NDB
-
జిల్లా రహదారులకు మహర్దశ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని జిల్లా, మండల ప్రధాన రహదారుల నిర్మాణం వేగం పుంజుకోనుంది. దాదాపు రూ.6,400 కోట్లతో ఆమోదించిన 2,512 కి.మీ. మేర రోడ్ల నిర్మాణానికి బాలారిష్టాలు తొలగిపోయాయి. ఇప్పటికే మొదటి దశ పనులు మొదలు పెట్టిన ఆర్‌అండ్‌బీశాఖ ఇక రెండో దశ టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు ఉద్యుక్తమవుతోంది. కాంట్రాక్టర్లకు తక్షణం బిల్లుల చెల్లింపు.. జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణం వేగవంతం చేయడం కోసం ప్రభుత్వం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ నిధులను పూర్తిగా రోడ్ల నిర్మాణానికే వెచ్చించేందుకు కేంద్రం సూచించిన విధంగా ప్రత్యేక ఫండ్ అకౌంట్ ఏర్పాటు చేసింది. అందుకోసం కేంద్ర ఆర్థిక శాఖలోని డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ (డీఈఏ) నుంచి అనుమతి పొంది ప్రత్యేక ఖాతాను తెరిచింది. దాంతో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు మరింత వేగవంతం కానుంది. పనులు పూర్తి చేసి బిల్లులు అప్లోడ్ చేయగానే ఆ ప్రత్యేక ఖాతాల నుంచి నేరుగా కాంట్రాక్టర్లకు బిల్లులు మొత్తం చెల్లిస్తారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రోడ్ల నిర్మాణానికి తీసుకొచ్చిన రూ.3 వేల కోట్లను ఇతర అవసరాలకు మళ్లించారు. దాంతో రోడ్ల నిర్వహణ అధ్వానంగా తయారైంది. దీనికి పరిష్కారంగా ప్రత్యేక ఖాతాల్లో నిధులు జమ చేసి.. నేరుగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే పారదర్శక విధానాన్ని అవలంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.6,400 కోట్లతో రెండు దశల్లో 2,512 కి.మీ. మేర జిల్లా, మండల ప్రధాన రహదారులను నిర్మించనున్నారు. మొదటి దశలో రూ.3,014 కోట్లతో 1,244 కి.మీ. రోడ్ల నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే 60 కి.మీ. పనులు పూర్తి చేశారు. ఇక రెండో దశలో రూ.3,386 కోట్లతో 1,268 కి.మీ. మేర రహదారులను ఏప్రిల్‌నాటికి నిర్మిస్తారు. అందుకోసం ఆర్అండ్బీ శాఖ త్వరలోనే టెండర్ల ప్రక్రియ చేపట్టనుంది. -
రయ్.. రయ్ రహదారులు
సాక్షి, అమరావతి: రహదారుల అభివృద్ధికి భారీ కార్యాచరణ ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి చేరుకునేందుకు ఇరుకు రహదారులపై అవస్థలతో కూడిన ప్రయాణానికి ఇక తెర పడనుంది. రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, ఒక మండల కేంద్రం నుంచి మరో మండల కేంద్రానికి రెండు లేన్ల రహదారుల అభివృద్ధి ప్రణాళికను ప్రభుత్వం ఖరారు చేసింది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్(ఎన్డీబీ) నుంచి రూ.6,400 కోట్ల రుణంతో రాష్ట్రంలో రెండు దశల్లో 2,500 కి.మీ.మేర రోడ్లు నిర్మించనున్నారు. ఇందుకోసం తొలిసారిగా ‘ప్రత్యేక ఫండ్ అకౌంట్’ తెరవాలని నిర్ణయించడం విశేషం. రోడ్ల కోసం ‘ప్రత్యేక ఫండ్ అకౌంట్’ రాష్ట్రంలో రహదారులకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్బీడీ బ్యాంకు రుణంతో జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణం శరవేగంగా చేపట్టేందుకు ప్రత్యేక ఫండ్ అకౌంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈమేరకు ఆర్ అండ్ బి శాఖ ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో జిల్లా ప్రధాన రహదారుల అభివృద్ధికి ఎన్డీబీతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. మొదటి దశలో రూ.3,014 కోట్లతో 1,244 కి.మీ. మేర రోడ్లు నిర్మించనున్నారు. రెండో దశలో రూ.3,386 కోట్లతో 1,268 కి.మీ. మేర రహదారులు నిర్మిస్తారు. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థలు పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు ‘ప్రత్యేక ఫండ్ అకౌంట్’ను తెరవాలని తాజాగా నిర్ణయించారు. ఎన్డీబీ రుణ మొత్తాన్ని ఆ ఖాతాలో జమ చేస్తారు. బిల్లుల చెల్లింపులో జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటారు. టీడీపీ హయాంలో 2018లో రోడ్ల నిర్మాణం కోసం తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణాన్ని ఎన్నికల ప్రయోజనాల కోసం ‘పసుపు–కుంకుమ’ పథకానికి మళ్లించారు. ఫలితంగా చాలా చోట్ల రహదారులు అధ్వాన్నంగా మారాయి. ఈ నేపథ్యంలో ఎన్డీబీ నిధులను పూర్తిగా రోడ్ల నిర్మాణానికే వ్యయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకోసం కేంద్ర ఆర్థిక శాఖలోని డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్(డీఈఏ) అనుమతి కోరనుంది. ఆ వెంటనే ప్రత్యేక ఫండ్ అకౌంట్‌ను తెరుస్తారు. తొలిదశలో రూ.3,014 కోట్లతో 1,244 కి.మీ. రోడ్లు ఎన్డీబీ నిధులతో మొదటి దశలో రాష్ట్రంలో మండల కేంద్రాలను జిల్లా కేంద్రంతోనూ, సమీపంలోని మండల కేంద్రంతోనూ అనుసంధానిస్తూ 1,244 కి.మీ. మేర రెండు లేన్ల రోడ్లు నిర్మిస్తారు. అందుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇవ్వడంతో రూ.3,014 కోట్లతో మొత్తం 124 పనులకు టెండర్లు కూడా ఖరారు చేసి పనులు ప్రారంభించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.85.43కోట్ల ప్రజాధనాన్ని కూడా ఆదా చేశారు. వర్షాలు తగ్గిన వెంటనే ఈ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని ఆర్ అండ్ బి శాఖ నిర్ణయించింది. రెండో దశలో రూ.3,386 కోట్లతో 1,268 కి.మీ. రోడ్లు ఎన్డీబీ నిధులతో రెండోదశలో 1,268 కి.మీ. మేర జిల్లా ప్రధాన రహదారులను నిర్మిస్తారు. రూ.3,386 కోట్లతో నిర్మించే ఈ రోడ్ల కోసం డీపీఆర్ రూపొందిస్తున్నారు. అక్టోబరులో టెండర్ల ప్రక్రియ నిర్వహించి డిసెంబరులో పనులు ప్రారంభించి వేసవికి పూర్తి చేయాలన్నది ఆర్ అండ్ బి శాఖ ప్రణాళిక. జిల్లా కేంద్రాలకు మెరుగైన రవాణా వసతి రూ.6,400 కోట్లతో జిల్లా ప్రధాన రహదారులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక ఖరారు చేసింది. ఈ పనులకు ప్రత్యేక ఫండ్ అకౌంట్ తెరవాలని నిర్ణయించింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు మెరుగైన రోడ్ కనెక్టివిటీ కల్పిస్తాం. –కె.వేణుగోపాల్‌రెడ్డి, ఈఎన్సీ, ఆర్ అండ్ బి ఏపీలో జాతీయ రహదారులను అభివృద్ధి చేయండి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారులు అభివృద్ధి చేయాలని కేంద్ర జాతీయ రహదారులు, రహదారి రవాణా కార్యదర్శి గిరిధర్ అరిమానేను రాష్ట్ర మంత్రి శంకరనారాయణ కోరారు. మంగళవారం వైఎస్సార్సీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, రాష్ట్ర రహదారులు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తదితరులతో కలిసి కేంద్ర కార్యదర్శితో మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న జాతీయ రహదారుల పనులు, నూతనంగా మంజూరు కావాల్సిన రహదారులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి చర్చించారు. కేంద్ర హైవేల శాఖ కార్యదర్శి గిరిధర్ అరిమానేతో రాష్ట్ర మంత్రి శంకరనారాయణ తదితరులు అనంతరం మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ.. బెంగళూరు విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ రహదారి నిర్మాణ పనులు వీలైనంత త్వరగా చేపట్టాలని కోరామన్నారు. విశాఖబీచ్ రోడ్డు–పోర్టు కనెక్టివిటీ, విజయవాడ ఈస్ట్రన్ బైపాస్ పనులు, విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద పనుల పురోగతి వివరించి త్వరగా పూర్తి చేయాలని కోరామన్నారు. బుగ్గ–గిద్దలూరు నాలుగు లేన్ల రహదారి ప్రతిపాదన, గతంలో జాతీయ రహదారులుగా ప్రకటించాలని కోరిన హిందూపురం–ముద్దనూరు, పావగడ–బుక్కపట్నం, రాజంపేట–కదిరి పనుల గురించి గిరిధర్‌తో చర్చించామన్నారు. ప్యాపిలి–బనగానపల్లి, గుత్తి నుంచి కర్ణాటక సరిహద్దు, దామాజిపల్లి నుంచి ధర్మవరం మీదుగా ఎన్‌హెచ్544డీ కనెక్షన్ రోడ్డు, మడకశిర–బుక్కపట్నం రోడ్డు తదితర పది రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని కోరామన్నారు. -
