భారత్, చైనా, రష్యాలతో సహా వివిధ దేశాలపై అమెరికా ఆంక్షల రూపంలో వాణిజ్య యుద్ధానికి కాలు దువ్వుతున్న ప్రస్తుత సందర్భంలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్) దేశాల శిఖరాగ్ర సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి మూడురోజుల పాటు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో బ్రిక్స్ పదవ వార్షిక సమావేశం జరగనుంది. బ్రిక్స్ దేశాల అధినేతలు, ఉన్నత స్థాయి బృందాల మేధోమథనంలో ప్రధానంగా సభ్య దేశాల మధ్య రాజకీయ, సామాజికఆర్థిక సమన్వయం, వ్యాపార,వాణిజ్య అవకాశాలు, ఏయే రంగాల్లో సహకారం అవసరమన్న అంశాలు చర్చకు రానున్నాయి. ఇప్పటికే ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ, రాజకీయాలపై చారిత్రక, వ్యూహాత్మక దృష్టికోణంతో బ్రిక్స్ తనదైన ముద్ర వేసింది. అమెరికా ప్రయోజనాల పరిరక్షణ పేరిట ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దుందుడుకు చర్యల ప్రభావం తమపై ఏ మేరకు పడుతుంది ? వాటి వల్ల జరిగే హాని, బయటపడే మార్గం ఏమిటన్న దానిపై ఈ దేశాలు కూలంకశంగా చర్చించవచ్చునని తెలుస్తోంది. భారత్‌లో సీమాంతర ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ ప్రోత్సహించడాన్ని గురించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
పదేళ్ల ప్రస్థానం...
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఏర్పడిన సందర్భంగా 2009 జూన్‌లో రష్యాలోని యెకటెరిన్‌బర్గ్‌లో బ్రిక్స్ మొదటి శిఖరాగ్ర సమావేశం ( 2010లో దక్షిణాఫ్రికా చేరింది) జరిగింది. ఒక్కో సంవత్సరం ఒక్కో సభ్యదేశంలో ఈ భేటీని ఏర్పాటు చేస్తున్నారు. మనదేశంలో 2012 మార్చిలో ఢిల్లీలో, 2016 అక్టోబర్‌లో గోవాలో ఈ భేటీ జరిగింది. 2010లో బ్రెజిల్‌లో, 2011లో చైనాలో, 2013లో దక్షిణాఫ్రికాలో, 2014లో బ్రెజిల్‌లో, 2015లో రష్యాలో, 2017లో చైనాలో ఈ సమావేశాలు జరిగాయి.
2014లో సభ్యదేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని వ్యవస్థీకరించే ఉద్ధేశ్యంతో న్యూడెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డీబీ)తో పాటు కాంటింజెంట్ రిజర్వ్ అరెంజ్‌మెంట్ (సీఆర్‌ఏ) సౌకర్యాన్ని ఏర్పాటుచేసుకోవడం గొప్ప విజయంగా చెబుతున్నారు. గతేడాది చైనాలో జరిగిన భేటీలో విలువలు, ఆకాంక్షలకు అనుగుణంగా సభ్యదేశాలు పునరంకితం కావాలని తీర్మానించాయి.ఎన్‌డీబీ ద్వారా ఆశించిన పురోగతి సాధ్యమైందని, ఈ బ్యాంక్ ద్వారా చేపట్టిన 11 ప్రాజెక్టులలో స్థిరమైన మౌలికవనరుల అభివృద్ధి సాధ్యమని భావిస్తున్నారు. 2017-18కు సంబంధించి ఈ బ్యాంకు ఆధ్వర్యంలో పరస్పర సహకారంలో భాగంగా చేపట్టిన మొత్తం 23 ప్రాజెక్టులు (600 కోట్ల అమెరికన్ డాలర్లు) వివిధ దశల్లో ఉన్నాయి.
-సభ్యదేశాల మధ్య మెరుగైన ఆర్థిక సంబంధాలు సాధించే దిశలో పురోగమనం సాధించడంలో బ్రిక్స్ సఫలమైందనే అభిప్రాయంతో నిపుణులున్నారు. ఈ ఐదు దేశాల్లోని లక్షలాది మంది ప్రజలకు స్థిరమైన ప్రయోజనాలు కలిగించిందని దర్భన్‌లోని చైనా కౌన్సల్‌జనరల్ వాంగ్ జియాంగ్‌జౌ తెలిపారు.పదేళ్లలో బ్రిక్స్ జీడీపీ 179 శాతం వృద్ధి చెందిందని ,, వాణిజ్యం 94 శాతం పెరిగిందని ఆయన చెబుతున్నారు. బ్రిక్స్ ఆర్థికాభివృద్ధి రేటు 8 శాతానికి చేరుకుంటుందని ఆశిస్తున్నామని, అదే సమయంలో ప్రపంచ సగటు మాత్రం కేవలం ఒక శాతమే ఉందని దక్షిణాఫ్రికా స్టాండర్డ్‌బ్యాంక్ ఆర్థికవేత్త జెర్మీ స్టీవెన్స్ తెలిపారు.
చర్చించే అంశాలివే...
అంతర్జాతీయ శాంతి, భద్రత, వాణిజ్యపరమైన అంశాలతో పాటు ఈ భేటీలో ఆరోగ్య పరిరక్షణ-వ్యాక్సిన్లు, మహిళల సామాజిక, ఆర్థిక సాధికారత, శాంతి పరిరక్షణ, సైన్స్, సాంకేతిక, మౌలిక సదుపాయాల అభివృద్ధిరంగాల్లో సహకారం, స్థిరమైన అభివృద్ధి, సమ్మిళిక పురోగతి, గ్లోబల్ గవర్నెన్స్ తదితర అంశాలు చర్చనీయాంశం కానున్నాయి.
బ్రిక్స్ చరిత్ర ఇదీ...
2001లో బ్రిక్ అనే పదాన్ని (ప్రపంచ ఆర్థికశక్తులు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలు ఎదుగుతున్న క్రమంలో) బ్రిటన్ ఆర్థికవేత్త జిమ్ ఓనీల్ ప్రతిపాదించారు.
2006 నుంచి ఈ నాలుగుదేశాలు క్రమం తప్పకుండా సమావేశమవుతున్నాయి. న్యూయార్క్‌లో ఐరాస వార్షిక జనరల్ అసెంబ్లీ సందర్భంగా ఈ దేశాల విదేశాంగ మంత్రులు సమావేశమయ్యారు.అదే ఏడాది జీ-8 నాయకులు తమ భేటీకి హాజరుకావాలని భారత్, బ్రెజిల్, చైనా దేశాల అధ్యక్షులను ఆహ్వానించారు.
2009లో మొదటి బ్రిక్స్ సమావేశానికి రష్యా వేదికైంది.
ప్రపంచ రాజకీయ,ఆర్థికరంగానికి సంబంధించిన సంస్థ రూపాన్ని 2010లో బ్రిక్స్ సంతరించుకుంది.
2010 డిసెంబర్‌లో ఆఫ్రికా ఖండం నుంచి ఏకైక ప్రతినిధిగా దక్షిణాప్రికా ఈ సభ్యదేశాల్లో ఒకటిగా చేరింది. పేరు బ్రిక్స్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment