space agency
-
చంద్రుని ఆవలి వైపుకు చాంగే6
బీజింగ్: చంద్రుని ఆవలివైపు చైనా చాంగే6 ల్యాండర్ విజయవంతంగా దిగింది. అక్కడి మట్టిని సేకరించి తిరిగి భూమికి చేరుకోనుంది. చంద్రుని దక్షిణ ధృవ అయిట్కెన్(ఎస్పీఏ) బేసిన్ వద్ద బీజింగ్ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 6.23 గంటలకు విజయవంతంగా అది దిగిందని చైనా నేషనల్ స్పేస్ అడ్మిని్రస్టేషన్(సీఎన్ఎస్ఏ) ప్రకటించింది. చాంగే6లో ఒక ఆర్బిటార్, ఒక రిటర్నర్, ఒక ల్యాండర్, ఒక అసెండర్ ఉన్నాయి. మే మూడో తేదీన చాంగే6ను చైనా ప్రయోగకేంద్రం నుంచి ప్రయోగించారు. అది తొలుత భూస్థిర కక్ష్యలో, తర్వాత చంద్ర కక్ష్యలో తిరిగింది. చాంగే6లో ఆర్బిటార్–రిటర్నర్, ల్యాండర్–అసెండర్ జతలు ఉన్నాయి. ఆర్బిటార్–రిటర్నర్ జత నుంచి ల్యాండర్–అసెండర్ జత మే 30వ తేదీన విడిపోయింది. ఆర్బిటార్–రిటర్నర్ జత చంద్రుని కక్ష్యలోనే తిరుగుతోంది. కీలకమైన ల్యాండింగ్ ల్యాండర్–అసెండర్ జత చంద్రుడిపై సురక్షితంగా ల్యాండ్ అవడమే ఈ మొత్తం మిషన్‌లో అత్యంత కీలకమైన దశ. దిగేటపుడు మార్గమధ్యంలో ఏమైనా అవాంతరాలు ఉంటే వాటిని గుర్తించేందుకు స్వయంచాలిత అవాంతరాల నిరోధక వ్యవస్థ, కాంతి కెమెరాను వినియోగించారు. వీటి సాయంతో సురక్షితమైన ల్యాండింగ్ ప్రదేశాన్ని ఎంచుకుని ల్యాండర్–అసెండర్ అక్కడే దిగిందని చైనా అధికారి జిన్హువా వార్తాసంస్థ పేర్కొంది. ఎస్పీఏ బేసిన్‌లోని అపోలో బేసిన్లో ఇది దిగింది. భూమి వైపు కంటే ఆవలి వైపు చంద్రుడి ఉపరితలం కాస్తంత గట్టిగా ఉందని సీఏఎస్‌సీ అంతరిక్ష నిపుణుడు హుయాంగ్ హావో చెప్పారు. అక్కడ దిగిన ల్యాండర్ 14 గంటల్లోపు రెండు రకాలుగా మట్టిని సేకరిస్తుంది. డ్రిల్లింగ్ చేసి కొంత, రోబోటిక్ చేయితో మరికొంత ఇలా మొత్తంగా 2 కేజీల మట్టిని సేకరిస్తుంది. ల్యాండర్ చంద్రునికి ఆవలివైపు ఉపరితలంపై ఉన్న నేపథ్యంలో భూమి నుంచి నేరుగా దానిని కమాండ్ ఇవ్వడం అసాధ్యం. అందుకే కమ్యూనికేషన్‌కు వారధిగా ఇప్పటికే చైనా క్వికియానో–2 రిలే ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఆ శాటిలైట్ ద్వారా చాంగే–6 ల్యాండర్‌కు ఆదేశాలు ఇవ్వొచ్చు.మళ్లీ భూమి మీదకు సేకరించిన మట్టిని ల్యాండర్ అసెండర్‌లోకి చేరుస్తుంది. అసెండర్ రాకెట్లా నింగిలోకి దూసుకెళ్లి ఆర్బిటార్–రిటర్నర్ జతతో అనుసంధానమవుతుంది. రిటర్నర్ మాడ్యూల్‌లోకి మట్టిని మార్చాక రిటర్నర్ అక్కడి నుంచి భూమి దిశగా బయల్దేరుతుంది. అంతా అనుకున్నది అనుకున్నట్లు సవ్యంగా జరిగితే జూన్ 25వ తేదీన రిటర్నర్ భూమి మీదకు చేరుకుంటుంది. చంద్రుని ఆవలివైపు మట్టిని తీసుకొచ్చిన దేశంగా చైనా చరిత్రలో నిలిచిపోనుంది. -
స్పేస్‌లోకి తొలి తెలుగు వ్యక్తి గోపీ తోటకూర.. ప్రారంభమైన ప్రయోగం
స్పేస్ టూరిజంలో అమెజాన్ అధినేత జెఫ్‌బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజన్ మరో అడుగు ముందుకు వేసింది. బ్లూ ఆరిజన్ సంస్థ టెక్సాస్ కేంద్రంగా అంతరిక్షం అంచు వరకు వెళ్లే మానవ రాకెట్ ప్రయోగాన్ని ప్రారంభించింది. బ్లూ ఆరిజన్ న్యూ షెపర్డ్ మిషన్ ఎన్ఎస్-25 మిషన్‌ను పశ్చిమ టెక్సాస్‌లోని లాంచ్ సైట్ వన్ నుండి మే 19న ఉదయం 8.30 (భారత్ కాలమాన ప్రకారం..సాయంత్రం 7.30) గంటలకు రాకెట్ బయలుదేరుతుంది. ఈ ఎన్ఎస్ -25 మెషిన్లో భారత్‌కు చెందిన గోపి తోటకూర సహా ఆరుగురు ప్రయాణిస్తున్నారు.కాగా, గోపి తోటకూరతో పాటు వెంచర్ క్యాపిలిస్ట్ మాసన్ ఏంజెల్, ఫ్రాన్స్ బిజినెస్మెన్ సిల్వైన్ చిరోన్, అమెరికా టెక్ బిజినెస్మెన్ కెన్నెత్ ఎల్ హెస్, సాహసయాత్రికుడు కరోల్ షాలర్, అమెరికా వైమానికదళ మాజీ కెప్టెన్ ఎడ్ డ్వైట్.. ఈ స్పేస్ యాత్రకు వెళ్లారు. -
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఉత్తరాఖండ్ టూరిజం విభాగం దేశంలోనే తొలిసారిగాఆస్ట్రో టూరిజం ప్రచారాన్ని ప్రారంభించింది. ఆకాశంలో అద్భుతాలను చూడాలని కోరుకునే ఔత్సాహికులే లక్ష్యంగా ‘నక్షత్ర సభ’ను లాంచ్ చేసింది. స్టార్‌స్కేప్స్ అనే ఆస్ట్రో టూరిజం కంపెనీతో కలిసి, ఖగోళ శాస్త్ర ఔత్సాహికులకు సంపూర్ణ అనుభవాన్ని అందించేందుకు కృషి చేస్తోంది.ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో, స్థానిక నివాసితులకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను అందించడమే కాకుండా భారతదేశంలో డార్క్ స్కైస్ పరిరక్షణకు పనిచేయనుంది. ఖగోళ శాస్త్ర వెంచర్ డార్క్ స్కై ప్రిజర్వేషన్ పాలసీని రూపొందించడం, ఏడాది పొడవునా ప్రాంతమంతటా అమలు చేయనుంది. దీనిపై ప్రచారం అవగాహన కల్పిస్తుంది, శిక్షణ ఇస్తుంది. వాలంటీర్లను ,డార్క్ స్కై అంబాసిడర్లనుతయారు చేస్తుంది. అంతేకాదుఆస్ట్రోఫోటోగ్రఫీ పోటీ కూడా నిర్వహిస్తుంది. రాత్రి ఆకాశంలోని అందాలను ఫోటో తీసిన వారికి ఆకర్షణీయమైన రివార్డులు కూడా అందిస్తుంది.అంతర్జిక్ష టూరిజానికి మద్దతుగా 'నక్షత్ర సభ'ను తీసుకొచ్చింది. ఇందులో స్టార్ గేజింగ్, ప్రత్యేక సౌర పరిశీలనలు, ఆస్ట్రోఫోటోగ్రఫీ పోటీలు, క్యాంపింగ్ లాంటివి అందించనుంది. ఈ ప్రచారంలో భాగంగా తొలి ఎడిషన్ జూన్‌లో ముస్సోరీలోని జార్జ్ ఎవరెస్ట్‌లో ప్రారంభమవుతుంది.ఖగోళ శాస్త్రం, పర్యాటకం కలయికగా ఆస్ట్రో-టూరిజం ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అవుతోంది. భారతదేశంలో, భూ సంబంధమైన ఆస్ట్రో-టూరిజంను విస్తరించేందుకు వివిధ సంస్థలు కృషి చేస్తున్నాయి. కొన్ని ప్రదేశాలలో ఆస్ట్రో-స్టేలు కూడా ఏర్పాటవుతున్నాయి. ఉదాహరణకు, లడఖ్‌లోని పాంగోంగ్ సరస్సు వద్ద, సందర్శకులు పగటిపూట సరస్సు అద్భుతమైన అందాలను ఆస్వాదిస్తారు. రాత్రి వేళలో,స్థానికులు వారి సంప్రదాయాలు , జానపద కథలను పంచుకుంటూ నక్షత్రరాశులను గుర్తించడానికి వారికి మార్గనిర్దేశం చేస్తారు. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ బోర్డ్ భారతదేశంలోని ప్రముఖ ఆస్ట్రో-టూరిజం కంపెనీ స్టార్స్కేప్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. నక్షత్ర సభ 2025 మధ్యకాలం వరకు కొనసాగుతుంది, ఉత్తరాఖండ్ అంతటా వివిధ ప్రదేశాలలో లీనమయ్యే ఈవెంట్ల శ్రేణిని అందిస్తుంది. ఉత్తరకాశీ, పితోర్‌గఢ్, నైనిటాల్, చమోలి జిల్లాల్లోని డార్క్ స్కై పొటెన్షియల్ సైట్లతో పాటు నిపుణులతో సెమినార్లు, వెబ్నార్లను నిర్వహిస్తుంది. విశ్వం అందాలను వీక్షించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్ర ఔత్సాహికులు, సాహసికులను ఒకచోట చేర్చడం ఈ కార్యక్రమం లక్ష్యం. -
అమెరికా వార్నింగ్ ఇచ్చినా ఒకేసారి మూడు ఉపగ్రహాలు ప్రయోగించిన దేశం..!
అణ్వాయుధాల ప్రదర్శనకు తమ దేశం వ్యతిరేకమని, కేవలం రక్షణ చర్యల్లో భాగంగానే కొన్ని అంతరిక్ష పరిశోధనలు జరుపుతున్నట్లు ప్రకటిస్తూనే ఇరాన్ తాజాగా ఒకేసారి మూడు ఉపగ్రహాలను స్పేస్‌లోకి ప్రవేశపెట్టింది. ఇరాన్‌లోని సెమ్నాన్ ప్రావిన్స్‌లోని ఇమాన్ ఖమేని స్పేస్ పోర్ట్ నుంచి మహ్దా(పరిశోధనా ఉపగ్రహం), కెహాన్-2(గ్లోబల్ పొజిషనింగ్), హతేఫ్-1(కమ్యూనికేషన్) నానో ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించింది. ఇలాంటి ప్రయోగం చేయడం ఇరాన్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం. కొన్ని మీడియా కథనాల ప్రకారం.. ‘మహ్దా’ ఉపగ్రహాన్ని ఇరాన్ స్పేస్ ఏజెన్సీ అభివృద్ధి చేసింది. ఈ ఉపగ్రహాలను టూ-స్టేజ్ సీమోర్గ్(ఫీనిక్స్) ఉపగ్రహ వాహననౌక ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహాలను 450 కిలోమీటర్ల దిగువ కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు తెలిసింది. స్పేస్ ఆధారిత పొజిషనింగ్ టెక్నాలజీ, న్యారో బ్యాండ్ కమ్యునికేషన్ పరీక్షించే లక్ష్యంతో ఇరాన్ ఈ ప్రయోగాలను చేపట్టింది. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ఈ ప్రయోగాన్ని తీవ్రంగా ఖండించాయి. ఇలాంటి ప్రయోగాలకు దిగొద్దని అమెరికా ఇరాన్‌ను హెచ్చరించినా తన బాలిస్టిక్ క్షిపణుల కోసం ఇరాన్ ఈ టెక్నాలజీను వాడుకోబోతున్నట్లు ప్రకటించింది. దేశ పౌర, రక్షణ ప్రయోజనాల కోసం మాత్రమే ప్రయత్నిస్తున్నట్లు ఇరాన్ తెలిపింది. అయితే ఇరాన్ వద్ద ఉన్న బాలిస్టిక్ క్షిపణులను వాడేందుకే ఈ ప్రయోగం జరిగినట్లు పశ్చిమదేశాలు అభిప్రాయపడుతున్నాయి. ఇరాన్ మాత్రం అణ్వాయుధాలు ప్రదర్శనకు తమ దేశం వ్యతిరేకమని, కేవలం రక్షణ చర్యల్లో భాగంగానే ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఇదీ చదవండి: ఈ దేశాల్లో డబ్బులన్నీ వ్యాపార కుటుంబాలవే.. యునైటెడ్ స్టేట్స్ గతంలో ఇరాన్ ఉపగ్రహ ప్రయోగాలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాన్ని ధిక్కరిస్తున్నాయని గతంలో తెలిపింది. అణ్వాయుధాలను పంపిణీ చేయగల బాలిస్టిక్ క్షిపణులతో కూడిన ఎలాంటి కార్యకలాపాలను చేపట్టవద్దని గతంలోనే తీర్మానించాయి. తాజా పరిణామాలతో ఇరుదేశాల మధ్య కొంత ఉద్రిక్తతలు చోటుచేసుకున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. -
జపాన్ గురి కుదిరేనా? చంద్రుడిపై ‘షార్ప్ షూటర్’!
జాబిల్లిపై అడుగుపెట్టేందుకు ఇంకో దేశం సన్నద్దమైంది. అన్నీ సవ్యంగా సాగితే భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8:50 గంటలకు చందమామ ఉపరితలంపై జపాన్ ప్రయోగించిన ల్యాండర్ దిగనుంది. దీని అసలు నామధేయం ‘స్లిమ్’ విశదీకరిస్తే... స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్. ఇది 730 కిలోల వ్యోమనౌక. చంద్రుడిపై ‘స్లిమ్’ సజావుగా దిగితే ఆ ఘనత సాధించిన ఐదో దేశంగా జపాన్ అవతరిస్తుంది. ఆ పనిలో ఈసరికే సఫలమైన నాలుగు దేశాలు అమెరికా, రష్యా, చైనా, భారత్. ‘స్లిమ్’ మిషన్ కోసం జపాన్ ఏరో స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా) నిర్దేశించిన లక్ష్యం... ‘స్నైపర్’ పేరులోనే ఉంది. సూక్ష్మ/బహుదూరపు లక్ష్యాలను గురి తప్పకుండా గన్ సాయంతో ఛేదించే మిలిటరీ స్నైపర్ లాంటిదే ఈ మూన్ స్నైపర్ కూడా! చెప్పాలంటే... పిన్ పాయింట్ ల్యాండింగ్. జాబిలిపై ముందుగా నిర్ణయించిన లక్ష్యిత ప్రదేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ 100 మీటర్ల లోపే అంటే... కచ్చితంగా గీసిన గిరిలోపే (100 మీటర్ల వ్యాసం లోపే) ల్యాండరు దిగాల్సివుంటుంది! పటలంపైనే ప్రావారం! చంద్రమధ్యరేఖ (ఈక్వేటర్)కు దక్షిణంగా ‘సీ ఆఫ్ నెక్టార్’ సమీపంలోని షియోలి బిలం వాలుపై జపాన్ ల్యాండర్ కాలుమోపనుంది. ఈ ప్రదేశం ప్రత్యేకత ప్రస్తావనార్హం. మన భూమికి బాహ్య పొర ‘భూపటలం’ (క్రస్ట్), లోపలి పొర ‘ప్రావారం’ (మాంటిల్), మధ్యలో ‘కేంద్రకం’ (కోర్) ఉన్నట్టే చంద్రుడిలోనూ ఆ తరహా పొరలు ఉంటాయి. ‘మూన్ స్నైపర్’ దిగే ప్రదేశంలో చంద్రుడి ఉపరితలంపైనే చంద్రుడి ‘ప్రావారం’ దర్శనమిస్తుంది. (బహుశా ఉల్కలు, గ్రహశకలాలు ఢీకొట్టడం వల్లనో, చంద్రుడి అంతర్గత మార్పుల వల్లనో ప్రావారం కాస్తా వెలుపలికి చొచ్చుకొచ్చి పటలంలోనే... అది కూడా ఉపరితలంపైనే అందుబాటులో ఉన్న విశేష ప్రదేశం అది). ‘సీ ఆఫ్ నెక్టార్’ అనేది చంద్రుడిపై గతంలో సంభవించిన అగ్నిపర్వత చర్య వల్ల ఏర్పడిన సమతల ప్రదేశమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గ్రహశకలాల వంటివి ఢీకొని ఏర్పడిన బిలం ‘షియోలి క్రేటర్’ ఈ ‘సీ ఆఫ్ నెక్టార్’ మైదానంలోనే ఉంది. భూచంద్రుల మూలాన్వేషణలో ఈ ప్రదేశంలోని శిలలు కీలకమని టోక్యో విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ టొమోకత్సు మొరోట (స్పెషలైజింగ్ ఇన్ లూనార్ అండ్ ప్లానెటరీ ఎక్స్‌ప్లోరేషన్) వ్యాఖ్యానించారు. మూడో యత్నం ఫలించేనా! జపాన్ నిరుడు సెప్టెంబరు 7న H-11A రాకెట్ సాయంతో తనెగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి ‘స్లిమ్’ను ప్రయోగించింది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.830 కోట్లు. ఇది ఒన్ వే మిషన్. అంటే... వ్యోమనౌక గానీ, చంద్రుడి నమూనాలు గానీ భూమికి తిరిగిరావు. నౌక జాబిలిపై దిగడంతోనే ఖేల్ ఖతం. దానికి అప్పగించిన పని అక్కడితో సమాప్తం. జాబిలి నేలపై ల్యాండరును క్షేమంగా దించేందుకు జపాన్ చేస్తున్న మూడో ప్రయత్నం ఇది. 2022లో ‘ఒమతెనాషి’ ల్యాండరును చంద్రుడిపై దించే తొలి ప్రయత్నంలో ‘జాక్సా’ దానితో సమాచార సంబంధాలు కోల్పోవడంతో మిషన్ విఫలమైంది. నిరుడు రెండో యత్నంలో జపాన్ ప్రైవేటు అంకుర (స్టార్టప్) సంస్థ ‘ఐ స్పేస్ ఇంక్’ కూడా హకుతో-ఆర్-1ను జాబిలిపై దింపబోయి విఫలమైంది. ఆ ల్యాండర్ దిగే క్రమంలో చంద్రుడిపై కూలిపోయింది. ఇక మన చంద్రయాన్-3 ‘విక్రమ్’ ల్యాండరుకు ముందు రష్యాకు చెందిన ‘లూనా-25’ ల్యాండర్ సైతం చంద్రుడిపై దిగబోతూ కుప్పకూలి ధ్వంసమైన సంగతి తెలిసిందే. అమెరికన్ స్టార్టప్ ‘ఆస్ట్రోబోటిక్’ గత వారం ఓ ల్యాండర్ ప్రయోగించింది. కానీ ఇంధనం లీక్ సమస్యతో ఆ మిషన్ మీద ఆశలు వదిలేసుకున్నారు. జపాన్ గతంలో రెండు చిన్న గ్రహశకలాలపై (ఆస్టరాయిడ్లపై) వ్యోమనౌకల్ని పిన్ పాయింట్ ల్యాండింగ్ చేయడంలో సఫలీకృతమైంది. కానీ గ్రహశకలాలతో పోలిస్తే గురుత్వాకర్షణ అధికంగా ఉండే చంద్రుడిపై దిగడం మాత్రం సంక్లిష్ట కార్యం. ‘స్లిమ్’లో బేస్ బాల్ సైజున్న గుండ్రటి రోవర్ (రోలింగ్ రోబో)ను పంపారు. ‘జాక్సా’, జపాన్ బొమ్మల తయారీ కంపెనీ ‘టకారా టోమీ’ ఈ రోవరును రూపొందించాయి. జాబిలిపై దిగిన వ్యోమనౌకను అది ఫొటోలు తీస్తుంది. ‘స్లిమ్’ మిషన్ విజయవంతమైతే అంతరిక్ష రంగంలో జపాన్ దశ తిరిగినట్టే. ఒకవేళ శుక్రవారం (జనవరి 19) నాటి ప్రయత్నం కుదరకపోతే ‘స్లిమ్’ను జపాన్ వచ్చే నెల 16న చంద్రుడిపై దింపే ప్రయత్నం చేస్తుంది. - జమ్ముల శ్రీకాంత్ -
రిటైల్ లీజింగ్ 15 శాతం అధికం
ముంబై: మెగా పట్టణాల్లో రిటైల్ స్థలాల లీజు పరిమాణం ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 15 శాతం పెరిగినట్టు రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ తెలిపింది. హోమ్‌వేర్, డిపార్ట్మెంట్ స్టోర్లు, కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్, ఫ్యాషన్ అండ్ అప్పారెల్ రిటైలర్ల నుంచి లీజింగ్‌కు డిమాండ్ ఉన్నట్టు పేర్కొంది. ముంబైలో 14.6 శాతం మేర రిటైల్ లీజింగ్ పెరిగింది. మొత్తం లీజు పరిమాణం 0.21 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో రిటైల్ లీజు పరిమాణం ముంబైలో 0.18 మిలియన్ చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. మొత్తం తాజా లీజు పరిమాణంలో హోమ్‌వేర్, డిపార్ట్మెంట్ స్టోర్ల వాటా 20 శాతంగా ఉంది. ఆ తర్వాత కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్, ఫ్యాషన్ అండ్ అప్పారెల్ వాటా 17 శాతం మేర నమోదైంది. టాప్ డీల్స్‌లో ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌లో 20,800 ఎస్ఎఫ్టీ స్థలాన్ని కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ సంస్థ లీజుకు తీసుకోవడం ఒకటి. అలాగే, కస్తూరి రీజియస్లో 13,500 ఎస్ఎఫ్టీని పాంటలూన్ లీజుకు తీసుకోగా, విశ్వరూప్ ఐటీ పార్క్‌లో 10,800 ఎస్ఎఫ్టీని క్రోమా తీసుకుంది. దేశవ్యాప్తంగా 24 శాతం అప్ దేశవ్యాప్తంగా ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో రిటైల్ లీజు పరిమాణం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు 24 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం 2.9 మిలియన్ ఎస్ఎఫ్టీని సంస్థలు లీజుకు తీసుకున్నాయి. 2022 ద్వితీయ ఆరు నెలల కాలంలో 15 శాతం వృద్ధితో పోల్చి చూసినప్పుడు గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది మొదటి అర్ధ భాగంలో లీజు పరిమాణంలో బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, అహ్మదాబాద్ పట్టణాల వాటాయే 65 శాతంగా ఉంది. రానున్న కాలంలోనూ రిటైల్ లీజింగ్ మంచి వృద్ధిని చూస్తుందని సీబీఆర్ఈ చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజిన్ తెలిపారు. మాల్ సరఫరాకు తోడు, పండుగల సీజన్లో వినియోగ డిమాండ్ ఇందుకు మద్దతుగా నిలుస్తుందన్నారు. 2023 మొత్తం మీద రిటైల్ లీజు పరిమాణం 5.5–6 మిలియన్ చదరపు అడుగులుగా ఉంటుందని సీబీఆర్ఈ ఎండీ రామ్ చంద్నాని పేర్కొన్నారు. 2019లో 6.8 మిలియన్ చదరపు అడుగుల లీజు అనంతరం ఇదే అధికమన్నారు. -
వీడిన మిస్టరీ.. అది భారత్‌కు చెందిన రాకెట్‌దే!
ఆస్ట్రేలియా ఒడ్డుకు కొట్టుకొచ్చిన అంతుచిక్కని వస్తువు మిస్టరీ వీడింది. అది భారత్‌కు చెందిన రాకెట్‌దేనని అక్కడి అధికారులు ప్రకటించారు. పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు ఉత్తరాన రెండు గంటల ప్రయాణంలో ఉన్న జురియన్ బే సమ్పీంలో జులై మధ్యవారంలో ఈ వస్తువు తొలిసారిగా కనిపించింది. ఆరు ఫీట్ల ఎత్తు.. కేబుల్స్ వేలాడుతూ కనిపించింది అది. ఆ సమయంలో ఇది చంద్రయాన్-3కి చెందిన శకలం అంటూ ప్రచారాలు చేశారు కొందరు. మరోవైపు ఇంకొందరు తొమ్మిదేళ్ల కిందట అదృశ్యమైన మలేషియా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ MH 370 విమానందేమో అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఈ తరుణంలో ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ దానిని అధ్యయనం చేసి సోమవారం ఒక ప్రకటన చేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన పోలార్ శాటిలైట్ లాంఛ్ వెహికిల్(PSLV)కి చెందిన శకలమని ప్రకటించారు అధికారులు. అయితే.. అంతర్జాతీయ ఒప్పందాల పరిధిలోకి లోబడి ఇరు దేశాలు సంయుక్త ప్రకటన వెలువరించాల్సి ఉందని ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ చెబుతోంది. అయితే తాము పరిశీలించిన తర్వాతే ప్రకటన చేస్తామని ఇస్రో ఇదివరకే ప్రకటించగా.. ఇక అది ఎప్పటిది అనే దానిపై ఇస్రో అధికారులే స్పష్టత ఇవ్వాల్సి ఉంది. PSLV ప్రయోగ దశల్లో ఇలా శలాలను సముద్రంలో పడేయడం సాధారణంగా జరిగేదే. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా తీరానికి ఇలాంటి స్పేస్‌జంక్ కొట్టుకురావడం ఇదే తొలిసారి కాదు. గత ఆగష్టులో ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ రాకెట్ శకలం న్యూసౌత్‌వేల్స్‌లోని ఓ గడ్డి మైదనాంలో పడగా.. ఓ గొర్రెల కాపరి దానిని గుర్తించి అధికారులకు సమాచారం అందించాడు. Last friday, people in Australia reported seeing a comet/UFO in the sky which turned out to be the LVM3 rocket that launched #Chandrayaan3. And now, the third stage of a PSLV rocket has washed ashore on the coast of Green Head, Western Australia! #ISRO pic.twitter.com/FFVwhooSyE — Debapratim (@debapratim_) July 17, 2023 -
ఆస్ట్రేలియా బీచ్‌లో కలకలం.. ఈ మిస్టరీ వస్తువు చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించిందేనా?
ఆస్ట్రేలియా బీచ్‌లో ఒక మిస్టరీ వస్తువు దర్శనమిస్తోంది. అకస్మాత్తుగా సముద్రం నుంచి ఒడ్డుకు కొట్టుకువచ్చిన ఆ వస్తువు ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది. అయితే ఆ శకలాలు చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించిన ఎల్వీఎం రాకెట్ తుది శకలాలుగా అనుమానిస్తున్నారు. కాగా దీనిపై ఇంతవరకు అధికారికంగా ఎవరూ స్పందించలేదు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ ఆస్ట్రేలియాలోని జురియన్ బే సమీపంలోని బీచ్‌లో రాకెట్ శకలాలకు సంబంధించిన వస్తువులా ఒకటి దర్శనమిస్తోంది. ఆ వస్తువు ఏమయ్యి ఉండొచ్చని ఆ ప్రాంత అధికారులు విచారణను ప్రారంభించారు. ఇదిలా ఉండగా భారత్ చంద్రయాన్-3ను ఎల్వీఎం రాకెట్ నింగిలోకి మోసుకెళ్లిన దృశ్యాలు ఆస్ట్రేలియన్ గగనతలంలో కనిపించడం గమనార్హం. దీంతో ఇది చంద్రయాన్‌కు సంబంధించినది వస్తువు అయ్యిండచ్చనే ఊహాగానాలతో ట్విటర్లో కామెంట్లతో నిండిపోతోంది. అయితే ఈ విషయంలో ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. భారతీయ అంతరిక్ష సంస్థ కూడా దీనిపై ఇప్పటివరకు మౌనంగా ఉంది. పశ్చిమ ఆస్ట్రేలియాలోని జురియన్ బే సమీపంలోని బీచ్‌లో ఉన్న వస్తువుకు సంబంధించి తాము విచారణ చేస్తున్నామని ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ వరుస ట్వీట్లలో తెలిపింది. "మేము ప్రస్తుతం పశ్చిమ ఆస్ట్రేలియాలోని జురియన్ బే సమీపంలోని బీచ్‌లో ఉన్న ఈ వస్తువుకు సంబంధించిన విచారణలు చేస్తున్నాము. ఆ వస్తువు విదేశీ అంతరిక్ష ప్రయోగ వాహనం నుండి వచ్చి ఉండవచ్చుని భావిస్తున్నాం. మేము మరింత సమాచారాన్ని అందించగల వారితో సంభాషిస్తున్నాం" అని ఆస్ట్రేలియన్ అంతరిక్ష సంస్థ ట్వీట్ చేసింది. Last friday, people in Australia reported seeing a comet/UFO in the sky which turned out to be the LVM3 rocket that launched #Chandrayaan3. And now, the third stage of a PSLV rocket has washed ashore on the coast of Green Head, Western Australia! #ISRO pic.twitter.com/FFVwhooSyE — Debapratim (@debapratim_) July 17, 2023 -
తొలిసారిగా అంతరిక్షంలోకి సాధారణ పౌరుడు!
చైనా తొలిసారిగా తమ దేశ సాధారణ పౌరుడిని అంతరిక్షంలోకి పంపనుంది. ఈ మేరకు టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి సిబ్బందితో కూడిన మిషన్‌లో భాగంగా మంగళవారమే తన దేశ పౌరుడిని అంతరిక్షంలోకి పంపనుందని ఆ దేశ మానవ సహిత అంతరిక్ష సంస్థ పేర్కొంది. ఈ విషయాన్ని బీచింగ్ యూనివర్సిటీ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ ప్రోఫెసర్, పేలోడ్ నిపుణుడు గుయ్ హైచావో, మానవ సహిత అంతరిక్ష సంస్థ ప్రతినిధి లిన్ జియాంగ్ వెల్లడించారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు వాయువ్య చైనాలోని జియక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి టేకాఫ్ కాబోతున్నాయని మానవ సహిత అంతరిక్ష సంస్థ తెలిపింది. అయితే ఈ మిషన్‌లో గుయ్ అంతరిక్ష శాస్త్ర ప్రయోగాత్మక పేలోడ్ల ఆన్-ఆర్బిట్ ఆపరేషన్‌కు ప్రధానంగా బాధ్యత వహించగా, మిషన్ కమాండర్ జింగ్ హైపెంగ్, క్రూ సిబ్బంది ఝు యాంగ్జు ఈ యాత్రని పర్యవేక్షిస్తారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆధ్వర్యంలో అంతరిక్ష యాత్ర కల కోసం ఎన్నో ప్రణాళికలను సిద్ధం చేసింది. అంతేగాదు ప్రపంచంలో రెండోవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా తన మిలటరీ రన్ స్పేస్ ప్రోగ్రామ్‌లో బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది. ఎప్పటికైనా మానవులను చంద్రునిపైకి పంపాలనే లక్ష్యంతో ఉంది. ఈ విషయమై రష్యా, యూఎస్‌లో పోటీ పడేందుకు యత్నిస్తోంది. అందులో భాగంగానే చైనా కూడా చంద్రునిపై స్థావరాన్ని నిర్మించాలని భావింస్తుంది. అంతేగాక 2029 నాటికి సిబ్బందితో కూడిన చంద్ర మిషన్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ దేశ నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. (చదవండి: మహిళా కార్యకర్తలపై జరుగుతున్న అకృత్యాలపై దర్యాప్తు చేయాలి!: అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించిన ఇమ్రాన్ ఖాన్) -
యుద్ధ విమానం స్వదేశీ గర్జన!
సాక్షి, విశాఖపట్నం: రక్షణ పరిశోధన సాంకేతిక రంగంలోకి ప్రైవేట్ సంస్థలను ఆహ్వానిస్తున్నట్లు డీఆర్డీవో చైర్మన్ సమీర్ వి.కామత్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్పేస్ పాలసీలో భాగంగా రక్షణ రంగంలో ప్రధానంగా స్పేస్ టెక్‌లో ప్రైవేట్ పరిశ్రమలు, పరిశోధన సంస్థలకు అవకాశాలు కల్పించినట్లు వివరించారు. విశాఖలో ని నేవల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లేబొరేటరీ (ఎన్ఎస్టీఎల్)లో గురువారం ప్రారంభమైన కండిషన్ మానిటరింగ్ జాతీయ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ‘సాక్షి’తో పలు అంశాలపై మాట్లాడారు. అంతరిక్ష పరిశోధనలపై దృష్టి స్పేస్ పాలసీలో భాగంగా పరిశోధనలపై దృష్టి సారించాం. ముఖ్యంగా రక్షణ శాఖతో పాటు అంతరిక్ష పరిశోధనలపై దృష్టి పెట్టాం. రాకెట్ లాంచింగ్, శాటిలైట్స్ అభివృద్ధి.. ఇలా ఎలాంటి హద్దులు లేకుండా ప్రైవేట్ సంస్థలు ముందుకు రావచ్చు. దీనిద్వారా అగ్రదేశాలతో పోటీ పడే స్థాయికి వేగంగా చేరుకుంటాం. అంతరిక్ష ఆధారిత నిఘా, అంతరిక్ష పరిస్థితులపై మన అవగాహన సామర్థ్యాలు మెరుగుపడుతున్నాయి. అంకుర సంస్థలకు ప్రోత్సాహం రక్షణ రంగంలో స్టార్టప్స్‌ని ప్రోత్సహిస్తున్నాం. డిఫెన్స్ సిస్టమ్, టెక్నాలజీపై పని చేస్తున్న స్టార్టప్స్‌కు ప్రాధాన్యమిస్తున్నాం. పరిశోధన అభివృద్ధి(ఆర్ అండ్ డీ) బడ్జెట్లో 25 శాతం వరకూ పరిశ్రమలు, స్టార్టప్స్, విద్యారంగానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించడం శుభ పరిణామం. అందుకే స్టార్టప్స్, ఎంఎస్ఎంఈలకు అవకాశాలు కల్పిస్తున్నాం. 17 వేల అడుగుల ఎత్తు వరకు ‘యూఏవీ’ మానవ రహిత వైమానిక వాహనం (యూఏవీ)పై ప్రధానంగా దృష్టి సారించాం. ఇందుకోసం గైడెన్స్ కిట్, సీట్ ఎజెక్షన్ సిస్టమ్, పైరోటెక్నిక్ కాట్రిడ్స్ అభివృద్ధి చేసే పనిలో ఉన్నాం. ‘యూఏవీ తపస్’ కోసం 180 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన ఇంజన్‌ను దేశీయంగా అభివృద్ధి చేశాం. దీని ద్వారా యూఏవీ 17 వేల అడుగుల ఎత్తువరకూ ఎగరగలదు. 2028లో తొలి దేశీయ యుద్ధ విమానం ఎగరనుంది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన సాయుధ బలగాల్లో చాలా వ్యవస్థలు స్వదేశీ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోనున్నాయి. ఇందులో భాగంగా ఎల్సీఏ ఎంకే–2 ఇండక్షన్కు సిద్ధమవుతున్నాం. జీఈఎఫ్ 414 ఇంజన్‌తో కూడిన ఏఎంసీఏ (అడ్వాన్స్డ్ మీడియమ్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) ఫేజ్–1 యుద్ధ విమానాన్ని 2028లో ఎగురవేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నాం. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతోంది. దీనికి సంబంధించి అనుమతుల కోసం వేచి చూస్తున్నాం. ఎలైట్ క్లబ్లో చేరడం గర్వకారణం ఇటీవల ‘సీ బేస్డ్ ఎండో అట్మాస్ఫియరిక్ ఇంటర్‌సెప్టర్ మిసైల్’ తొలి వి మాన ప్రయోగం విజయవంతం కావడంతో రక్షణ సామర్థ్యాల విషయంలో మన దేశం చరిత్రాత్మక మైలురాయిని అధిగవిుంచింది. నేవల్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ (బీఎండీ) సామర్థ్యంలో అగ్రదేశాల సరసన నిలిచి ఎలైట్ క్లబ్ ఆఫ్ నేషన్స్‌లో చేరడం గర్వకారణం. యుద్ధనౌకలు, ఉపరితలం నుంచి బాలిస్టిక్ క్షిపణులను నిలువరించే సామర్థ్యాన్ని భారత్ అభివృద్ధి చేసింది. అంతకుముందే భూ ఆధారిత క్షిపణి ప్రయోగాన్ని విజ యవంతంగా నిర్వహించాం. ఈ జంట విజయాలతో సుదూర అణు క్షిపణులు, హైపర్ సోనిక్ మిసైల్స్, గ్లైడర్స్, శత్రు విమానాల్ని అడ్డుకోగల సామర్థ్యాన్ని మన దేశం సొంతం చేసుకుంది. -
అంతరిక్షంలో అడుగు పెట్టనున్న భారతీయ నటుడు..ఎవరంటే?
Indian Actor Dev Joshi:స్పేస్ టూరిజంలో మరో సరికొత్త సంచలనం సృష్టించేందుకు అపరకుబేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది 8 మందిని అంతరిక్షంలోకి పంపించనున్నారు. తాజాగా నింగిలోకి వెళ్లేందుకు సిద్ధమైన ఆ ఎనిమిది మంది ఎవరనేది జపాన్ బిలియనీర్ యుసాకు మాయఝావా రివిల్ చేశారు. ఎందుకంటే? మూన్ ట్రిప్ కోసం స్పేస్ ఎక్స్‌కు చెందిన స్పేస్ షిప్ స్పేస్ క్రాఫ్ట్ సీట్లు కొనుగోలు చేసింది ఆయన కాబట్టి. ఇక స్పేస్‌లోకి వెళ్లే ప్రయాణికుల్లో ఓ భారతీయ నటుడు ఉండటం విశేషం.ఇంతకీ ఆ నటుడు ఎవరో తెలుసా? జపాన్‌లో అత్యంత ధనవంతుల జాబితాలో బిజినెస్ టైకూన్ యుసాకు మేజావా (Yusaku Maezawa) ఒకరు. ఎలాన్ మస్క్ తరహాలో ప్రమోషన్ కోసం సోషల్ మీడియాలో.. ముఖ్యంగా ట్విటర్లో ట్వీట్లు చేస్తూ అందర్ని ఆకర్షిస్తుంటారు. అందుకు ఉదాహరణే ఈ ట్వీట్. 2020 జనవరి 1న మేజావా చేసిన ఓ ట్వీట్‌ను ఎవరైతే ఎక్కువ సార్లు రీట్వీట్ చేస్తారో..వారిలో 1000 మందిని ఎంపిక చేసి 1 మిలియన్ యెన్ ($7300) చెల్లిస్తానని ప్రకటించారు. ఎందుకు ఇలా ఫ్రీగా ఇస్తున్నారని ప్రశ్నిస్తే ఇదొక సోషల్ ఎక్స్పెరిమెంట్. నేనిచ్చే డబ్బులు వారికి ఆనందాన్ని ఇస్తుందో లేదో చూడాలని ఇలా ప్రకటించినట్లు తెలిపారు. ఉచితంగానే ఇప్పుడు అదే మేజావా ప్రపంచ వ్యాప్తంగా 8 మందిని ఎంపిక చేసి వారిని ఉచితంగా చంద్రుని మీదకు పంపించేందుకు సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది ‘డియర్ మూన్ క్రూ’ పేరుతో అంతరిక్ష ప్రయాణం ప్రారంభం కానుంది. నింగిలోకి వెళ్లనున్న ఆ 8 మంది మొత్తం ఆరు రోజుల ప్రయాణం చేయనుండగా .. మూడు రోజులు పాటు చంద్రుడి చుట్టూ తిరిగి భూమి మీదికి రానున్నారు. ఆ 8 మంది ఎవరంటే ఆకాశాన్నీ దాటి అంతరిక్షంలోకి వెళ్లనున్న 8 మందిలో మనదేశానికి చెందిన నటుడు దేవ్ జోషితో పాటు జపనీస్ ఫ్యాషన్.. అమెరికన్ డిజె, నిర్మాత స్టీవ్ అయోకి, Czech artist యెమి ఎడి, అమెరికన్ యూట్యూబర్ టిమ్ డాడ్, బ్రిటిష్ ఫోటోగ్రాఫర్ కరీం ఇలియా, ఐరిష్ ఫోటోగ్రాఫర్ రియానన్ ఆడమ్, దక్షిణ కొరియా కె-పాప్ బ్యాండ్ స్టార్ చోయ్ సెయుంగ్-హ్యూన్ (Choi Seung-hyun) అమెరికన్ చిత్రనిర్మాత బ్రెండన్ హాల్ ఉన్నారు. భారత్‌కు చెందిన ఆ నటుడు ఎవరంటే వారిలో మనదేశంలోని గుజరాత్‌కు చెందిన దేవ్ జోషి చిన్నప్పట్నుంచి పలు సీరియల్స్, సినిమాల్లో బాలీవుడ్ లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఇతనికి కేవలం 22 సంవత్సరాలే. పలు నివేదికల ప్రకారం.. భారతీయ నటుడు, గుజరాత్‌కు చెందిన దేవ్ జోషి 3 ఏళ్ల వయస్సులో బాల నటుడిగా బుల్లితెరకు పరిచయం అయ్యాడు. అలా సోనీ (సోనీ సాబ్) టీవీ అక్టోబర్ 8, 2012లో విడుదల చేసిన బాల్ వీర్లో, బాల్ వీర్ రిటర్న్‌తో సీరియల్స్ తో పాటు 20కి పైగా గుజరాతీ సినిమాలు, ఇతర అడ్వటైజ్మెంట్లలో యాక్ట్ చేశారు. తాజాగా ఉచితంగా అంతరిక్షంలోకి వెళ్లే అదృష్టాన్ని దక్కించుకున్నారు. That's our Flight Path to the Moon and Back! 💙🚀 https://t.co/LtLxGuvNKW — Dev Joshi (@devjoshi10) December 10, 2022 -
వామ్మో! భగభగమండే సూర్యుని ఉపరితలంపై స్నేక్
సూర్యుని ఉపరితలం మీదుగా ఒక పాము జరజర వెళ్తున్నటు ఒక అద్భుత దృశ్యం కనువిందు చేసింది. ఈ యూరోపియన్ ఆర్బిటర్ ద్వారా ఈ సూర్యునిపై ఈ విచిత్రమైన ఘటన కనిపించిందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పేర్కొంది. ఐతే అవి సూర్యుని అయస్కాంత క్షేతం గుండా వెళ్తున్న చల్లటి వాతావరణ వాయువుల గొట్టంగా పేర్కొంది. అది చూడటానికి అచ్చం భగభగమండే సూర్యుని ఉపరితలంపై పాకుతున్న పాములా కనిపిస్తోంది. దీన్ని పాము రూపంలో ఉన్న ప్లాస్మా అని అది సూర్యునిపై ఒక వైపు నుంచి మరోవైపుకు అయస్కాంత క్షేత్రం ఫిలమెంట్‌ను అనుసరిస్తుందని స్పేస్ ఏజెన్సీ తెలిపింది. అక్టోబర్ 12న సోలార్ ఆర్బిటర్ సూర్యుని వైపు ప్రయాణిస్తున్నందున ఈ అరుదైన దృశ్యం చూడగలిగామని ముల్లార్డ్ స్పేస్ సైన్స్ లాబోరేటరీ శాస్త్రవేత్త డేవిడ్ లాంగ్ తెలిపారు. అదీగాక అయస్కాంత క్షేత్రం వక్రీకృతమైంది కాబట్టి ఈ దృశ్యాన్ని చూడగలిగామని అన్నారు. సోలార్ ఆర్బిటర్ అనేది ఫిబ్రవరి 2020లో ప్రారంభమైన అమెరికా స్పేస్ ఏజెన్సీ, యూరోపియన్ స్సేస్ ఏజెన్సీల ఉమ్మడి ప్రాజెక్టు. Spot the solar snake slithering across the #Sun! 🐍 This ‘tube’ of cooler atmospheric gases snaking its way through the Sun’s magnetic field was captured by @esasolarobiter’s @EuiTelescope on 5 September, ahead of a large eruption 💥 📹 https://t.co/FJgXYq1vwp #ExploreFarther pic.twitter.com/02uIJMMCBH — ESA Science (@esascience) November 14, 2022 (చదవండి: ప్చ్! పోరాడలేకపోయాం...కనీసం కొట్టేద్దాం: రష్యా బలగాలు) -
అంతరిక్ష రంగంలో తెలుగు తేజం
భారత అంతరిక్ష రంగంలో నవశకం ఆరంభం కాబోతోంది. దేశ చరిత్రలో తొలిసారిగా నింగిలోకి దూసుకెళ్లేందుకు ఓ ప్రైవేట్ రాకెట్ సిద్ధమవుతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైతే..భవిష్యత్‌లో అంతరిక్ష యానం మరింత సులభతరం కానుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ నెలలోనే శ్రీహరికోట నుంచి మూడు పేలోడ్లతో కూడిన ఈ ప్రైవేట్ రాకెట్ రోదసి బాట పట్టనుంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సహకారంతో స్కైరూట్ ఏరో స్పేస్ స్టార్టప్ సంస్థ తయారు చేసిన రాకెట్ ఈ నెల 16 లేదా 18న రోదసిలోకి దూసుకుపోనుంది. రాకెట్ రూపకర్తల్లో విశాఖకు చెందిన నాగభరత్ దాకా (33) ఒకరు కాగా.. మరొకరు హైదరాబాద్‌కు చెందిన చందన్ పవన్‌కుమార్. వీరిద్దరూ స్కైరూట్ ఏరో స్పేస్ పేరిట స్టార్టప్ సంస్థను ప్రారంభించారు. వ్యవస్థాపకులలో ఒకరిగా.. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో)గా వ్యవహరిస్తున్న నాగభరత్ విశాఖలోనే విద్యను అభ్యసించి అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన ఆధ్వర్యంలో రూపొందించిన విక్రమ్–ఎస్ అంతరిక్ష ప్రయాణానికి సిద్ధమవుతూ చరిత్ర సృష్టించబోతోంది. భీమిలిలో బీజం విశాఖ శివారు భీమిలిలోని అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (అనిట్స్) ఫౌండర్ ప్రిన్సిపల్‌గా వ్యవహరించిన డాక్టర్ రఘురామిరెడ్డి కుమారుడు నాగభరత్. 1999 నుంచి 2001 వరకూ రుషి వ్యాలీ స్కూల్లో విద్యనభ్యసించిన ఆయన 2001 నుంచి 2005 వరకు నగరంలోని లిటిల్ ఏంజల్స్ హైస్కూల్లో ఉన్నత విద్య పూర్తి చేశారు. అనంతరం ఐఐటీ మద్రాస్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూరి చేసుకొని 2012 అక్టోబర్ నుంచి 2015 మే వరకూ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఇంజినీర్ (ఎస్సీ)గా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత ఉద్యోగానికి స్వస్తి చెప్పి 2018 ఆగస్ట్‌లో తోటి శాస్త్రవేత్త పవన్‌కుమార్ చందనతో కలిసి స్కైరూట్ ఏరో స్పేస్ అనే స్టార్టప్ సంస్థను హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించారు. చిన్న చిన్న రాకెట్స్ మోడల్స్‌ను తయారు చేస్తూ వాటిపై పరిశోధనలు వేగవంతం చేశారు. రెండేళ్ల నుంచి పరిశోధనలు ఇప్పటివరకు అంతరిక్షంలోకి రాకెట్లను పంపించేందుకు ఇస్రోకు మాత్రమే అనుమతులు ఉండేవి. అయితే, రెండేళ్ల క్రితం అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల కూడా అడుగు పెట్టేందుకు ఇస్రో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అప్పటి నుంచి నాగభరత్, పవన్‌కుమార్ కలిసి దేశ అంతరిక్షంలోకి అడుగుపెట్టే మొదటి ప్రైవేట్ రాకెట్ తమదే కావాలన్న లక్ష్యంతో పరిశోధనలు ప్రారంభించారు. అనేక సంస్థల నుంచి పోటీ ఎదురైనా.. వాణిజ్య అవసరాలు తీర్చేలా స్నేహితులిద్దరూ ముందుగా రాకెట్ తయారు చేసి రికార్డు సృష్టించారు. భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు ఆద్యుడైన విక్రమ్ అంబాలాల్ సారాభాయ్కు నివాళిగా తొలి ప్రైవేట్ రాకెట్‌కు విక్రమ్–ఎస్ (శరభి) అని నామకరణం చేశారు. తొలుత ఈ ప్రైవేట్ రాకెట్‌ను ఈ నెల 15న ప్రారంభించాలని భావించగా.. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఈ నెల 16 లేదా 18వ తేదీన ప్రయోగించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ లాంచ్‌ప్యాడ్ నుంచి ఈ రాకెట్ ప్రయోగం చేయనున్నారు. ప్రస్తుతం చేపట్టబోయే ప్రయోగం డెమాన్‌స్ట్రేషన్ మాత్రమే. ఇందులో మూడు శాటిలైట్లను పంపిస్తున్నారు. తొలి ప్రైవేట్ రాకెట్ కావడంతో ఈ ఆపరేషన్‌కు ‘ప్రారంభ్ మిషన్’ గా నామకరణం చేశారు. విక్రమ్ పేరుతో మూడు రకాల రాకెట్లను తయారు చేస్తున్నారు. -
ఎస్ఎస్ఎల్వీ-డీ1 ప్రయోగం విఫలం.. నిరుపయోగంగా శాటిలైట్స్
సూళ్లూరుపేట(తిరుపతి): ఎంతో ప్రతిష్టాత్మంగా చేపట్టిన ఎస్ఎస్ఎల్వీ డీ1 ప్రయోగం విఫలమైందని అధికారికంగా ప్రకటించింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. ఆ రాకెట్ మోసుకెళ్లిన రెండు ఉపగ్రహాలు ఇకపై పనికిరావని ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తెలిపింది. మూడు దశలను విజయవంతంగా దాటిన రాకెట్.. టర్మినల్ దశలో అదుపు తప్పింది. రెండు ఉపగ్రహాలను 356x76 కిలోమీటర్ల దీర్ఘ వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే.. ఎస్ఎస్ఎల్వీ-డీ1 రాకెట్ వాటిని 356 కిలోమీటర్లు వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టింది. అందువల్ల ఈ ఉపగ్రహాలు పనికి రావని ఇస్రో వెల్లడించింది. సెన్సార్ విఫలమవటం వల్లే ఈ సమస్య తలెత్తిందని పేర్కొంది. టర్మినల్ దశలో తలెత్తిన సాంకేతిక సమస్యపై ఇస్రో ఏర్పాటు చేసిన కమిటీ విశ్లేషిస్తోందని, ఈ కమటీ ఇచ్చే నివేదిక, ప్రతిపాదనల ఆధారంగా త్వరలోనే ఎస్ఎస్ఎల్వీ-డీ2 ప్రయోగాన్ని చేపడతామని పేర్కొంది. ఇస్రో కొత్తగా అభివృద్ధి చేసిన చిన్న ఉపగ్రహా వాహకనౌక ఎస్ఎస్ఎల్వీ డీ1ను తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఆదివారం ఉదయం 9.18 గంటలకు ప్రయోగించారు. ఈ రాకెట్ ఈవోఎస్-02, ఆజాదీశాట్ ఉపగ్రహాలను మోసుకెళ్లింది. ఈవోఎస్-02 ఉపగ్రహం బరువు 140 కిలోలు. ఇది భూమిని పరిశీలిస్తుంది. ఆజాదీశాట్ బరువు 8 కిలోలు. 75 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 750 మంది విద్యార్థులు దీన్ని రూపొందించారు. ఈ ప్రయోగంలో మూడు దశలు అనుకున్నట్లుగానే పూర్తయినట్లు ఇస్రో మొదట వెల్లడించింది. టెర్మినల్ దశకు సంబంధించిన సమాచారం రావడంలో కొంత జాప్యం జరిగినట్లు తెలిపింది. (1/2) SSLV-D1/EOS-02 Mission update: SSLV-D1 placed the satellites into 356 km x 76 km elliptical orbit instead of 356 km circular orbit. Satellites are no longer usable. Issue is reasonably identified. Failure of a logic to identify a sensor failure and go for a salvage action— ISRO (@isro) August 7, 2022 -
ఈనెల 7న ఎస్ఎస్ఎల్వీ తొలి ప్రయోగం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నూతనంగా తయారుచేసిన స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ)ను ఈనెల 7వ తేదీ ఉదయం 9.18 గంటలకు ప్రయోగించనుంది. స్వదేశీ, విదేశీ సంస్థలతో పాటు, విద్యార్థులు తయారుచేసే చిన్న తరహా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించేందుకు ఇస్రో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఎస్ఎస్ఎల్వీని రూపొందించింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 75 జిల్లా పరిషత్ పాఠశాలలకు చెందిన 750 మంది గ్రామీణ విద్యార్థినులు తయారు చేసిన ఆజాదీ శాట్ అనే ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ద్వారా తొలిసారిగా అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. ఇది కూడా చదవండి: మీ ఫోన్ రిపేర్ అయ్యిందా? శాంసంగ్ యూజర్లకు శుభవార్త! -
రష్యా స్పేస్ చీఫ్‌కు ఎలన్ మస్క్ కౌంటర్
ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన ఎలన్ మస్క్‌కు.. రష్యాకు మధ్య కోల్డ్ వార్ మరింత ముదిరింది. తాజాగా రష్యా స్పేస్ చీఫ్ దిమిత్రి రోగోజిన్‌కు కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు మస్క్. ఉక్రెయిన్ పరిణామాల్లో ఫాసిస్ట్ బలగాలకు మిలిటరీ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ద్వారా ఎలన్ మస్క్ మద్ధతు ఇస్తున్నాడంటూ రష్యా స్పేస్ చీఫ్ దిమిత్రి రోగోజిన్ సంచలన ఆరోపణలు చేశాడు. అంతేకాదు.. మూర్ఖుడంటూ మస్క్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలను మస్క్ సీరియస్‌గానే తీసుకున్నాడు. మీడియాకు రోగోజిన్ ఇచ్చిన స్టేట్మెంట్ తాలుకా స్క్రీన్ షాట్లను ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్లేషన్ చేసి మరీ ఎలన్ మస్క్ తన ట్విటర్ వాల్‌పై పోస్ట్ చేసి మరీ కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టాడు. There are no angels in war — Elon Musk (@elonmusk) May 9, 2022 తాజాగా.. యుద్ధంలో దైవదూతలంటూ ఎవరూ ఉండరని రోగోజిన్‌కు పంచ్ వేశాడు. అంతకు ముందు చావు గురించి ఎలన్ మస్క్ చేసిన ఓ ట్వీట్ మీద విపరీతమైన చర్చ నడిచింది. అనుమానాస్పద రీతిలో చనిపోతే.. అంటూ రష్యా నుంచి తనకు ముప్పు ఉందన్న కోణంలో ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే.. రష్యా దురాక్రమణ మొదలైన తొలి నాటి నుంచే ఉక్రెయిన్‌కు మద్ధతు ప్రకటించాడు ఎలన్ మస్క్. అంతేకాదు తన శాటిలైట్ సర్వీస్ కంపెనీ స్టార్‌లింక్ నుంచి సేవలు సైతం అందించాడు. ఒకానొక టైంలో తనతో బాహాబాహీకి తలపడాలంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కే సవాల్ విసిరాడు ఎలన్ మస్క్. చదవండి: ‘ఒక వేళ నేను చనిపోతే?’.. ఎలన్ మస్క్ సంచలన ట్వీట్ -
మేము తలచుకుంటే అరగంటలో నాటో దేశాలన్నీ ధ్వంసం: రోస్కోస్మోస్ చీఫ్
కీవ్/మాస్కో: రష్యా విక్టరీ డే వేడుకల నేపథ్యంలో ఉక్రెయిన్, రష్యా దేశాల ముఖ్య నేతల వ్యాఖ్యలు కలవరం పుట్టిస్తున్నాయి. తాజాగా రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ చీఫ్ దిమిత్రి రోగోజిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము గనుక నిజంగా అణు యుద్ధం ప్రారంభిస్తే నాటో దేశాలన్నీ కేవలం అరగంటలో పూర్తిగా ధ్వంసమైపోతాయని అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న దిమిత్రి రోగోజిన్ తాజాగా మీడియాతో మాట్లాడారు. శత్రువు (పశ్చిమ దేశాలు)ను ఓడించడమే పుతిన్ లక్ష్యమని పేర్కొన్నారు. నాటో తమపై అనవసరంగా కయ్యానికి కాలు దువ్వుతోందని మండిపడ్డారు. బహిరంగంగా అంగీకరించకపోయినప్పటికీ పశ్చిమ దేశాలు లోలోపల రష్యాపై యుద్ధం సాగిస్తున్నాయని ఆరోపించారు. శత్రువుపై అణ్వాయుధాలను ప్రయోగించే సామర్థ్యం తమకు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఆ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అణు యుద్ధం ప్రపంచ పరిణామాలతోపాటు మన భూగోళం స్థితిగతులనే మార్చేస్తుం దని, అందుకే అది తమకు ఇష్టం లేదని వెల్లడిం చారు. బలవంతుడైన శత్రువును ఆర్థిక, సైనికపరమైన మార్గాల ద్వారా, సంప్రదాయ యుద్ధరీతులతోనే ఓడిస్తామని దిమిత్రి రోగోజిన్ పేర్కొన్నారు. చదవండి👉 రష్యా ‘విక్టరీ డే’.. పుతిన్ కీలక ప్రకటన? కాగా, 1945లో రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్ విజయానికి గుర్తుగా రష్యాలో ప్రతిఏటా మే 9న విక్టరీ డే జరుపుకుంటారు. ఈసారి ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో విక్టరీ డేకు మరింత ప్రాధాన్యం పెరిగింది. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. మే 9 రష్యా విక్టరీ డేను ఉద్దేశించి.. ‘చెడు మళ్లీ తిరిగొచ్చింది. అయితే, అది వేరే రూపంలో, వేర్వేరు నినాదాలతో వచ్చింది. కానీ, ప్రయోజనం మాత్రం అదే’ అని పేర్కొన్న సంగతి తెలిసిదే. కాకపోతే ఈసారి ఉక్రెయిన్ దాని మిత్రదేశాలు గెలుస్తాయని జెలెన్ స్కీ ధీమా వ్యక్తం చేశారు. మంచిపై చెడు ఎన్నడూ విజయం సాధించలేదని అన్నారు. చదవండి👉🏻 వేలంలో ఉక్రెయిన్ అధ్యక్షుడి జాకెట్.. ఎంత ధర పలికిందంటే? -
అమెరికాకు రష్యా స్పేస్ ఏజెన్సీ అధిపతి హెచ్చరికలు
మాస్కో: ఉక్రెయిన్‌పై దాడులకు ప్రతిగా అమెరికా విధించిన తీవ్ర ఆంక్షలపై రష్యా అంతరిక్ష విభాగం (రోస్కాస్మోస్) డైరెక్టర్ జనరల్ దిమిత్రీ రొగోజిన్ తీవ్రంగా స్పందించారు. ఆంక్షల నేపథ్యంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) నిర్వహణలో తమ దేశం సహకరించబోదని హెచ్చరించారు. తద్వారా, 500 టన్నుల బరువైన ఐఎస్ఎస్ భారత్, చైనాలపైనే పడేందుకు అవకాశాలున్నాయని అమెరికా బెదించాలనుకుంటోందా అని ఆయన ప్రశ్నించారు. ఐఎస్ఎస్ కక్ష్య, అంతరిక్షంలో దాని స్థానాన్ని నియంత్రించే ఇంజిన్లు రష్యా అధీనంలో ఉన్నాయని రొగోజిన్ ట్విట్టర్లో తెలిపినట్లు సీఎన్ఎన్ పేర్కొంది. చదవండి: (ప్రాణాలకు ముప్పని తెలిసినా.. అమెరికాకు తెగేసి చెప్పాడు..) ‘మాకు సహకారాన్ని నిలిపివేస్తే, ఐఎస్ఎస్ అనియంత్రిత కక్ష్యలోకి వెళ్లి, అమెరికా యూరప్‌పై పడితే ఎవరు రక్షిస్తారు?. 500 టన్నుల బరువైన ఐఎస్ఎస్ భారత్, చైనాల పైనే పడేందుకు అవకాశముంది. ఇదే సాకుతో ఆ దేశాలను బెదిరించాలనుకుంటున్నారా? ఐఎస్ఎస్ రష్యా మీదుగా వెళ్లడం లేదు కాబట్టి, రిస్కంతా మీకే. ఇందుకు సిద్ధంగా ఉన్నారా?’అని అమెరికాను ప్రశ్నించారు. ఐఎస్ఎస్ కార్యక్రమంలో ప్రధానంగా రష్యా, అమెరికాలతోపాటు కెనడా, జపాన్, ఫ్రాన్సు, ఇటలీ, స్పెయిన్ భాగస్వాములుగా ఉన్నాయి. అయితే, రోస్కాస్మోస్తోపాటు ఇతర దేశాల సంస్థలతో కలిసి, ఐఎస్ఎస్ కార్యకలాపాలు సజావుగా కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు నాసా పేర్కొందని సీఎన్ఎన్ తెలిపింది. -
ఈయూ ఆంక్షలు.. రష్యా సంచలన నిర్ణయం
మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా ఇప్పటికే పలు దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. శుక్రవారం యూరోపియన్ యూనియన్ (ఈయూ) సైతం రష్యాపై కఠిన ఆంక్షలు విధించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, విదేశాంగ మంత్రి లావ్రోవ్ ఆస్తులను ఫ్రీజ్ చేస్తున్నట్టు ఈయూ ప్రకటించింది. ఈ ఆంక్షల నేపథ్యంలో రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. రష్యాలోని ఫ్రెంచ్ గయానా నుంచి అంతరిక్ష ప్రయోగాలను నిలిపివేస్తున్నట్లు శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు రష్యా అంతరిక్ష సంస్థ రోసోకాస్మోస్ డైరెక్టర్ జనరల్ డిమిత్రి రోగోజిన్ ట్విట్టర్ వేదికగా.. ఈయూ విధించిన ఆంక్షలకు ప్రతిస్పందనగా, రాకెట్ ప్రయోగాలకు సంబంధించి యూరప్‌లోని ఇతర భాగస్వామ్య దేశాలకు సహకారం నిలిపివేస్తున్నామని అన్నారు. ఫ్రెంచ్ గయానాలోని కౌరూ కాస్మోడ్రోమ్, రోసోకాస్మోస్ నుంచి రష్యా రాకెట్ ప్రయోగ సిబ్బందిని, సాంకేతిక నిపుణులను ఉపసంహరించుకున్నట్టు వెల్లడించారు. -
4 కోట్ల గంటలు.. 10 వేల మంది.. 76 వేల కోట్ల ఖర్చు
విశ్వ రహస్యాలు తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఆదిమ కాలం నుంచి మానవుడికి ఉండేది. టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ జిజ్ఞాసతో టెలిస్కోపుల నిర్మాణం చేపట్టాడు. ఈ క్రమంలో తాజాగా అతిపెద్ద టెలిస్కోపును నిర్మించడం జరిగింది. ఇంతవరకు విశ్వ రహస్యాలను అందిస్తూ వస్తున్న హబుల్ టెలిస్కోపుకు వారసురాలిగా, అంతకన్నా శక్తివంతమైనదిగా తీర్చిదిద్దిన జేమ్స్ వెబ్ టెలిస్కోపు ప్రయోగం డిసెంబర్ 22న జరగనుంది. బిగ్‌బ్యాంగ్ అనంతర పరిణామాలు, గెలాక్సీల పుట్టుక, విశ్వ ఆవిర్భవ అంశాలను లోతుగా పరిశీలించేందుకు ఈ టెలిస్కోప్ ఎంతగానో ఉపయోగపడనుంది. విశ్వ రహస్యాలను వివరంగా చూపించే ఈ టెలిస్కోపు నిర్మాణం నుంచి ప్రయోగం వరకు అనేక విశేషాలున్నాయి. అవేంటో చూద్దాం.. 10,000 మంది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడా స్పేస్ ఏజెన్సీల సహకారంతో నాసా ఈ టెలిస్కోపును అభివృద్ది చేస్తోంది. దాదాపు 20కి పైగా దేశాలకు ఈ టెలిస్కోపు నిర్మాణంలో భాగస్వామ్యముంది. ఏరియన్ 5 స్పేస్ రాకెట్లో ఫ్రెంచ్ గినియాలోని గినియాస్పేస్ సెంటర్ నుంచి దీన్ని అంతరిక్షంలోకి పంపిస్తారు. దీని నిర్మాణంలో దాదాపు 10వేల మంది సైంటిస్టులు 4 కోట్ల పనిగంటల పాటు కష్టపడ్డారు. 25 సంవత్సరాలు 1996లో ఎన్జీఎస్టీ పేరిట ఈ టెలిస్కోపు ప్రాజెక్టు ఆరంభమైంది. 2002లో దీనికి జేమ్స్ వెబ్ పేరును పెట్టారు. సుదీర్ఘకాలం పట్టిన ఈ టెలిస్కోపు నిర్మాణం సాఫీగా జరగలేదు. నిధుల కొరతతో ప్రాజెక్టు చాలా ఆలస్యం అయింది. 2011లో అమెరికా చట్టసభల కేటాయింపుల కమిటీ ఈ ప్రాజెక్టును ఏకంగా రద్దు చేయాలని పత్రిపాదించింది. ఆ సమయంలో దీన్ని నేచర్ పత్రిక ‘ఖగోళ నిధులు మింగేస్తున్న టెలిస్కోపు’గా అభివర్ణించింది. అయితే రద్దు ప్రతిపాదనను తిరస్కరించిన అమెరికా కాంగ్రెస్ టెలిస్కోపు నిర్మాణాన్ని కొనసాగించే నిధులను కేటాయించింది. దీంతో సుమారు 25 సంవత్సరాల కృషి అనంతరం 2021కి టెలిస్కోపు సిద్ధమైంది. రూ.76 వేల కోట్లు సుదీర్ఘకాలం కొనసాగడంతో దీని నిర్మాణానికి చాలా నిధులు వెచ్చించారు. 1996లో ఈ టెలిస్కోపు నిర్మాణ అంచనా నిధులు 50 కోట్ల డాలర్లు కాగా, 2021లో పూర్తయ్యేనాటికి 1,000 కోట్ల డాలర్ల (సుమారు 76 వేల కోట్ల రూపాయలు) వ్యయమైంది. లక్షల కిలోమీటర్ల దూరంలో పరిభ్రమణం డిసెంబర్ 22న ప్రయోగంతో దీన్ని భూమి– సూర్యుల మధ్య ఉన్న ఎల్2 లాంగ్రేజియన్ బిందువు వద్దకు చేరుస్తారు. ఇది భూమికి సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ ఇది భూమిలా సూర్యుని చూట్టూ పరిభ్రమిస్తుంటుంది. టెలిస్కోపులోని దర్పణాలను, పరికరాలను –220 డిగ్రీల సెల్సియస్ వద్ద చల్లగా ఉంచేందుకు దీనికి సిలికాన్, అల్యూమినియం పూత పూసిన సౌర కవచాన్ని తొడిగారు. హబుల్ భూమికి సుమారు 550 కిలోమీటర్ల దూరంలో పరిభ్రమిస్తోంది. 11 రోజులు ప్రయోగించిన 11 రోజులకు ఇది ఎల్2 పాయింటుకు చేరుకుంటుంది. అక్కడ కక్ష్యలో ప్రవేశించాక అంతవరకు ముడుచుకుని ఉన్న దర్పణం తెరుచుకొని పని ప్రారంభిస్తుంది. ఇందులో ప్రాథమిక దర్పణం కాకుండా మరో మూడు దర్పణాలు, లైట్ డిటెక్టర్, స్టార్ ట్రాకర్స్, సోలార్ ప్యానెల్స్, యాంటెన్నాలాంటి ఇతర భాగాలుంటాయి. 458 జీబీ కక్ష్యలోకి చేరాక ఇది రోజుకు 458 గిగాబైట్ల డేటాను పదేళ్ల పాటు పంపగలదు. 1350 కోట్ల సంవత్సరాల క్రితం కాంతి బిగ్ బ్యాంగ్ అనంతరం ఏర్పడ్డ తొలి నక్షత్రాలు, గాలక్సీల నుండి వెలువడ్డ కాంతి కోసం అన్వేషణ, గెలాక్సీల నిర్మాణం, పరిణామాలను, నక్షత్ర, గ్రహ వ్యవస్థల ఏర్పాటును అధ్యయనం చేయడం, జీవావిర్భావాన్ని పరిశోధించడం లక్ష్యంగా ఈ టెలిస్కోపు పనిచేయనుంది. జేమ్స్ వెబ్ పరారుణ సామర్థ్యంతో బిగ్ బ్యాంగ్ అనంతరం కొన్ని పదుల కోట్ల సంవత్సరాల తరువాత ఏర్పడిన తొలి గెలాక్సీల గురించి పరిశీలించవచ్చు. విశ్వం ఆవిర్భవించి ఇప్పటికి సుమారు 1380 కోట్ల సంవత్సరాలైందని అంచనా. ఈ టెలిస్కోపు సుమారు 1350 కోట్ల సంవత్సరాల పూర్వపు కాంతిని పసిగట్టగలదు. ఆసక్తి ఉన్న సైంటిస్టులు డైరెక్టర్స్ డిస్క్రెషనరీ ఎర్లీ రిలీస్ సైన్స్(డిడి–ఇఆర్ఎస్) కార్యక్రమం, గ్యారెంటీడ్ టైమ్ అబ్జర్వేషన్స్(జిటిఓ) కార్యక్రమం, జనరల్ అబ్జర్వర్స్(జిఓ) కార్యక్రమాల ద్వారా ఈ టెలిస్కోపును వాడుకొని ఖగోళ పరిశోధన చేసేందుకు సమయాన్నిస్తారు. నేషనల్ డెస్క్, సాక్షి -
800 కోట్ల మంది లక్ష ఏళ్లు బతకొచ్చు!
