aprjc
-
ఓపికకు ‘పరీక్ష’
– సమస్యల నడుమ ఏపీఆర్జేసీ, డీసీ ప్రవేశ పరీక్ష – సౌకర్యాల కల్పనలో అధికారులు విఫలం – కనీసం తాగునీరు అందుబాటులోలేని వైనం అనంతపురం ఎడ్యుకేషన్ : ‘ఏ ఒక్క కేంద్రంలోనూ ఫర్నీచరు సమస్య తలెత్తకూడదు. ఒక్క విద్యార్థి కూడా నేలపై కూర్చుని రాయకూడదు. ఎక్కడైనా కేంద్రంలో ఫర్నీచరు లేకపోతే పరీక్ష రోజు ఉదయం 6 గంటలలోపు సమాచారం అందించినా పరీక్షా ప్రారంభ సమయానికి ఫర్నీచరు ఏర్పాటు చేస్తాం. అంతే తప్ప ప్రతి కేంద్రంలోనూ విధిగా ఫర్నీచరు ఉండాల్సిందే’...ముందురోజు జిల్లా రెవెన్యూ అధికారి మల్లీశ్వరిదేవి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులకు జారీ చేసిన ఆదేశాలు. అయితే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో 2017–18 విద్యా సంవత్సరం ప్రవేశాలకు గురువారం నిర్వహించిన పరీక్ష నిర్వహణలో ఈ ఆదేశాలు అమలుకాలేదు. విద్యార్థుల ఓపికకు పరీక్షలా మారింది. కనీస సదుపాయాలు కూడా కరువవడంతో విద్యార్థులు అల్లాడారు. మొత్తం 10,593 మంది విద్యార్థులకు గాను 9,669 మంది విద్యార్థులు హాజరయ్యారు. 924 మంది గైర్హాజరయ్యారు. 45 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్ష జరిగింది. విద్యార్థులు 9 గంటల నుంచే ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లా రెవెన్యూ అధికారి మల్లీశ్వరిదేవి, జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారాయణ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్, ఏపీఆర్జేసీ,డీసీ పరీక్ష కోఆర్డినేటర్ వాసుదేవరెడ్డి పర్యవేక్షించారు. తాగునీరు కరువు అసలే ఎండాకాలం తాగేందుకు నీరు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కొన్ని కేంద్రాల్లో అరకొరగా తాగునీరు సదుపాయం కల్పించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ముఖ్యంగా విద్యార్థినులకు తోడుగా బంధువులు వచ్చారు. కేంద్రాల వద్ద నీరు దొరకక వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు కొన్ని కేంద్రాల్లో ఫ్యాన్లు లేకపోవడంతో పరీక్ష ప్రారంభమైనçప్పటి నుంచే విద్యార్థులు అసౌకర్యానికి గురయ్యారు. ఫర్నీచరు లేక చాలా కేంద్రాల్లో విద్యార్థులు నేలపై కూర్చునే రాశారు. పరీక్ష ముగిసే సమయానికి మిట్టమధ్యాహ్నం కావడంతో ఊళ్లకు చేరుకునేందుకు విద్యార్థులు భగభగ మండుతున్న ఎండకు తట్టుకోలేక ఇబ్బంది పడ్డారు. -
నేడు ఏపీఆర్జేసీ,డీసీ ప్రవేశ పరీక్ష
- విద్యార్థులు అరగంట ముందే చేరుకోవాలి - ‘పది’ దాటితే అనుమతి లేదు అనంతపురం ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు(ఏపీఆర్జేసీ), డిగ్రీ కళాశాల(డీసీ)ల్లో 2017–18 విద్యా సంవత్సరం ప్రవేశాలకు గురువారం పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లాకేంద్రంలో 45 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 10,618 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో డిగ్రీ ప్రవేశాలకు 199 మంది, ఇంటర్ ప్రవేశాలకు 10,419 మంది పరీక్ష రాయనున్నారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. విద్యార్థులను తొమ్మిది గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పది గంటల తర్వాత ఎట్టి పరిస్థితులలోనూ విద్యార్థులను అనుమతించొద్దని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మల్లీశ్వరిదేవి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె అనంతపురంలోని లిటిల్‌ఫ్లవర్ స్కూల్లో వారితో సమావేశం నిర్వహించారు. కనీసం అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. రూట్ ఆఫీసర్లు ఏడు గంటలకే కేఎస్ఆర్ బాలికల పాఠశాలకు చేరుకోవాలన్నారు. ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు బందోబస్తుతో ఆయా రూట్లకు ప్రశ్నపత్రాలు తరలిస్తామన్నారు. ఆరుగురు డిప్యూటీ కలెక్టర్లను ప్రత్యేకంగా నియమించామని, వారు ప్రతిదీ పర్యవేక్షిస్తారని తెలిపారు. ఎక్కడా మాస్‌కాపీయింగ్‌ను ప్రోత్సహించొద్దన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. అందరూ సమన్వయంతో పనిచేసి పరీక్ష ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. డీఈఓ లక్ష్మీనారాయణ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ మాట్లాడుతూ పరీక్షకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఉంటుందన్నారు. ఎవరైనా విద్యార్థులకు హాల్‌టికెట్ రాని పక్షంలో స్థానిక కేఎస్ఆర్ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటరులో డూప్లికేట్ హాల్‌టికెట్ పొందాలని సూచించారు. సమావేశంలో కోఆర్డినేటర్ వాసుదేవరెడ్డి పాల్గొన్నారు. -
ఏపీఆర్జేసీ, డీసీ సెట్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం ఎడ్యుకేషన్ : 2017–18 విద్యా సంవత్సరంలో ఏపీఆర్ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కోఆర్డినేటర్ చంద్రశేఖర్‌రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీఆర్జేసీలో జనరల్ బాలురకు నాగార్జునసాగర్, కొడిగెనహళ్లి, గ్యారంపల్లి, వెంకటగిరి, జనరల్ బాలికలకు బనవాసి, నిమ్కూరు (కో ఎడ్యుకేషన్), తాటిపూడి కళాశాలలున్నాయన్నారు. అన్ని కళాశాలల్లోనూ ఎంసెట్, ఇంటెన్సివ్ కోచింగ్ ఉంటుందని వారు వివరించారు. డిగ్రీ కళాశాలలు నాగార్జున సాగర్ (బాలురు), కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాల (కో ఎడ్యుకేషన్) ఉన్నాయని వెల్లడించారు. ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, రూ.150 చెల్లించి ఏప్రిల్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రవేశ పరీక్ష మే 4న ఉంటుందన్నారు. -
ఏపీఆర్జేసీ ఫలితాలు విడుదల
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ప్రవేశ పరీక్షా ఫలితాలను మంగళవారం ఉదయం మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. విడుదల చేసిన ఫలితాల్లో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, జూనియర్, డిగ్రీ కాలేజీల ప్రవేశ పరీక్షా ఫలితాలు ఉన్నాయి. మార్కుల ఫలితాల ఆధారంగా రెసిడెన్షియల్ స్కూళ్లలో, కాలేజీల్లో విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ.. ప్రైవేట్ కాలేజీలకు నీట్ నుంచి మినహాయింపు లేదన్నారు. ప్రైవేట్ కాలేజీలో సీటుకు నీట్ తప్పనిసరిగా రాయాల్సిందేనని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి విద్యార్థులను నీట్‌కు సిద్ధం చేస్తామని చెప్పారు. -
జవాబుల్లేని ప్రశ్నలు.!
► విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం! ► ప్రశ్నపత్రాల్లో తరచూ తప్పులు ► మొన్న టెన్త్, నిన్న ఏపీఆర్జేసీ ► తప్పులకు బాధ్యులెవరని ప్రశ్నిస్తున్న విద్యార్థులు కర్నూలు(జిల్లా పరిషత్) : పరీక్షలు విద్యార్థుల భవిష్యత్‌ను నిర్దేశిస్తాయి. భవిష్యత్‌లో వారు ఏమి కావాలో దిశా నిర్దేశం చేస్తాయి. అలాంటి పరీక్షలకు ప్రశ్నపత్రాలను తయారు చేసే మేధావులు విద్యార్థుల జీవితంలో ఆడుకుంటున్నారు. సిలబస్‌లో లేనివి, సమాధానాలు లేనివి, ప్రశ్నే తప్పుగా ఇస్తూ విద్యార్థులను అయోమయానికి గురవుతున్నారు. అర్థంకాని ఈ ప్రశ్నలను చూసి నేర్చుకున్నవి కూడా మరిచిపోయేటట్లు చేస్తున్నారు. మొన్న జరిగిన పదో తరగతి పరీక్షల్లోనూ, నిన్న జరిగిన ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్షలోనూ ఇదే విధమైన తప్పులు దొర్లాయి. ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్షలో ప్రధానంగా విద్యార్థులకు పదో తరగతి సిలబస్‌లోని ప్రశ్నలు ఇవ్వాలి. కానీ ప్రశ్నపత్రం తయారు చేసే వారు పాతసిలబస్లోని ప్రశ్నలు ఇవ్వడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా రాయలేక బిక్కమొహం వేసుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. రేపు ఫలితాలు ఎలా వస్తాయోనన్న ఆందోళన వారికి ఇప్పటి నుంచే మొదలైంది. ఎవరో చేసిన తప్పుకు మేమెందుకు బలికావాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇన్సిట్యూట్ సొసైటీ వారు ఏపీ రెసిడెన్సియల్ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం ప్రతి యేటా ఏపీఆర్జేసీ సెట్ నిర్వహిస్తారు. ఈ యేడాది కూడా ఈ నెల 8వ తేదిన పరీక్ష నిర్వహించారు. పదో తరగతి సిలబస్ ఆధారంగా ప్రశ్నపత్రం తయారు చేస్తారు. ఎంపీసీ(మ్యాథ్స్), సైన్స్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బైపీసీలో బయాలజీ, సైన్స్ కలిపి 200 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. అయితే ఎంపీసీలో 12 ప్రశ్నలు పాతసిలబస్ నుంచి ఇవ్వగా, 5 ప్రశ్నలు సమాధానాలు లేనివి ఇచ్చారు. సైన్స్‌లో 14 ప్రశ్నలు పాతసిలబస్ నుంచి ఇచ్చారు. బైపీసీలో 16 ప్రశ్నలు పాతసిలబస్ నుంచి ఇచ్చారు. సైన్స్‌లో 14 ప్రశ్నలు అసలు సిలబస్‌లో లేనివి ఇచ్చారని విద్యార్థులు వాపోతున్నారు. ఆయా సబ్జక్టుల వారీగా విద్యార్థులను అయోమయానికి గురిచేసిన ప్రశ్నల వివరాలు ఇలా ఉన్నాయి. భౌతిక రసాయన శాస్త్ర విభాగంలో విభాగానికి సంబంధించిన ప్రశ్నపత్రంలో కోడ్ సిలో ఇచ్చిన పాతసిలబస్కు చెందిన ప్రశ్నలు(కొత్త సిలబస్‌లో లేనివి) 1. శుద్దగతి శాస్త్రం 118, 119, 122 ప్రశ్నలు 2. న్యూటన్ గమన నియమాలు 120, 121 ప్రశ్నలు 3. ధ్వని 111, 125 ప్రశ్నలు 4. బలం, పీడనం 111, 125 ప్రశ్నలు 5. ఘర్షణ 110 ప్రశ్న 6. సౌర కుటుంబం 115 ప్రశ్న 7. ద్రవాల పీడనం 123 ప్రశ్న 8. పెట్రోలియం, బొగ్గు 116 ప్రశ్న 9. సహజ దృగ్విషయాలు 114 ప్రశ్న 10. కృత్రిమ దారాలు 113 ప్రశ్న -బయాలజిలోని కోడ్ సిలో 51, 54, 60, 68, 72, 79, 80, 84, 87, 88, 90, 91, 92, 93, 96, 98 కలిపి మొత్తం 16 ప్రశ్నలు పాత సిలబస్ నుంచి ఇచ్చారు. జవాబులు లేని ప్రశ్నలు శ్రేఢులు 80, 81, 82 ప్రశ్నలు త్రికోణమితి 97వ ప్రశ్న వర్గబహులు 65వ ప్రశ్న 66వ ప్రశ్న సిలబస్‌లో లేనిది ఇచ్చారు. -
