సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశానికి ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు గురుకుల విద్యాలయ సంస్థ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణ ప్రాంత విద్యార్థులకు నల్లగొండ జిల్లా సర్వేల్, హసన్‌పర్తిలోని ఏపీఆర్‌జేసీలో 16, 18, 20 తేదీల్లో కౌన్సెలింగ్ ఉంటుందని, ఆంధ్రా ప్రాంత విద్యార్థులకు కృష్ణా జిల్లా నిమ్మకూరు ఏపీఆర్‌జేసీలో ఈనెల 16, 18, 20 తేదీల్లో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. రాయలసీమ విద్యార్థులకు కర్నూలు సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజీలో కౌన్సెలింగ్ ఉంటుందని చెప్పారు. పూర్తి వివరాలను తమ వెబ్‌సైట్‌లో (aprjdc.cgg.gov.in)) ఉంచామన్నారు.
తెలంగాణలో విద్యారంగంపై నేడు సదస్సు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అందరికీ నాణ్యమైన విద్యను అందించేందుకు, కొత్త రాష్ట్రంలో విద్యా రంగం తీరుతెన్నులపై చర్చించేందుకు ఈనెల 14న రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొండల్‌రెడ్డి, మనోహర్‌రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమానికి మంత్రులు హరీశ్‌రావు, జగదీష్‌రెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు.
నేటి నుంచి పీసెట్ ప్రవేశ పరీక్షలు
ఏఎన్‌యూ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 2014-15 విద్యా సంవత్సరంలో బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి వీలుగా శనివారం నుంచి మహిళా కేటగిరీలో పీసెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 50,001 నంబర్ హాల్‌టికెట్ నుంచి 50,890 నంబర్ వరకు గల అభ్యర్థులకు పరీక్షలు జరుగుతాయని పీసెట్ కన్వీనర్ ఆచార్య వై. కిషోర్ తెలిపారు. శుక్రవారం జరిగిన పురుషుల విభాగం పీసెట్ ప్రవేశ పరీక్షలకు 716 మంది హాజరయ్యారని పేర్కొన్నారు.