Rajiv Maharshi
-
రఫేల్ ఆడిట్ నుంచి తప్పుకోండి
న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పంద ఆడిట్ నుంచి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) రాజీవ్ మహర్షి తప్పుకోవాలని కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. ఆర్థిక శాఖ కార్యదర్శి హోదాలో ఆయన ఫ్రాన్స్‌తో జరిగిన చర్చల్లో పాల్గొన్నారని, ఆడిటింగ్‌లోనూ పాలుపంచుకుంటే పరస్పర విరుద్ధ ప్రయోజనమవుతుందని అభ్యంతరం వ్యక్తం చేసింది. రఫేల్ ఒప్పందంపై కాగ్ రూపొందించిన నివేదికను సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. రఫేల్ విమానాల కొనుగోలులో కేంద్రం జాతీయ ప్రయోజనాలపై రాజీ పడిందని, కానీ రాజ్యంగబద్ధ సంస్థ అయిన కాగ్ అన్ని రక్షణ ఒప్పందాలను నిష్పక్షపాతంగా ఆడిట్ చేయాలని రాజీవ్ మహర్షికి రాసిన లేఖలో పేర్కొంది. కాగ్‌కు తెలిసో తెలియకో రఫేల్ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని, వాటికి ఆయన కూడా బాధ్యుడేనని తెలిపింది. అసలు నిజాలు తెలిసి కూడా ఆయన ఆడిటింగ్‌లో పాల్గొనడం షాకింగ్‌కు గురిచేస్తోందని పేర్కొంది. రాజీవ్ మహర్షి 2014 అక్టోబర్ 24 నుంచి 2015 ఆగస్టు 30 మధ్య కాలంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఆ మధ్యకాలంలోనే(2015, ఏప్రిల్ 10న) ప్రధాని మోదీ పారిస్ వెళ్లి రఫేల్ ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. -
బ్యాంకులు అలా రుణాలిస్తుంటే కళ్లు మూసుకున్నారా?
న్యూఢిల్లీ: పేరుకుపోయిన మొండిబాకీలతో బ్యాంకింగ్ రంగం పెను సంక్షోభం ఎదుర్కొంటున్న నేపథ్యంలో నియంత్రణ సంస్థగా రిజర్వ్ బ్యాంక్ బాధ్యతలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) రాజీవ్ మహర్షి పలు ప్రశ్నలు లేవనెత్తారు. బ్యాంకులు విచక్షణారహితంగా రుణాలు ఇచ్చేస్తుంటే రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. అంతిమంగా ఈ రుణాలే మొండిబాకీలుగా మారి బ్యాంకింగ్ రంగంలో సమస్యలకు దారి తీశాయని పేర్కొన్నారు. ‘బ్యాంకింగ్ రంగం ప్రస్తుత సంక్షోభ పరిస్థితులకు సంబంధించి దీన్నుంచి ఎలా బైటపడాలన్న దానిపైనే అంతా చర్చిస్తున్నారు. సబ్సిడీల తరహాలో రీక్యాపిటలైజేషన్ దీనికి ఒక మార్గం. అయితే, ఈ మొత్తం వ్యవహారంలో ఎవరూ మాట్లాడనటువంటి విషయం ఒకటుంది. అదేంటంటే.. ఇంత జరుగుతుంటే నియంత్రణ సంస్థ (రిజర్వ్ బ్యాంక్) ఏం చేస్తున్నట్లు? దాని పాత్రేంటి, బాధ్యతలేంటి? వీటి గురించి చర్చించాల్సిన అవసరం ఉంది’ అని ఇండియన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (ఐఎస్ఎస్పీ) ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మహర్షి చెప్పారు. 2018 మార్చి 31 నాటికి బ్యాంకింగ్ రంగంలో రూ. 9.61 లక్షల కోట్ల మేర మొండిబాకీలు ఉన్నాయి. వీటిలో అత్యధిక భాగం రూ. 7.03 లక్షల కోట్లు పారిశ్రామిక రంగం నుంచి రావాల్సినవి కాగా, రూ. 