Brics Bank
-
BRICS: కోవిడ్‌తో కోలుకోలేని దెబ్బ
ముంబై: కోవిడ్ మహమ్మారి బ్రిక్స్ దేశాలకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగించిందని బ్రిక్స్ ఎకనమిక్ బులిటన్ పేర్కొంది. నిరుద్యోగం, పేదరికం, లింగ వివక్షత, వలసలు... ఇలా పలు సామాజిక అంశాలపై మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉందని వివరించింది. బ్రిక్స్ సెంట్రల్ బ్యాంకుల సభ్యులతో బ్రిక్స్ కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ (సీఆర్ఏ) రీసెర్చ్ గ్రూప్ రూపొందించిన బులెటిన్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసింది. బ్రిక్స్ పరిశోధన, ఆర్థిక విశ్లేషణ, నిఘా సామర్థ్యాన్ని పెంపొందించడానికి సీఆర్ఏ రీసెర్చ్ గ్రూప్ ఏర్పాటయ్యింది. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలు సభ్యదేశాలుగా ఉన్న బ్రిక్స్‌కు ప్రస్తుతం భారతదేశం అధ్యక్ష స్థానంలో ఉంది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. - కోవిడ్ సంక్షోభం అన్ని దేశాలను విచక్షణారహి తంగా ప్రభావితం చేసింది. బ్రిక్స్ కూడా దీనికి మినహాయింపు కాదు. ఈ సభ్య దేశాలు కూడా మహమ్మారితో తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాని నుండి కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. - మహమ్మారి వ్యవధి–తీవ్రతల విషయాల్లో బ్రిక్స్ దేశాల మధ్య గణనీయమైన వైవిధ్యత ఉంది. - చైనా కోవిడ్‌ను పటిష్ట స్థాయిలో కట్టడి చేయగా, ఇతర బ్రిక్స్ దేశాలు అనేక రకాల ఇన్ఫెక్షన్లను చవి చూశాయి. తీవ్ర సెకండ్వేవ్లను ఎదుర్కొన్నాయి. మూడవ వేవ్ భయాల ముందు నిలిచాయి. - 2020లో ఎదురైన మహమ్మారి–ప్రేరిత తీవ్ర సవాళ్ల నుండి బ్రిక్స్ కోలుకున్నట్లు విశ్వసనీయంగా కనిపిస్తోంది. అయితే, రికవరీ విషయంలో బ్రిక్స్ సభ్యుల మధ్య గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నాయి. - కరోనా సవాళ్లు, ఆర్థిక పునరుద్ధరణ, దేశాల మధ్య రికవరీలో వైరుద్యాలు, ద్రవ్యోల్బణం ఇబ్బందులు, అంతర్జాతీయంగా ఎదురవుతున్న అవరోధాలు, ఫైనాన్షియల్ రంగంలో ఒడిదుడుకులుసహా బ్రిక్స్ దేశాలు పలు సమస్యలను ప్రస్తుతం ఎదుర్కొంటున్నాయి. - మహమ్మారిని ఎదుర్కొనడంలో వ్యాక్సినేషన్ కీలక పాత్ర పోషించనుంది. విస్తృత వ్యాక్సినేషన్ వేగం, సమర్థత వంటి అంశాలు ఆర్థిక పునరుద్ధరణలో అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. - కోవిడ్ అనిశ్చితికి తోడు, కఠిన ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, సంక్షోభం నుండి ఉత్పన్నమయ్యే నిరంతర ఆర్థిక మరియు నిర్మాణాత్మక మార్పులు బ్రిక్స్ దేశాలలో ఆందోళనను రేకెత్తిస్తున్న మరికొన్ని అంశాలు. - మహమ్మారి అనంతరం చక్కటి భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించడం, ఆయా ప్రణాళికలు విజయవంతానికి కృషి, సంక్షోభం తదనంతరం ఉద్భవించే అవకాశాలను అందిపుచ్చుకోవడంపై బ్రిక్స్ దేశాలు దృష్టి సారించాలి. - సంవత్సరాలుగా సమన్వయం– సహకారానికి బ్రిక్స్ దేశాలు బలమైన పునాదులను ఏర్పరచుకున్నాయి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ), కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ (సీఆర్ఏ) ఏర్పాటు ఇందులో భాగంగా చెప్పుకోవచ్చు. చదవండి: భారత్ ఎకానమీకి ఢోకాలేదు.. క్రెడిట్ సూసీ నివేదిక -
‘బ్రిక్స్ బ్యాంకు’ తొలి ప్రాజెక్టు ప్రారంభం
బీజింగ్: భారత్ సహా బ్రిక్స్ దేశాల ఆధ్వర్యంలో ఏర్పాటైన న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) ఆర్థిక సహకారంతో మొట్టమొదటి ప్రాజెక్టు కార్యకలాపాలు ప్రారంభించింది. షాంఘై లింగాంగ్ సోలార్ పవర్ ప్రాజెక్టుకు 17 ఏళ్ల కాలానికి గాను 76 మిలియన్ డాలర్లు (రూ.486 కోట్లు) రుణం ఇచ్చేందుకు 2016 డిసెంబర్లో ఒప్పందం జరిగింది. ఎన్డీబీ నుంచి ఆర్థిక సహకారం అందుకున్న తొలి ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టులో భాగంగా లింగాంగ్ పారిశ్రామిక ప్రాంతంలో 100 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యంతో పరిశ్రమల పైకప్పులపై సోలార్ రూఫ్ టాప్‌లను ఏర్పాటు చేస్తారు. ఇందులో తొలి దశ శనివారం ప్రారంభమైంది. ఎన్డీబీని బ్రిక్స్ దేశాలు 2015లో ఏర్పాటు చేశాయి. -
బ్రిక్స్ నిధికి భారత్.. 18 బిలియన్ డాలర్లు
మాస్కో : బ్రిక్స్ దేశాలు 100 బిలియన్ డాలర్లతో నెలకొల్పనున్న విదేశీమారక ద్రవ్య నిల్వల నిధి(ఫారెక్స్ రిజర్వ్స్ పూల్)కి భారత్ తనవంతుగా 18 బిలియన్ డాలర్లను సమకూర్చనుంది. డాలర్ లిక్విడిటీలో ఏవైనా సమస్యలు తలెత్తితే ఒకరికొకరు సహకారం అందించుకోవడానికి ఈ నిధి తోడ్పాటును అందిస్తుంది. బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) ఫారెక్స్ రిజర్వ్స్ పూల్‌కు సంబంధించిన నిర్వహణ ఒప్పందంపై సభ్య దేశాలకు చెందిన సెంట్రల్ బ్యాం కులు సంతకాలు చేశాయి. అంతకుముందు బ్రిక్స్ దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకుల చీఫ్‌ల సమావేశం జరిగింది. ఈ నిధికి అత్యధికంగా చైనా నుంచి 41 బిలియన్ డాలర్లు సమకూరనున్నాయి. ఈ నిధిని సభ్యదేశాలు ఒక బీమా సాధనంగా ఉపయోగించుకోనున్నాయని.. చెల్లింపుల సమతౌల్యత(బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్)లో ఇబ్బందులు ఎదురైతే దీని నుంచి నిధులను తీసుకోవచ్చని రష్యా సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 30 నుంచి ఈ సదుపాయం అమల్లోకిరానుంది. కాగా, బుధ, గురువారాల్లో జరిగే బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఈ ఒప్పందం కార్యరూపం దాల్చడం గమనార్హం. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీతో పాటు ఆయా దేశాల అధినేతలు పాల్గొంటున్నారు. ప్రధానంగా బ్రిక్స్ బ్యాంక్‌కు ప్రారంభ నిధులను సమకూర్చడంపై సదస్సులో చర్చించనున్నారు. హైడ్రో ప్రాజెక్టులపై భారత్, రష్యా ఎంఓయూ.... జల విద్యుత్ రంగంలో ప్రాజెక్టులకు నిధులందించేందుకు భారత్, రష్యా సహకరించుకోనున్నాయి. దీనిలో భాగంగా రష్యా డెరైక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్), ఇండియా ఇన్ఫ్రా డెవలప్మెంట్ ఫైనాన్స్ కంపెనీ(ఐడీఎఫ్సీ)లు ఒక అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై సంతకాలు చేశాయి. అదేవిధంగా బ్రిక్స్ దేశాల్లోని ఇతర సభ్య దేశాలకు చెందిన ఇతర సంస్థలతో కూడా మౌలిక ప్రాజెక్టులకు నిధుల కల్పనకు సబంధిందించి తాము ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఆర్డీఐఎఫ్ డెరైక్టర్ జనరల్ కిరిల్ దిమిత్రీవ్ చెప్పారు. సమున్నత లక్ష్యాల సాధనకు కృషి బ్రిక్స్ బ్యాంక్‌పై ‘తొలి ప్రెసిడెంట్’ కామత్ వ్యాఖ్య ఉఫా (రష్యా): కొత్తగా ఏర్పాటవుతున్న న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) సొంత ప్రమాణాలకు అనుగుణంగా- అత్యున్నత లక్ష్యాల సాధనకు కృషి చేస్తుందని ఈ బ్యాంక్ చీఫ్‌గా నియమితులైన కేవీ కామత్ పేర్కొన్నారు. ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) వంటి తోటి బహుళజాతి బ్యాంకులతో ఎటువంటి పోరు ఉండబోదని స్పష్టం చేశారు. బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల కూటమి గత ఏడాది 100 బిలియన్ డాలర్ల న్యూ డెవలప్మెంట్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తోటి బహుళజాతి బ్యాంకులతో ఎటువంటి పోరు పరిస్థితీ ఉండనప్పటికీ, ఈ బ్యాంకుల కార్యకలాపాల్లో ఒక కొత్త మార్పు తీసుకువచ్చే రీతిలో ఎన్డీబీ కార్యకలాపాలు నిర్వహిస్తుందని అన్నారు. భారత్‌లో మౌలిక రంగానికి సంబంధించి అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ, బ్రిక్స్ దేశాలన్నింటి విషయంలో మౌలిక రంగంలో పురోగతి సాధించాల్సి ఉందని అన్నారు. ఏ ఒక్క బ్యాంకో ఈ అవసరాలను ఒక్కటిగా తీర్చలేదని వివరించారు. 20న బాధ్యతలు...: షాంఘై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించనున్న బ్యాంక్ గవర్నర్ల బోర్డ్ సమావేశం మంగళవారం మాస్కోలో జరిగింది. బ్యాంక్ ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేసింది. బ్రిక్స్ దేశాల ఏడవ సదస్సుకు ఒక రోజు ముందు ఈ సమావేశం జరిగింది. బ్రిక్స్ దేశాధినేతలు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ‘‘బ్యాంక్ ధ్రువీకరణ ప్రక్రియ పూర్తయ్యింది. ఇక నేను జూలై 20న షాంఘైలో బ్యాంక్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్నాను’’ అని కూడా కామత్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునాటికి బ్రిక్స్ బ్యాంక్ కార్యకలాపాలను ప్రారంభిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. -
బ్రిక్స్ బ్యాంక్ సారథి కామత్
గత వారం బిజినెస్ మూడోసారి వడ్డీరేట్లు తగ్గించిన చైనా 10/05/15: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన చైనా ఆర్థిక వృద్ధి మందగమనం వల్ల గతేడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు అంటే ఆరు నెలల సమయంలో మూడు సార్లు వడ్డీరేట్లను తగ్గించింది. చైనా పబ్లిక్ బ్యాంక్ వడ్డీ రేటును 25 బేసిక్ పాయింట్లు తగ్గించింది. బ్రిక్స్ బ్యాంక్ సారథి... కామత్ 11/05/15: ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధికి పోటీగా వర్ధమాన దేశాల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు నిధులందించడమే లక్ష్యం గా 100 బిలియన్ డాలర్ల మూలధనంతో షాంఘై కేంద్రంగా ఏర్పాటుకానున్న