బ్రిక్స్ అధ్యక్షుడుగా కె.వి.కామత్
న్యూ ఢిల్లీ: బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల వాణిజ్యాభివృద్ధికి ఉద్దేశించిన బ్రిక్స్ బ్యాంక్ అధ్యక్షుడుగా కే వీ కామత్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంకు చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కామత్ ఈ పదవిలో ఐదేళ్ళు కొనసాగుతారు . ఐదు దేశాల కూటమికి 2001లో బ్రిక్స్ గా నామకరణం చేశారు. ఈ బ్యాంకుకు అధ్యక్షుడిని నామినేట్ చేసే అవకాశం భారత్‌కు లభించింది. భారత్ తర్వాత బ్రెజిల్, రష్యాలు ఐదేళ్ల చొప్పున సారథ్యం వహిస్తాయని అధికార వర్గాలు వెల్లడించాయి.
కాగా పాశ్చాత్య దేశాలు పెత్తనం చెలాయిస్తున్న అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థ రూపురేఖలు మార్చేందుకు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాదేశాలు సంయుక్తంగా ఏర్పాటు చేసుకున్న బ్రిక్స్ బ్యాంకును భవిష్యత్తు ప్రపంచ బ్యాంకుగా గ్లోబల్ ఫైనాన్షియల్ సంస్థ గోల్డ్‌మన్ సాచే అసెట్ మేనేజ్‌మెంట్ గతంలో అభివర్ణించింది. ఆర్థిక విశ్లేషకులు కూడా బ్రిక్స్ బ్యాంక్ ఆవిర్భావంపై హర్షం వ్యక్తం చేశారు.