- విద్యార్థులు అరగంట ముందే చేరుకోవాలి
- ‘పది’ దాటితే అనుమతి లేదు
అనంతపురం ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు(ఏపీఆర్‌జేసీ), డిగ్రీ కళాశాల(డీసీ)ల్లో 2017–18 విద్యా సంవత్సరం ప్రవేశాలకు గురువారం పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లాకేంద్రంలో 45 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 10,618 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో డిగ్రీ ప్రవేశాలకు 199 మంది, ఇంటర్ ప్రవేశాలకు 10,419 మంది పరీక్ష రాయనున్నారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. విద్యార్థులను తొమ్మిది గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పది గంటల తర్వాత ఎట్టి పరిస్థితులలోనూ విద్యార్థులను అనుమతించొద్దని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మల్లీశ్వరిదేవి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె అనంతపురంలోని లిటిల్‌ఫ్లవర్ స్కూల్‌లో వారితో సమావేశం నిర్వహించారు.
కనీసం అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. రూట్ ఆఫీసర్లు ఏడు గంటలకే కేఎస్‌ఆర్ బాలికల పాఠశాలకు చేరుకోవాలన్నారు. ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసు బందోబస్తుతో ఆయా రూట్లకు ప్రశ్నపత్రాలు తరలిస్తామన్నారు. ఆరుగురు డిప్యూటీ కలెక్టర్లను ప్రత్యేకంగా నియమించామని, వారు ప్రతిదీ పర్యవేక్షిస్తారని తెలిపారు. ఎక్కడా మాస్‌కాపీయింగ్‌ను ప్రోత్సహించొద్దన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
అందరూ సమన్వయంతో పనిచేసి పరీక్ష ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. డీఈఓ లక్ష్మీనారాయణ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ మాట్లాడుతూ పరీక్షకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఉంటుందన్నారు. ఎవరైనా విద్యార్థులకు హాల్‌టికెట్ రాని పక్షంలో స్థానిక కేఎస్‌ఆర్ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటరులో డూప్లికేట్ హాల్‌టికెట్ పొందాలని సూచించారు. సమావేశంలో కోఆర్డినేటర్ వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.
నేడు ఏపీఆర్‌జేసీ,డీసీ ప్రవేశ పరీక్ష
Published Wed, May 3 2017 11:14 PM | Last Updated on Tue, Sep 5 2017 10:19 AM
Advertisement