తెలంగాణలోని రెండు నియోజకవర్గాలు అన్ని పార్టీలకు హాట్ టాపిక్‌గా మారాయి. కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు కూడా గట్టిగానే ఉన్నారు. కామారెడ్డిలో పీసీసీ చీఫ్ రేవంత్ పోటీ చేస్తున్నారు. గజ్వేల్‌లో బీజేపీ నేత ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు. కేసీఆర్ రెండు స్థానాల్లో పోటీ చేయడమే ఆసక్తికరం కాగా.. రెండు చోట్లా బరిలో ఉన్న ప్రత్యర్థులు కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నారు. గజ్వేల్‌లో రెండుసార్లు గెలిచిన కేసీఆర్ హ్యట్రిక్ సాధించడానికి సిద్ధమవుతున్నారు. అక్కడ ప్రధాన పార్టీల ప్రచారం ఎలా ఉందంటే..
ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో గులాబీ పార్టీ ప్రచార బాధ్యతలు మంత్రి హరీష్‌రావు నిర్వహిస్తున్నారు. హరీష్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతోంది. స్థానిక ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రజలకు తాము చేసిన అభివృద్ధి గురించి, బీఆర్ఎస్ మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరంగా చెబుతూ ప్రచారం చేస్తున్నారు. ఈసారి గులాబీ బాస్‌కు లక్షకు పైగా మెజారిటీ రావాలనే లక్ష్యంతో ప్రచారం సాగిస్తున్నారు. హరీష్ రావు ఇప్పటివరకు నాలుగు మండలాల్లో ప్రచారం పూర్తి చేశారు. ఇక నియోజకవర్గ నేతలందరూ పార్టీ శ్రేణులతో కలిసి గజ్వేల్ సెగ్మెంట్‌లోని అన్ని మండలాల్లో కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు.
బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గతంలో ప్రకటించినట్టుగానే హుజూరాబాద్, గజ్వేల్ నుండి కమలం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ రెండు నియోజకవర్గాల్లోనూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఈటల ప్రచారం పూర్తయింది. గజ్వేల్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ అసంతృప్త నేతలకు బీజేపీ కండువా కప్పి కమలం గూటికి ఆహ్వానించారు. పలు గ్రామాల సర్పంచులు కూడా ఈటల సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. కేసీఆర్ ఓటమే తన లక్ష్యంగా జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడినుంచే రెండుసార్లు గెలిచి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ నియోజకవర్గంలోనే ఇప్పటివరకు సమస్యలు తీరకపోవడం సిగ్గుచేటు అంటూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు.
గజ్వేల్ ప్రజలు రెండుసార్లు మంచి మనసుతో కేసీఆర్‌ను గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తే.. పదేళ్ళయినా నియోజకవర్గంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని మరోసారి గెలిపిస్తే ప్రజలకు అధోగతే అని కాంగ్రెస్ అభ్యర్థి తూముకుంట నర్సారెడ్డి ప్రజలకు వివరిస్తున్నారు. కేసీఆర్, ఈటల రాజేందర్‌లకు ఈ నియోజకవర్గంతో సంబంధం లేదని.. కేసీఆర్‌ది పక్క నియోజకవర్గం అయితే.. ఈటల పక్క జిల్లాకు చెందిన నాయకుడని.. తాను మాత్రం ఎల్లప్పుడూ ప్రజలతో గజ్వేల్‌లోనే ఉంటానని చెబుతున్నారు. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా గజ్వేల్‌లో, రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని నర్సారెడ్డి తన ప్రచారంలో ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2009లో ఒకసారి తూముకుంట నర్సారెడ్డి గజ్వేల్‌లో విజయం సాధించారు.
గజ్వేల్‌లో ఏ పార్టీ గెలుస్తుందో రాష్ట్రంలో ఆ పార్టీకే అధికారం దక్కడం ఒక విశేషం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ గజ్వేల్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. మూడోసారి కూడా ఇక్కడి నుంచి పోటీలో ఉన్నారు. ధరణి పోర్టల్ బాధితులు, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ నిర్వాసితుల బాధితులు, నిజామాబాద్లో చెరుకు ఫ్యాక్టరీ కోసం భూములు కోల్పోయిన రైతులు గజ్వేల్‌లో 127 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కొన్ని నామినేషన్లు తిరస్కరణకు గురికాగా.. 70 మంది అభ్యర్థులు విత్ డ్రా చేసుకున్నారు. ప్రస్తుతం గజ్వేల్ పోటీలో మొత్తం 44 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
గతంలో సిద్ధిపేట నుంచి గెలిచిన గులాబీ బాస్ కేసీఆర్.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక గజ్వేల్‌కు మారారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో లోక్‌సభకు పోటీ చేసిన కేసీఆర్.. సిద్దిపేట నియోజకవర్గాన్ని హరీష్‌రావుకు అప్పగించారు. అక్కడి నుంచి హరీష్‌రావు వరుసగా గెలుస్తూనే ఉన్నారు. గత రెండు ఎన్నికల్లోనూ గజ్వేల్‌లో కేసీఆర్ భారీ మెజారిటీతో గెలిచారు. గత ఎన్నికల్లో 58 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించిన కేసీఆర్ మెజారిటీని ఈసారి లక్ష దాటించాలని గులాబీ శ్రేణులు లక్ష్యంగా పెట్టుకున్నాయి. మరి గజ్వేల్ ప్రజలు ఎవరిని గెలిపిస్తారో చూడాలి..
Comments
Please login to add a commentAdd a comment