ఖర్చు ఎక్కువైనా సరే అనుకునేవారు ఓసారి ట్రై చేయొచ్చు | Blue Origin Plans To Fly Him To Space On July 20 | Sakshi
Sakshi News home page

Space Flight: ఖర్చు ఎక్కువైనా సరే అనుకునేవారు ఓసారి ట్రై చేయొచ్చు

Published Sun, Jul 11 2021 4:20 AM | Last Updated on Sun, Jul 11 2021 10:00 AM

  Blue Origin Plans To Fly Him To Space On July 20 - Sakshi

అంతరిక్షంలో సరికొత్త రేస్‌ మొదలైంది. గగన వీధుల్లో సరదాగా చక్కర్లు కొట్టే రోజు వచ్చేస్తోంది. ఆదివారం వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ.. 20న బ్లూఆరిజిన్‌ కంపెనీ తమ స్పేస్‌ ఫ్లైట్లను పంపుతున్నాయి. స్పేస్‌ ఎక్స్‌ సంస్థ అంతరిక్ష యాత్రలకు సిద్ధమవుతోంది. ఖర్చు కాస్త ఎక్కువైనా సరే.. ఓసారి అంతరిక్ష ప్రయాణం చేయాలనుకునే వారు ఓసారి ట్రై చేయొచ్చు. ఈ స్పేస్‌ టూరిజం విశేషాలు తెలుసుకుందామా?  
–సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

ఇన్నాళ్లూ స్పేస్‌.. ప్రయోగాలకే.. 


వాణిజ్యపరంగా అంతరిక్ష యాత్రలు నిర్వహించేందుకు పలు దేశాలు, కొన్ని సంస్థలు చాలా ఏళ్ల కిందే ప్రయత్నా లు మొదలుపెట్టాయి. స్పేస్‌ టెక్నాలజీ చాలా క్లిష్టమైనది. రాకెట్లు, స్పేస్‌ షటిల్స్, ఇతర పరికరాలకు పెద్ద మొత్తంలో ఖర్చవుతుంది. దీంతో పెద్ద దేశాలకు చెందిన ప్రభుత్వ అంతరిక్ష సంస్థలు మాత్రమే అంతరిక్ష యాత్రలు చేపట్టగలిగాయి. అవి కూడా అన్వేషణలు, ప్రయోగాలకే పరిమితం అయ్యాయి.

అయితే 2001 ఏప్రిల్‌ 30న రష్యా తొలిసారిగా శాస్త్రవేత్తలు కాకుండా సాధారణ వ్యక్తిని వాణిజ్యపరంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. రష్యాకు చెందిన సోయూజ్‌ రాకెట్‌ ద్వారా ‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)’కు వెళ్లిన అమెరికన్‌ వ్యాపారవేత్త డెన్నిస్‌ టిటో తొలి అంతరిక్ష యాత్రికుడిగా నిలిచాడు. ఏడు రోజులు అంతరిక్షంలో ఉన్నందుకు 2కోట్ల డాలర్లు (ఇప్పుడు మన కరెన్సీలో రూ.147 కోట్లు) చార్జిగా చెల్లించాడు. తర్వాత మరికొందరు మా త్రమే అంతరిక్ష యాత్రలకు వెళ్లగలిగారు. విపరీతమైన ఖర్చు, స్పేస్‌లోకి వెళ్లేందుకు అవకాశాలు తక్కువగా ఉండటమే దీనికి కారణం. 

ప్రైవేటు కంపెనీల రాకతో.. 
డెన్నిస్‌ టిటో ఘటన తర్వాత అంతరిక్ష యాత్రలకు వెళ్లాలనుకునే వారి సంఖ్య పెరిగింది. ఈ క్రమంలోనే పలు ప్రైవేటు కంపెనీలు తెరపైకి వచ్చా యి. ధనిక వ్యాపారవేత్తలు రిచర్డ్‌ బ్రాస్నన్‌ వర్జిన్‌ గెలాక్టిక్‌ కంపెనీ, అమెజాన్‌ యజమాని జెఫ్‌ బెజోస్‌ బ్లూఆరిజిన్‌ కంపెనీని, టెస్లా ఓనర్‌ ఎలన్‌ మస్క్‌ స్పేస్‌ ఎక్స్‌ కంపెనీని స్థాపించి ప్రయోగాలు మొదలుపెట్టారు. అవన్నీ ఇటీవలే ఓ కొలిక్కి వచ్చాయి. మనుషులను తీసుకుని అంతరిక్షంలోకి వెళ్లి, తిరిగి సురక్షితంగా ల్యాండ్‌ అయ్యే స్పేస్‌ షటిల్స్‌ను వారు అభివృద్ధి చేశారు.   

