సౌర విద్యుత్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
15 వేల మెగావాట్ల సామర్థ్యం కేబినెట్ భేటీలో ఆమోదం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఎన్‌టీపీసీ తలపెట్టిన 15,000 మెగావాట్ల గ్రిడ్ ఆధారిత సౌర విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్‌టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్ (ఎన్‌వీవీఎన్) మూడు దశల్లో వీటిని ఏర్పాటు చేయనుంది. వీటిలో కొన్ని ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌లో రానున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా సౌర విద్యుత్ అందుబాటులోకి వస్తే కిరోసిన్, డీజిల్ వినియోగం గణనీయంగా తగ్గగలదు.
ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మరోవైపు, బ్రిక్స్ కూటమి దేశాల ప్రతిపాదిత బ్యాంకు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వర్ధమాన దేశాల్లో ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు, ఇతరత్రా చెల్లింపుల అవసరాలకు కావాల్సిన నిధులు సమకూర్చేందుకు ఈ న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డీబీ) ఉపయోగపడనుంది.
బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలతో కలిసి 100 బిలియన్ డాలర్లతో ఏర్పాటు చేసే ఈ బ్యాంక్‌కు తొలి ఆరేళ్ల పాటు భారత్ సారథ్యం వహించనుంది. మరోవైపు, ఆదాయ పన్ను సంబంధిత కేసుల సత్వర పరిష్కారం కోసం ఢిల్లీ, ముంబైలో అదనంగా రెండు అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్స్ (ఏఏఆర్) బెంచ్‌ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటి ఏర్పాటు సమయంలో రూ. 7.48 కోట్లు ఖర్చు కాగలదని, అటు పైన ఏటా రూ. 6.61 కోట్లు వ్యయం కాగలదని అంచనా.