16 నుంచి ఏపీఆర్జేసీ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశానికి ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు గురుకుల విద్యాలయ సంస్థ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణ ప్రాంత విద్యార్థులకు నల్లగొండ జిల్లా సర్వేల్, హసన్‌పర్తిలోని ఏపీఆర్జేసీలో 16, 18, 20 తేదీల్లో కౌన్సెలింగ్ ఉంటుందని, ఆంధ్రా ప్రాంత విద్యార్థులకు కృష్ణా జిల్లా నిమ్మకూరు ఏపీఆర్జేసీలో ఈనెల 16, 18, 20 తేదీల్లో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. రాయలసీమ విద్యార్థులకు కర్నూలు సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజీలో కౌన్సెలింగ్ ఉంటుందని చెప్పారు. పూర్తి వివరాలను తమ వెబ్సైట్లో (aprjdc.cgg.gov.in)) ఉంచామన్నారు. తెలంగాణలో విద్యారంగంపై నేడు సదస్సు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అందరికీ నాణ్యమైన విద్యను అందించేందుకు, కొత్త రాష్ట్రంలో విద్యా రంగం తీరుతెన్నులపై చర్చించేందుకు ఈనెల 14న రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొండల్‌రెడ్డి, మనోహర్‌రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమానికి మంత్రులు హరీశ్‌రావు, జగదీష్‌రెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు. నేటి నుంచి పీసెట్ ప్రవేశ పరీక్షలు ఏఎన్‌యూ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 2014-15 విద్యా సంవత్సరంలో బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి వీలుగా శనివారం నుంచి మహిళా కేటగిరీలో పీసెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 50,001 నంబర్ హాల్‌టికెట్ నుంచి 50,890 నంబర్ వరకు గల అభ్యర్థులకు పరీక్షలు జరుగుతాయని పీసెట్ కన్వీనర్ ఆచార్య వై. కిషోర్ తెలిపారు. శుక్రవారం జరిగిన పురుషుల విభాగం పీసెట్ ప్రవేశ పరీక్షలకు 716 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. -
12న ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ సెట్‌కు ఏర్పాట్లు
హైదరాబాద్: ఏపీఆర్జేసీ, ఏపీఆర్‌డీసీలలో ప్రవేశానికి ఈనెల 12న నిర్వహించనున్న కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సెట్ కన్వీనర్ పి. జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష జిల్లా కేంద్రాలలో ఆరోజు ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టరు, విద్యాశాఖాధికారి, జిల్లా కన్వీనర్ పర్యవేక్షణలో పరీక్ష జరుగుతుందని, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు నెట్లో హాల్‌టికెట్లను సీజీజీ.జీవోవీ.ఐఎన్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. కాగా విద్యార్థులు పరీక్షా కేంద్రానికి 10 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని, హాల్లోకి వచ్చిన వారు 12.30 గంటల వరకు బయటికి వెళ్లేందుకు అనుమతించవద్దని చీఫ్ సూపరింటెండెంట్‌కు ఆదేశించినట్లు తెలిపారు. ఓఎమ్ఆర్ షీట్లను బ్లాక్ లేదా బ్లూ బాల్‌పెన్స్ మాత్రమే వాడాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే నమూనా ఓఎంఆర్ షీట్లను నెట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.