ఇద్దరూ సొంత స్పేస్‌ ఫ్లైట్లలో.. 


ఆదివారం జరిగే అంతరిక్ష యాత్ర లో వర్జిన్‌ గెలాక్టిక్‌ యజమాని రిచర్డ్‌ బ్రాస్నన్, కొందరు కంపెనీ ఉద్యోగులు స్పేస్‌లోకి వెళ్తున్నారు. 20న బ్లూఆరిజిన్‌ నిర్వహించనున్న యాత్రలో జెఫ్‌ బెజోస్, మరికొందరు అంతరిక్షంలో చక్కర్లు కొట్టి రానున్నారు. ఇద్దరూ కూడా తమ సొంత కంపెనీల స్పేస్‌ ఫ్లైట్ల గగన విహారానికి వెళ్తుండటం గమనార్హం. ఈ యాత్రలతో అంతరిక్ష పర్యాటకానికి దారులు తెరుచుకున్నట్టేనని నిపుణులు చెప్తున్నారు. స్పేస్‌ కంపెనీల మధ్య పోటీ పెరుగుతుండటంతో టూర్‌ వ్యయం కూడా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.   

ఏయే కంపెనీలు.. ఎప్పుడెప్పుడు?

స్పేస్‌ ఎక్స్‌

ఈ సంస్థ తమ ఫాల్కన్‌ 9 రాకెట్‌ ద్వారా ‘ది క్రూ డ్రాగన్‌’ స్పేస్‌ షటిల్‌ను ఇప్పటికే విజయవంతంగా నిర్వహిస్తోంది. ప్రస్తుతం నాసా శాస్త్రవేత్తలను, పరికరాలను ఐఎస్‌ఎస్‌కు తీసుకెళ్లడానికి, తిరిగి తీసుకురావడానికి వినియోగిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ‘ఇన్‌స్పిరేషన్‌4’ పేరిట తొలి వాణిజ్య యాత్ర చేపట్టనున్నారు. అందులో నలుగురు ప్యాసింజర్లు స్పేస్‌ టూర్‌కు వెళ్తున్నారు. అయితే దీనికి అయ్యే చార్జీలను బయటపెట్టలేదు. ఇదే సంస్థ భవిష్యత్తులో విస్తృతంగా అంతరిక్ష యాత్రలు చేపట్టేందుకు ‘స్టార్‌ షిప్‌’ స్పేస్‌ ఫ్లైట్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ రాకెట్‌ ద్వారా 2023లో చంద్రుడిపైకి యాత్ర చేపడతామని ప్రకటించింది. జపాన్‌కు చెందిన యుసకు మెజవా అనే వ్యాపారవేత్త అందులో ఇప్పటికే సీటు బుక్‌ చేసుకున్నారు. 

ఆక్సిమ్‌ స్పేస్‌
స్పేస్‌ ఎక్స్, నాసా సంస్థలతో కలిసి ఆక్సిమ్‌ స్పేస్‌ సంస్థ అంతరిక్ష యాత్రలకు ప్లాన్‌ చేస్తోంది. 2022 జనవరిలో నలుగురు ఎనిమిది రోజుల స్పేస్‌ టూర్‌కు వెళ్లనున్నారు. దీనికి ఒక్కొక్కరు 5.5 కోట్ల డాలర్లు (సుమారు రూ.400 కోట్లు) చెల్లిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. స్పేస్‌ ఎక్స్‌ సంస్థకు చెందిన రాకెట్, స్పేష్‌ షటిల్‌ను ఈ యాత్రలకు వినియోగించనున్నారు. 

బ్లూ ఆరిజిన్‌
ఈ సంస్థ తమ న్యూషెపర్డ్‌ పునర్వినియోగ రాకెట్‌ ద్వారా ఇప్పటికే పలు ప్రయోగాలు నిర్వహించింది. ఈ నెల 20న జెఫ్‌ బెజోస్, మరో ఐదుగురు సిబ్బంది, శాస్త్రవేత్తలు ఈ రాకెట్‌ ద్వారా కాసేపు అంతరిక్షంలో చక్కర్లు కొట్టి రానున్నారు. త్వరలోనే పూర్తిస్థాయి వాణిజ్య యాత్రలను ప్రారంభిస్తామని బ్లూఆరిజిన్‌ ప్రకటించింది. 

వర్జిన్‌ గెలాక్టిక్‌
వీఎస్‌ఎస్‌ యూనిటీ ప్రత్యేక విమానం ద్వారా ‘స్పేస్‌ షిప్‌ టూ’ స్పేస్‌ వెహికల్‌ను భూమికి 10 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి అంతరిక్షంలోకి స్పేస్‌ షటిల్‌ను ప్రయోగించడం ఈ సంస్థ ప్రత్యేకత. ఇప్పటికే పలుమార్లు విజయవంతంగా ప్రయోగించింది. తాజాగా ఆదివారం తొలి ఫ్లైట్‌ జరగనుంది. వచ్చే ఏడాది నుంచి వాణిజ్యపరంగా అంతరిక్ష యాత్రలను మొదలుపెట్టనుంది. కొద్ది నిమిషాల్లోనే ముగిసే ఈ టూర్‌ల కోసం ఇప్పటికే 600 మంది టికెట్లు బుక్‌ చేసుకున్నట్టు ప్రకటించింది. ఒక్కొక్కరికి 2.5 లక్షల డాలర్లు (రూ.18.5 కోట్లు) చార్జిగా నిర్ణయించింది. 

ఇదే వరుసలో మరిన్ని కంపెనీలు కూడా..
రష్యా స్పేస్‌ ఏజెన్సీ తమ సోయూజ్‌ రాకెట్‌ ద్వారా ఇప్పటికే అంతరిక్ష యాత్రలు నిర్వహిస్తుండగా.. బోయింగ్‌ కంపెనీ స్పేస్‌ టూరిజం కోసం స్టార్‌లైనర్‌ స్పేస్‌ ఫ్లైట్‌ను అభివృద్ధి చేస్తోంది. ది డ్రీమ్‌ ఆఫ్‌ గేట్‌వే ఫౌండేషన్‌ భూమి చుట్టూ తిరుగుతూ ఉండే అంతరిక్ష హోటల్‌ ‘వోయేజర్‌ స్టేషన్‌’ను ప్లాన్‌ చేస్తోంది. దానికి సంబంధించి పనులు జరుగుతున్నాయి.  

కొన్ని నిమిషాల నుంచి... కొన్ని రోజుల దాకా.. 
అంతరిక్ష యాత్రలు అంటే.. కొన్ని నిమిషాలు గడిపి తిరిగిరావడం నుంచి కొద్దిరోజులు ఐఎస్‌ఎస్‌లో ఉండటం దాకా వేర్వేరుగా ఉంటాయి. అంతరిక్షంలోకి వెళ్లి గుండ్రంగా ఉన్న భూమిని, కాస్త దగ్గరగా చంద్రుడిని, సువిశాల విశ్వాన్ని వీక్షించడానికి చేసే సాధారణ స్పేస్‌ ఫ్లైట్లు అరగంట నుంచి గంటలో ముగుస్తాయి. వీటికి ఒక స్థాయి ధనికులు కూడా భరించే స్థాయిలో కొన్ని లక్షల నుంచి ఒకట్రెండు కోట్ల వరకు చార్జీలు ఉంటాయి. ఐఎస్‌ఎస్‌లో కొద్దిరోజులు గడపడం, భూమి చుట్టూ పరిభ్రమించడం సుదీర్ఘ యాత్రల కిందికి వస్తాయి. వీటికి పదుల కోట్లలో ఖర్చు అవుతుంది.  

నాసా కూడా రంగంలోకి.. 
అంతరిక్ష రంగంలో పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్న అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా స్పేస్‌ టూరిజంపై దృష్టి పెట్టింది. భవిష్యత్తులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (ఐఎస్‌ఎస్‌ను) ప్రైవేటుకు అప్పగించి.. తాము అందులో ఓ వినియోగదారుడిగా కొనసాగాలని భావిస్తోంది. ఇప్పటికే నాసాకు చెందిన వ్యోమగాములు, పరికరాలను ఐఎస్‌ఎస్‌కు తీసుకెళ్లేందుకు స్పేస్‌ ఎక్స్, బోయింగ్‌ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. కొన్నేళ్లలో అంతరిక్ష యాత్రలు చేపడతామని, వెళ్లి రావడానికి అయ్యే ఖర్చును నిర్ధారించాల్సి ఉందని నాసా ఇప్పటికే పేర్కొంది. ఐఎస్‌ఎస్‌లో గడిపితే ఒక్కో టూరిస్టు రోజుకు 35 వేల డాలర్లు (రూ.11 లక్షలు) చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement