సాక్షి, విశాఖపట్నం: రక్షణ పరిశోధన సాంకేతిక రంగంలోకి ప్రైవేట్ సంస్థలను ఆహ్వానిస్తున్నట్లు డీఆర్‌డీవో చైర్మన్ సమీర్ వి.కామత్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్పేస్ పాలసీలో భాగంగా రక్షణ రంగంలో ప్రధానంగా స్పేస్ టెక్‌లో ప్రైవేట్ పరిశ్రమలు, పరిశోధన సంస్థలకు అవకాశాలు కల్పించినట్లు వివరించారు. విశాఖలో ని నేవల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లేబొరేటరీ (ఎన్‌ఎస్‌టీఎల్)లో గురువారం ప్రారంభమైన కండిషన్ మానిటరింగ్ జాతీయ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ‘సాక్షి’తో పలు అంశాలపై మాట్లాడారు.
అంతరిక్ష పరిశోధనలపై దృష్టి
స్పేస్ పాలసీలో భాగంగా పరిశోధనలపై దృష్టి సారించాం. ముఖ్యంగా రక్షణ శాఖతో పాటు అంతరిక్ష పరిశోధనలపై దృష్టి పెట్టాం. రాకెట్ లాంచింగ్, శాటిలైట్స్ అభివృద్ధి.. ఇలా ఎలాంటి హద్దులు లేకుండా ప్రైవేట్ సంస్థలు ముందుకు రావచ్చు. దీనిద్వారా అగ్రదేశాలతో పోటీ పడే స్థాయికి వేగంగా చేరుకుంటాం. అంతరిక్ష ఆధారిత నిఘా, అంతరిక్ష పరిస్థితులపై మన అవగాహన సామర్థ్యాలు మెరుగుపడుతున్నాయి.
అంకుర సంస్థలకు ప్రోత్సాహం
రక్షణ రంగంలో స్టార్టప్స్‌ని ప్రోత్సహిస్తున్నాం. డిఫెన్స్ సిస్టమ్, టెక్నాలజీపై పని చేస్తున్న స్టార్టప్స్‌కు ప్రాధాన్యమిస్తున్నాం. పరిశోధన అభివృద్ధి(ఆర్ అండ్ డీ) బడ్జెట్‌లో 25 శాతం వరకూ పరిశ్రమలు, స్టార్టప్స్, విద్యారంగానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించడం శుభ పరిణామం. అందుకే స్టార్టప్స్, ఎంఎస్‌ఎంఈలకు అవకాశాలు కల్పిస్తున్నాం.
17 వేల అడుగుల ఎత్తు వరకు ‘యూఏవీ’
మానవ రహిత వైమానిక వాహనం (యూఏవీ)పై ప్రధానంగా దృష్టి సారించాం. ఇందుకోసం గైడెన్స్ కిట్, సీట్ ఎజెక్షన్ సిస్టమ్, పైరోటెక్నిక్ కాట్రిడ్స్ అభివృద్ధి చేసే పనిలో ఉన్నాం. ‘యూఏవీ తపస్’ కోసం 180 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన ఇంజన్‌ను దేశీయంగా అభివృద్ధి చేశాం. దీని ద్వారా యూఏవీ 17 వేల అడుగుల ఎత్తువరకూ ఎగరగలదు.
2028లో తొలి దేశీయ యుద్ధ విమానం ఎగరనుంది
మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన సాయుధ బలగాల్లో చాలా వ్యవస్థలు స్వదేశీ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోనున్నాయి. ఇందులో భాగంగా ఎల్‌సీఏ ఎంకే–2 ఇండక్షన్‌కు సిద్ధమవుతున్నాం. జీఈఎఫ్ 414 ఇంజన్‌తో కూడిన ఏఎంసీఏ (అడ్వాన్స్‌డ్ మీడియమ్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) ఫేజ్–1 యుద్ధ విమానాన్ని 2028లో ఎగురవేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నాం. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతోంది. దీనికి సంబంధించి అనుమతుల కోసం వేచి చూస్తున్నాం.
ఎలైట్ క్లబ్‌లో చేరడం గర్వకారణం
ఇటీవల ‘సీ బేస్డ్ ఎండో అట్మాస్ఫియరిక్ ఇంటర్‌సెప్టర్ మిసైల్’ తొలి వి మాన ప్రయోగం విజయవంతం కావడంతో రక్షణ సామర్థ్యాల విషయంలో మన దేశం చరిత్రాత్మక మైలురాయిని అధిగవిుంచింది. నేవల్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ (బీఎండీ) సామర్థ్యంలో అగ్రదేశాల సరసన నిలిచి ఎలైట్ క్లబ్ ఆఫ్ నేషన్స్‌లో చేరడం గర్వకారణం.
యుద్ధనౌకలు, ఉపరితలం నుంచి బాలిస్టిక్ క్షిపణులను నిలువరించే సామర్థ్యాన్ని భారత్ అభివృద్ధి చేసింది. అంతకుముందే భూ ఆధారిత క్షిపణి ప్రయోగాన్ని విజ యవంతంగా నిర్వహించాం. ఈ జంట విజయాలతో సుదూర అణు క్షిపణులు, హైపర్ సోనిక్ మిసైల్స్, గ్‌లైడర్స్, శత్రు విమానాల్ని అడ్డుకోగల సామర్థ్యాన్ని మన దేశం సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment