బ్రిక్స్ నిధికి భారత్.. 18 బిలియన్ డాలర్లు
మాస్కో : బ్రిక్స్ దేశాలు 100 బిలియన్ డాలర్లతో నెలకొల్పనున్న విదేశీమారక ద్రవ్య నిల్వల నిధి(ఫారెక్స్ రిజర్వ్స్ పూల్)కి భారత్ తనవంతుగా 18 బిలియన్ డాలర్లను సమకూర్చనుంది. డాలర్ లిక్విడిటీలో ఏవైనా సమస్యలు తలెత్తితే ఒకరికొకరు సహకారం అందించుకోవడానికి ఈ నిధి తోడ్పాటును అందిస్తుంది. బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) ఫారెక్స్ రిజర్వ్స్ పూల్‌కు సంబంధించిన నిర్వహణ ఒప్పందంపై సభ్య దేశాలకు చెందిన సెంట్రల్ బ్యాం కులు సంతకాలు చేశాయి. అంతకుముందు బ్రిక్స్ దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకుల చీఫ్‌ల సమావేశం జరిగింది.
ఈ నిధికి అత్యధికంగా చైనా నుంచి 41 బిలియన్ డాలర్లు సమకూరనున్నాయి. ఈ నిధిని సభ్యదేశాలు ఒక బీమా సాధనంగా ఉపయోగించుకోనున్నాయని.. చెల్లింపుల సమతౌల్యత(బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్)లో ఇబ్బందులు ఎదురైతే దీని నుంచి నిధులను తీసుకోవచ్చని రష్యా సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 30 నుంచి ఈ సదుపాయం అమల్లోకిరానుంది. కాగా, బుధ, గురువారాల్లో జరిగే బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఈ ఒప్పందం కార్యరూపం దాల్చడం గమనార్హం. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీతో పాటు ఆయా దేశాల అధినేతలు పాల్గొంటున్నారు. ప్రధానంగా బ్రిక్స్ బ్యాంక్‌కు ప్రారంభ నిధులను సమకూర్చడంపై సదస్సులో చర్చించనున్నారు.
హైడ్రో ప్రాజెక్టులపై భారత్, రష్యా ఎంఓయూ....
జల విద్యుత్ రంగంలో ప్రాజెక్టులకు నిధులందించేందుకు భారత్, రష్యా సహకరించుకోనున్నాయి. దీనిలో భాగంగా రష్యా డెరైక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(ఆర్‌డీఐఎఫ్), ఇండియా ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కంపెనీ(ఐడీఎఫ్‌సీ)లు ఒక అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై సంతకాలు చేశాయి. అదేవిధంగా బ్రిక్స్ దేశాల్లోని ఇతర సభ్య దేశాలకు చెందిన ఇతర సంస్థలతో కూడా మౌలిక ప్రాజెక్టులకు నిధుల కల్పనకు సబంధిందించి తాము ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఆర్‌డీఐఎఫ్ డెరైక్టర్ జనరల్ కిరిల్ దిమిత్రీవ్ చెప్పారు.
సమున్నత లక్ష్యాల సాధనకు కృషి
బ్రిక్స్ బ్యాంక్‌పై ‘తొలి ప్రెసిడెంట్’ కామత్ వ్యాఖ్య
ఉఫా (రష్యా): కొత్తగా ఏర్పాటవుతున్న న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డీబీ) సొంత ప్రమాణాలకు అనుగుణంగా- అత్యున్నత లక్ష్యాల సాధనకు కృషి చేస్తుందని ఈ బ్యాంక్ చీఫ్‌గా నియమితులైన కేవీ కామత్ పేర్కొన్నారు. ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) వంటి తోటి బహుళజాతి బ్యాంకులతో ఎటువంటి పోరు ఉండబోదని స్పష్టం చేశారు. బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల కూటమి గత ఏడాది 100 బిలియన్ డాలర్ల న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
తోటి బహుళజాతి బ్యాంకులతో ఎటువంటి పోరు పరిస్థితీ ఉండనప్పటికీ, ఈ బ్యాంకుల కార్యకలాపాల్లో ఒక కొత్త మార్పు తీసుకువచ్చే రీతిలో ఎన్‌డీబీ కార్యకలాపాలు నిర్వహిస్తుందని అన్నారు. భారత్‌లో మౌలిక రంగానికి సంబంధించి అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ, బ్రిక్స్ దేశాలన్నింటి విషయంలో మౌలిక రంగంలో పురోగతి సాధించాల్సి ఉందని అన్నారు. ఏ ఒక్క బ్యాంకో ఈ అవసరాలను ఒక్కటిగా తీర్చలేదని వివరించారు.
20న బాధ్యతలు...: షాంఘై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించనున్న బ్యాంక్ గవర్నర్ల బోర్డ్ సమావేశం మంగళవారం మాస్కోలో జరిగింది. బ్యాంక్ ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేసింది. బ్రిక్స్ దేశాల ఏడవ సదస్సుకు ఒక రోజు ముందు ఈ సమావేశం జరిగింది. బ్రిక్స్ దేశాధినేతలు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ‘‘బ్యాంక్ ధ్రువీకరణ ప్రక్రియ పూర్తయ్యింది. ఇక నేను జూలై 20న షాంఘైలో బ్యాంక్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్నాను’’ అని కూడా కామత్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునాటికి బ్రిక్స్ బ్యాంక్ కార్యకలాపాలను ప్రారంభిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.