ముంబై: కోవిడ్ మహమ్మారి బ్రిక్స్ దేశాలకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగించిందని బ్రిక్స్ ఎకనమిక్ బులిటన్ పేర్కొంది. నిరుద్యోగం, పేదరికం, లింగ వివక్షత, వలసలు... ఇలా పలు సామాజిక అంశాలపై మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉందని వివరించింది. బ్రిక్స్ సెంట్రల్ బ్యాంకుల సభ్యులతో బ్రిక్స్ కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్‌మెంట్ (సీఆర్‌ఏ) రీసెర్చ్ గ్రూప్ రూపొందించిన బులెటిన్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసింది. బ్రిక్స్ పరిశోధన, ఆర్థిక విశ్లేషణ, నిఘా సామర్థ్యాన్ని పెంపొందించడానికి సీఆర్‌ఏ రీసెర్చ్ గ్రూప్ ఏర్పాటయ్యింది. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలు సభ్యదేశాలుగా ఉన్న బ్రిక్స్‌కు ప్రస్తుతం భారతదేశం అధ్యక్ష స్థానంలో ఉంది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే..
- కోవిడ్ సంక్షోభం అన్ని దేశాలను విచక్షణారహి తంగా ప్రభావితం చేసింది. బ్రిక్స్ కూడా దీనికి మినహాయింపు కాదు. ఈ సభ్య దేశాలు కూడా మహమ్మారితో తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాని నుండి కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.
- మహమ్మారి వ్యవధి–తీవ్రతల విషయాల్లో బ్రిక్స్ దేశాల మధ్య గణనీయమైన వైవిధ్యత ఉంది.
- చైనా కోవిడ్‌ను పటిష్ట స్థాయిలో కట్టడి చేయగా, ఇతర బ్రిక్స్ దేశాలు అనేక రకాల ఇన్ఫెక్షన్‌లను చవి చూశాయి. తీవ్ర సెకండ్‌వేవ్‌లను ఎదుర్కొన్నాయి. మూడవ వేవ్ భయాల ముందు నిలిచాయి.
- 2020లో ఎదురైన మహమ్మారి–ప్రేరిత తీవ్ర సవాళ్ల నుండి బ్రిక్స్ కోలుకున్నట్లు విశ్వసనీయంగా కనిపిస్తోంది. అయితే, రికవరీ విషయంలో బ్రిక్స్ సభ్యుల మధ్య గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నాయి.
- కరోనా సవాళ్లు, ఆర్థిక పునరుద్ధరణ, దేశాల మధ్య రికవరీలో వైరుద్యాలు, ద్రవ్యోల్బణం ఇబ్బందులు, అంతర్జాతీయంగా ఎదురవుతున్న అవరోధాలు, ఫైనాన్షియల్ రంగంలో ఒడిదుడుకులుసహా బ్రిక్స్ దేశాలు పలు సమస్యలను ప్రస్తుతం ఎదుర్కొంటున్నాయి.
- మహమ్మారిని ఎదుర్కొనడంలో వ్యాక్సినేషన్ కీలక పాత్ర పోషించనుంది. విస్తృత వ్యాక్సినేషన్ వేగం, సమర్థత వంటి అంశాలు ఆర్థిక పునరుద్ధరణలో అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి.
- కోవిడ్ అనిశ్చితికి తోడు, కఠిన ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, సంక్షోభం నుండి ఉత్పన్నమయ్యే నిరంతర ఆర్థిక మరియు నిర్మాణాత్మక మార్పులు బ్రిక్స్ దేశాలలో ఆందోళనను రేకెత్తిస్తున్న మరికొన్ని అంశాలు.
- మహమ్మారి అనంతరం చక్కటి భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించడం, ఆయా ప్రణాళికలు విజయవంతానికి కృషి, సంక్షోభం తదనంతరం ఉద్భవించే అవకాశాలను అందిపుచ్చుకోవడంపై బ్రిక్స్ దేశాలు దృష్టి సారించాలి.
- సంవత్సరాలుగా సమన్వయం– సహకారానికి బ్రిక్స్ దేశాలు బలమైన పునాదులను ఏర్పరచుకున్నాయి. న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డీబీ), కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్‌మెంట్ (సీఆర్‌ఏ) ఏర్పాటు ఇందులో భాగంగా చెప్పుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment