బ్రిక్స్ బ్యాంక్ సారథి.. కామత్! | Kamath to head BRICS bank | Sakshi
Sakshi News home page

బ్రిక్స్ బ్యాంక్ సారథి.. కామత్!

Published Tue, May 12 2015 12:20 AM | Last Updated on Sun, Sep 3 2017 1:51 AM

బ్రిక్స్ బ్యాంక్ సారథి.. కామత్!

బ్రిక్స్ బ్యాంక్ సారథి.. కామత్!

తొలి ప్రెసిడెంట్‌గా ఎంపిక...
పదవిలో ఐదేళ్లపాటు కొనసాగే అవకాశం...
ఏడాదిలో బ్యాంక్ కార్యకలాపాలు షురూ...
100 బిలియన్ డాలర్ల మూలధనంతో షాంఘై కేంద్రంగా ఏర్పాటు

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన బ్రిక్స్ బ్యాంక్‌కు తొలి ప్రెసిడెంట్‌గా ప్రఖ్యాత భారతీయ బ్యాంకర్ కేవీ కామత్ నియామకం ఖరారైంది. ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి సోమవారమిక్కడ వెల్లడించారు.

ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్)లకు పోటీగా వర్ధమాన దేశాల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులందించడమే లక్ష్యంగా ఈ బ్రిక్స్ బ్యాంక్ అవతరించింది. బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) కూటమి దేశాలు దీన్ని ఏర్పాటు చేసేందుకు గతేడాది ఆమోదముద్ర వేయడం తెలిసిందే. సుమారు 100 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.6.3 లక్షల కోట్లు) ప్రారంభ అధీకృత మూలధనంతో నెలకొల్పనున్నారు. న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఎన్‌డీబీ)గా పేరుపెట్టిన ఈ సంస్థ చైనాలోని షాంఘై ప్రధాన కేంద్రంగా మరో ఏడాది వ్యవధిలో కార్యకలాపాలను ప్రారంభించనుందని మహర్షి తెలిపారు.
 
ప్రస్తుతం కామత్(67 ఏళ్లు) కొన్ని కంపెనీల బోర్డుల్లో విధులు నిర్వహిస్తున్నారని.. వాటినుంచి బయటికివచ్చాక బ్రిక్స్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా ఆయన నియామకం అమల్లోకిరానుందన్నారు. కాగా, కామత్ నియామకానికి భారత్ ఆమోదముద్ర వేసిందని.. దీనికి ఇతర బ్రిక్స్ కూటమి దేశాలు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాల్సి ఉందని మహర్షి వివరించారు. పదవీ కాలంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోనప్పటికీ ఐదేళ్లు ఉండొచ్చని ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. దేశీ ప్రైవేటు బ్యాంకింగ్ అగ్రగామి ఐసీఐసీఐ బ్యాంక్‌తో పాటు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు కూడా నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కామత్ వ్యవహరిస్తున్నారు.
 
బ్రిక్స్ బ్యాంక్ ఆవిర్భావం ఇలా...
2012లో ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఈ సరికొత్త బ్యాంక్ ఏర్పాటు ప్రతిపాదనకు నాంది పడింది. ఆతర్వాత డర్బన్‌లో జరిగిన సదస్సులో బ్రిక్స్ బ్యాంక్‌పై అన్ని దేశాలు తమ సుముఖత వ్యక్తం చేశాయి. గతేడాది బ్రెజిల్ బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర దేశాల అధిపతులు దీనికి తుది ఆమోదముద్ర వేశారు. ప్రతి బ్రిక్స్ సభ్య దేశం ప్రాథమిక సభ్య దేశం 10 బిలియన్ డాలర్ల చొప్పున ప్రాథమిక మూల ధనాన్ని సమకూర్చనున్నాయి. అధీకృత మూల ధనం మాత్రం 100 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. సభ్య దేశాలన్నీ సమాన స్థాయిలోనే క్యాపిటల్‌ను అందించనుండటంతో.. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ తరహాలో యాజమాన్య హక్కులపై ఎలాంటి సమస్యలకూ అవకాశం ఉండదనేది పరిశీలకుల అభిప్రాయం.

2014 చివరికల్లా బ్రిక్స్ బ్యాంక్ ఏర్పాటుకు లాంఛనాలన్నీ పూర్తికావాలని.. 2016 నుంచి ఇది కార్యకలాపాలను ప్రారంభించాలంటూ గతేడాది జీ20 సదస్సు(బ్రిస్బేన్) సందర్భంగా మోదీ సభ్య దేశాల అధిపతులకు సూచించినట్లు సమాచారం. కాగా, తొలి ప్రెసిడెంట్‌ను నామినేట్ చేసే అధికారం భారత్‌కు లభించింది. తర్వాత ఈ పదవిలో బ్రెజిల్, రష్యాకు చెందినవాళ్లు కొనసాగేలా ఒప్పందం కుదిరింది. ప్రపంచ జీడీపీలో దాదాపు 16 ట్రిలియన్ డాలర్లు.. అదేవిధంగా ప్రపంచ జనాభాలో 40 శాతం బ్రిక్స్ దేశాలదేనని.. ఈ బ్యాంక్ ద్వారా భారత్‌కు మరిన్ని ఇన్‌ఫ్రా నిధులు లభిస్తాయన్న ఆశాభావాన్ని మహర్షి వ్యక్తం చేశారు.
 
ఆధునిక బ్యాంకింగ్ ఆవిష్కర్త... కేవీ
భారత్‌లో ఆధునిక బ్యాంకింగ్‌కు మూలకర్తగా కామత్‌ను చెప్పుకోవచ్చు. సన్నిహితులకు ఆయన ‘కేవీ’గా సుపరిచితులు.
మెకానికల్ ఇంజనీరింగ్ చదివి.. ఆతర్వాత ఐఐఎం-అహ్మదాబాద్‌లో ఎంబీఏ పూర్తిచేశారు. 1994లో ఐసీఐసీఐ బ్యాంక్ ఆయన నేతృత్వంలోనే ఆవిర్భవించింది.
దేశీ బ్యాంకింగ్ వ్యవస్థలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడంతోపాటు వినియోగదారులకు బ్యాంకింగ్ లావాదేవీల్లో సరికొత్త అనుభూతిని అందించడంలో కామత్ కృషి ఎనలేనది. మిగతా ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఐసీఐసీఐను అనుసరించేలా చేసిన ఘనత కూడా ఆయనదే.
అంతక్రితం 1971లో ఐసీఐసీఐ(బ్యాంక్‌గా మారకముందు ఆర్థిక సంస్థగా ఉండేది)లో కామత్ తన కెరీర్‌ను ప్రారంభించారు. దశాబ్దపు కాలానికిపైగా ఇక్కడ పనిచేసిన కేవీ.. 1988లో ఆసియా అభివృద్ధి బ్యాంక్(ఏడీబీ)లో చేరారు. చైనా, భారత్, ఇండోనేషియా, బంగ్లాదేశ్ తదితర వర్ధమాన దేశాల్లోని పలు ప్రాజెక్టులను ఆయన పర్యవేక్షించారు. అప్పుడు చైనాలోనే ఆయన ఎక్కువగా ఉన్నారు.
అయితే, 1994లో ఐసీఐసీఐ అనుబంధ సంస్థగా బ్యాంక్ ఏర్పాటైంది. ఆ తర్వాత 2002లో మాతృసంస్థ ఐసీఐసీఐ.. బ్యాంక్‌లో విలీనం అయింది.
1996లో బ్యాంక్ సీఈఓగా మళ్లీ పాత సంస్థకు వచ్చిన కామత్... దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్‌గా, బీమా, మ్యూచువల్ ఫండ్ రంగాల్లోనూ అత్యుత్తమ సంస్థగా ఐసీఐసీఐని తీర్చిదిద్దారు.
2009లో ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ పదవి నుంచి రిటైర్ అయ్యాక.. ప్రస్తుతం నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఇంకా అనేక కంపెనీ డెరైక్టర్ల బోర్డుల్లో కూడా ఆయన ఉన్నారు.
భారత్ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పుడు కూడా వృద్ధిపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసిన కామత్‌కు పద్మ భూషణ్ పురస్కారం కూడా లభించింది.
గ్లోబల్ బ్యాంకుల జాబితాలో భారత్ నుంచి కొన్ని బ్యాంకులైనా ఉండాలని.. ఇందులో ఐసీఐసీఐ కూడా ఒకటి కావాలన్న ఆకాంక్షను ఒక ఇంటర్వ్యూ సందర్బంగా కామత్ వ్యక్తం చేశారు.
⇒  ప్రస్తుతం ఐసీఐసీఐ వ్యాపార పరిమాణం(అసెట్ బేస్) దాదాపు 100 బిలియన్ డాలర్లు కాగా.. కామత్ సారథ్యం వహించనున్న బ్రిక్స్ బ్యాంక్ అధీకృత మూలధనం కూడా 100 బిలియన్ డాలర్లు కావడం విశేషం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement