గజ్వేల్, న్యూస్‌లైన్: గజ్వేల్ నియోజకవర్గంలో చేపట్టిన ‘మంజీర’ మంచినీటి పథకం టెండర్ల ప్రక్రియలో నెలకొన్న జాప్యానికి తెర పడనుంది. సాధారణ ఎన్నికల ‘కోడ్’ ముంచుకొస్తున్న వేళ.. అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ పథకానికి ఏడాదిన్నర క్రితం ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ (నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్) పథకం కింద రూ.40 కో ట్లు మంజూరుకాగా.. ఇందులో రెండు నెలల క్రితం రూ.10 కోట్లకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయ్యింది.
మిగతా రూ.30 కోట్లకు సంబంధించిన టెండర్ల ప్రక్రియలో జాప్యం నెలకొనగా ఈ వ్యవహారం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. మరో 15 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తిచేసే దిశగా హైదరాబాద్‌లోని ఇంజినీరింగ్ చీఫ్(ఈఎన్‌సీ) వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. ‘మంజీర’ పథకం పను లు పూర్తి చేయడానికి మంజూరైన నిధులతో తూప్రాన్, వర్గల్, ములుగు, గజ్వేల్, జగదేవ్‌పూర్ మండలాల్లోని 129 గ్రామాల్లో పైప్‌లైన్ విస్తరణ పనులు చేపట్టాల్సి ఉంది. అంతేగాకుండా పలుచోట్ల ఓహెచ్‌బీఆర్ ట్యాంకుల నిర్మాణం జరగనుంది.
కానీ కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం స్టేట్ టెక్నికల్ కమిటీ అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉండగా ఈ ప్రక్రియలో నెలలతరబడి జాప్యం నెలకొంది. ఫలితంగా ప్రభుత్వం మంజూరుచేసిన రూ.40 కోట్లల్లో కేవలం రూ.10 కోట్లకు సంబంధించి మాత్రమే ఈ ప్రక్రియ పనులు సాగుతున్నాయి. మిగిలిన రూ.30కోట్ల వినియోగానికి కూడా ప్రభుత్వం ఆమోదం పలికింది. ఇందుకు సంబంధించి ఇటీవల హైదరాబాద్‌లోని ఈఎన్‌సీ కార్యాలయ వర్గాలు టెండర్లను నిర్వహించినా సాంకేతిక లోపాల కారణంగా దీనిని నిలిపివేశారు.
రీ-టెండర్ ప్రక్రియ వేగవతం
‘మంజీర’ పథకానికి సంబంధించి రీ-టెండర్ ప్రక్రియను వేగంగా పూర్తిచేయడానికి అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే నర్సారెడ్డి సైతం ఇందుకు సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంతో రీ-టెండర్ పక్రియను చేపడుతున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ గడువు కూడా పూర్తయ్యింది. మరో 15 రోజుల్లో టెండర్‌ను పూర్తిచేసి నిధులను వినియోగించే అవకాశం కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నారు. ఈ వ్యవహారంపై స్థానిక ఆర్‌డబ్ల్యూఎస్ ఇన్‌చార్జి డిప్యూటీఈఈ మోహన్‌రెడ్డి ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ కొద్దిరోజుల్లోనే టెండర్ ప్రక్రియ పూర్తయి నిధులు విడుదలయ్యే అవకాశాలున్నాయని చెప్పారు.
కొలిక్కి వచ్చిన ‘మంజీర’!
Published Thu, Jan 30 2014 2:32 AM | Last Updated on Tue, Oct 9 2018 4:44 PM
Advertisement
Advertisement