విశ్లేషణ
పశ్చిమాసియా ప్రస్తుత పరిణామాల సందర్భంలో బలహీనమైన దేశాలకు అణ్వస్త్రాలే బలమా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. చైనా నుంచి అణ్వస్త్ర ప్రమాదం లేనట్లయితే భారతదేశం ఆత్మరక్షణ కోసం అణ్వస్త్రాలు తయారు చేసుకునేదా? భారత్ నుంచి అదే ప్రమాదం లేనట్లయితే పాకిస్తాన్ తన అస్త్రాలు ఉత్పత్తి చేసుకునేదా? అమెరికా, రష్యాల అణు ప్రమాదం లేని పక్షంలో చైనా గానీ, అమెరికా ప్రమాదం లేని స్థితిలో సోవియెట్ యూనియన్ గానీ అణ్వాయుధాలు చేసేవా? వియత్నాం వద్ద అణ్వాయుధ శక్తి ఉండి ఉంటే, మొదట ఫ్రాన్స్, తర్వాత అమెరికా ఆ చిన్న దేశాన్ని ఏళ్ళ తరబడి ధ్వంసం చేసేందుకు సాహసించేవా? సూటిగా అడగాలంటే, పాలస్తీనాకు అణ్వస్త్ర శక్తి ఉండినట్లయితే ఇజ్రాయెల్ ఈ తరహా యుద్ధానికి పాల్పడి ఉండేదా?
బలహీనమైన దేశాలకు బలవంతుల నుంచి ఆత్మరక్షణకు అంతిమంగా అణ్వస్త్రాలే శరణ్య మవుతాయా అన్నది ఆలోచించదగ్గ ప్రశ్న. మరీ ముఖ్యంగా తక్కిన ప్రపంచం, ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలు ప్రేక్షక పాత్ర వహిస్తు న్నప్పుడు. బలహీనమైన దేశాలకు అణ్వస్త్రాలే బలమా, రక్షణా అని పశ్చిమాసియా ప్రస్తుత పరిణామాల సందర్భంలో చర్చించటానికి ముందు... ఇపుడు ఇండియా, పాకిస్తాన్, చైనా, రష్యాలు తమ అణ్వస్త్రాలను కవచంగా మార్చుకుని ఎంత భద్రతను అనుభవిస్తున్నాయో గమనించాలి.
సూటిగా అడగాలంటే, పాలస్తీనాకు అణ్వస్త్ర శక్తి ఉండినట్లయితే ఇజ్రాయెల్ వంటి శక్తిమంతమైన దేశం గాజాలో గానీ, వెస్ట్ బ్యాంక్‌లో గానీ, తాజాగా లెబనాన్‌లో గానీ ఈ తరహా యుద్ధానికి పాల్పడి ఉండేదా? ఇరాన్ నాయకత్వాన్ని హతమార్చి మొత్తం పశ్చిమాసియా స్థితి గతులనే మార్చి వేయగలమనే ఇటీవలి హెచ్చరికలను ఒకవేళ ఇరాన్ ఇప్పటికే అణ్వాయుధాలు తయారు చేసుకుని ఉండినట్లయితే జారీ చేయగలిగేదా?
ఈ ప్రశ్నలన్నింటి ఉద్దేశం ప్రపంచం అంతా అణ్వస్త్రాల మయం అయిపోవాలని సూచించటం కాదు. అవెంత వినాశనకరమైనవో అమెరికన్ల హిరోషిమా, నాగసాకి ప్రయోగాల అనుభవం తర్వాత ఎవరికీ చెప్పనక్కర లేదు.
ఉద్దేశపూర్వకంగా కాకున్నా ప్రమాదవ శాత్తునో, ఏదైనా యాంత్రికపరమైన పొరపాటు వల్లనో ఏ అగ్రరాజ్య శిబిరం వైపు నుంచో అణు ప్రయోగం జరిగి మరుక్షణం ఎదుటి శిబిరం కూడా వాటిని ప్రయోగించటం జరిగితే పరిస్థితి ఏమిటని? అసలు అణ్వస్త్రాలు అన్నవే మొత్తం మానవాళికి ఒక భయంకర స్థితి అనటంలో ఎటువంటి సందేహాలు లేవు.
అణ్వస్త్ర వ్యాప్తి నిరోధానికి, అణ్వస్త్ర దేశాల వద్ద గల అణ్వాయుధాల పరిమితికి, కొత్తగా అణు పరీక్షలపై నియంత్రణకు, రోదసీలో అస్త్రాల మోహరింపుపై నిషేధానికి అనేక ఒప్పందాలు జరిగాయి. కానీ వాటన్నింటి ఉల్లంఘనలు జరుగు తున్నాయన్నది గమనించవలసిన విషయం.
పాలస్తీనా వంటి ఒక అతి చిన్న దేశం వద్ద, ఇరాన్ వంటి ఒక మధ్యమ స్థాయి దేశం వద్ద అణ్వస్త్ర శక్తి ఉండి ఉంటే, పాలస్తీనా సమస్య 1948లోనే పరిష్కారమయ్యేదని కాదనగలమా? అందుకు ఇజ్రాయెల్‌తో పాటు అమెరికన్ శిబిరం అంగీకరించేవని చెప్పలేమా? ఈ పరిణామాల మధ్య మరొకవైపు ఏమవుతున్నదో గమనించండి.
ఇరాన్ వద్ద అణ్వస్త్రాల ఉత్పత్తికి తగిన సామర్థ్యంతోపాటు, అవస రమైన సామగ్రి అంతా ఉన్నది. కానీ అణ్వస్త్రాలు ఇస్లాంకు విరుద్ధమైన వని అంటూ వాటి తయారీని ఇరాన్ అధిపతి అలీ ఖమేనీ బహిరంగంగా నిషేధించారు. శాంతియుత వినియోగానికి మాత్రమేనని చెబుతూ వారు ఆ శక్తిని అభివృద్ధి పరుస్తున్నారు. దానిని కూడా సహించని అమెరికా ఇరాన్‌పై అనేక ఆంక్షలు విధించింది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అనేక తనిఖీలు జరిపింది.
నెతన్యాహూ గత వారం ఒక రికార్డెడ్ వీడియో విడుదల చేశారు. అందులో రెండు గమనార్హమైన హెచ్చరికలున్నాయి. హమాస్, హిజ్బుల్లా తరహాలో ఇరాన్ నాయకత్వాన్ని కూడా అంతం చేసి ఇరాన్ ప్రజలను విముక్తం చేయగలమన్నది ఒకటి. మొత్తం పశ్చిమాసియాలో ఏ ప్రాంతం కూడా తమ శక్తికి అతీతమైనది కాదని, తాము క్రమంగా మొత్తంగానే ఆ ప్రాంతపు రూపును, స్థితిగతులను మార్చివేయనున్నా మనేది రెండోది.
దీనంతటి మధ్య మరొక గమనించదగ్గ ఘటన చోటు చేసుకుంది. ఇరాన్‌లోని సెమ్నాన్ ప్రాంతంలో కొద్ది రోజుల క్రితం 4.4 మాగ్ని ట్యూడ్‌తో భూకంపం సంభవించింది. దాని ప్రభావంతో ఆ ప్రాంతంలోని అరదాన్ పట్టణంతో పాటు టెహరాన్ నగరంలోని ఒక భాగంలో కూడా ప్రకంపనలు వచ్చాయి. ఇంతకూ అది నిజంగా భూకంపమా లేక భూగర్భ అణ్వస్త్ర ప్రయోగ ఫలితమా అన్న చర్చలు బయటి ప్రపంచంలో సాగుతున్నాయి.
పాశ్చాత్య నిఘా సంస్థలు కూడా ఇంతవరకు నిర్ధారణగా ఏమీ చెప్పలేదు. సెమ్నాన్ ప్రాంతానికి సమీపంలోనే ఇరాన్ అణుశక్తి పరీక్షల ప్రధాన కేంద్రాలైన నాతాంజ్, ఫొర్దోవ్‌లు ఉండటం గమనించదగ్గది. ఒకవేళ రహస్యంగా అణ్వస్త్ర పరీక్షలు జరిగి ఉంటే భూప్రకంపనలు రావటం సహజం. భారత ప్రభుత్వం రాజ స్థాన్ ఎడారిలోని పొఖారణ్ వద్ద పరీక్షలు నిర్వహించినప్పుడు ఇదే జరిగింది.
ఒకవేళ ఇరాన్ పరీక్షలు నిజమనుకుంటే, దేశాధిపతి తన నిషేధాన్ని సడలించి ఉంటారా అన్నది ఒక ప్రశ్న. ఇజ్రాయెల్ హెచ్చరి కలతో నాయకుల ప్రాణాలు, దేశ రక్షణ ప్రమాదంలో పడినపుడు, బయటకు చెప్పకుండా ఎందుకు సడలించరాదన్నది మరొక ప్రశ్న.
మరొకవైపు, పోయిన ఆగస్టు చివరలో ఖమేనీ తమ ప్రధానికి ఒక ఆదేశాన్ని బహిరంగంగా ఇచ్చారు. ఒకవేళ తాము అణ్వస్త్రాలు ఉత్పత్తి చేయరాదంటే తమకు ఎటువంటి రక్షణలు కల్పించగలరో, పశ్చిమా సియాలోని వివిధ పరిస్థితుల గురించి ఏమి హామీలివ్వగలరో బైడెన్‌తో చర్చించాలని! అటువంటి చర్చలు ఇంతవరకేమీ జరగలేదు గానీ ఈ లోపల యుద్ధ రీత్యా అనేక పరిణామాలు చోటు చేసుకుంటూ పరిస్థితి దాదాపు చేయి దాటింది.
వచ్చే నెల అమెరికా ఎన్నికలు న్నాయి. ఈ దశలో ఇక అటువంటి చర్చలకు అవకాశం లేదు. ఎన్ని కలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడే సరికి ఇక్కడ గాజా, లెబనాన్, ఇరాన్‌లలో ఏమైన జరగవచ్చు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని ఇరాన్ నాయకత్వం తమ అణు విధానాన్ని రహస్యంగా సడలించు కున్నదేమో తెలియదు.
ఇంతకూ ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేయాలని ఇజ్రా యెల్ నిర్ణయించినా ఆ పని ఎంతవరకు సాధ్యమనే ప్రశ్న కూడా ఒకటున్నది. ఆ కేంద్రాలు ఇరాన్ తూర్పు ప్రాంతంలో ఏదో ఒక చోట కాకుండా విస్తరించి ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి నాతాంజ్, ఫొర్దోవ్‌లు. వాటి పరిశోధనాగారాలు భూగర్భంలో చాలా లోతున దుర్భేద్యమైన రక్షణలో ఉన్నాయి.
ఇవన్నీ ఇజ్రాయెల్ నుంచి వెయ్యి మైళ్ళకు పైగా దూరం. అంతవరకు వచ్చి దాడి చేయాలంటే సుమారు వంద యుద్ధ విమానాలు అవసరమని, అవి ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను, యుద్ధ విమానాల ఎదురుదాడులను దాటుకుంటూ రావాలన్నది అమెరికాయే ఒకప్పుడు వేసిన అంచనా. ఇది ఒక సమస్య అయితే, ఎంతో లోతున గల అణు కేంద్రాలను దెబ్బతీసే శక్తి అమెరి కన్ బంకర్ బస్టర్లకు తప్ప ఇజ్రాయెల్‌కు లేదు.
మరి అమెరికా ఆ సహాయం చేస్తుందా? దీనంతటిలో అనిశ్చితి ఉంది. ఒకవేల పరిస్థి తులు ఇరాన్ ఆశించినట్లుగానే లేనట్లయితే? అందుకే ఇరానియన్ రిపబ్లిక్ అధికారులు, రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్లు ఇటీవల, పరిస్థి తులు ఈ విధంగానే కొనసాగితే తమ సైనిక రక్షణ విధానాన్ని మార్చు కొనక తప్పదని తరచూ ప్రకటిస్తున్నారు.
ఇదంతా ఏమి చెప్తున్నది? మొదటి నుంచి కూడా బలవంతులదే రాజ్యం అన్నట్లు ఉన్న ప్రపంచ పరిస్థితులు ఇప్పటికీ అదే విధంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ సంస్థలు, చర్చలు, ఒప్పందాల వంటివన్నీ బలవంతుల ఉల్లంఘనలకు గురవుతున్నాయి. ఆయుధ బలం, ధన బలం మాత్రమే రాజ్యమేలుతున్నాయి. న్యాయాన్యాయాలు, ధర్మాధర్మాలు, నీతి అవినీతుల ప్రసక్తే లేదు.
అణ్వస్త్రాల మాట కూడా అందులో భాగమే. అంతెందుకు, జపాన్ వద్ద బాంబులు ఉండినట్ల యితే వారిపై మొదటి అణ్వస్త్ర ప్రయోగం జరిగేదా? ఇప్పుడు ఉత్తర కొరియా వద్ద అవి ఉన్నందుకే గదా అమెరికా వెనుకాడుతున్నది? ఉక్రెయిన్ యుద్ధంలో అణుప్రయోగ ప్రస్తావనలు ఎందుకు వస్తున్నాయి? ఇట్లా చెప్తూ పోవాలంటే రెండవ ప్రపంచ యుద్ధానంతర కాలంలో అనేక ఉదాహరణలున్నాయి. అందువల్లనే, బలహీన దేశాల రక్షణకు అణ్వస్త్రాలే బలమా అనే ప్రశ్న వస్తున్నది. అదెంత ప్రమాద కరమైనది, అవాంఛనీయమైనది అయినా. చర్చకోసం.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు
Comments
Please login to add a commentAdd a comment