రహదారులకు మహర్దశ | YS Jagan comments in a review of the Highways and Buildings Department | Sakshi
Sakshi News home page

రహదారులకు మహర్దశ

Published Tue, Nov 5 2019 3:56 AM | Last Updated on Tue, Nov 5 2019 10:46 AM

YS Jagan comments in a review of the Highways and Buildings Department - Sakshi

ప్రభుత్వంలో జరిగే ప్రతి పనికీ రివర్స్‌ టెండర్లు పిలుస్తున్నాం. రివర్స్‌ టెండర్లు పిలిచిన ప్రతిసారి తక్కువకు టెండర్లు ఖరారవుతున్నాయి. రోడ్ల నిర్మాణంలో కూడా అదే పద్ధతి పాటించండి. అంచనాల్లో వాస్తవికతతో వ్యవహరించాలి. సింగిల్‌ లేన్‌ రోడ్లు అనే విధానాన్ని విడిచిపెడితే మంచిది. ఏ రోడ్డయినా రెండు లేన్లుగా విస్తరిస్తేనే బాగుంటుంది. 
– అధికారులతో సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఎన్‌డీబీ) అందించే రుణ సాయంతో రాష్ట్రంలో రహదారుల రూపు రేఖలు మార్చాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఎన్‌డీబీ అందిస్తున్న రుణ సాయం రూ.6,400 కోట్ల నుంచి రూ.8,800 కోట్లకు పెంచేలా కోరాలని నిర్ణయించామన్నారు. సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో రహదారులు, భవనాల శాఖపై సమీక్ష నిర్వహించారు. న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు ఇస్తున్న రూ.6,400 కోట్లతో సుమారు 3,100 కిలోమీటర్లకు పైగా ఉన్న రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు అవసరమైన చోట కొత్త బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టులో జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకున్న రోడ్లకు ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాలని, ఒకవేళ ఇప్పుడున్న రోడ్లు బాగుంటే.. మండల కేంద్రం నుంచి మరో మండల కేంద్రానికి వెళ్లే రోడ్లపై దృష్టి పెట్టాలన్నారు. అవసానదశలో ఉన్న 676 బ్రిడ్జిలను ఎన్‌డీబీ ప్రాజెక్టులో పెట్టాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లను వెంటనే గుర్తించి, రూ.625 కోట్లతో సత్వర మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. 

త్వరితగతిన భూసేకరణ 
అనంతపురం – అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వేను చిలకలూరిపేట బైపాస్‌కు అనుసంధానం చేసే ప్రతిపాదనకు సీఎం వైఎస్‌ జగన్‌ అంగీకారం తెలిపారు. ఈ ఎక్స్‌ప్రెస్‌ వే భూసేకరణపై ప్రధానంగా దృష్టి పెట్టి పనులు ప్రారంభం అయ్యేలా చూడాలని ఆదేశించారు. ప్రాథమికంగా నాలుగు లేన్ల రోడ్డు, భవిష్యత్తు కోసం 8 లేన్ల రహదారికి భూ సేకరణ చేస్తున్నామని ఆర్‌అండ్‌బీ అధికారులు సీఎంకు వివరించారు. ఎక్స్‌ప్రెస్‌ వే లో భాగంగా నిర్మించే టన్నెల్స్‌ నాలుగు లేన్లా.. లేక ఆరు లేన్లా అన్నది చర్చ జరుగుతుందన్నారు. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా ఆరు లేన్లకు సరిపడా టన్నెల్స్‌ ఉండాలని సీఎం సూచించారు. రోడ్ల నిర్మాణంలో ఎం–శాండ్‌ వినియోగంపై దృష్టి పెట్టాలన్నారు. 

ఏపీఆర్‌డీసీ బలోపేతం 
ఆంధ్రప్రదేశ్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఆర్‌డీసీ) బలోపేతానికి అధికారులు చేసిన ప్రతిపాదనలకు సీఎం సానుకూలంగా స్పందించి చట్టంలో సపరణలకు అంగీకరించారు. కార్పొరేషన్‌ స్వావలంబనతో నడవడానికి, రోడ్ల నిర్మాణం, నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు ఉండేలా కార్పొరేషన్‌ ఉండాలని సీఎం సూచించారు. ఆర్టీసీకి సంబంధించిన 12 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగిన 3,600కు పైగా బస్సులను వెంటనే రీప్లేస్‌ చేయాలని సూచించారు. అప్పుడే ప్రయాణికుల భద్రతకు సరైన ప్రమాణాలు పాటించినట్లవుతుందన్నారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు ప్రణాళికలు వేసుకుని వాటిని అమలు చేయడానికి కార్పొరేషన్‌ దృష్టి పెట్టాలన్నారు. రోడ్ల నిర్మాణం, నిర్వహణ కోసం ప్రత్యేక నిధి ఏపీఆర్‌డీసీ ద్వారా ఏర్పాటు కావాలన్న అధికారుల ప్రతిపాదనకు సీఎం అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాలలో అమలవుతున్న విధానాలను అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమావేశంలో ఆర్‌అండ్‌బీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, ఎన్‌హెచ్‌ఏఐ ఆర్వో అనిల్‌ దీక్షిత్, ఆర్‌అండ్‌బీ చీఫ్‌ ఇంజనీర్లు మనోహర్‌ రెడ్డి, రాజీవ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

వేగంగా జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ
గుండుగొలను – కలపర్రు– గొల్లపూడి – మంగళగిరి బైపాస్‌ హైవేపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. దీన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఎక్కడ సమస్యలు వచ్చినా వెంటనే జోక్యం చేసుకుని వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. విజయవాడ నగరాన్ని ట్రాఫిక్‌ సమస్య నుంచి తప్పించేందుకు ఇదొక పరిష్కారం అవుతుందని సీఎం అన్నారు. అనకాపల్లి – ఆనందపురం రోడ్డు కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తవుతోందని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు సీఎంకు వివరించారు. ఒంగోలు– కత్తిపూడి జాతీయ రహదారికి సంబంధించి అక్కడక్కడ చిన్న స్థాయిలో పనులు మిగిలిపోయాయని, వాటిని త్వరలో పూర్తి చేస్తామని వారు చెప్పారు. రేణిగుంట నుంచి కడప, రేణిగుంట నుంచి నాయుడుపేట, నెల్లూరు నుంచి తడ వరకు ఆరు లేన్ల రహదారి.. తదితర ప్రాజెక్టుల గురించి వారు సీఎంకు వివరించారు. వైఎస్సార్‌ జిల్లా ముద్దనూరు నుంచి బెంగళూరు హైవేలోని కొడికొండ చెక్‌పోస్టు వరకు 150 కిలోమీటర్ల రహదారిని రూ.350 కోట్ల ఎన్‌డీబీ నిధులతో పది మీటర్ల మేర విస్తరించాలని సీఎం ఆదేశించారు. వశిష్ట గోదావరి పాయమీద సెకినేటిపల్లి వద్ద చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న బ్రిడ్జిని రూ.100 కోట్లతో పూర్తి చేయాలన్నారు. అనంతపురం జిల్లా కదిరి బైపాస్‌ రోడ్డు నిర్మాణాన్ని ఈ ఏడాది ప్రణాళికలోనే పెట్టాలని అధికారులకు సూచించారు. 

రోడ్ల నిర్మాణంలో ప్లాస్టిక్‌ వినియోగం
పర్యావరణ పరిరక్షణలో భాగంగా రోడ్ల నిర్మాణంలో ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నామని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు సీఎంకు వివరించారు. నగరాలు, పట్టణాల్లో సేకరించిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఎన్‌హెచ్‌ఏఐకు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. దీనికోసం ఒక విధానాన్ని రూపొందించాలన్నారు. రేషన్‌ పంపిణీలో భాగంగా బియ్యాన్ని ప్యాక్‌ చేసేందుకు ఇస్తున్న సంచులను తిరిగి సేకరించి వాటిని పునర్‌ వినియోగించడం లేదా రోడ్ల నిర్మాణంలో ఉపయోగించేందుకు ఇవ్వాలని సూచించారు. ప్లాస్టిక్‌ వ్యర్థాల సరఫరాపై ఎంఓయూకు సిద్ధంగా ఉన్నామని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement