aprdc
-
రోడ్ల అత్యవసర మరమ్మతులకు.. రూ.550 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లకు ప్రాధాన్యతా క్రమంలో మరమ్మతులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.550 కోట్లను కేటాయించింది. జనవరి 10లోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఫిబ్రవరి నెలాఖరు నాటికి మరమ్మతులు పూర్తి చేసేలా 45 రోజుల ప్రత్యేక ప్రణాళిక ప్రకటించింది. ఈ మేరకు ఆర్ అండ్ బీ శాఖ లక్ష్యాలను నిర్దేశించుకుంది. కేటాయించిన నిధులతో చేపట్టే పనులకు సంబంధించి జిల్లాల వారీగా టెండర్లు పిలిచే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. మరోవైపు 7 వేల కిలోమీలర్ల మేర రోడ్లను పునరుద్ధరించాలని నిర్ణయించారు. వీటి కోసం ఏపీఆర్డీసీ (ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ప్రత్యేక నిధులు కేటాయించనుంది. గురువారం ఆర్ అండ్ బీ శాఖపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షించనున్నారు. రూ.450 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల గతంలో రోడ్ల మరమ్మతులు చేసిన కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులను మంజూరు చేశారు. ఇందుకోసం రూ.450 కోట్లను ఇటీవలే విడుదల చేశారు. గతంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో రోడ్ల మరమ్మతులు చేసేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా, రూ.450 కోట్లను మంజూరు చేసింది. అన్ని పనులూ మార్చి నాటికి పూర్తి రాష్ట్రంలోని రోడ్ల మరమ్మతులు, పునరుద్ధరణ పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టి మార్చి నాటికి సంపూర్ణంగా పూర్తి చేస్తాం. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు రెడీ అయ్యాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నుంచి అనుమతి రాగానే హై ట్రాఫిక్ కారిడార్ల రోడ్లను తీర్చిదిద్దుతాం. – ఎంటీ కృష్ణబాబు, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి -
తనఖా రుణం.. తన ప్రచారానికి
సాక్షి, అమరావతి: అందినకాడికి అప్పులు చేయడం... వాటిని సొంత ప్రచారం కోసం మంచినీళ్లలా ఖర్చు చేయడం! గత సర్కారు విచ్చలవిడితనానికి రహదారుల పేరుతో జరిగిన నిర్వాకాలే మరో నిదర్శనం. పలు కార్పొరేషన్ల ద్వారా రూ.వేల కోట్లు అప్పులు తెచ్చిన చంద్రబాబు సర్కారు వాటిని నిర్వీర్యం చేసింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డీసీ) అలంకార ప్రాయంగా మారింది. ఒక్క రోడ్డూ నిర్మించలేదు.. ► రాష్ట్రంలో కొత్త రహదారుల నిర్మాణంతోపాటు ప్రధానమైన రోడ్లకు మరమ్మతులు చేపడతామంటూ ఏపీఆర్డీసీ ద్వారా చంద్రబాబు సర్కారు 2018లో రూ.3 వేల కోట్ల రుణం తెచ్చింది. ఈ రుణంతో ఒక్క రహదారి ప్రాజెక్టు ప్రారంభించలేదు సరికదా కనీసం ఒక్క గుంతనైనా పూడ్చలేదు. ► గత సర్కారు అప్పుగా తెచ్చిన రూ.3 వేల కోట్లను మళ్లించి ఎన్నికలకు ముందు పసుపు–కుంకుమ పేరుతో చంద్రబాబు ప్రచారం కోసం పంచేసింది. దీంతో ఆ రుణాన్ని చెల్లించేందుకు ఏపీఆర్డీసీ ఆర్‌అండ్‌బీకి కేటాయించిన బడ్జెట్ నుంచి ఖర్చు చేయాల్సి వస్తోంది. తెచ్చిన అప్పులపై వడ్డీలు చెల్లించేందుకే బడ్జెట్ చాలకపోవడంతో ఏపీఆర్డీసీ రహదార్లను అభివృద్ధి చేయలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపడంతో న్యూ డెవలప్మెంట్ బ్యాంకు సహకారంతో గ్రామ, మండల, జిల్లా రోడ్ల విస్తరణ, వంతెనల పునర్నిర్మాణాన్ని ప్రారంభించింది. పంజాబ్ బ్యాంకు నుంచి 7.90 శాతం వడ్డీతో రుణం ► టీడీపీ సర్కారు అధికారంలో ఉండగా జాతీయ/రాష్ట్ర రహదారులను అభివృద్ధి చేసేందుకు అప్పు ఇవ్వాలంటూ పలు ఆర్ధిక సంస్ధలను ఆశ్రయించింది. చివరకు పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి 7.90 శాతం వడ్డీతో రూ.3 వేల కోట్ల రుణం తీసుకుంది. ఆర్ అండ్ బీకి 2017–18 బడ్జెట్ కేటాయింపులు సరిపోలేదంటూ అప్పు చేసింది. ► రాష్ట్రంలో 2,144 కి.మీ రోడ్లు, 78 వంతెనల నిర్మాణం చేపడతామంటూ రుణం తీసుకుని చంద్రబాబు ప్రభుత్వం సొంత ప్రచారానికి వాడుకోవడంతో ఇప్పుడు ఆ భారం ఏపీఆర్డీసీపై పడింది. -
రోడ్లు రయ్..రయ్
-
రహదారులకు మహర్దశ
ప్రభుత్వంలో జరిగే ప్రతి పనికీ రివర్స్ టెండర్లు పిలుస్తున్నాం. రివర్స్ టెండర్లు పిలిచిన ప్రతిసారి తక్కువకు టెండర్లు ఖరారవుతున్నాయి. రోడ్ల నిర్మాణంలో కూడా అదే పద్ధతి పాటించండి. అంచనాల్లో వాస్తవికతతో వ్యవహరించాలి. సింగిల్ లేన్ రోడ్లు అనే విధానాన్ని విడిచిపెడితే మంచిది. ఏ రోడ్డయినా రెండు లేన్లుగా విస్తరిస్తేనే బాగుంటుంది. – అధికారులతో సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) అందించే రుణ సాయంతో రాష్ట్రంలో రహదారుల రూపు రేఖలు మార్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఎన్డీబీ అందిస్తున్న రుణ సాయం రూ.6,400 కోట్ల నుంచి రూ.8,800 కోట్లకు పెంచేలా కోరాలని నిర్ణయించామన్నారు. సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో రహదారులు, భవనాల శాఖపై సమీక్ష నిర్వహించారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ఇస్తున్న రూ.6,400 కోట్లతో సుమారు 3,100 కిలోమీటర్లకు పైగా ఉన్న రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు అవసరమైన చోట కొత్త బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టులో జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకున్న రోడ్లకు ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాలని, ఒకవేళ ఇప్పుడున్న రోడ్లు బాగుంటే.. మండల కేంద్రం నుంచి మరో మండల కేంద్రానికి వెళ్లే రోడ్లపై దృష్టి పెట్టాలన్నారు. అవసానదశలో ఉన్న 676 బ్రిడ్జిలను ఎన్డీబీ ప్రాజెక్టులో పెట్టాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లను వెంటనే గుర్తించి, రూ.625 కోట్లతో సత్వర మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. త్వరితగతిన భూసేకరణ అనంతపురం – అమరావతి ఎక్స్‌ప్రెస్ వేను చిలకలూరిపేట బైపాస్కు అనుసంధానం చేసే ప్రతిపాదనకు సీఎం వైఎస్ జగన్ అంగీకారం తెలిపారు. ఈ ఎక్స్‌ప్రెస్ వే భూసేకరణపై ప్రధానంగా దృష్టి పెట్టి పనులు ప్రారంభం అయ్యేలా చూడాలని ఆదేశించారు. ప్రాథమికంగా నాలుగు లేన్ల రోడ్డు, భవిష్యత్తు కోసం 8 లేన్ల రహదారికి భూ సేకరణ చేస్తున్నామని ఆర్అండ్బీ అధికారులు సీఎంకు వివరించారు. ఎక్స్‌ప్రెస్ వే లో భాగంగా నిర్మించే టన్నెల్స్ నాలుగు లేన్లా.. లేక ఆరు లేన్లా అన్నది చర్చ జరుగుతుందన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆరు లేన్లకు సరిపడా టన్నెల్స్ ఉండాలని సీఎం సూచించారు. రోడ్ల నిర్మాణంలో ఎం–శాండ్ వినియోగంపై దృష్టి పెట్టాలన్నారు. ఏపీఆర్డీసీ బలోపేతం ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డీసీ) బలోపేతానికి అధికారులు చేసిన ప్రతిపాదనలకు సీఎం సానుకూలంగా స్పందించి చట్టంలో సపరణలకు అంగీకరించారు. కార్పొరేషన్ స్వావలంబనతో నడవడానికి, రోడ్ల నిర్మాణం, నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు ఉండేలా కార్పొరేషన్ ఉండాలని సీఎం సూచించారు. ఆర్టీసీకి సంబంధించిన 12 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగిన 3,600కు పైగా బస్సులను వెంటనే రీప్లేస్ చేయాలని సూచించారు. అప్పుడే ప్రయాణికుల భద్రతకు సరైన ప్రమాణాలు పాటించినట్లవుతుందన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు ప్రణాళికలు వేసుకుని వాటిని అమలు చేయడానికి కార్పొరేషన్ దృష్టి పెట్టాలన్నారు. రోడ్ల నిర్మాణం, నిర్వహణ కోసం ప్రత్యేక నిధి ఏపీఆర్డీసీ ద్వారా ఏర్పాటు కావాలన్న అధికారుల ప్రతిపాదనకు సీఎం అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలలో అమలవుతున్న విధానాలను అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమావేశంలో ఆర్అండ్బీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, ఎన్హెచ్ఏఐ ఆర్వో అనిల్ దీక్షిత్, ఆర్అండ్బీ చీఫ్ ఇంజనీర్లు మనోహర్ రెడ్డి, రాజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేగంగా జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ గుండుగొలను – కలపర్రు– గొల్లపూడి – మంగళగిరి బైపాస్ హైవేపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. దీన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఎక్కడ సమస్యలు వచ్చినా వెంటనే జోక్యం చేసుకుని వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. విజయవాడ నగరాన్ని ట్రాఫిక్ సమస్య నుంచి తప్పించేందుకు ఇదొక పరిష్కారం అవుతుందని సీఎం అన్నారు. అనకాపల్లి – ఆనందపురం రోడ్డు కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తవుతోందని ఎన్హెచ్ఏఐ అధికారులు సీఎంకు వివరించారు. ఒంగోలు– కత్తిపూడి జాతీయ రహదారికి సంబంధించి అక్కడక్కడ చిన్న స్థాయిలో పనులు మిగిలిపోయాయని, వాటిని త్వరలో పూర్తి చేస్తామని వారు చెప్పారు. రేణిగుంట నుంచి కడప, రేణిగుంట నుంచి నాయుడుపేట, నెల్లూరు నుంచి తడ వరకు ఆరు లేన్ల రహదారి.. తదితర ప్రాజెక్టుల గురించి వారు సీఎంకు వివరించారు. వైఎస్సార్ జిల్లా ముద్దనూరు నుంచి బెంగళూరు హైవేలోని కొడికొండ చెక్‌పోస్టు వరకు 150 కిలోమీటర్ల రహదారిని రూ.350 కోట్ల ఎన్డీబీ నిధులతో పది మీటర్ల మేర విస్తరించాలని సీఎం ఆదేశించారు. వశిష్ట గోదావరి పాయమీద సెకినేటిపల్లి వద్ద చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న బ్రిడ్జిని రూ.100 కోట్లతో పూర్తి చేయాలన్నారు. అనంతపురం జిల్లా కదిరి బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని ఈ ఏడాది ప్రణాళికలోనే పెట్టాలని అధికారులకు సూచించారు. రోడ్ల నిర్మాణంలో ప్లాస్టిక్ వినియోగం పర్యావరణ పరిరక్షణలో భాగంగా రోడ్ల నిర్మాణంలో ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నామని ఎన్హెచ్ఏఐ అధికారులు సీఎంకు వివరించారు. నగరాలు, పట్టణాల్లో సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఎన్హెచ్ఏఐకు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. దీనికోసం ఒక విధానాన్ని రూపొందించాలన్నారు. రేషన్ పంపిణీలో భాగంగా బియ్యాన్ని ప్యాక్ చేసేందుకు ఇస్తున్న సంచులను తిరిగి సేకరించి వాటిని పునర్ వినియోగించడం లేదా రోడ్ల నిర్మాణంలో ఉపయోగించేందుకు ఇవ్వాలని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాల సరఫరాపై ఎంఓయూకు సిద్ధంగా ఉన్నామని ఎన్హెచ్ఏఐ అధికారులు చెప్పారు. -
నేడు ఏపీఆర్జేసీ,డీసీ ప్రవేశ పరీక్ష
- విద్యార్థులు అరగంట ముందే చేరుకోవాలి - ‘పది’ దాటితే అనుమతి లేదు అనంతపురం ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు(ఏపీఆర్జేసీ), డిగ్రీ కళాశాల(డీసీ)ల్లో 2017–18 విద్యా సంవత్సరం ప్రవేశాలకు గురువారం పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లాకేంద్రంలో 45 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 10,618 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో డిగ్రీ ప్రవేశాలకు 199 మంది, ఇంటర్ ప్రవేశాలకు 10,419 మంది పరీక్ష రాయనున్నారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. విద్యార్థులను తొమ్మిది గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పది గంటల తర్వాత ఎట్టి పరిస్థితులలోనూ విద్యార్థులను అనుమతించొద్దని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మల్లీశ్వరిదేవి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె అనంతపురంలోని లిటిల్‌ఫ్లవర్ స్కూల్లో వారితో సమావేశం నిర్వహించారు. కనీసం అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. రూట్ ఆఫీసర్లు ఏడు గంటలకే కేఎస్ఆర్ బాలికల పాఠశాలకు చేరుకోవాలన్నారు. ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు బందోబస్తుతో ఆయా రూట్లకు ప్రశ్నపత్రాలు తరలిస్తామన్నారు. ఆరుగురు డిప్యూటీ కలెక్టర్లను ప్రత్యేకంగా నియమించామని, వారు ప్రతిదీ పర్యవేక్షిస్తారని తెలిపారు. ఎక్కడా మాస్‌కాపీయింగ్‌ను ప్రోత్సహించొద్దన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. అందరూ సమన్వయంతో పనిచేసి పరీక్ష ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. డీఈఓ లక్ష్మీనారాయణ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ మాట్లాడుతూ పరీక్షకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఉంటుందన్నారు. ఎవరైనా విద్యార్థులకు హాల్‌టికెట్ రాని పక్షంలో స్థానిక కేఎస్ఆర్ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటరులో డూప్లికేట్ హాల్‌టికెట్ పొందాలని సూచించారు. సమావేశంలో కోఆర్డినేటర్ వాసుదేవరెడ్డి పాల్గొన్నారు. -
12 న ఏపీడీఆర్‌సీ ప్రవేశ పరీక్ష
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి ఈనెల 12న ఏపీఆర్డీసీ ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. నాగార్జున సాగర్, కర్నూలు జిల్లాల్లోని డిగ్రీకళాశాలల్లో ప్రవేశానికి తెలంగాణ నుంచి 425మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష నిర్వహణ నిమిత్తం హైదరాబాద్‌లో సెయింట్ ప్యాట్రిక్స్ హైస్కూల్(సికింద్రాబాద్)ను, వరంగల్ జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల(హన్మకొండ)పరీక్షాకేంద్రాలుగా ఎంపిక చేసినట్లు సెట్ కన్వీనర్ సోమవారం తెలిపారు. హాల్‌టికెట్లు అందని అభ్యర్థులు www.aprs.cgg.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటలవరకు పరీక్ష జరగనుంది. -
12న ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ సెట్‌కు ఏర్పాట్లు
హైదరాబాద్: ఏపీఆర్జేసీ, ఏపీఆర్‌డీసీలలో ప్రవేశానికి ఈనెల 12న నిర్వహించనున్న కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సెట్ కన్వీనర్ పి. జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష జిల్లా కేంద్రాలలో ఆరోజు ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టరు, విద్యాశాఖాధికారి, జిల్లా కన్వీనర్ పర్యవేక్షణలో పరీక్ష జరుగుతుందని, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు నెట్లో హాల్‌టికెట్లను సీజీజీ.జీవోవీ.ఐఎన్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. కాగా విద్యార్థులు పరీక్షా కేంద్రానికి 10 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని, హాల్లోకి వచ్చిన వారు 12.30 గంటల వరకు బయటికి వెళ్లేందుకు అనుమతించవద్దని చీఫ్ సూపరింటెండెంట్‌కు ఆదేశించినట్లు తెలిపారు. ఓఎమ్ఆర్ షీట్లను బ్లాక్ లేదా బ్లూ బాల్‌పెన్స్ మాత్రమే వాడాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే నమూనా ఓఎంఆర్ షీట్లను నెట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.