లిస్మోర్(ఆస్ట్రేలియా): భూమికి ఉపగ్రహమైన చంద్రుడిపై మానవ మనుగడకు ఆస్కారం ఉందా? అనే అంశంపై దశాబ్దాలుగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. మనిషి జీవించాలంటే శ్వాసించాల్సిందే. అందుకు ప్రాణవాయువు(ఆక్సిజన్) కావాలి. ఆ ప్రాణవాయువు చందమామపై ఇబ్బడిముబ్బడిగా ఉందని ఆస్ట్రేలియా స్సేస్ ఏజెన్సీ చెబుతోంది. అయితే, అది గాలి రూపంలో లేదని, చంద్రుడి ఉపరితలంపై వివిధ రాళ్లు, ఖనిజాల్లో నిక్షిప్తమై ఉన్నట్లు గుర్తించింది. చందమామపై రాళ్లను సేకరించి, వాటినుంచి ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్రక్రియపై ఇప్పుడు ఆస్ట్రేలియా దృష్టి పెట్టింది. ఇందుకోసం ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియా అంతరిక్ష సంస్థ, అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా తయారు చేసే రోవర్‌ను చంద్రుడిపైకి పంపిస్తారు. ఈ రోవర్ సాయంతో చంద్రుడిపై రాళ్లను సేకరించి, భూమిపైకి తీసుకొస్తారు. వాస్తవానికి చందమామపై వాతావరణం లేదు. రాళ్లు, దుమ్ము ధూళితోపాటు సిలికా, అల్యూమినియం, ఐరన్, మెగ్నీషియం ఆక్సైడ్ ఉన్నాయి. వీటన్నింటిలో ఆక్సిజన్ సమృద్ధిగా ఉందని ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ పరిశోధకులు చెబుతున్నారు. అది ఎంతమేరకు ఉందన్న దానిపై ఒక అంచనాకొచ్చారు. ఉపరితలం నుంచి కేవలం 10 మీటర్ల లోతులో ఒక క్యూబిక్ మీటర్ రాళ్లలో 630 కిలోల ఆక్సిజన్ ఉందని పేర్కొంటున్నారు. మనిషి ఒకరోజు జీవించాలంటే 800 గ్రాముల ఆక్సిజన్‌ను శ్వాసించాలి. 630 కిలోల ఆక్సిజన్‌తో ఒకరు రెండేళ్లకుపైగానే జీవించవచ్చు. ఈ లెక్కన 800 కోట్ల మంది లక్ష ఏళ్లపాటు జీవించేందుకు అవసరమైన ఆక్సిజన్ చంద్రుడిపై 10 మీటర్ల లోతుదాకా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. అయితే, చంద్రుడిపై ఉన్న ప్రాణవాయువును ఎంత సమర్థంగా వెలికితీసి, వాడుకుంటామన్న దానిపై ఇదంతా ఆధారపడి ఉంటుంది. -
ఇద్దరూ ఇద్దరే.. వీళ్ల చర్యలు ఊహాతీతం
పోటీ ప్రపంచంలో దిగజారి తిట్టుకోవడంలో ఆ ఇద్దరు బిలియనీర్లతో పోటీపడేవాళ్లెవరూ లేరంటే అతిశయోక్తి కాదు. నువ్వెంత అని ఒకరంటే.. అసలు ఎవరు నువ్వు? అనే తత్వం మరొకరిది. ఒకరు ఒక రంగంలో అడుగుపెడితే.. ఆ వెనకే అదే రంగంలోకి అడుగుపెడతారు మరొకరు. పోటాపోటీ ప్రయోగాలు.. ప్రదర్శనలతో వార్తల్లోకి ఎక్కుతుంటారు. ఒకరి మీద ఒకరు కోర్టులకు ఎక్కుతూ.. ఇష్టమొచ్చినట్లు తిట్టుకుంటారు. అలాంటి ఈ ఇద్దరు.. మొట్టమొదటిసారి తమ స్వభావాలకు భిన్నంగా ప్రవర్తించడం అంతర్జాతీయ మీడియా సమాజాన్ని అమితంగా ఆకర్షించింది ఇప్పుడు. ఎలన్ మస్క్ ఈ పేరు చెప్పగానే టెస్లా కార్లు, స్పేస్ ఎక్స్ ఏజెన్సీ అంతరిక్ష ప్రయోగాలతో పాటు రొటీన్‌కు భిన్నంగా సాగే ప్రయత్నాలు.. ప్రయోగాలు కళ్ల ముందు మెదలాడుతాయి. ఇక జెఫ్ బెజోస్ పేరు వినగానే.. గుండుతో మెరిసే రూపం కళ్ల ముందు మెదలాడుతుంది. ఆన్లైన్లో బుక్స్ అమ్మాలనే ఆలోచనతో మొదలైన అమెజాన్ ప్రస్థానాన్ని.. ఈ-కామర్స్ రంగంలో మహా సామ్రాజ్యంగా విస్తరించిన ఘనత బెజోస్‌ది. అలాంటి వ్యాపార దిగ్గజాలు ఇద్దరూ జస్ట్ ఒకే ఒక్క ట్వీట్‌తో సంభాషించుకోవడం చర్చనీయాంశంగా మారింది. Congratulations to @ElonMusk and the @SpaceX team on their successful Inspiration4 launch last night. Another step towards a future where space is accessible to all of us. — Jeff Bezos (@JeffBezos) September 16, 2021 చదవండి: ఎలన్ మస్క్ దమ్ము ఇది తాజాగా స్పేస్ఎక్స్ ఫాల్కన్ రాకెట్ ద్వారా ‘ఇన్స్పిరేషన్ 4’ ద్వారా స్పేస్ టూరిజంలో కొత్త ఒరవడిని సృష్టించాడు మస్క్. ఇక నుంచి కొందరు తమ బాటలోనే పయనిస్తారంటూ పరోక్షంగా బెజోస్(బ్లూఆరిజిన్ స్పేస్ ఏజెన్సీ ఓనర్) పైనే సెటైర్లు వేశాడు కూడా. కానీ, బెజోస్ మాత్రం ఎవరూ ఊహించని రీతిలో స్పందించాడు. ఈ ప్రయోగం సక్సెస్ కావడంపై మస్క్‌కు, స్పేస్ఎక్స్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీటేశాడు. దానికి మస్క్ సింపుల్‌గా ‘థ్యాంక్స్’ అని స్పందించాడు. ఈ ఇద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే.. భగ్గుమంటుదనే రేంజ్ శతత్రుత్వం ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. అందుకే వీళ్ల సంభాషణపై కొందరు ఎలా రియాక్ట్ అయ్యారో కింద ఓ లుక్కేస్కోండి. Elon said "Jeff who? " 😂 pic.twitter.com/zEHRRNJiPE — Sahil (@sahilypatel) September 16, 2021 This feels much better gentleman. 💪💕 — jason@calacanis.com (@Jason) September 16, 2021 Look at you guys being all friendly — MrBeast (@MrBeast) September 16, 2021 You guys are supposed to be mean to each other — Fintwit (@fintwit_news) September 16, 2021 చదవండి: దెబ్బ మీద దెబ్బ.. ముదురుతున్న వివాదాలు -
ఖర్చు ఎక్కువైనా సరే అనుకునేవారు ఓసారి ట్రై చేయొచ్చు
అంతరిక్షంలో సరికొత్త రేస్ మొదలైంది. గగన వీధుల్లో సరదాగా చక్కర్లు కొట్టే రోజు వచ్చేస్తోంది. ఆదివారం వర్జిన్ గెలాక్టిక్ సంస్థ.. 20న బ్లూఆరిజిన్ కంపెనీ తమ స్పేస్ ఫ్లైట్లను పంపుతున్నాయి. స్పేస్ ఎక్స్ సంస్థ అంతరిక్ష యాత్రలకు సిద్ధమవుతోంది. ఖర్చు కాస్త ఎక్కువైనా సరే.. ఓసారి అంతరిక్ష ప్రయాణం చేయాలనుకునే వారు ఓసారి ట్రై చేయొచ్చు. ఈ స్పేస్ టూరిజం విశేషాలు తెలుసుకుందామా? –సాక్షి సెంట్రల్ డెస్క్ ఇన్నాళ్లూ స్పేస్.. ప్రయోగాలకే.. వాణిజ్యపరంగా అంతరిక్ష యాత్రలు నిర్వహించేందుకు పలు దేశాలు, కొన్ని సంస్థలు చాలా ఏళ్ల కిందే ప్రయత్నా లు మొదలుపెట్టాయి. స్పేస్ టెక్నాలజీ చాలా క్లిష్టమైనది. రాకెట్లు, స్పేస్ షటిల్స్, ఇతర పరికరాలకు పెద్ద మొత్తంలో ఖర్చవుతుంది. దీంతో పెద్ద దేశాలకు చెందిన ప్రభుత్వ అంతరిక్ష సంస్థలు మాత్రమే అంతరిక్ష యాత్రలు చేపట్టగలిగాయి. అవి కూడా అన్వేషణలు, ప్రయోగాలకే పరిమితం అయ్యాయి. అయితే 2001 ఏప్రిల్ 30న రష్యా తొలిసారిగా శాస్త్రవేత్తలు కాకుండా సాధారణ వ్యక్తిని వాణిజ్యపరంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. రష్యాకు చెందిన సోయూజ్ రాకెట్ ద్వారా ‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)’కు వెళ్లిన అమెరికన్ వ్యాపారవేత్త డెన్నిస్ టిటో తొలి అంతరిక్ష యాత్రికుడిగా నిలిచాడు. ఏడు రోజులు అంతరిక్షంలో ఉన్నందుకు 2కోట్ల డాలర్లు (ఇప్పుడు మన కరెన్సీలో రూ.147 కోట్లు) చార్జిగా చెల్లించాడు. తర్వాత మరికొందరు మా త్రమే అంతరిక్ష యాత్రలకు వెళ్లగలిగారు. విపరీతమైన ఖర్చు, స్పేస్‌లోకి వెళ్లేందుకు అవకాశాలు తక్కువగా ఉండటమే దీనికి కారణం. ప్రైవేటు కంపెనీల రాకతో.. డెన్నిస్ టిటో ఘటన తర్వాత అంతరిక్ష యాత్రలకు వెళ్లాలనుకునే వారి సంఖ్య పెరిగింది. ఈ క్రమంలోనే పలు ప్రైవేటు కంపెనీలు తెరపైకి వచ్చా యి. ధనిక వ్యాపారవేత్తలు రిచర్డ్ బ్రాస్నన్ వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ, అమెజాన్ యజమాని జెఫ్ బెజోస్ బ్లూఆరిజిన్ కంపెనీని, టెస్లా ఓనర్ ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీని స్థాపించి ప్రయోగాలు మొదలుపెట్టారు. అవన్నీ ఇటీవలే ఓ కొలిక్కి వచ్చాయి. మనుషులను తీసుకుని అంతరిక్షంలోకి వెళ్లి, తిరిగి సురక్షితంగా ల్యాండ్ అయ్యే స్పేస్ షటిల్స్‌ను వారు అభివృద్ధి చేశారు. ఇద్దరూ సొంత స్పేస్ ఫ్లైట్లలో.. ఆదివారం జరిగే అంతరిక్ష యాత్ర లో వర్జిన్ గెలాక్టిక్ యజమాని రిచర్డ్ బ్రాస్నన్, కొందరు కంపెనీ ఉద్యోగులు స్పేస్‌లోకి వెళ్తున్నారు. 20న బ్లూఆరిజిన్ నిర్వహించనున్న యాత్రలో జెఫ్ బెజోస్, మరికొందరు అంతరిక్షంలో చక్కర్లు కొట్టి రానున్నారు. ఇద్దరూ కూడా తమ సొంత కంపెనీల స్పేస్ ఫ్లైట్ల గగన విహారానికి వెళ్తుండటం గమనార్హం. ఈ యాత్రలతో అంతరిక్ష పర్యాటకానికి దారులు తెరుచుకున్నట్టేనని నిపుణులు చెప్తున్నారు. స్పేస్ కంపెనీల మధ్య పోటీ పెరుగుతుండటంతో టూర్ వ్యయం కూడా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. ఏయే కంపెనీలు.. ఎప్పుడెప్పుడు? స్పేస్ ఎక్స్ ఈ సంస్థ తమ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ‘ది క్రూ డ్రాగన్’ స్పేస్ షటిల్‌ను ఇప్పటికే విజయవంతంగా నిర్వహిస్తోంది. ప్రస్తుతం నాసా శాస్త్రవేత్తలను, పరికరాలను ఐఎస్ఎస్కు తీసుకెళ్లడానికి, తిరిగి తీసుకురావడానికి వినియోగిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ‘ఇన్స్పిరేషన్4’ పేరిట తొలి వాణిజ్య యాత్ర చేపట్టనున్నారు. అందులో నలుగురు ప్యాసింజర్లు స్పేస్ టూర్‌కు వెళ్తున్నారు. అయితే దీనికి అయ్యే చార్జీలను బయటపెట్టలేదు. ఇదే సంస్థ భవిష్యత్తులో విస్తృతంగా అంతరిక్ష యాత్రలు చేపట్టేందుకు ‘స్టార్ షిప్’ స్పేస్ ఫ్లైట్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ రాకెట్ ద్వారా 2023లో చంద్రుడిపైకి యాత్ర చేపడతామని ప్రకటించింది. జపాన్‌కు చెందిన యుసకు మెజవా అనే వ్యాపారవేత్త అందులో ఇప్పటికే సీటు బుక్ చేసుకున్నారు. ఆక్సిమ్ స్పేస్ స్పేస్ ఎక్స్, నాసా సంస్థలతో కలిసి ఆక్సిమ్ స్పేస్ సంస్థ అంతరిక్ష యాత్రలకు ప్లాన్ చేస్తోంది. 2022 జనవరిలో నలుగురు ఎనిమిది రోజుల స్పేస్ టూర్‌కు వెళ్లనున్నారు. దీనికి ఒక్కొక్కరు 5.5 కోట్ల డాలర్లు (సుమారు రూ.400 కోట్లు) చెల్లిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన రాకెట్, స్పేష్ షటిల్‌ను ఈ యాత్రలకు వినియోగించనున్నారు. బ్లూ ఆరిజిన్ ఈ సంస్థ తమ న్యూషెపర్డ్ పునర్వినియోగ రాకెట్ ద్వారా ఇప్పటికే పలు ప్రయోగాలు నిర్వహించింది. ఈ నెల 20న జెఫ్ బెజోస్, మరో ఐదుగురు సిబ్బంది, శాస్త్రవేత్తలు ఈ రాకెట్ ద్వారా కాసేపు అంతరిక్షంలో చక్కర్లు కొట్టి రానున్నారు. త్వరలోనే పూర్తిస్థాయి వాణిజ్య యాత్రలను ప్రారంభిస్తామని బ్లూఆరిజిన్ ప్రకటించింది. వర్జిన్ గెలాక్టిక్ వీఎస్ఎస్ యూనిటీ ప్రత్యేక విమానం ద్వారా ‘స్పేస్ షిప్ టూ’ స్పేస్ వెహికల్‌ను భూమికి 10 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి అంతరిక్షంలోకి స్పేస్ షటిల్‌ను ప్రయోగించడం ఈ సంస్థ ప్రత్యేకత. ఇప్పటికే పలుమార్లు విజయవంతంగా ప్రయోగించింది. తాజాగా ఆదివారం తొలి ఫ్లైట్ జరగనుంది. వచ్చే ఏడాది నుంచి వాణిజ్యపరంగా అంతరిక్ష యాత్రలను మొదలుపెట్టనుంది. కొద్ది నిమిషాల్లోనే ముగిసే ఈ టూర్ల కోసం ఇప్పటికే 600 మంది టికెట్లు బుక్ చేసుకున్నట్టు ప్రకటించింది. ఒక్కొక్కరికి 2.5 లక్షల డాలర్లు (రూ.18.5 కోట్లు) చార్జిగా నిర్ణయించింది. ఇదే వరుసలో మరిన్ని కంపెనీలు కూడా.. రష్యా స్పేస్ ఏజెన్సీ తమ సోయూజ్ రాకెట్ ద్వారా ఇప్పటికే అంతరిక్ష యాత్రలు నిర్వహిస్తుండగా.. బోయింగ్ కంపెనీ స్పేస్ టూరిజం కోసం స్టార్‌లైనర్ స్పేస్ ఫ్లైట్‌ను అభివృద్ధి చేస్తోంది. ది డ్రీమ్ ఆఫ్ గేట్‌వే ఫౌండేషన్ భూమి చుట్టూ తిరుగుతూ ఉండే అంతరిక్ష హోటల్ ‘వోయేజర్ స్టేషన్’ను ప్లాన్ చేస్తోంది. దానికి సంబంధించి పనులు జరుగుతున్నాయి. కొన్ని నిమిషాల నుంచి... కొన్ని రోజుల దాకా.. అంతరిక్ష యాత్రలు అంటే.. కొన్ని నిమిషాలు గడిపి తిరిగిరావడం నుంచి కొద్దిరోజులు ఐఎస్ఎస్లో ఉండటం దాకా వేర్వేరుగా ఉంటాయి. అంతరిక్షంలోకి వెళ్లి గుండ్రంగా ఉన్న భూమిని, కాస్త దగ్గరగా చంద్రుడిని, సువిశాల విశ్వాన్ని వీక్షించడానికి చేసే సాధారణ స్పేస్ ఫ్లైట్లు అరగంట నుంచి గంటలో ముగుస్తాయి. వీటికి ఒక స్థాయి ధనికులు కూడా భరించే స్థాయిలో కొన్ని లక్షల నుంచి ఒకట్రెండు కోట్ల వరకు చార్జీలు ఉంటాయి. ఐఎస్ఎస్లో కొద్దిరోజులు గడపడం, భూమి చుట్టూ పరిభ్రమించడం సుదీర్ఘ యాత్రల కిందికి వస్తాయి. వీటికి పదుల కోట్లలో ఖర్చు అవుతుంది. నాసా కూడా రంగంలోకి.. అంతరిక్ష రంగంలో పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్న అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా స్పేస్ టూరిజంపై దృష్టి పెట్టింది. భవిష్యత్తులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (ఐఎస్ఎస్ను) ప్రైవేటుకు అప్పగించి.. తాము అందులో ఓ వినియోగదారుడిగా కొనసాగాలని భావిస్తోంది. ఇప్పటికే నాసాకు చెందిన వ్యోమగాములు, పరికరాలను ఐఎస్ఎస్కు తీసుకెళ్లేందుకు స్పేస్ ఎక్స్, బోయింగ్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. కొన్నేళ్లలో అంతరిక్ష యాత్రలు చేపడతామని, వెళ్లి రావడానికి అయ్యే ఖర్చును నిర్ధారించాల్సి ఉందని నాసా ఇప్పటికే పేర్కొంది. ఐఎస్ఎస్లో గడిపితే ఒక్కో టూరిస్టు రోజుకు 35 వేల డాలర్లు (రూ.11 లక్షలు) చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. -
శుక్రుడి మీద జీవం: రష్యా సంచలన ప్రకటన
మాస్కో: భూమికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహమైన శుక్రుడి మీద జీవం ఉండేందుకు ఆస్కారం ఉన్నట్లు ఇటీవలి పరిశోధనల్లో వెల్లడైన విషయం తెలిసిందే. శుక్ర గ్రహం మీద ఉన్న దట్టమైన మేఘాల్లో ఫాస్ఫైన్ అణువులు ఉన్నట్లు బ్రిటన్‌లోని కార్డిఫ్ యూనివర్సిటీ పరిశోధకులు సోమవారం తెలిపారు. ఈ నేపథ్యంలో రష్యా సంచలన ప్రకటన చేసింది. వీనస్‌ను ‘‘రష్యన్ ప్లానెట్’’ అని పేర్కొంటూ ఆ గ్రహంపై గుత్తాధిపత్యం ప్రకటించుకుంది. ఈ మేరకు మాస్కోలో జరుగుతున్న ఇండస్ట్రీ ఎగ్జిబిషన్లో రష్యా అంతరిక్ష సంస్థ చీఫ్ దిమిత్రి రొగోజిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘శుక్ర గ్రహం మీద అడుగుపెట్టిన మొట్టమొదటి, ఏకైక దేశం మాదే’’ అని పేర్కొన్నారు. 60, 70,80 దశకాల్లో శుక్రుడి మీద తమ శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. ఆ గ్రహానికి సంబంధించి అనేకానేక విషయాలను తమ అంతరిక్షనౌకలు ఏనాడో సమాచారం సేకరించాయని, అక్కడి పరిస్థితులు చాలా సంక్లిష్టంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. (చదవండి: శుక్రగ్రహం మీద ఫాస్ఫైన్!) ఇక తాజా పరిణామాల నేపథ్యంలో త్వరలోనే రష్యా సొంతంగా వీనస్‌పై మరోసారి పరిశోధనలు చేసేందుకు ప్రణాళికలు చేస్తోందని ఆయన ప్రకటించారు. గతంలో అమెరికా సహాయంతో వెనెరా- డి మిషన్‌తో సంబంధం లేకుండా ప్రత్యేకంగా మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు రొగోజిన్ వెల్లడించారు.‘‘ఆన్- ప్లానెట్ స్టేషన్ల ద్వారా శుక్ర గ్రహ పరిస్థితుల మీద తరచుగా ప్రయోగాలు చేసిన చరిత్ర రష్యాకు ఉంది. సౌరకుటుంబంలో తొలిసారిగా ఇతర గ్రహం మీద విజయవంతంగా అడుగుపెట్టాం. 1970లో వెనెరా-7 ద్వారా కీలక ఘట్టం ఆవిష్కరింపజేశాం. వీనస్ మీది వాతావరణం, మట్టి, ఇతర మూలకాల మిశ్రమం తదితర అంశాల గురించి వివిధ దశల్లో ప్రయోగాలు చేశాం. అంతేకాదు శుక్ర గ్రహం మీద అత్యధికంగా 127 నిమిషాల పాటు యాక్టివ్‌గా ఉన్న స్సేప్క్రాఫ్ట్గా ది సోవియెట్ వెనెరా-13 పేరిట రికార్డు నేటికీ పదిలంగా ఉంది’’అంటూ శుక్ర గ్రహాన్ని రష్యా ప్లానెట్‌గా పేర్కొనడం వెనుక ఉన్న ఉద్దేశం గురించి వివరించారు. ఈ మేరకు ది మాస్కో టైమ్స్ కథనం వెలువరించింది. కాగా.. ఇక బ్రిటన్ శాస్త్రవేత్తల తాజా పరిశోధనల నేపథ్యంలో, ఫాస్ఫైన్ ఉన్నంత మాత్రాన శుక్రుడి మీద జీవం ఉందని చెప్పలేమని, ఒక గ్రహం మీద భాస్వరం సమృద్ధిగా ఉన్నప్పటికి.. జీవం మనుగడకు అనుకూలమైన వాతావరణం అక్కడ లేకపోవచ్చని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడిన విషయం తెలిసిందే. -
అంతరిక్ష యుద్ధ తంత్రం
న్యూఢిల్లీ: అంతరిక్షయానంలో తిరుగులేని విజయాలు సొంతం చేసుకున్న భారత్, అంతరిక్ష యుద్ధతంత్రంలోనూ పైచేయి సాధించే దిశగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా అంతరిక్షంలో యుద్ధాలు సాగించేందుకు అనువైన వ్యవస్థల రూపకల్పన కోసం అంతరిక్ష రక్షణ సంస్థ(డీఎస్ఏ)ను ఏర్పాటు చేయనుంది. డీఎస్ఏకు అవసరమైన పరిశోధన, అభివృద్ధి వ్యవస్థలను సమకూర్చేందుకు రక్షణ రంగ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఎస్ఆర్వో)ను ఏర్పాటు చేయనుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మంగళవారం సమావేశమైన రక్షణపై కేబినెట్ కమిటీ (సీసీఎస్) అంతరిక్ష యుద్ధతంత్రానికి అవసరమైన అధునాతన యుద్ధ వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి డీఎస్ఆర్వో అనే కొత్త సంస్థను ఏర్పాటు చేయాలని తీర్మానించింది. డీఎస్‌ఏలో ఎంపిక చేసిన శాస్త్రవేత్తల బృందంతోపాటు త్రివిధ దళాలకు చెందిన అధికారులు కూడా ఉంటారు. బెంగళూరు కేంద్రంగా ఎయిర్ వైస్ మార్షల్ అధికారి నేతృత్వంలో ఇది పనిచేస్తుంది. ఇటీవల భారత్ అంతరిక్షంలోని కక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహాన్ని క్షిపణిని ప్రయోగించి తుత్తునియలు చేసిన విషయం తెలిసిందే. ఈ సత్తాను సంపాదించుకున్న నాలుగో దేశంగా అగ్రరాజ్యాల సరసన నిలిచింది. అంతేకాకుండా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘స్పేస్ ఫోర్స్’ ఏర్పాటు చేస్తామంటూ ఇటీవల ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం డీఎస్ఆర్వో ఏర్పాటుకు నిర్ణయించడం గమనార్హం.