85,344 కోట్లు వ్యవసాయ, వ్యవసాయ సంబంధ సంస్థల నుంచి రావాల్సినవి. ప్రధాన కారణాలపై చర్చ జరగడం లేదు.. ఆస్తులు, అప్పులకు మధ్య వ్యత్యాసం భారీగా పెరిగిపోవడమే ప్రస్తుత బ్యాంకింగ్ సంక్షోభానికి కారణమని, కానీ దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదని ఆయన పేర్కొన్నారు. బాండ్ల మార్కెట్ ద్వారా నిధుల సమీకరణపై చర్చ జరగాలన్నారు. సంస్కరణల్లో రాష్ట్రాలూ పాలుపంచుకోవాలి: ఎన్కే సింగ్ ఆర్థిక సంస్కరణలను కేంద్రం ఒక్కటే అమలు చేయజాలదని, రాష్ట్రాలు కూడా ఇందులో పాలుపంచుకోవాలని 14వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, మాజీ రెవెన్యూ కార్యదర్శి ఎన్కే సింగ్ చెప్పారు. ఆర్థిక సంస్కరణలకు సంబంధించి పైపై మెరుగులతో ఉపయోగం లేదని, వ్యవస్థాగతమైన సంస్కరణలు అవసరమని తెలిపారు. ఈ విషయంలో రాష్ట్రాల ప్రభుత్వాలు ఎంతో చేయగలవని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలు, నిర్వహణ మొదలైన అంశాల్లో ఏడాది ఫుల్ టైమ్ కోర్స్‌ను ఇండియన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అందిస్తుంది. 2–3 ఏళ్ల అనుభవం ఉన్న ప్రొఫెషనల్స్ కోసం ఇది ఉద్దేశించినది. -
నూతన కాగ్‌గా రాజీవ్ మహర్షి
-
నూతన కాగ్‌గా రాజీవ్ మహర్షి
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ హోం కార్యదర్శి రాజీవ్ మహర్షి(62)ని తదుపరి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)గా కేంద్రం నియమించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. రాష్ట్రపతి భవన్లో సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మహర్షి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారన్నారు. 1978 బ్యాచ్, రాజస్తాన్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన మహర్షి కాగ్‌గా ఆరేళ్ల పాటు లేదా 65 ఏళ్లు పూర్తయ్యేవరకు కొనసాగుతారు. హోంశాఖ కార్యదర్శిగా రెండేళ్ల పదవీకాలాన్ని ఆగస్టుతో పూర్తిచేసుకున్నారు. -
ఆర్థిక కార్యదర్శిగా శక్తికాంత్ దాస్
న్యూఢిల్లీ : రెవెన్యూ కార్యదర్శిగా ఉన్న శక్తికాంత్ దాస్ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న రాజీవ్ మహర్షి ఈ నెల 31న పదవీ బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్యదర్శిగా ఉన్న హస్ముక్ అదియా రెవెన్యూ కార్యదర్శిగా శక్తికాంత్ దాస్ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఉన్న అంజులీ చిబ్ దుగ్గల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్యదర్శిగా నియమితులయ్యారు. దుగ్గల్ స్థానంలో కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా కొత్తగా తపన్ రాయ్ నియమితులయ్యారు. -
ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరో రూ. 11,500 కోట్లు!
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) కేంద్రం మరో రూ. 11,500 కోట్ల మూలధనం సమకూర్చే అవకాశముందని ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి తెలిపారు. ఇప్పటికే బడ్జెట్లో కేటాయించిన దాదాపు రూ. 7,940 కోట్లకు ఇది అదనమని ఆయన వివరించారు. ప్రపంచ స్థాయి మూలధన ప్రమాణాలను అందుకునేందుకు, వృద్ధి సాధించేందుకు పీఎస్బీలకు వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో కేంద్రం దాదాపు రూ. 57,000 కోట్ల నిధులు సమకూర్చాలని భావిస్తున్నట్లు మహర్షి ఇటీవలే వెల్లడించారు. -
బ్రిక్స్ బ్యాంక్ సారథి.. కామత్!
తొలి ప్రెసిడెంట్‌గా ఎంపిక... ⇒ పదవిలో ఐదేళ్లపాటు కొనసాగే అవకాశం... ⇒ ఏడాదిలో బ్యాంక్ కార్యకలాపాలు షురూ... ⇒ 100 బిలియన్ డాలర్ల మూలధనంతో షాంఘై కేంద్రంగా ఏర్పాటు న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన బ్రిక్స్ బ్యాంక్‌కు తొలి ప్రెసిడెంట్‌గా ప్రఖ్యాత భారతీయ బ్యాంకర్ కేవీ కామత్ నియామకం ఖరారైంది. ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి సోమవారమిక్కడ వెల్లడించారు. ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్)లకు పోటీగా వర్ధమాన దేశాల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులందించడమే లక్ష్యంగా ఈ బ్రిక్స్ బ్యాంక్ అవతరించింది. బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) కూటమి దేశాలు దీన్ని ఏర్పాటు చేసేందుకు గతేడాది ఆమోదముద్ర వేయడం తెలిసిందే. సుమారు 100 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.6.3 లక్షల కోట్లు) ప్రారంభ అధీకృత మూలధనంతో నెలకొల్పనున్నారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్(ఎన్డీబీ)గా పేరుపెట్టిన ఈ సంస్థ చైనాలోని షాంఘై ప్రధాన కేంద్రంగా మరో ఏడాది వ్యవధిలో కార్యకలాపాలను ప్రారంభించనుందని మహర్షి తెలిపారు. ప్రస్తుతం కామత్(67 ఏళ్లు) కొన్ని కంపెనీల బోర్డుల్లో విధులు నిర్వహిస్తున్నారని.. వాటినుంచి బయటికివచ్చాక బ్రిక్స్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా ఆయన నియామకం అమల్లోకిరానుందన్నారు. కాగా, కామత్ నియామకానికి భారత్ ఆమోదముద్ర వేసిందని.. దీనికి ఇతర బ్రిక్స్ కూటమి దేశాలు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాల్సి ఉందని మహర్షి వివరించారు. పదవీ కాలంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోనప్పటికీ ఐదేళ్లు ఉండొచ్చని ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. దేశీ ప్రైవేటు బ్యాంకింగ్ అగ్రగామి ఐసీఐసీఐ బ్యాంక్‌తో పాటు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు కూడా నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కామత్ వ్యవహరిస్తున్నారు. బ్రిక్స్ బ్యాంక్ ఆవిర్భావం ఇలా... 2012లో ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఈ సరికొత్త బ్యాంక్ ఏర్పాటు ప్రతిపాదనకు నాంది పడింది. ఆతర్వాత డర్బన్‌లో జరిగిన సదస్సులో బ్రిక్స్ బ్యాంక్‌పై అన్ని దేశాలు తమ సుముఖత వ్యక్తం చేశాయి. గతేడాది బ్రెజిల్ బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర దేశాల అధిపతులు దీనికి తుది ఆమోదముద్ర వేశారు. ప్రతి బ్రిక్స్ సభ్య దేశం ప్రాథమిక సభ్య దేశం 10 బిలియన్ డాలర్ల చొప్పున ప్రాథమిక మూల ధనాన్ని సమకూర్చనున్నాయి. అధీకృత మూల ధనం మాత్రం 100 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. సభ్య దేశాలన్నీ సమాన స్థాయిలోనే క్యాపిటల్‌ను అందించనుండటంతో.. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ తరహాలో యాజమాన్య హక్కులపై ఎలాంటి సమస్యలకూ అవకాశం ఉండదనేది పరిశీలకుల అభిప్రాయం. 2014 చివరికల్లా బ్రిక్స్ బ్యాంక్ ఏర్పాటుకు లాంఛనాలన్నీ పూర్తికావాలని.. 2016 నుంచి ఇది కార్యకలాపాలను ప్రారంభించాలంటూ గతేడాది జీ20 సదస్సు(బ్రిస్బేన్) సందర్భంగా మోదీ సభ్య దేశాల అధిపతులకు సూచించినట్లు సమాచారం. కాగా, తొలి ప్రెసిడెంట్‌ను నామినేట్ చేసే అధికారం భారత్‌కు లభించింది. తర్వాత ఈ పదవిలో బ్రెజిల్, రష్యాకు చెందినవాళ్లు కొనసాగేలా ఒప్పందం కుదిరింది. ప్రపంచ జీడీపీలో దాదాపు 16 ట్రిలియన్ డాలర్లు.. అదేవిధంగా ప్రపంచ జనాభాలో 40 శాతం బ్రిక్స్ దేశాలదేనని.. ఈ బ్యాంక్ ద్వారా భారత్‌కు మరిన్ని ఇన్ఫ్రా నిధులు లభిస్తాయన్న ఆశాభావాన్ని మహర్షి వ్యక్తం చేశారు. ఆధునిక బ్యాంకింగ్ ఆవిష్కర్త... కేవీ ⇒ భారత్‌లో ఆధునిక బ్యాంకింగ్‌కు మూలకర్తగా కామత్‌ను చెప్పుకోవచ్చు. సన్నిహితులకు ఆయన ‘కేవీ’గా సుపరిచితులు. ⇒ మెకానికల్ ఇంజనీరింగ్ చదివి.. ఆతర్వాత ఐఐఎం-అహ్మదాబాద్‌లో ఎంబీఏ పూర్తిచేశారు. 1994లో ఐసీఐసీఐ బ్యాంక్ ఆయన నేతృత్వంలోనే ఆవిర్భవించింది. ⇒ దేశీ బ్యాంకింగ్ వ్యవస్థలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడంతోపాటు వినియోగదారులకు బ్యాంకింగ్ లావాదేవీల్లో సరికొత్త అనుభూతిని అందించడంలో కామత్ కృషి ఎనలేనది. మిగతా ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఐసీఐసీఐను అనుసరించేలా చేసిన ఘనత కూడా ఆయనదే. ⇒ అంతక్రితం 1971లో ఐసీఐసీఐ(బ్యాంక్‌గా మారకముందు ఆర్థిక సంస్థగా ఉండేది)లో కామత్ తన కెరీర్‌ను ప్రారంభించారు. దశాబ్దపు కాలానికిపైగా ఇక్కడ పనిచేసిన కేవీ.. 1988లో ఆసియా అభివృద్ధి బ్యాంక్(ఏడీబీ)లో చేరారు. చైనా, భారత్, ఇండోనేషియా, బంగ్లాదేశ్ తదితర వర్ధమాన దేశాల్లోని పలు ప్రాజెక్టులను ఆయన పర్యవేక్షించారు. అప్పుడు చైనాలోనే ఆయన ఎక్కువగా ఉన్నారు. ⇒ అయితే, 1994లో ఐసీఐసీఐ అనుబంధ సంస్థగా బ్యాంక్ ఏర్పాటైంది. ఆ తర్వాత 2002లో మాతృసంస్థ ఐసీఐసీఐ.. బ్యాంక్‌లో విలీనం అయింది. ⇒ 1996లో బ్యాంక్ సీఈఓగా మళ్లీ పాత సంస్థకు వచ్చిన కామత్... దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్‌గా, బీమా, మ్యూచువల్ ఫండ్ రంగాల్లోనూ అత్యుత్తమ సంస్థగా ఐసీఐసీఐని తీర్చిదిద్దారు. ⇒ 2009లో ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ పదవి నుంచి రిటైర్ అయ్యాక.. ప్రస్తుతం నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఇంకా అనేక కంపెనీ డెరైక్టర్ల బోర్డుల్లో కూడా ఆయన ఉన్నారు. ⇒ భారత్ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పుడు కూడా వృద్ధిపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసిన కామత్‌కు పద్మ భూషణ్ పురస్కారం కూడా లభించింది. ⇒ గ్లోబల్ బ్యాంకుల జాబితాలో భారత్ నుంచి కొన్ని బ్యాంకులైనా ఉండాలని.. ఇందులో ఐసీఐసీఐ కూడా ఒకటి కావాలన్న ఆకాంక్షను ఒక ఇంటర్వ్యూ సందర్బంగా కామత్ వ్యక్తం చేశారు. ⇒ ప్రస్తుతం ఐసీఐసీఐ వ్యాపార పరిమాణం(అసెట్ బేస్) దాదాపు 100 బిలియన్ డాలర్లు కాగా.. కామత్ సారథ్యం వహించనున్న బ్రిక్స్ బ్యాంక్ అధీకృత మూలధనం కూడా 100 బిలియన్ డాలర్లు కావడం విశేషం