మాస్కో: ఉక్రెయిన్‌పై దాడులకు ప్రతిగా అమెరికా విధించిన తీవ్ర ఆంక్షలపై రష్యా అంతరిక్ష విభాగం (రోస్‌కాస్మోస్) డైరెక్టర్ జనరల్ దిమిత్రీ రొగోజిన్ తీవ్రంగా స్పందించారు. ఆంక్షల నేపథ్యంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్) నిర్వహణలో తమ దేశం సహకరించబోదని హెచ్చరించారు. తద్వారా, 500 టన్నుల బరువైన ఐఎస్‌ఎస్ భారత్, చైనాలపైనే పడేందుకు అవకాశాలున్నాయని అమెరికా బెదించాలనుకుంటోందా అని ఆయన ప్రశ్నించారు. ఐఎస్‌ఎస్ కక్ష్య, అంతరిక్షంలో దాని స్థానాన్ని నియంత్రించే ఇంజిన్లు రష్యా అధీనంలో ఉన్నాయని రొగోజిన్ ట్విట్టర్‌లో తెలిపినట్లు సీఎన్‌ఎన్ పేర్కొంది.
చదవండి: (ప్రాణాలకు ముప్పని తెలిసినా.. అమెరికాకు తెగేసి చెప్పాడు..)
‘మాకు సహకారాన్ని నిలిపివేస్తే, ఐఎస్‌ఎస్ అనియంత్రిత కక్ష్యలోకి వెళ్లి, అమెరికా యూరప్‌పై పడితే ఎవరు రక్షిస్తారు?. 500 టన్నుల బరువైన ఐఎస్‌ఎస్ భారత్, చైనాల పైనే పడేందుకు అవకాశముంది. ఇదే సాకుతో ఆ దేశాలను బెదిరించాలనుకుంటున్నారా? ఐఎస్‌ఎస్ రష్యా మీదుగా వెళ్లడం లేదు కాబట్టి, రిస్కంతా మీకే. ఇందుకు సిద్ధంగా ఉన్నారా?’అని అమెరికాను ప్రశ్నించారు. ఐఎస్‌ఎస్ కార్యక్రమంలో ప్రధానంగా రష్యా, అమెరికాలతోపాటు కెనడా, జపాన్, ఫ్రాన్సు, ఇటలీ, స్పెయిన్ భాగస్వాములుగా ఉన్నాయి. అయితే, రోస్‌కాస్మోస్‌తోపాటు ఇతర దేశాల సంస్థలతో కలిసి, ఐఎస్‌ఎస్ కార్యకలాపాలు సజావుగా కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు నాసా పేర్కొందని సీఎన్‌ఎన్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment