రూరల్ బ్యాంకులు/కోపరేటివ్ బ్యాంకులు మినహా మిగిలిన షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల నుంచి బీజీలు స్వీకరించారు. హార్డ్ కాపీని బిడ్ల దాఖలుకు ముందే ఇవ్వాలన్న నిబంధనను.. బ్యాంకు ఆథరైజేషన్‌తో రివర్స్ టెండర్లు నిర్వహించేలోగా ఇవ్వొచ్చని సవరించారు. రీ టెండర్లకు సంబంధించి కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో ఆర్అండ్బీ అధికారులు ప్రీ బిడ్ సమావేశాలను నిర్వహిస్తున్నారు. టెండర్ల నిర్వహణ ఇలా.. ఈ నెల 13తో పశ్చిమగోదావరి, కృష్ణా, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు టెండర్ల గడువు ముగుస్తుంది. దాఖలైన టెండర్లను టెక్నికల్ ఎవాల్యుయేషన్ చేస్తారు. అర్హత సాధించిన కాంట్రాక్టు సంస్థలకు రివర్స్ టెండర్లు నిర్వహిస్తారు. అనంతరం ఫైనాన్స్ కమిటీకి పంపించి టెండర్లు ఖరారు చేస్తారు. ఈ నెల 18న కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాలకు టెండర్ల గడువు ముగుస్తుంది. ఆ తర్వాత రివర్స్ టెండర్లు నిర్వహిస్తారు. ఈ నెల 27న విజయనగరం, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలకు టెండర్ల గడువు ముగుస్తుంది. ఈ నెలాఖరుకు టెండర్లను ఖరారు చేస్తారు. ఆ తర్వాత కాంట్రాక్టు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటారు. రెండేళ్లలో పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. స్పందన బాగుంది.. గతంలో కంటే రీ టెండర్లకు మంచి స్పందన వచ్చింది. ప్రీ బిడ్ సమావేశాలు జరుగుతున్నాయి. గతంలో 25 బిడ్లు దాఖలయ్యాయి. ఈసారి ఎక్కువ సంఖ్యలో దాఖలయ్యే అవకాశాలున్నాయి. పోటీతత్వం పెంచేందుకు ఎక్కువ మంది కాంట్రాక్టర్లు ఈ టెండర్లలో పాల్గొనేలా చర్యలు తీసుకున్నాం. దీనివల్ల మరిన్ని రోడ్లు అభివృద్ధి చేయొచ్చు. – వేణుగోపాల్‌రెడ్డి, ఆర్ అండ్ బీ ఇంజనీర్ ఇన్ చీఫ్ -
19న ఎన్డీబీ రెండో విడత రీ టెండర్లు
సాక్షి, అమరావతి: న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) సాయంతో రాష్ట్రంలో రహదార్లు, వంతెనల పునర్నిర్మాణ పనులకు సంబంధించి రెండో విడత రీ టెండర్ల ప్రకటనను ఈ నెల 19న జారీచేయనున్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలో రూ.792.76 కోట్ల పనులకు రీ టెండర్ ప్రకటన ఇవ్వనున్నారు. తొలివిడత రీ టెండర్లకు విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో రూ.682.16 కోట్ల పనులకు ఈ నెల 14న నోటిఫికేషన్ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ టెండర్లలో రెండు నిబంధనలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల కిందట ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం రూ.6,400 కోట్లతో చేపట్టనున్న ఈ పనులకు సంబంధించి మొదటి విడతగా రూ.1,860 కోట్లతో 13 ప్యాకేజీలకు గతంలో ఈ–టెండర్లు పిలవగా 14 సంస్థల నుంచి 25 బిడ్లు మాత్రమే వచ్చాయి. సీఎం వైఎస్ జగన్ ఆర్అండ్బీ ముఖ్య అధికారులతో సమీక్షించి కాంట్రాక్టర్లలో పోటీతత్వం పెంచేందుకు టెండర్లను రద్దుచేసి మళ్లీ పిలవాలని ఆదేశించడంతో ఎన్డీబీ టెండర్లను రద్దుచేసిన విషయం తెలిసిందే. -
రోడ్లు, వంతెన పనులకు రీ టెండర్లు
సాక్షి, అమరావతి: న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) సహకారంతో రాష్ట్రంలో చేపట్టే రోడ్లు, వంతెనల పునర్నిర్మాణ పనులకు రీ టెండర్లు పిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని టెండర్ నిబంధనల్లో గడువు విధించింది. బిడ్డర్ల మధ్య పోటీతత్వాన్ని పెంచి.. తద్వారా ఆదా అయ్యే నిధులతో మరికొన్ని రోడ్ల విస్తరణ పనులు చేపట్టేలా గతంలో దాఖలైన టెండర్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అన్నీ ఒకేసారి కాకుండా విడతల వారీగా టెండర్లు పిలవనుంది. రూ.682.16 కోట్లతో తొలి విడత పనులు ► మొదటి దఫాగా నాలుగు జిల్లాల్లో రూ.682.16 కోట్లతో చేపట్టే పనులకు రీ టెండర్లు పిలుస్తున్నారు. ఇందులో కృష్ణా, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో రోడ్ల విస్తరణ పనులున్నాయి. కాంట్రాక్టర్ల మధ్య పోటీ పెంచేలా టెండర్ బిడ్ల దాఖలుకు నెల రోజుల గడువు ఇవ్వనున్నారు. జిల్లా యూనిట్‌గా పనులను ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలుస్తారు. ► ఈ నెల 9 నుంచి నవంబర్ 9 వరకు టెండర్ల దాఖలుకు గడువు ఉంటుంది. టెండర్ డాక్యుమెంట్లు ఈ నెల 9 నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. ► నవంబరు 10న బిడ్లు తెరుస్తారు. ఆ తర్వాత రివర్స్ టెండర్లు నిర్వహిస్తారు. ఈ నెల 26న కాంట్రాక్ట్ కంపెనీలతో ప్రీ బిడ్ సమావేశం జరుగుతుంది. ► తొలి దఫాగా పిలిచే టెండర్లలో కృష్ణా జిల్లాలో రూ.233.96 కోట్లు, విశాఖలో రూ.138.96 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.142.54 కోట్లు, తూర్పు గోదావరిలో జిల్లాలో రూ.166.70 కోట్ల విలువైన పనులున్నాయి. ► టెండర్లలో రెండు నిబంధనలను సవరించారు. బ్యాంక్ గ్యారెంటీలను ఏదైనా రూరల్/కోపరేటివ్ బ్యాంకులు కాకుండా షెడ్యూల్డ్ బ్యాంకుల నుంచి ఇవ్వవచ్చు. ► హార్డ్ కాపీ నిబంధనను సవరించారు. రివర్స్ టెండర్లు జరిగేలోగా హార్డ్ కాపీలు అందించాలి. ఇది ఆప్షన్ మాత్రమే. బిడ్లను మాన్యువల్‌గా స్వీకరించరు. -
నెలాఖర్లో ఎన్డీబీ రీ టెండర్లు
సాక్షి, అమరావతి: న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) సహకారంతో రాష్ట్రంలో చేపడుతున్న రహదారుల నిర్మాణానికి సంబంధించిన రీటెండర్ల ప్రక్రియను ఆర్ అండ్ బీ శాఖ ఈ నెలాఖరున నిర్వహించనుంది. రద్దయిన టెండర్లకు సంబంధించిన నోటిఫికేషన్‌ను మళ్లీ జారీచేయనున్నారు. ఈలోపు రీటెండర్లలో ఎక్కువ కాంట్రాక్టు సంస్థలు పాల్గొనేలా అధికారులు అర్హత ఉన్న కాంట్రాక్టర్లతో సంప్రదింపులు జరుపుతారు. జాతీయ రహదారుల నిర్మాణంలో అనుభవం ఉన్న కాంట్రాక్టర్లతో వెబినార్, ఈ–మెయిళ్ల ద్వారా చర్చించాలని నిర్ణయించారు. ఎన్డీబీ సహకారంతో మొత్తం రూ.6,400 కోట్ల వ్యయంతో రహదారుల నిర్మాణానికి సంబంధించి.. తొలిదశలో రూ.1,860 కోట్లతో 13 ప్యాకేజీలకు ఈ–టెండర్లు పిలవగా 14 సంస్థల నుంచి 25 బిడ్లు మాత్రమే వచ్చాయి. ఒక వర్గం మీడియా ఉద్దేశపూర్వకంగా రాస్తున్న అసత్య కథనాలకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్ శనివారం ఆర్ అండ్ బీ ముఖ్య అధికారులతో టెండర్ల విషయమై సమీక్షించారు. టెండర్లలో పోటీతత్వం పెంచాలని.. పారదర్శకత ప్రతిబింబించాలని, ప్రజల్లో ఎక్కడా అనుమానాలకు ఆస్కారం ఇవ్వకూడదని ఆయన ఆదేశించడంతో టెండర్లు రద్దయిన సంగతి తెలిసిందే. కాగా, టెండర్లలో ఎక్కువ సంస్థలు పాల్గొని ఎక్కవ సంఖ్యలో బిడ్లు వేస్తే ఆ మొత్తంతోనే ఇంకొన్ని ఎక్కువ రహదారులు నిర్మించవచ్చు. రీటెండర్ల విధివిధానాలివే.. ► బ్యాంక్ గ్యారెంటీ కోసం కాంట్రాక్టు సంస్థలు హార్డ్ కాపీ ఇవ్వాలి. ► జ్యుడీషియల్ ప్రివ్యూ సూచనల మేరకు జాతీయ బ్యాంకుల నుంచి మాత్రమే బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వాలి. ► చిన్న కంపెనీలు కూడా టెండర్లలో పాల్గొనేందుకు వీలుగా జాయింట్ వెంచర్ కంపెనీలకు అవకాశం ఉంది. ► విదేశీ రుణంతో చేపట్టే ఏ ప్రాజెక్టు అయినా.. ప్రపంచ బ్యాంకు బిడ్డింగ్ విధానం అనుసరించాల్సిందే. ► ఏపీలో రాజమండ్రి–విజయనగరం హైవే ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు అండ్ హైవేస్ ప్రపంచ బ్యాంకు బిడ్డింగ్ విధానమే అనుసరిస్తోంది. నిజానికి టెండర్ల రద్దు అక్కర్లేదు ► ఇప్పటికే దాఖలైన బిడ్లతో ముందుకు వెళ్లొచ్చు. రద్దు చేయవలసిన అవసరంలేదు. ఎన్డీబీ కూడా ప్రస్తుత బిడ్లపై సంతృప్తి వ్యక్తంచేసింది. గతంలో కూడా ఎక్కువ విలువ ఉన్న పనుల్లో కొన్ని సంస్థలే పాల్గొన్నాయి. విజయవాడ బైపాస్ రోడ్డు పనుల్లో కూడా ఒకటి, రెండు సంస్థలే పాల్గొన్నాయి. కానీ, పారదర్శకత కోసమే ప్రభుత్వం రీటెండర్లకు ఆదేశించింది. -
అందుకే ఫ్లైఓవర్ ఓపెనింగ్ ఆగింది
సాక్షి, విజయవాడ: న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) అందించే రుణ సాయంతో రాష్ట్రంలో త్వరలోనే రహదారుల నిర్మాణ పనులు మొదలు పెడతామని రహదారులు, భవనాల ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు అన్నారు. టెండర్లను పారదర్శకంగా నిర్వహించేందుకు జ్యుడీషియల్ ప్రివ్యూకి పంపి త్వరలోనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పనులు మొదలు పెట్టకపోతే నిధులు సరెండర్ చేయాలని కేంద్రం నిబంధన పెట్టిందన్న కృష్ణబాబు... ఎన్ఐసి ప్లాట్‌ఫామ్ ద్వారా, గ్లోబల్ బిడ్డింగ్ ద్వారా టెండర్లు నిర్వహిస్తామని వెల్లడించారు. అయితే కొంతమంది కావాలనే దీని గురించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇ-టెండర్ తో పాటు 25 బిడ్స్ వచ్చాయని, ఇందుకు సంబంధించిన హార్డ్ కాపీలు కూడా అందాయని తెలిపారు. (చదవండి: రూ.2,978 కోట్లతో రోడ్లు) అదే విధంగా బిడ్డింగ్ దశలో కూడా ఎన్డీబీ అభిప్రాయం తీసుకున్నామన్న కృష్ణబాబు, ప్రపంచ బ్యాంకు సూచించిన నిబంధనల మేరకే అర్హత ప్రమాణాలను నిర్దేశించినట్లు తెలిపారు. కేవలం జాతీయ బ్యాంకుల ద్వారా సదరు సంస్థలు లావాదేవీలు చేయాలన్న నిబంధన మాత్రమే జ్యుడీషియల్ ప్రివ్యూ లో సూచించారని, టెండర్ల విషయంలో ఎలాంటి సందేహాస్పద లావాదేవీలు జరగలేదని స్పష్టం చేశారు. బిడ్ల నుంచి రివర్స్ టెండర్ల వరకు సంబంధించిన ప్రక్రియ అంతా కూడా ఏపీ ప్రభుత్వంతో పాటు ఎన్డీబీ పర్యవేక్షణలో సాగిందన్నారు. అయితే బిడ్లు ఇంత తక్కువగా ఎందుకు దాఖలు అయ్యాయన్న విషయాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. అప్పుడే మళ్లీ రాయితీ వర్తింపజేస్తాం విజయవాడ, వైజాగులో సిటీ బస్సులు రన్ చేస్తామని కృష్ణబాబు తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సీటీ బస్సులను తిప్పుతున్నామన్నారు. 50 శాతం ఆక్యుపెన్సీతోనే బస్సులను నడుపుతామని, అయితే భారీగా నష్టం చేకూర్చే అంశంగా ఉంటుందన్నారు. అలాగే బస్సుల్లో స్టాడింగుకు అనుమతించడం లేదని, అందుకే వృద్ధులు బస్సు ప్రయాణాలు చేయొద్దని సూచిస్తున్నామన్నారు. కానీ కొందరు అత్యవసర పరిస్థితులంటూ కొందరు వృద్ధులు వస్తున్నారని, వారి బస్ ప్రయాణాలను నిరుత్సాహాపరిచేందుకే బస్సుల్లో సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపారు. అయితే సాధారణ పరిస్థితులు రాగానే సీనియర్ సిటీజన్లకు రాయితీని వర్తింపజేస్తామని కృష్ణబాబు పేర్కొన్నారు.(చదవండి: ఆర్టీసీ ఉన్నతాధికారుల సమావేశం) అందుకే ఫ్లైఓవర్ ఓపెనింగ్ ఆగింది కేంద్ర మంత్రి గడ్కరీకి కరోనా కారణంగా ఫ్లైఓవర్ ఓపెనింగ్ ఆగిందని కృష్ణబాబు వెల్లడించారు. గడ్కరీ ప్రారంభించాకే ఫ్లైఓవర్ పై రాకపోకలకు అనుమతిస్తామని తెలిపారు. ఇక అంతర్రాష్ట్ర సర్వీసుల గురించి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం బస్ సర్వీసులను పెంచడానికి ఇష్టపడడం లేదని, ఏపీని తగ్గించుకోమని సూచిస్తోందన్నారు. తెలంగాణ సూచనల మేరకు సర్వీసులను తగ్గించుకోవవడానికి సిద్దంగా ఉన్నా, ఏపీ తగ్గించుకునే 1.10 లక్షల కిలోమీటర్ల మేర రవాణను ప్రైవేట్ ఆపరేటర్లకు అవకాశం లభిస్తుందన్నారు. ‘‘ఏపీ తిప్పే సర్వీసుల కంటే డబుల్ సర్వీసులు తిప్పుతామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. అయితే బెజవాడ-హైదరాబాద్ రూట్లో మాత్రమే డబుల్ సర్వీసులు తిప్పుతానంటోన్న తెలంగాణ.. మిగిలిన రూట్ల గురించి ప్రస్తావించడం లేదు’’ అని కృష్ణబాబు తెలిపారు. -
రూ.2,978 కోట్లతో రోడ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదార్లకు మహర్దశ పట్టనుంది. తొలిదశ విస్తరణ పనులకు ప్రభుత్వం రూ.2,978.51 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో 1,243.51 కిలోమీటర్ల మేర రాష్ట్ర, జిల్లా రహదార్లను అభివృద్ధి చేయనున్నారు. ఈ పనులకు సంబంధించి 70 శాతం నిధులు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) రుణ సహాయం అందిస్తుండగా 30 శాతం రాష్ట్ర ప్రభుత్వంభరించనుంది. ► అన్ని జిల్లాల్లో కలిపి 33 ప్యాకేజీల కింద రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులు. 17 ప్యాకేజీల కింద 696.75 కి.మీ. విస్తరణకు రూ.1,746.84 కోట్లు, భూ సేకరణకు రూ.19.27 కోట్లు. మొత్తం రూ.1,766.11 కోట్లు ► 16 ప్యాకేజీల కింద 546.76 కి.మీ. విస్తరణకు రూ.1,200.79 కోట్లు, భూ సేకరణకు 11.61 కోట్లు కలిపి మొత్తం రూ.1,212.40 కోట్లు ► ఎన్డీబీ అందిస్తున్న రుణ సాయం రూ.6,400 కోట్ల నుంచి రూ.8,800 కోట్లకు పెంచేందుకు ఆర్అండ్బీ కసరత్తు ► ఎన్డీబీ రుణ సాయంతో సుమారు 3,100 కిలోమీటర్ల మేర రహదార్లు అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక టెండర్ల పారదర్శక నిర్వహణకు జ్యుడీషియల్ ప్రివ్యూ రాష్ట్రంలో రూ.100 కోట్లు పైబడిన ఏ ప్రాజెక్టు అయినా పూర్తి పారదర్శకతతో నిర్వహించేందుకు టెండర్ డాక్యుమెంట్లను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపుతున్నారు. రహదారుల అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్ డాక్యుమెంట్లను గత నెల 28న జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపించారు. పారదర్శకత కోసం ప్రజలు, కాంట్రాక్టర్ల నుంచి అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరించేందుకు ఈ నెల 3వ తేదీతో గడువు ముగిసింది. టెండర్ల స్వీకరణకు ఈ నెల 30వ తేదీ తుది గడువుగా ఆర్అండ్బీ పేర్కొంది. జ్యుడిషియల్ ప్రివ్యూ అనుమతులతో టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లను ఖరారు చేస్తారు. -
రోడ్లు రయ్..రయ్
-
రహదారులకు మహర్దశ
ప్రభుత్వంలో జరిగే ప్రతి పనికీ రివర్స్ టెండర్లు పిలుస్తున్నాం. రివర్స్ టెండర్లు పిలిచిన ప్రతిసారి తక్కువకు టెండర్లు ఖరారవుతున్నాయి. రోడ్ల నిర్మాణంలో కూడా అదే పద్ధతి పాటించండి. అంచనాల్లో వాస్తవికతతో వ్యవహరించాలి. సింగిల్ లేన్ రోడ్లు అనే విధానాన్ని విడిచిపెడితే మంచిది. ఏ రోడ్డయినా రెండు లేన్లుగా విస్తరిస్తేనే బాగుంటుంది. – అధికారులతో సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) అందించే రుణ సాయంతో రాష్ట్రంలో రహదారుల రూపు రేఖలు మార్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఎన్డీబీ అందిస్తున్న రుణ సాయం రూ.6,400 కోట్ల నుంచి రూ.8,800 కోట్లకు పెంచేలా కోరాలని నిర్ణయించామన్నారు. సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో రహదారులు, భవనాల శాఖపై సమీక్ష నిర్వహించారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ఇస్తున్న రూ.6,400 కోట్లతో సుమారు 3,100 కిలోమీటర్లకు పైగా ఉన్న రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు అవసరమైన చోట కొత్త బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టులో జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకున్న రోడ్లకు ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాలని, ఒకవేళ ఇప్పుడున్న రోడ్లు బాగుంటే.. మండల కేంద్రం నుంచి మరో మండల కేంద్రానికి వెళ్లే రోడ్లపై దృష్టి పెట్టాలన్నారు. అవసానదశలో ఉన్న 676 బ్రిడ్జిలను ఎన్డీబీ ప్రాజెక్టులో పెట్టాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లను వెంటనే గుర్తించి, రూ.625 కోట్లతో సత్వర మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. త్వరితగతిన భూసేకరణ అనంతపురం – అమరావతి ఎక్స్‌ప్రెస్ వేను చిలకలూరిపేట బైపాస్కు అనుసంధానం చేసే ప్రతిపాదనకు సీఎం వైఎస్ జగన్ అంగీకారం తెలిపారు. ఈ ఎక్స్‌ప్రెస్ వే భూసేకరణపై ప్రధానంగా దృష్టి పెట్టి పనులు ప్రారంభం అయ్యేలా చూడాలని ఆదేశించారు. ప్రాథమికంగా నాలుగు లేన్ల రోడ్డు, భవిష్యత్తు కోసం 8 లేన్ల రహదారికి భూ సేకరణ చేస్తున్నామని ఆర్అండ్బీ అధికారులు సీఎంకు వివరించారు. ఎక్స్‌ప్రెస్ వే లో భాగంగా నిర్మించే టన్నెల్స్ నాలుగు లేన్లా.. లేక ఆరు లేన్లా అన్నది చర్చ జరుగుతుందన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆరు లేన్లకు సరిపడా టన్నెల్స్ ఉండాలని సీఎం సూచించారు. రోడ్ల నిర్మాణంలో ఎం–శాండ్ వినియోగంపై దృష్టి పెట్టాలన్నారు. ఏపీఆర్డీసీ బలోపేతం ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డీసీ) బలోపేతానికి అధికారులు చేసిన ప్రతిపాదనలకు సీఎం సానుకూలంగా స్పందించి చట్టంలో సపరణలకు అంగీకరించారు. కార్పొరేషన్ స్వావలంబనతో నడవడానికి, రోడ్ల నిర్మాణం, నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు ఉండేలా కార్పొరేషన్ ఉండాలని సీఎం సూచించారు. ఆర్టీసీకి సంబంధించిన 12 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగిన 3,600కు పైగా బస్సులను వెంటనే రీప్లేస్ చేయాలని సూచించారు. అప్పుడే ప్రయాణికుల భద్రతకు సరైన ప్రమాణాలు పాటించినట్లవుతుందన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు ప్రణాళికలు వేసుకుని వాటిని అమలు చేయడానికి కార్పొరేషన్ దృష్టి పెట్టాలన్నారు. రోడ్ల నిర్మాణం, నిర్వహణ కోసం ప్రత్యేక నిధి ఏపీఆర్డీసీ ద్వారా ఏర్పాటు కావాలన్న అధికారుల ప్రతిపాదనకు సీఎం అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలలో అమలవుతున్న విధానాలను అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమావేశంలో ఆర్అండ్బీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, ఎన్హెచ్ఏఐ ఆర్వో అనిల్ దీక్షిత్, ఆర్అండ్బీ చీఫ్ ఇంజనీర్లు మనోహర్ రెడ్డి, రాజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేగంగా జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ గుండుగొలను – కలపర్రు– గొల్లపూడి – మంగళగిరి బైపాస్ హైవేపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. దీన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఎక్కడ సమస్యలు వచ్చినా వెంటనే జోక్యం చేసుకుని వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. విజయవాడ నగరాన్ని ట్రాఫిక్ సమస్య నుంచి తప్పించేందుకు ఇదొక పరిష్కారం అవుతుందని సీఎం అన్నారు. అనకాపల్లి – ఆనందపురం రోడ్డు కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తవుతోందని ఎన్హెచ్ఏఐ అధికారులు సీఎంకు వివరించారు. ఒంగోలు– కత్తిపూడి జాతీయ రహదారికి సంబంధించి అక్కడక్కడ చిన్న స్థాయిలో పనులు మిగిలిపోయాయని, వాటిని త్వరలో పూర్తి చేస్తామని వారు చెప్పారు. రేణిగుంట నుంచి కడప, రేణిగుంట నుంచి నాయుడుపేట, నెల్లూరు నుంచి తడ వరకు ఆరు లేన్ల రహదారి.. తదితర ప్రాజెక్టుల గురించి వారు సీఎంకు వివరించారు. వైఎస్సార్ జిల్లా ముద్దనూరు నుంచి బెంగళూరు హైవేలోని కొడికొండ చెక్‌పోస్టు వరకు 150 కిలోమీటర్ల రహదారిని రూ.350 కోట్ల ఎన్డీబీ నిధులతో పది మీటర్ల మేర విస్తరించాలని సీఎం ఆదేశించారు. వశిష్ట గోదావరి పాయమీద సెకినేటిపల్లి వద్ద చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న బ్రిడ్జిని రూ.100 కోట్లతో పూర్తి చేయాలన్నారు. అనంతపురం జిల్లా కదిరి బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని ఈ ఏడాది ప్రణాళికలోనే పెట్టాలని అధికారులకు సూచించారు. రోడ్ల నిర్మాణంలో ప్లాస్టిక్ వినియోగం పర్యావరణ పరిరక్షణలో భాగంగా రోడ్ల నిర్మాణంలో ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నామని ఎన్హెచ్ఏఐ అధికారులు సీఎంకు వివరించారు. నగరాలు, పట్టణాల్లో సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఎన్హెచ్ఏఐకు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. దీనికోసం ఒక విధానాన్ని రూపొందించాలన్నారు. రేషన్ పంపిణీలో భాగంగా బియ్యాన్ని ప్యాక్ చేసేందుకు ఇస్తున్న సంచులను తిరిగి సేకరించి వాటిని పునర్ వినియోగించడం లేదా రోడ్ల నిర్మాణంలో ఉపయోగించేందుకు ఇవ్వాలని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాల సరఫరాపై ఎంఓయూకు సిద్ధంగా ఉన్నామని ఎన్హెచ్ఏఐ అధికారులు చెప్పారు. -
అంతర్జాతీయ బ్యాంకు ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ
-
అంతర్జాతీయ బ్యాంకు ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ
సాక్షి, అమరావతి: ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకు ‘న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు’ ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో గురువారం భేటీ అయ్యారు. బ్యాంకు వైస్ ప్రెసిడెంట్ ఎన్ జాంగ్, ప్రాజెక్టు హెడ్ రాజ్‌పుర్కర్ తాడేపల్లి నివాసంలో ఈ ఉదయం ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. రాష్ట్రానికి 6వేల కోట్ల రూపాయల రుణం మంజూరు ప్రతిపాదన త్వరలో బ్యాంకు బోర్డు ఆమోదానికి వెళ్తున్న అంశం వీరిమధ్య చర్చకు వచ్చింది. రోడ్లను మెరుగుపరచడంతోపాటు, వివిధ ప్రాజెక్టుల కోసం ఈ మొత్తాన్ని వెచ్చిస్తారు. రుణంలో 30 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుండగా, 70 శాతాన్ని బ్యాంకు మంజూరు చేస్తుంది. 32 సంవత్సరాల్లో ఈ రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్కూళ్లు, ఆస్పత్రులు, పరిశుభ్రమైన తాగునీరు సదుపాయం సహా రోడ్ల నిర్మాణం ప్రాజెక్టులకు మరింత సహాయం అందించాలని ముఖ్యమంత్రి బ్యాంకు ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి రూ.25 వేల కోట్ల రూపాయలను మంజూరు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా ఈ బ్యాంకును 2015లో ఏర్పాటు చేశాయి. షాంఘై వేదికగా పనిచేస్తున్న ఈబ్యాంకు ఇప్పటివరకూ వివిధ ప్రాజెక్టులకు రూ.75వేల కోట్ల రూపాయలను రుణాలుగా మంజూరు చేసింది. ఒక్క భారత్‌లోనే రూ.25వేల కోట్లు మంజూరు చేసింది. (చదవండి: ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు) -
పదేళ్ల ప్రస్థానం...!
భారత్, చైనా, రష్యాలతో సహా వివిధ దేశాలపై అమెరికా ఆంక్షల రూపంలో వాణిజ్య యుద్ధానికి కాలు దువ్వుతున్న ప్రస్తుత సందర్భంలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్) దేశాల శిఖరాగ్ర సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి మూడురోజుల పాటు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో బ్రిక్స్ పదవ వార్షిక సమావేశం జరగనుంది. బ్రిక్స్ దేశాల అధినేతలు, ఉన్నత స్థాయి బృందాల మేధోమథనంలో ప్రధానంగా సభ్య దేశాల మధ్య రాజకీయ, సామాజికఆర్థిక సమన్వయం, వ్యాపార,వాణిజ్య అవకాశాలు, ఏయే రంగాల్లో సహకారం అవసరమన్న అంశాలు చర్చకు రానున్నాయి. ఇప్పటికే ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ, రాజకీయాలపై చారిత్రక, వ్యూహాత్మక దృష్టికోణంతో బ్రిక్స్ తనదైన ముద్ర వేసింది. అమెరికా ప్రయోజనాల పరిరక్షణ పేరిట ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దుందుడుకు చర్యల ప్రభావం తమపై ఏ మేరకు పడుతుంది ? వాటి వల్ల జరిగే హాని, బయటపడే మార్గం ఏమిటన్న దానిపై ఈ దేశాలు కూలంకశంగా చర్చించవచ్చునని తెలుస్తోంది. భారత్‌లో సీమాంతర ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ ప్రోత్సహించడాన్ని గురించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పదేళ్ల ప్రస్థానం... ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఏర్పడిన సందర్భంగా 2009 జూన్‌లో రష్యాలోని యెకటెరిన్‌బర్గ్‌లో బ్రిక్స్ మొదటి శిఖరాగ్ర సమావేశం ( 2010లో దక్షిణాఫ్రికా చేరింది) జరిగింది. ఒక్కో సంవత్సరం ఒక్కో సభ్యదేశంలో ఈ భేటీని ఏర్పాటు చేస్తున్నారు. మనదేశంలో 2012 మార్చిలో ఢిల్లీలో, 2016 అక్టోబర్‌లో గోవాలో ఈ భేటీ జరిగింది. 2010లో బ్రెజిల్లో, 2011లో చైనాలో, 2013లో దక్షిణాఫ్రికాలో, 2014లో బ్రెజిల్లో, 2015లో రష్యాలో, 2017లో చైనాలో ఈ సమావేశాలు జరిగాయి. 2014లో సభ్యదేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని వ్యవస్థీకరించే ఉద్ధేశ్యంతో న్యూడెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ)తో పాటు కాంటింజెంట్ రిజర్వ్ అరెంజ్మెంట్ (సీఆర్ఏ) సౌకర్యాన్ని ఏర్పాటుచేసుకోవడం గొప్ప విజయంగా చెబుతున్నారు. గతేడాది చైనాలో జరిగిన భేటీలో విలువలు, ఆకాంక్షలకు అనుగుణంగా సభ్యదేశాలు పునరంకితం కావాలని తీర్మానించాయి.ఎన్డీబీ ద్వారా ఆశించిన పురోగతి సాధ్యమైందని, ఈ బ్యాంక్ ద్వారా చేపట్టిన 11 ప్రాజెక్టులలో స్థిరమైన మౌలికవనరుల అభివృద్ధి సాధ్యమని భావిస్తున్నారు. 2017-18కు సంబంధించి ఈ బ్యాంకు ఆధ్వర్యంలో పరస్పర సహకారంలో భాగంగా చేపట్టిన మొత్తం 23 ప్రాజెక్టులు (600 కోట్ల అమెరికన్ డాలర్లు) వివిధ దశల్లో ఉన్నాయి. -సభ్యదేశాల మధ్య మెరుగైన ఆర్థిక సంబంధాలు సాధించే దిశలో పురోగమనం సాధించడంలో బ్రిక్స్ సఫలమైందనే అభిప్రాయంతో నిపుణులున్నారు. ఈ ఐదు దేశాల్లోని లక్షలాది మంది ప్రజలకు స్థిరమైన ప్రయోజనాలు కలిగించిందని దర్భన్లోని చైనా కౌన్సల్జనరల్ వాంగ్ జియాంగ్జౌ తెలిపారు.పదేళ్లలో బ్రిక్స్ జీడీపీ 179 శాతం వృద్ధి చెందిందని ,, వాణిజ్యం 94 శాతం పెరిగిందని ఆయన చెబుతున్నారు. బ్రిక్స్ ఆర్థికాభివృద్ధి రేటు 8 శాతానికి చేరుకుంటుందని ఆశిస్తున్నామని, అదే సమయంలో ప్రపంచ సగటు మాత్రం కేవలం ఒక శాతమే ఉందని దక్షిణాఫ్రికా స్టాండర్డ్బ్యాంక్ ఆర్థికవేత్త జెర్మీ స్టీవెన్స్ తెలిపారు. చర్చించే అంశాలివే... అంతర్జాతీయ శాంతి, భద్రత, వాణిజ్యపరమైన అంశాలతో పాటు ఈ భేటీలో ఆరోగ్య పరిరక్షణ-వ్యాక్సిన్లు, మహిళల సామాజిక, ఆర్థిక సాధికారత, శాంతి పరిరక్షణ, సైన్స్, సాంకేతిక, మౌలిక సదుపాయాల అభివృద్ధిరంగాల్లో సహకారం, స్థిరమైన అభివృద్ధి, సమ్మిళిక పురోగతి, గ్లోబల్ గవర్నెన్స్ తదితర అంశాలు చర్చనీయాంశం కానున్నాయి. బ్రిక్స్ చరిత్ర ఇదీ... 2001లో బ్రిక్ అనే పదాన్ని (ప్రపంచ ఆర్థికశక్తులు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలు ఎదుగుతున్న క్రమంలో) బ్రిటన్ ఆర్థికవేత్త జిమ్ ఓనీల్ ప్రతిపాదించారు. 2006 నుంచి ఈ నాలుగుదేశాలు క్రమం తప్పకుండా సమావేశమవుతున్నాయి. న్యూయార్క్‌లో ఐరాస వార్షిక జనరల్ అసెంబ్లీ సందర్భంగా ఈ దేశాల విదేశాంగ మంత్రులు సమావేశమయ్యారు.అదే ఏడాది జీ-8 నాయకులు తమ భేటీకి హాజరుకావాలని భారత్, బ్రెజిల్, చైనా దేశాల అధ్యక్షులను ఆహ్వానించారు. 2009లో మొదటి బ్రిక్స్ సమావేశానికి రష్యా వేదికైంది. ప్రపంచ రాజకీయ,ఆర్థికరంగానికి సంబంధించిన సంస్థ రూపాన్ని 2010లో బ్రిక్స్ సంతరించుకుంది. 2010 డిసెంబర్లో ఆఫ్రికా ఖండం నుంచి ఏకైక ప్రతినిధిగా దక్షిణాప్రికా ఈ సభ్యదేశాల్లో ఒకటిగా చేరింది. పేరు బ్రిక్స్‌గా మారింది. -
‘మౌలిక’ సాయం చేయండి
బ్రిక్స్ బ్యాంకుకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సాయం అందించాలని బ్రిక్స్ దేశాల ఉమ్మడి బ్యాంకు అయిన ‘న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ)’ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కోరారు. ప్రధానంగా నగరాల అభివృద్ధి, చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాలు కలసి ఉమ్మడిగా ఇటీవలే ‘న్యూ డెవలప్మెంట్ బ్యాంక్’ను ఏర్పాటు చేశాయి. చైనాలోని షాంఘైలో నెలకొల్పిన ఈ బ్యాంకు.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సాయం అందిస్తుంది. ఇప్పటివరకు విదేశీ రుణ సంస్థల నుంచి నిధులు పొందుతున్నట్లుగానే.. ఈ బ్యాంకు నుంచీ రుణసాయం పొందవచ్చని ఇటీవలే కేంద్రం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఈ నేపథ్యంలో గురువారం షాంఘైలో బ్యాంకు అధ్యక్షుడు కేవీ కామత్, ఉపాధ్యక్షుడు జియాన్ ఝూతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదాపు నలభై నిమిషాల పాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన విజ్ఞప్తికి ఎన్డీబీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఇకతెలంగాణలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడులే లక్ష్యంగా చైనా పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ నాలుగో రోజు గురువారం కూడా బిజీ బిజీగా గడిపారు. సీఐఐ సదస్సులో ప్రసంగం.. షాంఘైలోని పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమయ్యారు. భారత కాన్సులేట్, తెలంగాణ ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సంయుక్తంగా ఏర్పాటు చేసిన సదస్సులో ప్రసంగించారు. ‘తెలంగాణలో పెట్టుబడి అవకాశాలు’ పేరిట ఏర్పాటు చేసిన ఈ వర్క్‌షాప్‌కు దాదాపు 65 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం ఉందని, తాము అమల్లోకి తెచ్చిన నూతన పారిశ్రామిక విధానంతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని కేసీఆర్ ఈ సందర్భంగా వివరించారు. అంతర్జాతీయ స్థాయి నగరంగా ఎదిగిన హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని ఆహ్వానించారు. మా రాష్ట్రానికి రండి.. తెలంగాణలో హైపవర్ పంపు లు, విద్యుత్ పరికరాల తయారీ, సరఫరా చేసే పరిశ్రమను నెలకొల్పేందుకు షాంఘై ఎలక్ట్రిక్ కార్పొరేషన్ ముందుకొచ్చింది. దాదాపు 40 బిలియన్ డాలర్ల టర్నోవర్ ఉన్న ఈ సంస్థ వైస్ ప్రెసిడెంట్ షావో గురువారం సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు తమ కంపెనీ ఆసక్తి ప్రదర్శిస్తోందన్నారు. ఈ సందర్భంగా ఒకసారి తెలంగాణకు రావాలని ఆ కంపెనీ ప్రతినిధులను సీఎం ఆహ్వానించారు. రాష్ట్రాన్ని సందర్శించి... వనరులు, అనుకూలతను స్వయంగా పరిశీలించాలని కోరారు. ఈ సందర్భంగా పారిశ్రామిక వేత్తలందరికీ సీఎం కేసీఆర్ విందు ఇచ్చారు. హైస్పీడ్ రైల్లో కేసీఆర్: బుధవారం డేలియన్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరైన కేసీఆర్ తన వెంట ఉన్న బృందంతో కలసి గురువారం ఉదయం షాంఘై నగరానికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నగరంలోకి వెళ్లేటప్పుడు గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే మాగ్లేవ్ హైస్పీడ్ రైల్లో ఈ బృందం ప్రయాణం చేసింది. మకేనాతో సెల్కాన్ ఎంవోయూ దాదాపు 140 కోట్లతో ఎల్సీడీ, ఎల్ఈడీల తయారీ యూనిట్‌ను తెలంగాణలో నెలకొల్పేందుకు చైనాలోని మకేనా కంపెనీ ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించి సెల్కాన్ కంపెనీ మకేనా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులతో ఎంవోయూ చేసుకుంది. సీఎం కేసీఆర్ సమక్షంలో ఈ 2 కంపెనీల ప్రతినిధులు ఈ ఒప్పందం చేసుకున్నారు. మరో 2 చైనా కంపెనీలు కూడా సెల్‌ఫోన్ విడిభాగాలు, హెడ్ఫోన్ల తయారీ పరిశ్రమల స్థాపనకు, హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయి. -
బ్రిక్స్ అధ్యక్షుడుగా కె.వి.కామత్
న్యూ ఢిల్లీ: బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల వాణిజ్యాభివృద్ధికి ఉద్దేశించిన బ్రిక్స్ బ్యాంక్ అధ్యక్షుడుగా కే వీ కామత్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంకు చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కామత్ ఈ పదవిలో ఐదేళ్ళు కొనసాగుతారు . ఐదు దేశాల కూటమికి 2001లో బ్రిక్స్ గా నామకరణం చేశారు. ఈ బ్యాంకుకు అధ్యక్షుడిని నామినేట్ చేసే అవకాశం భారత్‌కు లభించింది. భారత్ తర్వాత బ్రెజిల్, రష్యాలు ఐదేళ్ల చొప్పున సారథ్యం వహిస్తాయని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా పాశ్చాత్య దేశాలు పెత్తనం చెలాయిస్తున్న అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థ రూపురేఖలు మార్చేందుకు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాదేశాలు సంయుక్తంగా ఏర్పాటు చేసుకున్న బ్రిక్స్ బ్యాంకును భవిష్యత్తు ప్రపంచ బ్యాంకుగా గ్లోబల్ ఫైనాన్షియల్ సంస్థ గోల్డ్‌మన్ సాచే అసెట్ మేనేజ్మెంట్ గతంలో అభివర్ణించింది. ఆర్థిక విశ్లేషకులు కూడా బ్రిక్స్ బ్యాంక్ ఆవిర్భావంపై హర్షం వ్యక్తం చేశారు. -
సౌర విద్యుత్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
15 వేల మెగావాట్ల సామర్థ్యం కేబినెట్ భేటీలో ఆమోదం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఎన్టీపీసీ తలపెట్టిన 15,000 మెగావాట్ల గ్రిడ్ ఆధారిత సౌర విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్ (ఎన్‌వీవీఎన్) మూడు దశల్లో వీటిని ఏర్పాటు చేయనుంది. వీటిలో కొన్ని ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌లో రానున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా సౌర విద్యుత్ అందుబాటులోకి వస్తే కిరోసిన్, డీజిల్ వినియోగం గణనీయంగా తగ్గగలదు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మరోవైపు, బ్రిక్స్ కూటమి దేశాల ప్రతిపాదిత బ్యాంకు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వర్ధమాన దేశాల్లో ఇన్ఫ్రా ప్రాజెక్టులకు, ఇతరత్రా చెల్లింపుల అవసరాలకు కావాల్సిన నిధులు సమకూర్చేందుకు ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) ఉపయోగపడనుంది. బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలతో కలిసి 100 బిలియన్ డాలర్లతో ఏర్పాటు చేసే ఈ బ్యాంక్‌కు తొలి ఆరేళ్ల పాటు భారత్ సారథ్యం వహించనుంది. మరోవైపు, ఆదాయ పన్ను సంబంధిత కేసుల సత్వర పరిష్కారం కోసం ఢిల్లీ, ముంబైలో అదనంగా రెండు అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్స్ (ఏఏఆర్) బెంచ్‌ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటి ఏర్పాటు సమయంలో రూ. 7.48 కోట్లు ఖర్చు కాగలదని, అటు పైన ఏటా రూ. 6.61 కోట్లు వ్యయం కాగలదని అంచనా. -
బ్రిక్స్ బ్యాంక్‌కు ఆరేళ్లు భారత్ సారథ్యం
ఫోర్టలేజా (బ్రెజిల్): బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంకుకు మొదటి ఆరు సంవత్సరాలు భారత్ అధ్యక్షత వహించనుంది. రెండేళ్లలో కార్యకలాపాలు ప్రారంభం కానున్న ఈ బ్యాంకు ప్రధాన కార్యాలయం షాంఘై (చైనా)లో ఉంటుంది. భారత్ తర్వాత బ్రెజిల్, రష్యాలు ఐదేళ్ల చొప్పున సారథ్యం వహిస్తాయని అధికార వర్గాలు బుధవారం వెల్లడించాయి. పాశ్చాత్య దేశాలు పెత్తనం చెలాయిస్తున్న అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థ రూపురేఖలు మార్చేందుకు బ్యాంకును నెలకొల్పాలని బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) దేశాల సదస్సు మంగళవారం నిర్ణయించిన సంగతి విదితమే. బ్యాంకుతో పాటు 10 వేల కోట్ల డాలర్లతో ఏర్పాటు చేయనున్న కరెన్సీ రిజర్వ్ అరేంజ్మెంట్ (సీఆర్ఏ)తో బ్రిక్స్ దేశాలు స్వల్పకాలిక లిక్విడిటీ ఒత్తిడులను తట్టుకోగలుగుతాయి. ఇండియా మినహా బ్రిక్స్ సభ్య దేశాల పార్లమెంట్లు సీఆర్ఏకు ఆమోదముద్ర వేయడానికి ఆరు నెలలు గడువుందని అధికార వర్గాలు తెలిపాయి. సీఆర్ఏకు అవసరమైన నిధుల్లో భాగంగా చైనా అత్యధికంగా 4,100 కోట్ల డాలర్లు, ఇండియా, రష్యా, బ్రెజిల్‌లు 1,800 కోట్ల డాలర్ల చొప్పున, దక్షిణ ఆఫ్రికా 500 కోట్ల డాలర్లు అందించనున్నాయి. రెండేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో చర్చించిన డెవలప్మెంట్ బ్యాంక్ ఇపుడు వాస్తవరూపం దాల్చిందని భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. బ్రిక్స్ దేశాలతో పాటు ఇతర వర్థమాన దేశాలకు సైతం ఈ బ్యాంకు సహకరిస్తుందని తెలిపారు. పారిశ్రామిక రంగం హర్షం...: బ్రిక్స్ బ్యాంకు ఏర్పాటుతో సభ్యదేశాల మధ్య ఆర్థిక సహకారం వృద్ధిచెందుతుందని భారతీయ పారిశ్రామికరంగం హర్షం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభాలను అధిగమించడానికి, మౌలిక సౌకర్యాల వృద్ధికి బ్యాంకు దోహదపడుతుందని పేర్కొంది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏర్పాటు చరిత్రాత్మకమని ఫిక్కీ అధ్యక్షుడు సిద్ధార్థ్ బిర్లా అభివర్ణించారు. బ్యాంకు ఏర్పాటు ఇండియా సాధించిన విజయమని అన్నారు. వర్థమాన ఆర్థిక వ్యవస్థల పురోగతికి భారీగా నిధులు అవసరమనీ, 10 వేల కోట్ల డాలర్ల కంటే మరిన్ని రెట్ల నిధుల సమీకరణ మార్గాలను బ్యాంకు అన్వేషించాలని అసోచామ్ అధ్యక్షుడు రాణా కపూర్ అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది సదస్సు రష్యాలో.. వచ్చే సంవత్సరం బ్రిక్స్ ఏడో సదస్సును రష్యాలోని ఊఫా నగరంలో నిర్వహించనున్నారు. సదస్సు నిర్వహణకు ముందుకొచ్చిన రష్యాను భారత్, బ్రెజిల్, చైనా, దక్షిణాఫ్రికాలు అభినందించాయి. -
రక్షణాత్మక వాణిజ్యానికి దూరం
ఫోర్టలేజా (బ్రెజిల్): వాణిజ్యంలో రక్షణాత్మక చర్యలకు దూరంగా ఉంటామని బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ఆఫ్రికా) దేశాలు ఉద్ఘాటించాయి. పెట్టుబడులు, వ్యాపారం వృద్ధికి విధానపరంగా మరింత సమన్వయంతో వ్యవహరిస్తామని తెలిపాయి. బ్రిక్స్ ఆరో సదస్సు సందర్భంగా ఆయా దేశాలు మంగళవారం ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. భారత ప్రధాని మోడీతో పాటు బ్రెజిల్ వెళ్లిన వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్ బ్రిక్స్ దేశాల వాణిజ్య మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. బ్రిక్స్ దేశాల నడుమ ప్రస్తుతం 23 వేల కోట్ల డాలర్లుగా ఉన్న వాణిజ్యాన్ని వచ్చే ఏడాదికి 50 వేల కోట్ల డాలర్లకు పెంచవచ్చని ఈ సందర్భంగా మంత్రులు అభిప్రాయపడ్డారు. బ్రిక్స్ బ్యాంకులో సమాన వాటాలు.. 5 వేల కోట్ల డాలర్లతో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంకులో ఐదు సభ్య దేశాలకూ సమాన వాటాలుంటాయి. ఈ బ్యాంకు ఏర్పాటుకు ఇండియా గట్టిగా ఒత్తిడి తెస్తోంది. బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంకులో ఒక్కో సభ్య దేశానికి వెయ్యి కోట్ల డాలర్ల వాటా ఉండాలని అవగాహన కుదిరినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సమాన వాటాలుంటే ఏ ఒక్క దేశమో ఆధిపత్యం చెలాయించడం కుదరదని పేర్కొన్నాయి. బ్రిక్స్ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని ఢిల్లీలో నెలకొల్పాలని భారత్ పట్టుబడుతుండగా, దాన్ని షాంఘైలో ఏర్పాటు చేస్తారని సూచనలు వెలువడుతున్నాయి. ఈ బ్యాంకుకు ‘న్యూ డెవలప్మెంట్ బ్యాంకు’ అనే పేరు పెట్టాలన్న మోడీ సూచనను ఆమోదించే అవకాశం ఉంది. చెల్లిం పుల సమతౌల్యంలో సమస్యలు ఉత్పన్నమైనపుడు బ్రిక్స్ దేశాలకు అందుబాటులో ఉండడానికి 5 వేల కోట్ల డాలర్లతో అత్యవసర సహాయ నిధి(సీఆర్ఏ)ని ఈ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.