బ్రిక్స్ బ్యాంకు తొలి ప్రెసిడెంట్‌గా కేవీ కామత్ పేరు ఖరారైంది. రెండంకెల వృద్ధే లక్ష్యంగా.. లగ్జరీ కార్ల కంపెనీలు మెర్సిడస్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్ల కం పెనీలు రెండంకెల వృద్ధిపై కన్నేశాయి. ఈ ఏడాది తొలి 5 నెలల్లో బీఎండబ్ల్యూ 10 మోడళ్లను, మెర్సిడస్ 5 మోడళ్లను, ఆడి 4 మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. అలాగే ఈ 3 కంపెనీలు డిసెంబర్ చివరికి 30 మోడళ్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నాయి. టోకు ధరలు మరింత తగ్గాయ్ 12/05/15: టోకు ధరల సూచీ ఆధారిత (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణ రేటు ఏప్రిల్‌లో -2.65 శాతానికి క్షీణించింది. 2014 ఏప్రిల్‌తో పోలిస్తే మొత్తం టోకు వస్తువుల ధరలు -2.65 శాతానికి తగ్గాయన్నమాట. గతేడాది జీరో స్థాయిలో కదలాడుతున్న ద్రవ్యోల్బణ రేటు జనవరి నుంచి ఏకంగా మైనస్లలోకి జారిపోయింది. ఇది వ్యవస్థలో డిమాండ్ లేకపోవడానికి ప్రతిబింబమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 5 నెలల కనిష్టానికి పారిశ్రామికాభివృద్ధి తయారీ రంగం కాస్త పుంజుకున్నప్పటికీ పారిశ్రామికాభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. మార్చిలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు (ఐఐపీ) 2.1 శాతానికి పరిమితమైంది. ఫిబ్రవరిలో ఈ రేటు 4.86 శాతంగా (సవరణకు ముందు 5 శాతం) నమోదైంది. గతేడాది ఐఐపీ మైనస్‌లలో (-0.5 శాతం) కొనసాగింది. గతేడాది అక్టోబర్‌లో -2.7 శాతంగా ఉన్న ఐఐపీ నవంబర్‌లో 5.2 శాతం, డిసెంబర్ 3.56 శాతం, జనవరి 2.77 శాతం చొప్పున వృద్ధి చెందుతూ వచ్చింది. రిటైల్ ధరలు కూల్ వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం రేటు ఏప్రిల్ నెలలో 4.87 శాతంగా నమోదైంది. ఇది నాలుగు నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. అంటే 2014 ఏప్రిల్ ధరలతో పోలిస్తే ఆయా వినియోగ వస్తువుల ధరలు 4.87 శాతం పెరిగాయన్నమాట. ఇక మార్చి నెలలోలో రిటైల్ ద్రవ్యోల్చణం రేటు 5.25 శాతంగా నమోదైంది. -
'10 రోజుల్లో పదవి చేపడతారు'
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన బ్రిక్స్ బ్యాంక్‌కు తొలి ప్రెసిడెంట్‌గా ఎంపికైన ప్రఖ్యాత భారతీయ బ్యాంకర్ కేవీ కామత్ 10 రోజుల్లో పదవి చేపట్టనున్నారని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి వెల్లడించారు. కొన్ని కంపెనీల బోర్డుల్లో విధులు నిర్వహిస్తున్న ఆయన వాటికి రాజీనామా చేశారని తెలిపారు. వచ్చే వారం లేదా 10 రోజుల్లో బ్రిక్స్ బ్యాంక్‌కు తొలి ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపడతారని చెప్పారు. ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉంది. 67 ఏళ్ల కామత్ దేశీ ప్రైవేటు బ్యాంకింగ్ అగ్రగామి ఐసీఐసీఐ బ్యాంక్‌తో పాటు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు కూడా నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కామత్ వ్యవహరిస్తున్నారు. -
బ్రిక్స్ బ్యాంక్ సారథి.. కామత్!
తొలి ప్రెసిడెంట్‌గా ఎంపిక... ⇒ పదవిలో ఐదేళ్లపాటు కొనసాగే అవకాశం... ⇒ ఏడాదిలో బ్యాంక్ కార్యకలాపాలు షురూ... ⇒ 100 బిలియన్ డాలర్ల మూలధనంతో షాంఘై కేంద్రంగా ఏర్పాటు న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన బ్రిక్స్ బ్యాంక్‌కు తొలి ప్రెసిడెంట్‌గా ప్రఖ్యాత భారతీయ బ్యాంకర్ కేవీ కామత్ నియామకం ఖరారైంది. ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి సోమవారమిక్కడ వెల్లడించారు. ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్)లకు పోటీగా వర్ధమాన దేశాల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులందించడమే లక్ష్యంగా ఈ బ్రిక్స్ బ్యాంక్ అవతరించింది. బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) కూటమి దేశాలు దీన్ని ఏర్పాటు చేసేందుకు గతేడాది ఆమోదముద్ర వేయడం తెలిసిందే. సుమారు 100 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.6.3 లక్షల కోట్లు) ప్రారంభ అధీకృత మూలధనంతో నెలకొల్పనున్నారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్(ఎన్డీబీ)గా పేరుపెట్టిన ఈ సంస్థ చైనాలోని షాంఘై ప్రధాన కేంద్రంగా మరో ఏడాది వ్యవధిలో కార్యకలాపాలను ప్రారంభించనుందని మహర్షి తెలిపారు. ప్రస్తుతం కామత్(67 ఏళ్లు) కొన్ని కంపెనీల బోర్డుల్లో విధులు నిర్వహిస్తున్నారని.. వాటినుంచి బయటికివచ్చాక బ్రిక్స్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా ఆయన నియామకం అమల్లోకిరానుందన్నారు. కాగా, కామత్ నియామకానికి భారత్ ఆమోదముద్ర వేసిందని.. దీనికి ఇతర బ్రిక్స్ కూటమి దేశాలు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాల్సి ఉందని మహర్షి వివరించారు. పదవీ కాలంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోనప్పటికీ ఐదేళ్లు ఉండొచ్చని ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. దేశీ ప్రైవేటు బ్యాంకింగ్ అగ్రగామి ఐసీఐసీఐ బ్యాంక్‌తో పాటు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు కూడా నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కామత్ వ్యవహరిస్తున్నారు. బ్రిక్స్ బ్యాంక్ ఆవిర్భావం ఇలా... 2012లో ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఈ సరికొత్త బ్యాంక్ ఏర్పాటు ప్రతిపాదనకు నాంది పడింది. ఆతర్వాత డర్బన్‌లో జరిగిన సదస్సులో బ్రిక్స్ బ్యాంక్‌పై అన్ని దేశాలు తమ సుముఖత వ్యక్తం చేశాయి. గతేడాది బ్రెజిల్ బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర దేశాల అధిపతులు దీనికి తుది ఆమోదముద్ర వేశారు. ప్రతి బ్రిక్స్ సభ్య దేశం ప్రాథమిక సభ్య దేశం 10 బిలియన్ డాలర్ల చొప్పున ప్రాథమిక మూల ధనాన్ని సమకూర్చనున్నాయి. అధీకృత మూల ధనం మాత్రం 100 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. సభ్య దేశాలన్నీ సమాన స్థాయిలోనే క్యాపిటల్‌ను అందించనుండటంతో.. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ తరహాలో యాజమాన్య హక్కులపై ఎలాంటి సమస్యలకూ అవకాశం ఉండదనేది పరిశీలకుల అభిప్రాయం. 2014 చివరికల్లా బ్రిక్స్ బ్యాంక్ ఏర్పాటుకు లాంఛనాలన్నీ పూర్తికావాలని.. 2016 నుంచి ఇది కార్యకలాపాలను ప్రారంభించాలంటూ గతేడాది జీ20 సదస్సు(బ్రిస్బేన్) సందర్భంగా మోదీ సభ్య దేశాల అధిపతులకు సూచించినట్లు సమాచారం. కాగా, తొలి ప్రెసిడెంట్‌ను నామినేట్ చేసే అధికారం భారత్‌కు లభించింది. తర్వాత ఈ పదవిలో బ్రెజిల్, రష్యాకు చెందినవాళ్లు కొనసాగేలా ఒప్పందం కుదిరింది. ప్రపంచ జీడీపీలో దాదాపు 16 ట్రిలియన్ డాలర్లు.. అదేవిధంగా ప్రపంచ జనాభాలో 40 శాతం బ్రిక్స్ దేశాలదేనని.. ఈ బ్యాంక్ ద్వారా భారత్‌కు మరిన్ని ఇన్ఫ్రా నిధులు లభిస్తాయన్న ఆశాభావాన్ని మహర్షి వ్యక్తం చేశారు. ఆధునిక బ్యాంకింగ్ ఆవిష్కర్త... కేవీ ⇒ భారత్‌లో ఆధునిక బ్యాంకింగ్‌కు మూలకర్తగా కామత్‌ను చెప్పుకోవచ్చు. సన్నిహితులకు ఆయన ‘కేవీ’గా సుపరిచితులు. ⇒ మెకానికల్ ఇంజనీరింగ్ చదివి.. ఆతర్వాత ఐఐఎం-అహ్మదాబాద్‌లో ఎంబీఏ పూర్తిచేశారు. 1994లో ఐసీఐసీఐ బ్యాంక్ ఆయన నేతృత్వంలోనే ఆవిర్భవించింది. ⇒ దేశీ బ్యాంకింగ్ వ్యవస్థలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడంతోపాటు వినియోగదారులకు బ్యాంకింగ్ లావాదేవీల్లో సరికొత్త అనుభూతిని అందించడంలో కామత్ కృషి ఎనలేనది. మిగతా ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఐసీఐసీఐను అనుసరించేలా చేసిన ఘనత కూడా ఆయనదే. ⇒ అంతక్రితం 1971లో ఐసీఐసీఐ(బ్యాంక్‌గా మారకముందు ఆర్థిక సంస్థగా ఉండేది)లో కామత్ తన కెరీర్‌ను ప్రారంభించారు. దశాబ్దపు కాలానికిపైగా ఇక్కడ పనిచేసిన కేవీ.. 1988లో ఆసియా అభివృద్ధి బ్యాంక్(ఏడీబీ)లో చేరారు. చైనా, భారత్, ఇండోనేషియా, బంగ్లాదేశ్ తదితర వర్ధమాన దేశాల్లోని పలు ప్రాజెక్టులను ఆయన పర్యవేక్షించారు. అప్పుడు చైనాలోనే ఆయన ఎక్కువగా ఉన్నారు. ⇒ అయితే, 1994లో ఐసీఐసీఐ అనుబంధ సంస్థగా బ్యాంక్ ఏర్పాటైంది. ఆ తర్వాత 2002లో మాతృసంస్థ ఐసీఐసీఐ.. బ్యాంక్‌లో విలీనం అయింది. ⇒ 1996లో బ్యాంక్ సీఈఓగా మళ్లీ పాత సంస్థకు వచ్చిన కామత్... దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్‌గా, బీమా, మ్యూచువల్ ఫండ్ రంగాల్లోనూ అత్యుత్తమ సంస్థగా ఐసీఐసీఐని తీర్చిదిద్దారు. ⇒ 2009లో ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ పదవి నుంచి రిటైర్ అయ్యాక.. ప్రస్తుతం నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఇంకా అనేక కంపెనీ డెరైక్టర్ల బోర్డుల్లో కూడా ఆయన ఉన్నారు. ⇒ భారత్ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పుడు కూడా వృద్ధిపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసిన కామత్‌కు పద్మ భూషణ్ పురస్కారం కూడా లభించింది. ⇒ గ్లోబల్ బ్యాంకుల జాబితాలో భారత్ నుంచి కొన్ని బ్యాంకులైనా ఉండాలని.. ఇందులో ఐసీఐసీఐ కూడా ఒకటి కావాలన్న ఆకాంక్షను ఒక ఇంటర్వ్యూ సందర్బంగా కామత్ వ్యక్తం చేశారు. ⇒ ప్రస్తుతం ఐసీఐసీఐ వ్యాపార పరిమాణం(అసెట్ బేస్) దాదాపు 100 బిలియన్ డాలర్లు కాగా.. కామత్ సారథ్యం వహించనున్న బ్రిక్స్ బ్యాంక్ అధీకృత మూలధనం కూడా 100 బిలియన్ డాలర్లు కావడం విశేషం