రహదారుల విస్తరణకు ఒప్పందాలు పూర్తి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం, న్యూడెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) సంయుక్త నిధులు రూ.1,860 కోట్లతో చేపట్టే రహదారుల అభివృద్ధి పనులకు ఒప్పందాలు పూర్తయ్యాయి. రెండేళ్లలో రహదారుల విస్తరణ పనులను పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం 12 కాంట్రాక్టు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇవి ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో 13 జిల్లాల్లో 1,200 కి.మీ. మేర రోడ్ల విస్తరణ చేపట్టనున్నాయి. 13 జిల్లాల్లో మూడు ప్యాకేజీల కింద ఎన్డీబీ టెండర్లను గతేడాది నవంబర్‌లో పూర్తి చేశారు. రివర్స్ టెండర్లు నిర్వహించగా.. రూ.81.58 కోట్లు ఆదా అయిన సంగతి తెలిసిందే. ఏటా 11.8 శాతం ట్రాఫిక్ వృద్ధి ఏపీలో ఏటా 11.8 శాతం ట్రాఫిక్ వృద్ధి చెందుతోందని ఎన్డీబీ సర్వేలో వెల్లడైంది. ఇందుకు తగ్గట్టుగా రోడ్ల విస్తరణ, వంతెనల పునర్నిర్మాణ పనులకు రుణ సాయం అందించేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. విడతలవారీగా రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీబీ మొత్తం రూ.6,400 కోట్లను రహదారుల విస్తరణ పనులకు కేటాయించనున్నాయి. రాష్ట్రంలో ఏపీ మండల కనెక్టివిటీ అండ్ రూరల్ కనెక్టివిటీ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు (ఏపీఎంసీఆర్‌సీఐపీ), ఏపీ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ రీ కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టు (ఏపీఆర్‌బీఆర్‌పీ)లకు ఎన్డీబీ రుణ సాయం అందించనుంది. రెండో విడత రహదారి విస్తరణ పనుల కోసం త్వరలో టెండర్లను నిర్వహించనున్నారు. 145 ఎకరాల భూమి అవసరం 13 జిల్లాల్లో తొలి విడతలో చేపట్టే రహదారుల అభివృద్ధికి 145 ఎకరాల భూమి అవసరం. దీనికోసం ఇప్పటికే అన్ని జిల్లాల్లోని రెవెన్యూ యంత్రాంగానికి ఆర్అండ్బీ ఎస్ఈలు లేఖ రాశారు. భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి అప్పగిస్తే ఏప్రిల్‌లో రోడ్ల విస్తరణ పనులు ప్రారంభించనున్నట్లు వివరించారు. కాగా, భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30.88 కోట్లను కేటాయించింది. రెండేళ్లలో పనులు పూర్తి చేయాల్సిందే.. న్యూ డెవలప్మెంట్ బ్యాంకు నిబంధనల ప్రకారం రోడ్ల విస్తరణ పనులను 2023 కల్లా పూర్తి చేయాల్సిందే. ఏప్రిల్‌లో పనులు ప్రారంభించేందుకు కాంట్రాక్టు సంస్థలు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఈ మేరకు కాంట్రాక్టు సంస్థలతో ఒప్పందాలు పూర్తయ్యాయి. భూసేకరణకు రెవెన్యూ యంత్రాంగం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. – వేణుగోపాలరెడ్డి, ఆర్అండ్బీ ఇంజనీర్ ఇన్ చీఫ్ -
ఎన్డీబీ రీ టెండర్లలో 12 బిడ్లు
సాక్షి, అమరావతి: న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) సాయంతో రాష్ట్రంలో రహదార్లు, వంతెనల పునర్నిర్మాణ పనులకు సంబంధించి గత నెలలో పిలిచిన రీ టెండర్లలో 10 కాంట్రాక్టు సంస్థలు 12 బిడ్లు దాఖలు చేశాయి. తొలిదశలో నాలుగు జిల్లాల్లో పిలిచిన రీ టెండర్ల టెక్నికల్ బిడ్లను ఆర్అండ్బీ అధికారులు సోమవారం తెరిచారు. ఒక్కో జిల్లాలో మూడు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. గతంలో మాదిరిగా 13 జిల్లాలకు ఒకేసారి టెండర్లు పిలవకుండా నాలుగు జిల్లాలకు మాత్రమే రీ టెండర్లు పిలిచారు. మొత్తం రూ.6,400 కోట్లతో చేపట్టే రహదారుల నిర్మాణానికి సంబంధించి.. తొలిదశలో రూ.1,860 కోట్లతో 13 ప్యాకేజీలకు మొదట ఈ–టెండర్లు పిలవగా 14 సంస్థల నుంచి 25 బిడ్లు మాత్రమే వచ్చాయి. దీనిపై ఆర్అండ్బీ ముఖ్య అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పోటీతత్వం పెంచేందుకు ఆ టెండర్లను రద్దుచేసి మళ్లీ పిలవాలని ఆదేశించడంతో అవి రద్దయిన సంగతి తెలిసిందే. రీ టెండర్లకు తొలివిడతగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, విశాఖపట్టణం జిల్లాలను ఎంపికచేసిన అధికారులు జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీచేశారు. రెండు నిబంధనల్ని సవరించి, నాలుగు జిల్లాల్లో రూ.682.16 కోట్ల పనులకు సంబంధించి ఈ టెండర్లను పిలిచారు. సోమవారం ఈ టెక్నికల్ బిడ్లు తెరిచిన అధికారులు వాటిని పరిశీలించి అర్హత సాధించిన సంస్థల వివరాలు ప్రకటిస్తారు. అనంతరం రివర్స్ టెండర్లు నిర్వహించనున్నారు. -
సాగిపోదాం.. సాఫీగా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదారుల రూపు మారుతోంది. వేలకోట్ల రూపాయలతో విస్తరణ, మరమ్మతు పనులు చురుగ్గా సాగుతున్నాయి. పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేస్తున్నారు. ప్రస్తుతం రూ.5 వేల కోట్లతో పనులు జరుగుతున్నాయి. ఇందులో రూ.4,316 కోట్లతో రహదారుల విస్తరణ, రూ.684 కోట్లతో రోడ్ల నిర్వహణ, ప్రత్యేక మరమ్మతులు చేపట్టారు. ఇవికాకుండా రూ.2,168 కోట్లతో 7,116 కి.మీ. మేర రోడ్లు, వంతెనలను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని ఇటీవల ఆర్ అండ్ బీ శాఖ సమీక్షలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో రోడ్లపై ఎక్కడా గుంతలు కనిపించకూడదని సూచించారు. ఇందుకు మూడువేల కిలోమీటర్ల రోడ్లకు రూ.303 కోట్లు అవసరమని ఆర్ అండ్ బీ శాఖ ఆర్థికశాఖకు ప్రతిపాదించింది. డిసెంబరు నాటికల్లా వర్షాలకు దెబ్బతిన్న రోడ్లపై గుంతల్ని పూడ్చేందుకు ఆర్ అండ్ బీ శాఖ ప్రణాళిక రూపొందించింది. రోడ్ల మరమ్మతుల పర్యవేక్షణకు ప్రభుత్వం సీఈలు, ఎస్ఈలను నియమించింది. గ్రామీణ రహదారుల కోసం రూ.1,089 కోట్ల మేర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ పథకం కింద సాయమందించాలని నాబార్డును కోరారు. మరోపక్క రూ.6,400 కోట్లతో న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) రుణ సాయంతో రహదారుల ప్రాజెక్టులు చేపడుతున్న విషయం తెలిసిందే. జిల్లా ప్రధాన రహదారులకు ప్రాధాన్యం ► జిల్లా ప్రధాన రహదారులకు ప్రాధాన్యం దక్కనుంది. మొత్తం మరమ్మతులు చేసే మూడువేల కి.మీ.లలో 2,060 కి.మీ. మేర జిల్లా ప్రధాన రహదారులకు రూ.197 కోట్లు కేటాయించేందుకు ప్రతిపాదించారు. 940 కి.మీ. రాష్ట్ర రహదారులకు రూ.106 కోట్లు కేటాయించనున్నారు. ► రాష్ట్ర రహదారులపై ప్యాసింజర్ కార్ యూనిట్లు (పీసీయూ) రోజుకు 6 వేలు దాటిన వాటిని మొదటి ప్రాధాన్యతగా తీసుకుని రోడ్ల నిర్వహణ చేపట్టనున్నారు. ► గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల కాలంలో రోడ్లు విస్తరణ, మరమ్మతులకు రూ.4,150 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. ► 2014 నుంచి 2019 వరకు ఐదేళ్లలో గ్రామీణ రహదారుల కోసం రూ.2,748.21 కోట్ల బడ్జెట్ కేటాయించినా రూ.2,103.34 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. ► ఆర్ అండ్ బీకి కేటాయించిన నిధుల్ని వేరే పథకాలకు మళ్లించారు. రోడ్ల మరమ్మతులకు రూ.122 కోట్లు ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న గ్రామీణ రోడ్లకు రూ.122.15 కోట్లతో మరమ్మతులు చేయడానికి పంచాయతీరాజ్‌శాఖ ఇంజనీరింగ్ విభాగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సెప్టెంబర్, అంతకు ముందు కురిసిన వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 207 రోడ్లు దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు. 28 చోట్ల రాకపోకలకు అంతరాయం కలిగే రీతిలో ఆ రోడ్లకు గండ్లు పడ్డాయి. అన్ని జిల్లాల ఎస్ఈలు దెబ్బతిన్న రోడ్ల వివరాలు పంపినట్టు ఈఎన్సీ సుబ్బారెడ్డి తెలిపారు. ► గండ్లు పూడ్చివేతతోపాటు రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నచోట అత్యవసరంగా రూ.10.25 కోట్లతోను, ఆయా రోడ్లకు రూ.111.90 కోట్లతో పూర్తిస్థాయిలోను మరమ్మతులు చేయాలని ప్రతిపాదించారు. ► కర్నూలు జిల్లాలో ఏడుచోట్ల పంచాయతీరాజ్‌శాఖ ఇంజనీరింగ్ విభాగం పరిధిలోని భవనాలు, వైఎస్సార్ కడప జిల్లాలో ఐదు పాఠశాలల ప్రహరీలు వర్షాలకు దెబ్బతిన్నాయి. వీటి మరమ్మతులకు రూ.1.55 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. విశాఖ జిల్లాలో పాడేరు నుంచి సుజనాకోట వరకు రూ.20 కోట్లతో రహదారి పనులు జరుగుతున్నాయి. పెదబయలు మండలం దూడకోట పంచాయతీ కేంద్రం నుంచి అత్యంత మారుమూల జాముగూడ వరకు రూ.13.21 కోట్లతో రోడ్డు నిర్మిస్తున్నారు. ఒడిశా సరిహద్దులో కెందుగూడ వరకు, ముంచంగిపుట్టు మండలం మారుమూల లబ్బూరు జంక్షన్ నుంచి మారుమూల గ్రామం బుంగాపుట్టు వరకు రూ.14 కోట్లతో రోడ్డు నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట–దోన్బాయి–వీరఘట్టం వరకు 25 కి.మీ. రోడ్డు నిర్మాణాన్ని రూ.24 కోట్లతో చేపట్టారు. డిసెంబర్‌కల్లా రాష్ట్రంలో గుంతల్లేని రహదారులు వర్షాలకు రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. ప్రాధాన్యత క్రమంలో రోడ్లను నిర్వహించేందుకు ప్రతిపాదనలు రూపొందించాం. వాహనాల రద్దీ ఎక్కువ ఉండే రోడ్లు గుర్తించి వాటి మరమ్మతులు, నిర్వహణ చేపడుతున్నాం. డిసెంబర్ నాటికల్లా రోడ్ల నిర్వహణ మెరుగ్గా ఉంటుంది. గ్రామీణ రహదారులను విస్తరించడం, నిర్వహణ కోసం నాబార్డుకు ప్రతిపాదనలు పంపించాం. రూ.1,089 కోట్ల ప్రతిపాదనల్లో రూ.440 కోట్లతో రోడ్ల నిర్వహణ చేపట్టే ప్రణాళికలున్నాయి. – వేణుగోపాల్ రెడ్డి, ఆర్ అండ్ బీ ఇంజనీర్ ఇన్ చీఫ్ -
14న ఎన్డీబీ రీ టెండర్లకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) సాయంతో రాష్ట్రంలో రహదారులు, వంతెనల పునర్నిర్మాణ పనులకు సంబంధించి రీ టెండర్లకు రహదారులు, భవనాలశాఖ ఈ నెల 14న నోటిఫికేషన్ జారీ చేయనుంది. నాలుగు జిల్లాలకు మాత్రమే టెండరు నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ టెండర్లలో రెండు నిబంధనలకు సవరణ చేస్తూ శనివారం రవాణా, ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులిచ్చారు. మొత్తం రూ.6,400 కోట్లతో చేపట్టనున్న ఈ పనులకు సంబంధించి.. తొలిదశలో రూ.1,860 కోట్లతో 13 ప్యాకేజీలకు ఈ–టెండర్లు పిలవగా 14 సంస్థల నుంచి 25 బిడ్లు మాత్రమే వచ్చాయి. సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆర్అండ్బీ ముఖ్య అధికారులతో సమీక్షించి కాంట్రాక్టర్లలో పోటీతత్వం పెంచేందుకు టెండర్లను రద్దుచేసి మళ్లీ పిలవాలని ఆదేశించడంతో ఎన్డీబీ టెండర్లు రద్దయిన సంగతి తెలిసిందే. తొలి దశగా ఇప్పుడు నాలుగు జిల్లాల్లో రూ.682.16 కోట్ల పనులకు సంబంధించి మళ్లీ టెండర్లు పిలవనున్నారు. నిబంధనల్లో రెండింటిని సవరించారు. ఇందుకు న్యూ డెవలప్మెంట్ బ్యాంకు అనుమతి తీసుకున్నారు. జ్యుడిషియల్ ప్రివ్యూ అనుమతి తీసుకుని జీవో జారీ చేశారు. సవరించిన నిబంధనలివే.. ► టెండరు నిబంధనల్లో గతంలో బ్యాంకు గ్యారెంటీలు జాతీయ బ్యాంకుల నుంచే స్వీకరిస్తామన్నారు. ఈ దఫా రూరల్ బ్యాంకులు/కో–ఆపరేటివ్ బ్యాంకులు మినహా మిగిలిన షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల నుంచి స్వీకరిస్తారు. ► హార్డ్ కాపీని బిడ్ల దాఖలుకు ముందే ఇవ్వాలన్న నిబంధనను.. బ్యాంకు ఆథరైజేషన్‌తో రివర్స్ టెండర్లు నిర్వహించేలోగా ఇవ్వవచ్చని పేర్కొన్నారు. -
ఎన్డీబీ టెండర్లు రద్దు
సాక్షి, అమరావతి: టెండర్లలో పోటీతత్వం పెంపొందించేందుకే న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) సహకారంతో రాష్ట్రంలో చేపట్టిన మూడు వేల కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి సంబంధించిన టెండర్లను రద్దుచేశామని రవాణా, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎం.టి కృష్ణబాబు స్పష్టంచేశారు. రీ టెండర్లలో వాస్తవాలు తెలుస్తాయని, పచ్చ పత్రికలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని, వారికి నమ్మకం కలిగించేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు టెండర్లను రద్దుచేసినట్లు ఆయన తెలిపారు. విజయవాడలో శనివారం ఆయన ఆర్ అండ్ బీ ఈఎన్సీ వేణుగోపాల్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రోడ్ ప్రాజెక్టు ఫేజ్–1లో టెండర్లు పిలిచామని.. 26 పనులు, 13 ప్యాకేజీలకు 25 టెండర్ బిడ్లు మాత్రమే వచ్చాయన్నారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా టెండర్లు చేసిన విషయం రీ టెండర్లలో బహిర్గతం అవుతుందన్నారు. పారదర్శకంగా పనిచేయడమే కాదు.. పారదర్శకత ప్రతిబింబించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారని.. టెండర్ల స్పందనపై ఆయన సమగ్రంగా సమీక్ష చేశారని కృష్ణబాబు వివరించారు. అధిక మొత్తం విలువగల టెండర్లలో తక్కువ మంది పాల్గొనడం సహజమేనని ఎన్డీబీ పేర్కొన్నా.. పారదర్శకత, నిష్పాక్షికతకు పెద్దపీట వేసేందుకే ప్రస్తుత టెండర్లను రద్దుచేసి మళ్లీ టెండర్లకు వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ఈ నెలాఖరుకల్లా టెండర్లను పూర్తిచేయాలని ఎన్డీబీ కోరిందని, అయితే.. తాను కేంద్రంతో మాట్లాడి గడువు కోరతానని ముఖ్యమంత్రి చెప్పారన్నారు. కృష్ణబాబు ఇంకా ఏమన్నారంటే.. – అర్హత విషయంలో చాలా కంపెనీలున్నా, 14 కంపెనీలే టెండరు వేయడానికి గల కారణాలు తెలుసుకుంటాం. – ఏపీ ప్రభుత్వం, ఎన్డీబీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ ఎఫైర్స్ ట్రైపార్టీ అగ్రిమెంట్‌కు లోబడి ప్రపంచ బ్యాంకు నిబంధనల ప్రకారం పనులను నిర్వహిస్తాం. – ఎక్కువమంది టెండరులో పాల్గొనేలా చేస్తే, రాష్ట్రంలో మరింత ఎక్కువ కిలోమీటర్లు అభివృద్ధి చేసే అవకాశముంది. – జ్యుడీషియల్ ప్రివ్యూ కమిషన్, రివర్స్ బిడ్డింగ్ కూడా పారదర్శకత కోసమే. – కాంట్రాక్టర్లకు బ్యాంకులలో లిక్విడిటీ, కోవిడ్ కారణంగా లేబర్ అందుబాటు ఇబ్బందులు ఉండచ్చు. విదేశీ రుణ సాయంతో చేపట్టే ప్రాజెక్టులకు నిధుల కొరత ఉండదు. ముందుగా 15 శాతం అడ్వాన్స్‌లు విడుదల చేస్తారు. – ప్రపంచ బ్యాంకు నిబంధనల ప్రకారం టెండరు విలువ ఎంత ఉంటుందో.. కాంట్రాక్టు కంపెనీ టర్నోవర్ అంత ఉండాలి. – రాష్ట్రంలో అర్హత కలిగిన కాంట్రాక్టర్లతో సంప్రదించమని ఇంజనీర్లకు ఆదేశాలు జారీచేశాం. కాంట్రాక్టర్లు బ్యాంకు గ్యారంటీ, జీపీఏ మాత్రమే హార్డ్ కాపీలు ఇవ్వాల్సి ఉంటుంది. – ఏ రకమైన సమస్య ఉన్నా కాంట్రాక్టు ఏజెన్సీలు నేరుగా సూపరింటెండెంట్/చీఫ్ ఇంజనీర్లను సంప్రదించవచ్చు. – జరిగిన టెండర్లపై ఒక్క ఫిర్యాదు లేదా అభ్యంతరం రాలేదు. – టెండరు విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా ప్రభుత్వం నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. – ప్రాజెక్టు టెండర్లను భౌతికంగా అడ్డుకుంటే చర్యలు తీసుకుంటాం. – టెండర్ల పూర్తికి 45 రోజుల గడువు ఇస్తామని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ ఎఫైర్స్ అదనపు కార్యదర్శి చెప్పారు. – మరో వారం రోజుల్లో టెండర్లు పిలుస్తాం. – కొన్ని వార్తాపత్రికలు, పనికట్టుకుని నిరాధారమైన వార్తలు ప్రచురించడం, ప్రజల్లో లేనిపోని అనుమానాలకు తావిచ్చేలా దురుద్దేశ్యపూర్వక రాతలు రాశాయి. వాటిని నివృత్తి చేస్తూ టెండరుదారుల్లో ఎలాంటి అనుమానాలు, అపోహలు కలగకుండా ఈ టెండర్లు రద్దుచేశాం. – ఎక్కువ మంది టెండర్లలో పాల్గొంటే ఖర్చు తగ్గడంతో పాటు నాణ్యత పెరుగుతుంది. – నిధులు మిగలడంవల్ల మరిన్ని పనులు చేపట్టే వీలు కలుగుతుందన్న అభిప్రాయాన్ని సీఎం వైఎస్ జగన్ వ్యక్తంచేశారు. -
జిల్లా కేంద్రం వరకు రెండు వరుసల రోడ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రం వరకు ఉన్న రోడ్లను రెండు వరుసల రహదార్లుగా విస్తరించనున్నారు. రహదారులపై శిథిలావస్థలో ఉన్న వంతెనలను పునర్నిర్మిస్తారు. ఇందుకోసం న్యూ డెవలప్మెంట్ బ్యాంకు(ఎన్డీబీ) 70 శాతం రుణం అందజేయనుంది. మిగతా 30 శాతం వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. మొత్తం రూ.6,400 కోట్లతో ఏపీ మండల కనెక్టివిటీ అండ్ రూరల్ కనెక్టివిటీ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు(ఏపీఎంసీఆర్‌సీఐపీ), ఏపీ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్టులను (ఏపీఆర్‌బీఆర్‌పీ) రహదారులు, భవనాల శాఖ అధికారులు చేపట్టనున్నారు. 479 కొత్త వంతెనల నిర్మాణం రోజుకు 2 వేలకు పైగా వాహనాలు ప్రయాణించే రహదార్లన్నింటినీ రెండు వరుసలుగా మారుస్తారు. 3,103 కిలోమీటర్లకు పైగా రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు 479 కొత్త వంతెనల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులో రహదార్ల విస్తరణకు రూ.5,313 కోట్లు, వంతెనల నిర్మాణానికి రూ.1,087 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఎన్డీబీ, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టనున్న రూ.6,400 కోట్ల పనులకు అదనంగా రూ.2,400 కోట్లు జోడించి.. మొత్తం రూ.8,800 కోట్లు కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల అధికారులకు సూచించారు. రూ.2,978 కోట్లకు పరిపాలన అనుమతులు ఎన్డీబీ సాయంతో ఏపీలో తొలిదశ కింద 1,243.51 కిలోమీటర్ల మేర రహదారులు, వంతెనల విస్తరణకు గాను రూ.2,978.51 కోట్ల వ్యయానికి పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 33 ప్యాకేజీల కింద రూ.2,978.51 కోట్లకు గాను పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి. భూ సేకరణ, ఇతర అవసరాలకు రూ.30.88 కోట్లు కేటాయించారు. తొలి దశలో రహదారుల విస్తరణ, వంతెనల నిర్మాణానికి రూ.2,978 కోట్లు విడుదల చేశామని ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు చెప్పారు. డిసెంబర్ ఆఖరు నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. మార్చి నెల నాటికి పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. -
‘బ్రిక్స్ బ్యాంకు’ తొలి ప్రాజెక్టు ప్రారంభం
బీజింగ్: భారత్ సహా బ్రిక్స్ దేశాల ఆధ్వర్యంలో ఏర్పాటైన న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) ఆర్థిక సహకారంతో మొట్టమొదటి ప్రాజెక్టు కార్యకలాపాలు ప్రారంభించింది. షాంఘై లింగాంగ్ సోలార్ పవర్ ప్రాజెక్టుకు 17 ఏళ్ల కాలానికి గాను 76 మిలియన్ డాలర్లు (రూ.486 కోట్లు) రుణం ఇచ్చేందుకు 2016 డిసెంబర్లో ఒప్పందం జరిగింది. ఎన్డీబీ నుంచి ఆర్థిక సహకారం అందుకున్న తొలి ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టులో భాగంగా లింగాంగ్ పారిశ్రామిక ప్రాంతంలో 100 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యంతో పరిశ్రమల పైకప్పులపై సోలార్ రూఫ్ టాప్‌లను ఏర్పాటు చేస్తారు. ఇందులో తొలి దశ శనివారం ప్రారంభమైంది. ఎన్డీబీని బ్రిక్స్ దేశాలు 2015లో ఏర్పాటు చేశాయి. -
రుణ వృద్ధిపై ఎన్డీబీ దృష్టి: కామత్
దావోస్: బ్రిక్ దేశాల నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) రుణ వృద్ధిపై దృష్టి సారిస్తోంది. వచ్చే రెండు మూడేళ్లూ... ప్రతి ఏడాదీ తన రుణాన్ని రెట్టింపు చేసుకోవడంపై ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు బ్యాంక్ ప్రెసిడెంట్ కేవీ కామత్ తెలిపారు. తన 10 బిలియన్ డాలర్ల మూలధనాన్ని వినియోగించుకుని బ్యాంక్ మొదటి 6 నుంచి 7 సంవత్సరాల్లో భారీ రుణవృద్ధి లక్ష్యంగా వ్యూహాలను ఖరారు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రస్తుతం బ్యాంక్ సిబ్బంది సంఖ్య 130 వరకూ ఉందనీ, దీనిని మూడు రెట్లు పెంచాలన్నది లక్ష్యమని ఇక్కడ పేర్కొన్నారు. -
బ్రిక్స్ నిధికి భారత్.. 18 బిలియన్ డాలర్లు
మాస్కో : బ్రిక్స్ దేశాలు 100 బిలియన్ డాలర్లతో నెలకొల్పనున్న విదేశీమారక ద్రవ్య నిల్వల నిధి(ఫారెక్స్ రిజర్వ్స్ పూల్)కి భారత్ తనవంతుగా 18 బిలియన్ డాలర్లను సమకూర్చనుంది. డాలర్ లిక్విడిటీలో ఏవైనా సమస్యలు తలెత్తితే ఒకరికొకరు సహకారం అందించుకోవడానికి ఈ నిధి తోడ్పాటును అందిస్తుంది. బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) ఫారెక్స్ రిజర్వ్స్ పూల్‌కు సంబంధించిన నిర్వహణ ఒప్పందంపై సభ్య దేశాలకు చెందిన సెంట్రల్ బ్యాం కులు సంతకాలు చేశాయి. అంతకుముందు బ్రిక్స్ దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకుల చీఫ్‌ల సమావేశం జరిగింది. ఈ నిధికి అత్యధికంగా చైనా నుంచి 41 బిలియన్ డాలర్లు సమకూరనున్నాయి. ఈ నిధిని సభ్యదేశాలు ఒక బీమా సాధనంగా ఉపయోగించుకోనున్నాయని.. చెల్లింపుల సమతౌల్యత(బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్)లో ఇబ్బందులు ఎదురైతే దీని నుంచి నిధులను తీసుకోవచ్చని రష్యా సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 30 నుంచి ఈ సదుపాయం అమల్లోకిరానుంది. కాగా, బుధ, గురువారాల్లో జరిగే బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఈ ఒప్పందం కార్యరూపం దాల్చడం గమనార్హం. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీతో పాటు ఆయా దేశాల అధినేతలు పాల్గొంటున్నారు. ప్రధానంగా బ్రిక్స్ బ్యాంక్‌కు ప్రారంభ నిధులను సమకూర్చడంపై సదస్సులో చర్చించనున్నారు. హైడ్రో ప్రాజెక్టులపై భారత్, రష్యా ఎంఓయూ.... జల విద్యుత్ రంగంలో ప్రాజెక్టులకు నిధులందించేందుకు భారత్, రష్యా సహకరించుకోనున్నాయి. దీనిలో భాగంగా రష్యా డెరైక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్), ఇండియా ఇన్ఫ్రా డెవలప్మెంట్ ఫైనాన్స్ కంపెనీ(ఐడీఎఫ్సీ)లు ఒక అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై సంతకాలు చేశాయి. అదేవిధంగా బ్రిక్స్ దేశాల్లోని ఇతర సభ్య దేశాలకు చెందిన ఇతర సంస్థలతో కూడా మౌలిక ప్రాజెక్టులకు నిధుల కల్పనకు సబంధిందించి తాము ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఆర్డీఐఎఫ్ డెరైక్టర్ జనరల్ కిరిల్ దిమిత్రీవ్ చెప్పారు. సమున్నత లక్ష్యాల సాధనకు కృషి బ్రిక్స్ బ్యాంక్‌పై ‘తొలి ప్రెసిడెంట్’ కామత్ వ్యాఖ్య ఉఫా (రష్యా): కొత్తగా ఏర్పాటవుతున్న న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) సొంత ప్రమాణాలకు అనుగుణంగా- అత్యున్నత లక్ష్యాల సాధనకు కృషి చేస్తుందని ఈ బ్యాంక్ చీఫ్‌గా నియమితులైన కేవీ కామత్ పేర్కొన్నారు. ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) వంటి తోటి బహుళజాతి బ్యాంకులతో ఎటువంటి పోరు ఉండబోదని స్పష్టం చేశారు. బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల కూటమి గత ఏడాది 100 బిలియన్ డాలర్ల న్యూ డెవలప్మెంట్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తోటి బహుళజాతి బ్యాంకులతో ఎటువంటి పోరు పరిస్థితీ ఉండనప్పటికీ, ఈ బ్యాంకుల కార్యకలాపాల్లో ఒక కొత్త మార్పు తీసుకువచ్చే రీతిలో ఎన్డీబీ కార్యకలాపాలు నిర్వహిస్తుందని అన్నారు. భారత్‌లో మౌలిక రంగానికి సంబంధించి అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ, బ్రిక్స్ దేశాలన్నింటి విషయంలో మౌలిక రంగంలో పురోగతి సాధించాల్సి ఉందని అన్నారు. ఏ ఒక్క బ్యాంకో ఈ అవసరాలను ఒక్కటిగా తీర్చలేదని వివరించారు. 20న బాధ్యతలు...: షాంఘై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించనున్న బ్యాంక్ గవర్నర్ల బోర్డ్ సమావేశం మంగళవారం మాస్కోలో జరిగింది. బ్యాంక్ ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేసింది. బ్రిక్స్ దేశాల ఏడవ సదస్సుకు ఒక రోజు ముందు ఈ సమావేశం జరిగింది. బ్రిక్స్ దేశాధినేతలు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ‘‘బ్యాంక్ ధ్రువీకరణ ప్రక్రియ పూర్తయ్యింది. ఇక నేను జూలై 20న షాంఘైలో బ్యాంక్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్నాను’’ అని కూడా కామత్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునాటికి బ్రిక్స్ బ్యాంక్ కార్యకలాపాలను ప్రారంభిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.