Richard Branson
-
మంచులా కరిగిన ఆస్తులు.. దివాళా తీసిన అత్యంత ధనవంతుడు!
వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు సర్ రిచర్డ్ బ్రాన్సన్ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయారు. తాను దివాళా తీసినట్లు.. ప్రస్తుత ఆర్ధిక సమస్యల నుంచి బయటపడేందుకు నిధులు కావాలని కోరుతూ యునైటెడ్ స్టేట్స్ దివాలా (bankruptcy court) కోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది జనవరిలో రిచర్డ్ బ్రాన్సన్కు చెందిన శాటిలైట్ లాంచ్ సంస్థ ‘వర్జిన్ ఆర్బిట్’ యూకే కేంద్రంగా ఆర్బిట్ (కక్ష్య)లోకి శాటిలైట్లను పంపేందుకు మాడిఫైడ్ 747 జెట్‌ను ఉపయోగించింది. బాహుబలి జెట్‌లో ‘స్టార్ట్ అప్ మీ’ పేరుతో లూనార్ వన్స్ అనే రాకెట్‌ను యూకేలోని కార్న్‌వాల్ ఎయిర్పోర్ట్ న్యూక్వే విమానాశ్రయం నుంచి ప్రయోగించారు. అతిపెద్ద పొడవైన సముద్ర ఆకాశ మార్గం నుంచి జెట్ లూనార్ వన్స్ రాకెట్‌ను విడుదల చేయగా.. అది కక్ష్యలోకి వెళితే ప్రయోగం విజయవంతం అవుతుంది. అలా లూనార్ వన్స్ ప్రయోగం ప్రారంభమైంది. కొద్ది సేపటికి లూనార్ వన్స్ రాకెట్ విజయవంతంగా కక్ష్యకు చేరుకుందంటూ వర్జిన్ ఆర్బిట్ ట్వీట్ చేసింది. అయితే అనూహ్యంగా అరగంట తర్వాత ప్రయోగం విఫలమైంది. ప్రయోగం రెండో దశలో ఉండగా రాకెట్ ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో తొమ్మిది ఉపగ్రహాలు కక్ష్యను చేరుకోలేవని కంపెనీ ప్రకటించింది. 747 జెట్, దాని సిబ్బంది సురక్షితంగా తిరిగి వచ్చి నైరుతి ఇంగ్లాండ్‌లోని స్పేస్‌పోర్ట్ కార్న్‌వాల్‌లో దిగారు. ఈ ప్రయోగం విఫలం కావడంతో రిచర్డ్ బ్రాన్సన్ ఆస్తులు మంచులా కరిగిపోయాయి. గత వారం దాదాపు 85 శాతం మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత ఆస్తులను విక్రయించాలని కోరుతున్నట్లు యుఎస్ దివాలా కోర్టులో కంపెనీ చేసిన దాఖలలో పేర్కొన్నట్లు రాయిటర్స్ నివేదించింది. వర్జిన్ ఆర్బిట్ సీఈఓ డాన్ హార్ట్ మాట్లాడుతూ ఆస్తుల విక్రయాన్ని ఖరారు చేయడమే ఉత్తమమైన మార్గమని అన్నారు. ప్రయోగం విఫలం కావడంతో తర్వాత నిధులను పొందడంలో కంపెనీ విఫలమైంది. వర్జిన్ ఆర్బిట్ మార్చి 15న తన కార్యకలాపాలను నిలిపి వేయాల్సి వచ్చింది. నగదును ఆదా చేసేందుకు ఉద్యోగులందరినీ తొలగించింది. రాకెట్ డిజైన్ మెరుగుదలపై దృష్టి సారించడానికి నిధుల కోసం ప్రయత్నించి విఫలమైంది. చదవండి👉 షాకింగ్ ఘటన: అందరూ చూస్తుండగానే అగ్నికి ఆహుతైన కారు! -
అదృష్టం అతిధిలా వచ్చి, స్పేస్‌లో ఎగిరేందుకు ఆఫర్ ఇచ్చి..!
అదృష్టం అతిధిలా వచ్చి, స్పేస్‌లో ఎగిరేందుకు ఆఫర్ ఇవ్వడం అంటే ఇదేనేమో. ఆంటిగ్వా - బార్బుడా దేశానికి చెందిన తల్లికూతుళ్లు ఫ్రీగా స్పేస్ ట్రావెల్ చేసేందుకు టికెట్లను సొంతం చేసుకున్నారు. త్వరలో వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ టూర్‌ను ప్రారంభించనుంది. ఈ టూర్లో పాల్గొనేందుకు ఆంటిగ్వా - బార్బుడాకి చెందిన 44 ఏళ్ల కైషా షాహాఫ్, బ్రిటన్‌లో నివసిస్తున్న ఆమె కూతురు 17 ఏళ్ల సైన్స్ విద్యార్థితో కలిసి ఉచితంగా నింగిలోకి ఎగరనున్నారు. This is the moment we told Keisha Schahaff she’s won @virgingalactic’s @omaze competition and she’s going to space… Her reaction brought tears to my eyes! https://t.co/F6iBgXC5P0 @spacehumanity pic.twitter.com/G9VXuMAhTi — Richard Branson (@richardbranson) November 24, 2021 ఫ్రంట్ లైన్ వర్కర్ల కోసం వర్జిన్ గెలాక్టిక్ - స్వీప్స్ టేక్ తో కలిసి ఫండ్ రైజింగ్ 'ఓమెజ్'లో 1.7మిలియన్ డాలర్లు ఫండ్ రైజ్ చేసింది. 8 వారాల పాటు నిర్వహించిన ఈ ఫండ్ రైజింగ్ కోసం వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అధినేత రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ ప్రత్యేకంగా లాటరీ పద్దతిని ఏర్పాటు చేశారు. మినిమం 10డాలర్లతో టోకన్తో ఫండ్ రైజ్ చేయొచ్చు. ఇలా ఈ ఫండ్ రైజింగ్ లో వచ్చిన మొత్తాన్ని ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు, ముఖ్యంగా అంతరిక్షంలోకి వెళ్లాలనుకునేవారికి, లేదంటే నాసాలో పనిచేయాలనుకునే వారికి క్యాష్ రూపంలో కాకుండా బహుమతి రూపంలో అందిస్తున్నట్లు రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ ప్రకటించారు. ఈ ప్రకటనతో 165,000 మంది ఫండ్ రైజింగ్‌లో పాల్గొన్నారు. 8 వారాల పాటు నిర్విరామంగా జరిగిన అనంతరం ఇందులో విన్నర్స్‌ను రిచర్డ్స్ బ్రాన్స్‌న్ ప్రకటించారు. అంతేకాదు గెలిచిన వారికి స్వయంగా ఇంటికి వెళ్లి బహుమతులందిస్తున్నారు. అలా స్పేస్‌లోకి వెళ్లే అవకాశాన్ని దక్కించుకున్న కైషా షాహాఫ్ ఇంటికి వెళ్లి రిచర్డ్స్ బ్రాన్స్‌న్ ఆశ్చర్యపరిచారు. దీంతో గెలుపుపై కైషా షాహాఫ్ సంతోషం వ్యక్తం చేశారు. కూతురుతో కలిసి స్పేస్‌లోకి వెళ్లే కోరిక నెరవేరుతుందని అన్నారు. చదవండి: అడిడాస్ సంచలన నిర్ణయం..! ఫేస్‌బుక్‌కు పెద్ద దెబ్బే..! -
పాఠాలు చెప్పని గురువులు.. అయినా గెలిచిన శిష్యులు
Happy Teacher's Day 2021: గురువంటే బడిత పట్టి పాఠాలు నేర్పేవాడు మాత్రమే కాదు. శిష్యుడంటే పలక పట్టి దిద్దాల్సిన అవసరమూ లేదు. గెలుపు తీరాలను తాకిన వాళ్ల నుంచి పాఠాలు నేర్చుకునే వాళ్లను శిష్యులుగానే భావించొచ్చు. అలాగే వాళ్లకు ప్రత్యక్ష పాఠాలు చెప్పకుండా ‘సక్సెస్’ స్ఫూర్తిని నింపే మార్గదర్శకులు గురువులే అవుతారు. ద్రోణుడికి ఏకలవ్య శిష్యుడిలాగా.. వెతికితే వ్యాపార, టెక్ రంగాల్లో రాటుదేలిన ఎంతో మంది మేధావులు మనకు కనిపిస్తారు. వాళ్లలో గురువుల్ని మించిన శిష్యులుగా, వాళ్ల ‘లెగసీ’కి వారసులుగా ఆయా రంగాల్లో పేరు సంపాదించుకుంటున్న కొందరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ►సుందర్ పిచాయ్(పిచాయ్ సుందరరాజన్).. 49 ఏళ్ల ఈ టెక్ మేధావి అల్ఫాబెట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌గా, గూగుల్ సీఈవోగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మెటీరియల్స్ ఇంజినీర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టిన సుందర్ పిచాయ్.. 2004లో గూగుల్‌లో అడుగుపెట్టారు. ఇంతకీ ఈయన గురువు ఎవరో తెలుసా? విలియమ్ విన్సెంట్ క్యాంప్‌బెల్ జూనియర్. అమెరికా వ్యాపార దిగ్గజంగా పేరున్న విన్సెంట్ క్యాంప్‌బెల్.. మొదట్లో ఫుట్‌బాల్ కోచ్ కూడా. ఆపై టెక్నాలజీ వైపు అడుగులేసి.. యాపిల్ లాంటి ప్రముఖ కంపెనీలకు పని చేశారు. సుందర్ పిచాయ్.. అంతకంటే ముందు గూగుల్ ఫౌండర్లు ల్యారీ పేజ్, సెర్గీ బ్రిన్, ఎరిక్ షిమిడెట్, జెఫ్ బెజోస్(అమెజాన్ బాస్), జాక్ డోర్సే, డిక్ కోస్టోలో(ట్విటర్), షెరీల్ శాండ్‌బర్గ్(ఫేస్బుక్) లాంటి ప్రముఖులెందరికో ఈయనే మెంటర్ కూడా. ఇక యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్‌కు వ్యక్తిగత గురువుగా చాలాకాలం పని చేశారు విన్సెంట్ క్యాంప్‌బెల్. ►మార్క్ జుకర్‌బర్గ్.. ఫేస్బుక్ ఫౌండర్ కమ్ సీఈవో. చిన్నవయసులోనే బిలియనీర్‌గా ఎదిగిన ఈ ఇంటర్నెట్ ఎంట్రెప్రెన్యూర్.. ఎవరి స్ఫూర్తితో ఈ రంగంలోకి అడుగుపెట్టాడో తెలుసా? టెక్ మేధావి స్టీవ్ జాబ్స్. అవును.. ఈ విషయాన్ని స్టీవ్ జాబ్స్ తన బయోగ్రఫీలోనూ రాసుకున్నాడు. ఇది చాలామందిని విస్తుపోయేలా చేసింది. అయితే స్టీవ్ జాబ్స్ చనిపోయిన చాన్నాళ్లకు ఓ అమెరికన్ టాక్ షోలో జుకర్‌బర్గ్ మాట్లాడుతూ.. ఇదే విషయాన్ని నిర్ధారించాడు. ► రిచర్డ్ బ్రాన్సన్ బ్రిటిష్ వ్యాపారవేత్త, వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు. లేకర్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు, బ్రిటన్ వ్యాపారదిగ్గజం ఫ్రెడ్డీ లేకర్‌ను తన గురువుగా ఆరాధిస్తుంటాడు. ఆయన స్ఫూర్తితోనే తాను ఇవాళ ఉన్నానంటూ చాలా ఇంటర్వ్యూలో గురుభక్తిని చాటుకుంటాడు బ్రాన్సన్. ►సత్య నాదెళ్ల.. మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవోగా ఉన్న సత్య నాదెళ్ల.. సంస్థ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను గురువుగా ఆరాధిస్తుంటాడు. తన కెరీర్ ఎదుగుదలకు గేట్స్ ఇచ్చిన ప్రోత్సాహం, ప్రోద్భలమే కారణమని చెప్తుంటారు. గొప్ప విజయాలు సాధించేందుకు గేట్స్ చెప్పే సూత్రాలు పాటిస్తే చాలాని తనలాంటి వాళ్లకు సూచిస్తుంటాడు సత్య నాదెళ్ల. ►రతన్ నవల్ టాటా(రతన్ టాటా).. ప్రముఖ వ్యాపారవేత్త. టాటా గ్రూపుల మాజీ చైర్మన్. ప్రస్తుతం టాటా చారిటబుల్ ట్రస్ట్ వ్యవహారాలు చూసుకుంటున్న ఈ పెద్దాయన(83).. ఫ్రెండ్లీబాస్ తీరుతో, సహాయక కార్యక్రమాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇంతకీ ఈయన ఎవరిని గురువుగా భావిస్తాడో తెలుసా?.. టాటా గ్రూపుల మాజీ చైర్మన్ జహంగీర్ రతన్జీ దాదాబాయ్ టాటా(జేఆర్డీ టాటా)ని. ►ఎలన్ మస్క్.. బహుతిక్కమేధావిగా పేరున్న మస్క్ తనకు గురవంటూ ఎవరూ లేరని తరచూ ప్రకటనలు ఇస్తుంటాడు. అంతేకాదు స్పేస్ఎక్స్ బిజినెస్ డెవలప్మెంట్ వ్యవహారాలను చూసుకునే జిమ్ కాంట్రెల్ ఓ ఇంటర్వ్యూలో ‘మస్క్ రాకెట్ సైన్స్ గురించి తనంతట తానే తెలుసుకున్నాడ’ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కూడా. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. కంప్యూటర్ సైంటిస్ట్-గూగుల్ ఫౌండర్ ల్యారీ పేజ్‌తో దగ్గరగా ఎలన్‌మస్క్ పని చేశాడని, ఆ ప్రభావంతోనే మస్క్ రాటుదేలాడని. ►బిల్ గేట్స్.. వ్యాపార మేధావిగా పేరున్న బిల్‌గేట్స్‌కు, అమెరికా ప్రముఖ వ్యాపారవేత్త వారెన్ బఫెట్‌కు మధ్య అపర కుబేరుడి స్థానం కోసం చాలాకాలం పోటీ నడిచిన విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ, బఫెట్‌ను అన్నింటా తాను గురువుగా భావిస్తానని బిల్‌గేట్స్ చాలా ఇంటర్వ్యూల్లో చెప్తుంటాడు. అంతేకాదు ఇద్దరూ వ్యాపార సలహాలు, ఛారిటీలకు సంబంధించిన వ్యవహారాలపై చర్చించుకుంటారు కూడా. - సాక్షి, వెబ్‌డెస్క్ స్పెషల్ -
నింగిలోకి దూసుకుపోవాలనుందా? అయితే మీకో ఆఫర్!
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటన్ వ్యాపారవేత్త సర్ రిచర్డ్ బ్రాన్సన్, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ బృందం రోదసీ యానాన్ని విజయవంతంగా ముగించుకొని వచ్చిన తరువాత స్పేస్ టూరిజంపై ఏర్పడిన క్రేజ్ అంతా ఇంతా కాదు. నింగిలోకి దూసుకెళ్లి అక్కడినుంచి భూమిని చూడాలన్న ఉత్సాహం, ఉత్సుకత అందరిలోనూ ఏర్పడింది. అయితే ఇది సామాన్య మానవుడికి అందని ద్రాక్షే. కోట్ల ఖరీదు చేసే ఈ అనుభవాన్ని సొంతం చేసుకోవడం ఒక్క శ్రీమంతులకే సాధ్యం. అంతరిక్షయానం చేయాలంటే 3 కోట్ల రూపాయలకు పైమాటే అంటోంది. వర్జిన్ గెలాక్టిక్. తమ స్పేస్ షిప్లో సీటు రిజర్వ్ చేసుకోవాలని పిలుపు నిస్తోంది. అంతరిక్ష యాత్ర చేయాలనుకునేవారికోసం బ్రిటన్ బిలియనీర్ స్పేస్ షిప్ కంపెనీ వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ తాజాగా ఈ ఆఫర్ ప్రకటించారు. చరిత్రాత్మక రోదసీయాత్ర విజయవంతంగా ముగించుకున్న కొన్ని వారాల తర్వాత స్పేస్ విమాన టికెట్ల విక్రయాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు.ఈ విమానంలో సీటు దక్కించుకోవాలంటే 450,000 (సుమారు రూ.3,33,82,682) డాలర్లు చెల్లించు కోవాలి. అంతేకాదు ఇందుకు మూడు ప్యాకేజీలను కూడా ప్రకటించింది. సింగిల్ సీట్, మల్టీ-సీట్ ప్యాకేజీ, ఫుల్ ఫ్లైట్ బై అవుట్ ఆఫర్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది. సో.. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కింద టికెట్లు అందబాటులో ఉంటాయి. వచ్చే ఏడాది రెవెన్యూ విమానాలను ప్రారంభించే దిశగా పురోగతి సాధిస్తున్నట్లు స్పేస్-టూరిజం కంపెనీ గురువారం తెలిపింది.వర్జిన్ గెలాక్టిక్ తదుపరి అంతరిక్ష ప్రయాణం సెప్టెంబర్ చివరలో ఉండనుందని అంచనా. తాజా ప్రకటనతో కంపెనీ షేర్లు 5 శాతం దూసుకెళ్లడం విశేషం. కాగా జూలై 11న అంతరిక్ష సంస్థ వర్జిన్ గెలాక్టిక్‌కు చెందిన మానవ సహిత వ్యోమ నౌక వీఎస్ఎస్ యూనిటీ-22లో బ్రాన్సన్ రోదసీలోకి దూసుకెళ్లాడు. ఈ యాత్రలో భాగంగా తెలుగు తేజం గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష మరో నలుగురున్నారు. ఆ తరువాత జూలై 20న అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ బృందం కూడా 'న్యూ షెపర్డ్' రాకెట్లో రోదసి యాత్ర పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాది జూన్‌లో వర్జిన్ గెలాక్టిక్ ప్రజలను అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు యుఎస్ ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ నుండి వర్జిన్ గెలాక్టిక్ ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. -
Space Tourism: వినువీధిలో విహారయాత్రలు
వినువీధిలో విహారయాత్రల సందడి మొదలవుతోంది. వర్జిన్ గెలాక్టిక్ ఇటీవల చేపట్టిన వ్యోమ విహారయాత్ర విజయవంతమైంది.మరికొన్ని సంస్థలు కూడా ఇదే బాటలో సన్నాహాలు చేసుకుంటున్నాయి.డబ్బు, ధైర్యం, దారుఢ్యం, ఆసక్తి ఉన్న పర్యాటకులను ఆకట్టుకునేందుకు టూరిజం ప్యాకేజీల రూపకల్పనపై కసరత్తులు చేసుకుంటున్నాయి.స్పేస్ టూరిజం సూపర్ లగ్జరీ పరిశ్రమగా ఎదిగే అవకాశాలపై అంతర్జాతీయ మార్కెట్ వర్గాల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో స్పేస్ టూరిజం కథా కమామిషు కాస్త తెలుసుకుందాం.. ‘వర్జిన్ గ్రూప్’ అధినేత రిచర్డ్ బ్రాన్సన్ ఆధ్వర్యంలోని బ్రిటిష్ ప్రైవేటు సంస్థ వర్జిన్ గెలాక్టిక్ ఇటీవల జరిపిన వ్యోమ విహారయాత్ర వార్తల్లో సందడి చేసింది. ఆరుగురు సభ్యులతో కూడిన వర్జిన్ గెలాక్టిక్ బృందంలో తెలుగు యువతి శిరీష బండ్ల ఉండటంతో ఈ సంఘటనకు మన జాతీయ మీడియాలో, మరీ ముఖ్యంగా మన తెలుగు మీడియాలో విపరీతమైన ప్రాచుర్యం లభించింది. ఒక పర్యాటక బృందం వినువీధిలో జరిపిన తొలి విహారయాత్ర ఇదే అయినా, అంతరిక్షానికి చేరుకున్న తొలి ప్రైవేటు సంస్థ మాత్రం వర్జిన్ గెలాక్టిక్ కాదు. అమెరికన్ సంస్థ ‘స్కేల్డ్ కాంపోజిట్స్’ తయారు చేసిన ‘స్పేస్‌వన్’ వ్యోమవిమానం పద్దెనిమిదేళ్ల కిందటే ఈ ఘనత సాధించింది. అయితే, అందులో పైలట్ తప్ప యాత్రికులెవరూ లేరు. ‘స్పేస్‌వన్’ వ్యోమవిమానంలో పైలట్ సహా ముగ్గురు ప్రయాణించేందుకు వీలు ఉన్నా, 2003 డిసెంబరు 17న పైలట్ బ్రియాన్ బిన్నీ ప్రయోగాత్మకంగా అంతరిక్షంలో చక్కర్లు కొట్టి వచ్చాడు. ఆ తర్వాత ‘స్పేస్‌వన్’ 2004 సెప్టెంబరు–అక్టోబరులో రెండు వారాల వ్యవధిలోనే రెండుసార్లు భూకక్ష్య నుంచి వందమీటర్ల ఎత్తుకు ప్రయాణించింది. ఈ రెండు యాత్రల్లో ఒకసారి మైక్ మెల్విల్, మరోసారి బ్రియాన్ బిన్నీ పైలట్లుగా ‘స్పేస్‌వన్’ విమానాన్ని అంతరిక్షం వరకు తీసుకుపోయి, అక్కడ చక్కర్లు కొట్టి విజయవంతంగా భూమ్మీదకు వచ్చారు. ఈ ఘనత సాధించినందుకు ‘స్కేల్డ్ కాంపోజిట్స్’ సంస్థ పది మిలియన్ డాలర్ల (రూ.74.45 కోట్లు) ‘ఎక్స్ ప్రైజ్’ గెలుచుకుంది. ‘స్పేస్‌వన్’ ప్రయోగాలు విజయవంతమైన తర్వాతి నుంచే స్పేస్టూరిజం దిశగా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. రిచర్డ్ బ్రాన్సన్ బాటలోనే తాజాగా ‘అమెజాన్’ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కూడా వ్యోమ విహారయాత్రకు సమాయత్తం అవుతున్నారు. బెజోస్ ఆధ్వర్యంలోని ‘బ్లూ ఆరిజిన్’ జూలై 20న చేపట్టనున్న ఈ యాత్రలో జెఫ్ బెజోస్, ఆయన సోదరుడు మార్క్, అమెరికన్ జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ శిక్షణలో ఉత్తీర్ణులైన 13 మంది మహిళల్లో ఒకరైన వ్యాలీ ఫంక్‌తో పాటు ‘బ్లూ ఆరిజిన్’ తొలి వ్యోమయాత్రలో పాల్గొనేందుకు వేలంలో 28 మిలియన్ డాలర్లకు (రూ.208 కోట్లు) టికెట్టు దక్కించుకున్న ఒక అజ్ఞాత యాత్రికుడు కూడా పాల్గొననున్నారు. అపరకుబేరుడు ఎలాన్ మాస్క్‌కు చెందిన ‘స్పేస్ఎక్స్’ కూడా స్పేస్టూరిజం దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ‘స్పేస్ఎక్స్’ ఇప్పటికే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) విజయవంతంగా వ్యోమగాములను, కార్గోను చేరవేసింది. ఊరకే అంతరిక్షంలో చక్కర్లు కొట్టి వచ్చేయడం కాకుండా, త్వరలోనే చంద్రుడి మీద విహారయాత్ర నిర్వహించేందుకు ‘స్పేస్ఎక్స్’ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ సంస్థ 2023లో జపానీస్ శతకోటీశ్వరుడు యుసాకు మేజావాను చంద్రుడి మీదకు తీసుకువెళ్లనుంది. యుసాకుతో పాటు ఈ యాత్రలో మరో ఎనిమిది మంది ఔత్సాహిక యాత్రికులు కూడా పాల్గొననున్నారు. ఇరవై ఏళ్ల కిందటే తొలి వ్యోమపర్యటన స్పేస్ టూరిజం ఆలోచనలు గడచిన శతాబ్ది చివరినాళ్లలోనే మొదలయ్యాయి. ప్రైవేటు సంస్థలు ఈ దిశగా ప్రయత్నాలకు రంగం సిద్ధం చేసుకుంటున్న సమయంలోనే సరిగా ఇరవయ్యేళ్ల కిందట– 2001 ఏప్రిల్ 28న అమెరికన్ వ్యాపారవేత్త డెన్నిస్ టిటో రష్యన్ అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన ‘సోయుజ్ టీఎం–32’ వ్యోమనౌకలో శాస్త్రవేత్తల బృందంతో కలసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) చేరుకుని, అక్కడ ఎనిమిది రోజులు గడిపి వచ్చి, ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యోమ పర్యాటకుడిగా రికార్డులకెక్కాడు. టిటో తన అంతరిక్ష ప్రయాణానికి 20 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.150 కోట్లు) చెల్లించాడు. భూమ్మీదకు తిరిగి వచ్చాక ఈ పర్యటన తన కంపెనీకి, వ్యాపారానికి ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్పాడు. టిటో తర్వాత 2002లో దక్షిణాఫ్రికాకు చెందిన పారిశ్రామికవేత్త మార్క్ షటిల్వర్త్, 2005లో అమెరికన్ వ్యాపారవేత్త గ్రెగరీ ఆల్సెన్ కూడా డబ్బులు చెల్లించి ఐఎస్ఎస్ యాత్రకు వెళ్లి వచ్చారు. వీరి తర్వాత ఇరాన్లో జన్మించిన అమెరికన్ వ్యాపారవేత్త అనోషే అన్సారీ 2006లో డబ్బు చెల్లించి ఐఎస్ఎస్ యాత్రకు వెళ్లి వచ్చి, తొలి మహిళా అంతరిక్ష పర్యాటకు రాలిగా రికార్డులకె క్కారు. తర్వాత అమెరికన్ వాణిజ్యవేత్త చార్లెస్ సిమోన్యి 2007లో ఒకసారి, 2009లో ఒకసారి ఐఎస్ఎస్ యాత్రకు వెళ్లి వచ్చాడు. అమెరికన్ వీడియో గేమ్ డెవలపర్ రిచర్డ్ గేరియట్ 2008లో ఐఎస్ఎస్ యాత్రకు వెళ్లి, అంతరిక్షయానం చేసిన రెండోతరం అమెరికన్‌గా రికార్డు సృష్టించాడు. రిచర్డ్ గేరియట్ తండ్రి ఆవెన్ గేరియట్ ‘నాసా’ తరఫున రెండుసార్లు అంతరిక్షయానం చేశాడు. రిచర్డ్ గేరియట్ తర్వాత కెనడియన్ వ్యాపారవేత్త గై లాలిబెర్టె 2009లో ఐఎస్ఎస్ యాత్రకు వెళ్లాడు. వీళ్లందరూ రష్యన్ ప్రభుత్వానికి చెందిన ‘సోయుజ్’ వ్యోమనౌకల్లోనే అంతరిక్ష పర్యటనలు చేశారు. ‘స్పేస్ అడ్వెంచర్స్’ కంపెనీ రష్యాతో ఒప్పందం కుదుర్చుకుని, ఈ యాత్రల్లో తన పర్యాటకులను ‘సోయుజ్’ ద్వారా అంతరిక్షానికి తీసుకువెళ్లింది. ‘స్పేస్‌వన్’ ప్రయోగం విజయవంతమైన దరిమిలా ప్రైవేటు సంస్థలు ఈ రంగంలో దూసుకుపోవడానికి ముమ్మరంగా సన్నాహాలు మొదలుపెట్టాయి. 2021–2022 స్పేస్‌టూర్లు ఈ ఏడాది ద్వితీయార్ధంలో, వచ్చే ఏడాది ప్రారంభంలో పర్యాటకులతో మరో నాలుగు స్పేస్‌టూర్లు నిర్వహించేందుకు అంతరిక్ష సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఈ నాలుగు టూర్లు, వాటిలో పాల్గొనే వారి వివరాలు... ► ‘నాసా’ ఆధ్వర్యంలో చేపట్టిన ‘కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్’ (సీసీపీ) కింద ‘స్పేస్ఎక్స్’ రూపొందించిన ‘క్రూ డ్రాగన్ రీసైలెన్స్’ ఈ ఏడాది సెప్టెంబరు 15న నలుగురు పర్యాటకులతో మూడురోజుల అంతరిక్ష యాత్ర చేపట్టనుంది. ఇది అంతరిక్షం చేరుకుని, భూమి చుట్టూ చక్కర్లు కొట్టి తిరిగి వస్తుంది. ఈ వ్యోమయాత్రలో అమెరికన్ వ్యాపారవేత్త జేర్డ్ ఇసాక్‌మెన్, కాలేజీ ప్రొఫెసర్ సియాన్ ప్రోక్టర్, పిల్లల ఆస్పత్రికి చెందిన పారామెడికల్ ఉద్యోగి హేలీ ఆర్సెనాక్స్, అమెరికన్ ఎయిర్‌ఫోర్స్ మాజీ ఉద్యోగి క్రిస్టఫర్ సెంబ్రోస్కి పాల్గొననున్నారు. ► రష్యన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘రాస్‌కాస్మోస్’ ఈ ఏడాది ప్రైవేటు పర్యాటకులకు అవకాశం కల్పిస్తూ, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) రెండు యాత్రలు చేపట్టనుంది. ఈ ఏడాది అక్టోబర్ 5, 16 తేదీలలో ‘సోయుజ్ ఎంఎస్–18, ఎంఎస్–19’ వ్యోమనౌకల ద్వారా చేపట్టనున్న 12 రోజుల యాత్రలో రష్యన్ సినీ దర్శకుడు క్లిమ్ షిపెంకో, రష్యన్ నటి యూలియా పెరెసిల్ద్ పాల్గొననున్నారు. ► ‘రాస్‌కాస్మోస్’ ఈ ఏడాది డిసెంబర్ 8, 19 తేదీలలో ఐఎస్ఎస్కు సోయుజ్–20 వ్యోమనౌక ద్వారా చేపట్టనున్న 12 రోజుల యాత్రలో జపానీస్ వ్యాపారవేత్త యుసాకు మేజావా, ఆయన సహాయకుడు యోజో హిరానో పాల్గొననున్నారు. ► ‘నాసా’ ఆధ్వర్యంలో ‘స్పేస్ఎక్స్’కు చెందిన ‘క్రూ డ్రాగన్ రీసైలెన్స్’ వచ్చే ఏడాది జనవరిలో ఐఎస్ఎస్కు పదిరోజుల యాత్ర నిర్వహించనుంది. ఇందులో ఇజ్రాయెల్‌కు చెందిన మాజీ పైలట్, వ్యాపారవేత్త ఐటాన్ స్టిబ్బె, అమెరికన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ల్యారీ కానర్, కెనడియన్ వ్యాపారవేత్త మార్క్ ప్యాథీ పాల్గొననున్నారు. ఈ యాత్రలో పాల్గొనే ఒక్కొక్కరి వద్ద 55 మిలియన్ డాలర్లు (రూ.410 కోట్లు) వసూలు చేస్తున్నట్లు ‘స్పేస్ఎక్స్’ ప్రకటించింది. ‘రాస్‌కాస్మోస్’ మాత్రం తన ధరలను అధికారికంగా ప్రకటించకపోయినా, ఇందుకోసం 30 మిలియన్ డాలర్లు (రూ.224 కోట్లు) వసూలు చేస్తున్నట్లు అనధికారిక వార్తలు వెలువడ్డాయి. అమిత సంపన్నుల ఆటవిడుపు ప్రస్తుతానికైతే ‘స్పేస్ టూరిజం’ అమిత సంపన్నుల ఆటవిడుపుగా మాత్రమే కనిపిస్తోంది. దండిగా డబ్బు, అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేని పరిస్థితుల్లో గడపగలిగే శారీరక దారుఢ్యం, అక్కడి వరకు వెళ్ల గలిగే గుండెధైర్యం ఉంటే చాలు, ఎవ్వరైనా వెళ్లవచ్చు. ప్రపంచంలోని ధనిక, పేద దేశాల మధ్య అంతరాలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో స్పేస్ టూరిజం పేరిట కొద్ది గంటలు లేదా కొద్ది రోజుల ఆనందం కోసం అమిత సంపన్నులు భారీ మొత్తంలో డబ్బు వృథాగా ఖర్చు చేయడంపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. శాస్త్ర పరిశోధనల కోసం, శాస్త్ర సాంకేతిక పురోగతి కోసం వివిధ దేశాలకు చెందిన ప్రభుత్వ అంతరిక్ష పరిశోధన సంస్థలు జరిపే వ్యోమయాత్రలను అర్థం చేసుకోవచ్చు గాని, కేవలం పర్యటన కోసం అంతరిక్ష యాత్రల పేరిట డబ్బు ఖర్చు చేయడాన్ని సమర్థించలేమని పలువురు అంతర్జాతీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ‘అంతరాలు గల ప్రపంచంలో మనం ఉంటున్న నేపథ్యంలో నాకున్న సామాజిక అభిప్రాయాల ప్రకారం కేవలం కొద్దిమంది సంపన్నులకే పరిమితమయ్యే వ్యోమయాత్రలను సమర్థించలేను’ అని యూరోపియన్ కమిషన్ ఉపాధ్యక్షుడు గంటెర్ వెర్హ్యూజెన్ అభిప్రాయపడ్డారు. స్పేస్ టూరిజంపై విమర్శలు ఎలా ఉన్నా, ఇది శరవేగంగా ఎదుగుతున్న పరిశ్రమ అని, 2030 నాటికి 3 బిలియన్ డాలర్ల (రూ.22,360 కోట్లు) వార్షిక టర్నోవర్ సాధించగలదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రచారానికి పుట్టుకొచ్చిన సంస్థలు స్పేస్ టూరిజం మరింతగా పుంజుకునేలా ప్రచారం కల్పించేందుకు పలు సంస్థలు పుట్టుకొచ్చాయి. ‘స్పేస్ టూరిజం సొసైటీ’, ‘స్పేస్ ఫ్యూచర్’, ‘హాబీ స్పేస్’ వంటి సంస్థలు స్పేస్ టూరిస్టులుగా అంతరిక్షంలోకి వెళ్లాలనుకునే వారి కోసం వివిధ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాయి. స్పేస్ టూరిజం కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు సవివరమైన సమాచారాన్ని అందించేందుకు ‘యూని గెలాక్టిక్ స్పేస్ ట్రావెల్ మ్యాగజైన్’ అనే ద్వైమాసపత్రిక కూడా ప్రారంభమైంది. ‘జంక్’ జటిలం! అంతరిక్ష విహారయాత్రలపై సామాజిక విమర్శలను పక్కనపెడితే, వీటిపై శాస్త్రవేత్తల బృందాల్లో మరో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే శాస్త్ర పరిశోధనల కోసం జరిపిన అంతరిక్ష యాత్రల కారణంగా పునర్వినియోగానికి పనికిరాని పరికరాల శకలాలు, అంతరిక్ష ప్రమాదాల కారణంగా ముక్క ముక్కలైన ఉపగ్రహాల శకలాలు, కాలం చెల్లిన ఉపగ్రహాలు, ఇతర వ్యర్థాలు అంతరిక్షంలో భారీగా పేరుకుపోయాయి. అంతరిక్ష ప్రయోగాలు పెరుగుతున్న కొద్దీ ఈ వ్యర్థాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వ్యర్థాలనే ‘స్పేస్ జంక్’ అంటున్నారు. వీటిని అక్కడి నుంచి తొలగించడం లేదా, అక్కడికక్కడే నాశనం చేసేయడం వంటి చర్యలు చేపట్టేందుకు తగిన పరిజ్ఞానం, పద్ధతులు ఇంతవరకు అభివృద్ధి చెందలేదు. ఇలాంటి పరిస్థితుల్లో శాస్త్ర సాంకేతిక ప్రయోజమేదీ లేకుండా, కేవలం సంపన్నుల వినోదం కోసం, విలాసం కోసం అంతరిక్ష యాత్రలు చేపడితే ‘స్పేస్ జంక్’ సమస్య మరింత జటిలం కాగలదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘స్పేస్ జంక్’లో దాదాపు 0.4–4 అంగుళాల పరిమాణంలో ఉన్న 5 లక్షలకు పైగా శకలాలు భూమికి దాదాపు రెండువేల కిలోమీటర్ల దూరంలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ శకలాలు గంటకు దాదాపు 36 వేల కిలోమీటర్ల వేగంతో చక్కర్లు కొడుతుంటాయి. ఇంత శరవేగంగా చక్కర్లు కొట్టే ఈ శకలాలు పొరపాటున భూమిపై నుంచి కొత్తగా ప్రయోగించే ఉపగ్రహాలకు గాని, రాకెట్లకు గాని తాకితే పెనుప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంతరిక్షంలో పేరుకున్న ‘స్పేస్ జంక్’ను అక్కడికక్కడే నాశనం చేసేందుకు జపానీస్ జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘జాక్సా’ ఒక ‘ఎలక్ట్రానిక్ స్పేస్ విప్’ (అంతరిక్ష కొరడా) రూపొందించి, దీని పనితీరుపై పరీక్షలు జరుపుతోంది. ‘స్పేస్ జంక్’ సమస్యకు సరైన పరిష్కారం ఇంకా లభించక ముందే స్పేస్ టూరిజం కోసం వాణిజ్య సంస్థలు పోటీ పడటం సరికాదని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. టూరిస్టులకు ‘నాసా’ అవకాశం స్పేస్ టూరిజం దిశగా ప్రైవేటు సంస్థలు దూకుడు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో అమెరికా జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ కూడా తన అంతరిక్ష యాత్రలలో పర్యాటకులకు అవకాశం కల్పించడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ‘నాసా’ ప్రైవేటు పర్యాటకులకు అవకాశం కల్పించనున్న తన ‘కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్’ (సీసీపీ) కింద ప్రత్యేకంగా రూపొందించిన ‘బోయింగ్ స్టార్‌లైనర్’ క్యాప్సూల్ ద్వారా యాత్రలు నిర్వహించనుంది. ‘బోయింగ్ స్టార్‌లైనర్’ జరిపే ఒక్కో అంతరిక్ష యాత్రలో ఒక్కో ప్రైవేటు పర్యాటకునికి మాత్రమే అవకాశం ఉంటుంది. దీనికి టికెట్ ధరను ఇంకా నిర్ణయించలేదు. ‘సోయుజ్’ ద్వారా అంతరిక్ష యాత్రలకు రష్యన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘రాస్‌కాస్మోస్’ వసూలు చేసే తాజా ధరను పరిగణనలోకి తీసుకుని, తమ ధరను నిర్ణయించనున్నట్లు ‘బోయింగ్’ ప్రతినిధి ఒకరు మీడియాకు చెప్పారు. చంద్రమండలానికి టికెట్ రూ.1,119 కోట్లు ‘స్పేస్ఎక్స్’ కంటే చాలా ముందుగానే అమెరికన్ స్పేస్ టూరిజం కంపెనీ ‘స్పేస్ అడ్వెంచర్స్’ 2005లో చంద్రమండలానికి యాత్రా ప్యాకేజీని ప్రకటించింది. దీనికి టికెట్ ధరను కళ్లు చెదిరే రీతిలో100 మిలియన్ డాలర్లుగా (రూ.745 కోట్లు) నిర్ణయించింది. ‘డీప్ స్పేస్ ఎక్స్‌పెడిషన్– ఆల్ఫా’ (డీఎస్ఈ–ఆల్ఫా) పేరిట ‘సోయుజ్’ వ్యోమనౌక ద్వారా చేపట్టనున్న ఈ యాత్రలో ఏకకాలంలో ఇద్దరు పర్యాటకులకు అవకాశం ఉంటుందని తెలిపింది. అమ్మకానికి పెట్టిన రెండు టికెట్లలో ఒక టికెట్ 150 మిలియన్ డాలర్లకు (రూ.1119 కోట్లు) అమ్ముడుపోయినట్లు 2011లో ‘స్పేస్ అడ్వెంచర్స్’ వ్యవస్థాపకుడు ఎరిక్ ఆండర్సన్ ప్రకటించారు. ఐఎస్ఎస్ మీదుగా చంద్రమండలానికి సాగే ఈ యాత్ర 9–21 రోజులు సాగుతుందని వెల్లడించారు. తొలుత ఈ యాత్రను 2015లో నిర్వహించనున్నట్లు ప్రకటించినా, తర్వాత దీనిని 2018 నాటికి వాయిదా వేస్తున్నట్లు ‘స్పేస్ అడ్వెంచర్స్’ ప్రకటించింది. అయితే, ఇప్పటి వరకు ఈ యాత్రను నిర్వహించలేదు. ఎప్పుడు నిర్వహించేదీ కూడా ఇంతవరకు స్పష్టతనివ్వలేదు. తాజా పరిస్థితులను గమనిస్తే, ‘స్పేస్ అడ్వెంచర్స్’ తన కార్యక్రమాన్ని నిరవధికంగా వాయిదా వేసుకున్నట్లే భావించవచ్చు. అంతరిక్ష యాత్రలపై టూరిస్టుల అభిరుచులు పర్యాటకుల కోసం అంతరిక్ష విహారయాత్రలు నిర్వహించడానికి సిద్ధపడు తున్న సంస్థలు తమ వినియోగదారుల అభిరుచులపై ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నాయి. టూరిస్టుల అభిరుచులకు అనుగుణంగా తమ భవిష్యత్ ప్రణాళికలకు రూపకల్పన చేసుకుంటున్నాయి. ఒక ఆన్లైన్ సర్వే ప్రకారం స్పేస్ టూరిస్టుల అభిరుచులు ఇలా ఉన్నాయి: ► అంతరిక్షంలో రెండువారాలు లేదా అంతకంటే తక్కువ కాలం గడపాలనుకుంటున్న వారు– 70 % మంది ► వ్యోమనౌకలో చక్కర్లు కొట్టడంతో సరిపెట్టుకోకుండా, స్పేస్‌వాక్ చేయాలనుకుంటున్న వారు– 88% మంది ► స్పేస్‌వాక్ కోసం అవసరమైతే అదనంగా 50 % వరకు చెల్లించాలనుకుంటున్న వారు– 14% మంది ► అంతరిక్ష యాత్రలో భాగంగా స్పేస్ స్టేషన్ లేదా హోటల్లో గడపాలనుకుంటున్న వారు– 21% మంది. సొంత వాహనాలతో సిద్ధమవుతున్న ప్రైవేటు సంస్థలు ‘స్పేస్ అడ్వెంచర్స్’ గత ఇరవయ్యేళ్లుగా పర్యాటకుల కోసం అంతరిక్ష యాత్రలు నిర్వహించినా, ఆ సంస్థ ఇప్పటి వరకు సొంత వాహనాన్ని రూపొందించుకోలేకపోయింది. వర్జిన్ గెలాక్టిక్, స్పేస్ఎక్స్, బ్లూ ఆరిజిన్ వంటి సంస్థలు తమ తమ సొంత వాహనాలతో పర్యాటకుల కోసం అంతరిక్ష యాత్రలు నిర్వహించేందుకు పోటాపోటీగా ముందుకొస్తున్నాయి. ► ‘వర్జిన్ గెలాక్టిక్’ టికెట్ ధర 2.50 లక్షల డాలర్లు (రూ.1.86 కోట్లు). ఇప్పటికే 58 దేశాలకు చెందిన ఆరువందల మంది ఈ టికెట్లు కొనుక్కుని, అంతరిక్షంలో చక్కర్లు కొట్టేందుకు తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ టికెట్లు కొనుక్కున్న వారిలో పోటీ సంస్థ ‘స్పేస్ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్ కూడా ఉండటం విశేషం. ► ‘బ్లూ ఆరిజిన్’ తన తొలి అంతరిక్ష యాత్ర కోసం వేలంలో టికెట్‌ను అమ్మినా, రెగ్యులర్ టూర్ల కోసం ఇంకా టికెట్ ధరను ప్రకటించలేదు. అయితే, ఈ ధర 2 లక్షల డాలర్ల (1.49 కోట్లు) వరకు ఉండవచ్చని ‘బ్లూ ఆరిజిన్’ ఉద్యోగి ఒకరు ‘రాయ్‌టర్స్’ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ► ‘వర్జిన్ గెలాక్టిక్’, ‘బ్లూ ఆరిజిన్’ సంస్థలు నిర్వహించే టూర్ ప్యాకేజీలు పర్యాటకులను అంతరిక్షంలో చక్కర్లు కొట్టించి, తిరిగి భూమ్మీదకు తేవడానికి మాత్రమే పరిమితమైతే, ‘స్పేస్ఎక్స్’ ఏకంగా ఐఎస్ఎస్లో ఎనిమిది రోజులు గడపడానికి వీలుగా పర్యాటకుల కోసం ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో ఒకేసారి నలుగురు పర్యాటకులు పాల్గొనేందుకు వీలుంటుంది. నలుగురికి కలిపి 55 మిలియన్ డాలర్లు (రూ.410) టికెట్ ధరగా నిర్ణయించింది. ‘స్పేస్ఎక్స్’ ఈ యాత్ర కోసం ప్రత్యేకంగా ‘డ్రాగన్2’ వ్యోమనౌకను రూపొందించుకుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఇది ఐఎస్ఎస్ యాత్రకు వెళ్లనుంది. ఐఎస్ఎస్లో గడపడానికి సిద్ధపడిన పర్యాటకులకు తగిన శిక్షణ, ఐఎస్ఎస్లో వారు గడపడానికి అవసరమైన స్లీప్సూట్స్ వంటి సామగ్రి సరఫరా, ఆహార పానీయాలు, లైఫ్ సపోర్ట్, వైద్యసేవలు వంటివన్నీ కల్పిస్తుండటం వల్లనే స్పేస్ఎక్స్ తన టికెట్ ధరను భారీగానే నిర్ణయించింది. అంతరిక్షంలో ‘అరోరా’ హోటల్! అమెరికాకు చెందిన ప్రైవేటు ఏరోస్పేస్ కంపెనీ ఆరియాన్ స్పాన్ ‘అరోరా స్పేస్ స్టేషన్’ పేరిట భూమి చుట్టూ పరిభ్రమించేలా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు 2018లో ప్రకటించింది. దీనిని సూపర్ లగ్జరీ హోటల్‌గా తీర్చిదిద్ది, అంతరిక్ష పర్యాటకులకు అత్యంత విలాసవంతమైన వినూత్నమైన అనుభూతిని అందించనున్నట్లు తెలిపింది. హూస్టన్‌లో దీని నిర్మాణం చేపట్టనున్నట్లు ‘ఆరియాన్ స్పాన్’ వ్యవస్థాపకుడు ఫ్రాంక్ బంగర్ ప్రకటించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఇందులోకి పాసింజర్లను రిసీవ్ చేసుకోవడం ప్రారంభిస్తామని తెలిపారు. ఇందులో సిబ్బంది కాకుండా, మరో ఆరుగురు యాత్రికులు బస చేసేందుకు వీలుంటుంది. ఈ హోటల్లో గడపదలచిన వారు తప్పనిసరిగా మూడు నెలల శిక్షణ తీసుకోవలసి ఉంటుంది. ఇందులో పన్నెండు రోజుల బస కోసం ప్రకటించిన టూర్ ప్యాకేజీ ధరను ‘ఆరియాన్ స్పాన్’ 9.5 మిలియన్ డాలర్లుగా (రూ.70.18 కోట్లు) నిర్ణయించింది. ‘అరోరా’ స్పేస్‌స్టేషన్ హోటల్లో ఫైవ్‌స్టార్ హోటళ్లలో ఉండే సౌకర్యాలన్నీ ఉంటాయి. ఇందులో బసచేసే యాత్రికులు యథేచ్ఛగా ఇందులో సంచరించవచ్చు. దీనిలోని కిటికీల గుండా అంతరిక్షంలోని వింతలను, అక్కడి నుంచి భూగోళాన్ని తిలకించవచ్చు. దీనిలోని హోలోగ్రామ్ డెక్‌పై ఆటలాడవచ్చు. అయితే, ఇది అనుకున్న సమయానికి ప్రారంభమవుతుందా లేదా అనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని నిర్మాణం ఇంతవరకు ప్రారంభం కాలేదని కథనాలు వెలువడ్డాయి. నిర్మాణ పనులను నిలిపివేసి, ఇప్పటి వరకు సేకరించిన డిపాజిట్లను తిరిగి చెల్లించేశామని ఆరియాన్ స్పాన్ సంస్థ వెబ్సైట్ ఈ ఏడాది మార్చిలో ప్రకటించింది. అయితే, ఈ సంస్థ ప్రతినిధులు మాత్రం, వచ్చే ఏడాది పాసింజర్లను రిసీవ్ చేసుకుంటామని చెబుతున్నారు. -
నువ్వు గ్రేట్ మమ్మీ: బ్రాన్సన్ భావోద్వేగ లేఖ
రిచర్డ్ బ్రాన్సన్ ఆదివారం అంతరిక్షంలోకి వెళ్లి రావడానికి ముందు తల్లికి ఒక ఉత్తరం రాశారు. ఈ ఏడాది జనవరిలోనే ఆమె తన 96 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ‘నువ్వు గ్రేట్ మమ్మీ. నీ చిన్నతనంలో అబ్బాయిలా డ్రెస్ చేసుకుని గ్లైడర్ లెసన్స్ నేర్చుకున్నావు. రెండో ప్రపంచ యుద్ధ చరిత్రలో గ్రేట్ బ్రిటన్‌తో పాటు యోధురాలిగా నీ పేరూ ఉంది. ఆంట్రప్రెన్యూర్ అనే మాట పుట్టక ముందే నువ్వు ఆంట్రప్రెన్యూర్ అయ్యావు.. ‘ అంటూ ఒక ఉద్వేగభరితమైన, స్ఫూర్తిదాయక లేఖను బ్రాన్సన్ రాశారు. ‘ధైర్యవంతులే ఏదైనా సాధిస్తారు.. జాగ్రత్తపరులు కాదు అని కూడా అందులో ఆయన తన తల్లిని కొనియాడారు. గొప్ప ప్రారంభం ఏదైనా భయభక్తులతో, భక్తిశ్రద్ధలతో కూడి ఉంటుంది. ‘భగవంతుడా నీదే భారం’ అని ముకుళిత హస్తాలు ఆశీస్సులను వేడుకుంటాయి. శాస్త్రవేత్తలైనా అంతే! దైవాన్ని కాకుంటే, వాళ్లకు స్ఫూర్తిని ఇచ్చిన మనిషినైనా గుర్తుచేసుకుని కార్యోన్ముఖులౌతారు. యూఎస్‌లో ఉంటున్న బ్రిటన్ కోటీశ్వరుడు రిచర్డ్ బ్రాన్సన్ జూలై 11న ఆదివారం అంతరిక్షంలోకి వెళ్లే ముందు తన తల్లిని స్మరించుకున్నారు. ఆమెకొక లేఖను రాశారు. ఈవ్ బ్రాన్సన్ ఆమె పేరు. ఈ ఏడాది జనవరిలో కన్నుమూశారు. రిచర్డ్, మన తెలుగమ్మాయి శిరీషతో పాటు మరో నలుగురు వ్యోమగాములను రోదసీలోకి మోసుకెళ్లిన ‘వి.ఎం.ఎస్. ఈవ్’ వ్యోమనౌకలోని ‘ఈవ్’ అనే మాట రిచర్డ్ తన తల్లిపేరు లోంచి తీసుకున్నదే. వి.ఎం.ఎస్. అంటే ‘వర్జిన్ మదర్ షిప్’. పదిహేడేళ్ల క్రితం యూఎస్‌లో రిచర్డ్ స్థాపించిన బ్రిటిష్–అమెరికన్ స్పేస్ ఫ్లయిట్ కంపెనీ వర్జిన్ గెలాక్టిక్ విజయవంతంగా రోదసీలోకి పంపిన ఈ తొలి మానవ సహిత వ్యోమ నౌక ఆ ఆరుగురు అంతరిక్ష ప్రయాణికులను అదే రోజు క్షేమంగా భూమి మీదకు తీసుకొచ్చింది. కిందికి దిగీ దిగగానే రిచర్డ్ పట్టలేని ఆనందంతో తన సహ వ్యోమగామి శిరీషను భుజాల మీదకు ఎక్కించుకున్నారు. భూమి నుంచి 88 కి.మీ. ఎత్తులో ఆయన్ని ఆ భార రహిత స్థితిలో కనీసం నాలుగు నిముషాలు ఊయలలాడించిన ఒడి మాత్రం అతడి తల్లి ఈవ్ బ్రాన్సన్ ఇచ్చి వెళ్లిన ఉత్తేజమే . ‘అమ్మా.. దీవించు’ అని స్పేస్‌లోకి ఎగరడానికి ముందు రిచర్డ్ రాసిన లేఖను అతడి మాతృమూర్తి ఆత్మ చదివే ఉంటుందని ఆయన భావించి ఉంటారనేందుకు ఒక సంకేతంగా కూడా శిరీషను ఆయన ఎత్తుకోవడాన్ని చూడవచ్చు. ∙∙ తల్లికి రాసిన ఉత్తరంలో ‘అమ్మా నువ్వెప్పటికీ ఒక సాహసివి’ అని ఆమెను గుర్తు చేసుకున్నారు రిచర్డ్. తను చేయబోతున్న సాహసానికి ఆశీర్వచనాలను కోరారు. ఈవ్‌కు 26 ఏళ్ల వయసులో రిచర్డ్ జన్మించాడు. ముగ్గురు సంతానంలో తనే పెద్దవాడు. తర్వాత ఇద్దరు ఆడపిల్లలు. ఈవ్ తన పదిహేనవ యేటే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ‘ఉమెన్స్ రాయల్ నేవల్ సర్వీస్’లో పని చేశారు. అమ్మాయిల సైనిక బృందానికి నాయకత్వం వహించారు! ఇంకా చిన్న వయసులో అబ్బాయిల డ్రెస్ వేసుకుని గ్లైడింగ్ శిక్షణ తీసుకున్నారు. ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే బ్యాలే డాన్సర్‌గా పశ్చిమ జర్మనీలో పర్యటించారు. తిరిగొచ్చాక బ్రిటిష్ ఎయర్‌లైన్స్‌లో హోస్టెస్ అయ్యారు. ఇరవై ఐదో ఏట వివాహం చేసుకున్నారు. పెళ్లయ్యాక రియల్ ఎస్టేస్ బిజినెస్ చేపట్టారు. మిలటరీ ఆఫీసర్‌గా, ప్రొబేషన్ అధికారిగా కూడా పని చేశారు. నవలలు, పిల్లల పుస్తకాలు రాశారు. తల్లి అలసటన్నదే లేకుండా అనుక్షనం ఉత్తేజంగా ఏదో ఒక పని చేస్తుండటం రిచర్డ్ బ్రాన్సన్‌కి ఆశ్చర్యంగా ఉండేది. అతడు యువకుడు అయ్యేనాటికి బ్రిటన్‌లో పెద్ద ఆంట్రప్రెన్యూర్‌గా, గొప్ప పరోపకారిగా, బాలల సంక్షేమ సారథిగా ఆమె పేరు పొందారు. తల్లిని చూశాకే రిచర్డ్ తనొక ప్రయోగాల సాహసిగా మారాలనుకున్నాడు. ఆమె నుంచి స్ఫూర్తి పొంది అతడు సాధించిన తొలి విజయమే మొన్నటి వ్యోమయానం. ఈవ్, రిచర్డ్‌ల మధ్య అనుబంధం ప్రత్యేకమైనది. రిచర్డ్ తను ఎదుగుతున్న దశలో తల్లిని చూసి నేర్చుకున్నవే కాదు, తల్లి ఎదుగుతున్నప్పుడు ఆమె చిన్ననాటి విశేషాలు కూడా అతడిని సాహసి అయిన బిజినెస్ మాగ్నెట్గా మార్చాయి. తల్లికి రాసిన ‘ఆశీర్వచనాలను కోరే’ ఆ ఉత్తరంలో అవన్నీ గుర్తు చేసుకున్నారు రిచర్డ్. ‘ధైర్యవంతులే ఏదైనా సాధిస్తారు. జాగ్రత్తపరులు కాదు’ అని తన తల్లి ధైర్యాన్ని మహిళావనికి ఒక ఆదర్శంగా కీర్తించారు. -
బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ కీలక నిర్ణయం
లండన్: రోదసీ యాత్రతో బిలియనీర్లలో జెలస్ రేపుతున్న వర్జిన్ గెలాక్టిక్ అధిపతి బ్రిటిష్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్పేస్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లో భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టాడు. ఈ మేరకు లండన్‌కు చెందిన సెరాఫిమ్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కొనుగోలు మొత్తం వివరాలను సెరాఫిమ్ వెల్లడించలేదు. అయితే ప్రాథమికంగా 178 మిలియన్ పౌండ్ల (246.99 మిలియన్ డాలర్లు) విలువైన వాటాలను కొనుగోలు చేసినట్లు తెలిపింది. అలాగే ఇటీవల ఐవీవో పూర్తి చేసుకున్న సెరాఫిమ్ భాగస్వామ్య కంపెనీలలో ఎయిర్ బస్ ఎస్ కూడా ఒకటి. త్వరలోనే లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ట్రేడింగ్ ప్రారంభించనున్న సెరాఫిమ్ ప్రకారం ఐపీవోలో భారీ పెట్టుబడులు పెట్టింది ఎయిర్ బస్. -
బెజోస్ అంతరిక్షయాత్ర: మౌనం వీడిన గూగుల్ సీఈవో పిచాయ్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుతం గ్లోబల్ బిలియనీర్ల అంతరిక్ష యానం హవా నడుస్తోంది. ఇప్పటికే బిలియనీర్, వర్జిన్ గెలాక్టిక్ అధినేత రిచర్డ్ బ్రాన్సన్ చారిత్రక రోదసీ యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకోగా మరో బిలియనీర్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఈ నెలలోనే నింగిలోకి దూసుకెళ్లెందుకు సిద్ధపడుతున్నారు. తాజాగా టెక్ దిగ్గజం, గూగుల్, అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతరిక్షం నుంచి భూమిని చూడటం అంటే తనకు కూడా చాలా ఇష్టమని, త్వరలోనే బెజోస్ నింగిలోకి వెళ్లడం తనకు కొంచెం జెలస్‌గా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్బంగా మనుషులు సృష్టించిన అత్యంత లోతైన సాంకేతికత ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అంటూ ప్రశంసలు కురిపించారు. కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో బీబీసీ ఇంటర్వ్యూలో పిచాయ్ పలు విషయాలపై మాట్లాడారు. ముