‘మౌలిక’ సాయం చేయండి | BRICS bank To CM KCR appeal | Sakshi
Sakshi News home page

‘మౌలిక’ సాయం చేయండి

Published Fri, Sep 11 2015 3:01 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

‘మౌలిక’ సాయం చేయండి - Sakshi

‘మౌలిక’ సాయం చేయండి

బ్రిక్స్ బ్యాంకుకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సాయం అందించాలని బ్రిక్స్ దేశాల ఉమ్మడి బ్యాంకు అయిన ‘న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఎన్‌డీబీ)’ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కోరారు. ప్రధానంగా నగరాల అభివృద్ధి, చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాలు కలసి ఉమ్మడిగా ఇటీవలే ‘న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్’ను ఏర్పాటు చేశాయి.

చైనాలోని షాంఘైలో నెలకొల్పిన ఈ బ్యాంకు.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సాయం అందిస్తుంది. ఇప్పటివరకు విదేశీ రుణ సంస్థల నుంచి నిధులు పొందుతున్నట్లుగానే.. ఈ బ్యాంకు నుంచీ రుణసాయం పొందవచ్చని ఇటీవలే కేంద్రం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఈ నేపథ్యంలో గురువారం షాంఘైలో బ్యాంకు అధ్యక్షుడు కేవీ కామత్, ఉపాధ్యక్షుడు జియాన్ ఝూతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

దాదాపు నలభై నిమిషాల పాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన విజ్ఞప్తికి ఎన్‌డీబీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఇకతెలంగాణలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడులే లక్ష్యంగా చైనా పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ నాలుగో రోజు గురువారం కూడా బిజీ బిజీగా గడిపారు.
 
సీఐఐ సదస్సులో ప్రసంగం..
షాంఘైలోని పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమయ్యారు. భారత కాన్సులేట్, తెలంగాణ ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సంయుక్తంగా ఏర్పాటు చేసిన సదస్సులో ప్రసంగించారు. ‘తెలంగాణలో పెట్టుబడి అవకాశాలు’ పేరిట ఏర్పాటు చేసిన ఈ వర్క్‌షాప్‌కు దాదాపు 65 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.

కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం ఉందని, తాము అమల్లోకి తెచ్చిన నూతన పారిశ్రామిక విధానంతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని కేసీఆర్ ఈ సందర్భంగా వివరించారు. అంతర్జాతీయ స్థాయి నగరంగా ఎదిగిన హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని ఆహ్వానించారు.
 
మా రాష్ట్రానికి రండి..
తెలంగాణలో హైపవర్ పంపు లు, విద్యుత్ పరికరాల తయారీ, సరఫరా చేసే పరిశ్రమను నెలకొల్పేందుకు షాంఘై ఎలక్ట్రిక్ కార్పొరేషన్ ముందుకొచ్చింది. దాదాపు 40 బిలియన్ డాలర్ల టర్నోవర్ ఉన్న ఈ సంస్థ వైస్ ప్రెసిడెంట్ షావో గురువారం సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు తమ కంపెనీ ఆసక్తి ప్రదర్శిస్తోందన్నారు. ఈ సందర్భంగా ఒకసారి తెలంగాణకు రావాలని ఆ కంపెనీ ప్రతినిధులను సీఎం ఆహ్వానించారు. రాష్ట్రాన్ని సందర్శించి... వనరులు, అనుకూలతను స్వయంగా పరిశీలించాలని కోరారు.  ఈ  సందర్భంగా పారిశ్రామిక వేత్తలందరికీ సీఎం కేసీఆర్ విందు ఇచ్చారు.
 
హైస్పీడ్ రైల్లో కేసీఆర్: బుధవారం డేలియన్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరైన కేసీఆర్ తన వెంట ఉన్న బృందంతో కలసి గురువారం ఉదయం షాంఘై నగరానికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నగరంలోకి వెళ్లేటప్పుడు గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే మాగ్లేవ్ హైస్పీడ్ రైల్లో ఈ బృందం ప్రయాణం చేసింది.
 
మకేనాతో సెల్‌కాన్ ఎంవోయూ
దాదాపు 140 కోట్లతో ఎల్‌సీడీ, ఎల్‌ఈడీల తయారీ యూనిట్‌ను తెలంగాణలో నెలకొల్పేందుకు చైనాలోని మకేనా కంపెనీ ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించి సెల్‌కాన్ కంపెనీ మకేనా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులతో ఎంవోయూ చేసుకుంది. సీఎం కేసీఆర్ సమక్షంలో ఈ 2 కంపెనీల ప్రతినిధులు ఈ ఒప్పందం చేసుకున్నారు. మరో 2 చైనా కంపెనీలు కూడా సెల్‌ఫోన్ విడిభాగాలు, హెడ్‌ఫోన్ల తయారీ పరిశ్రమల స్థాపనకు, హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement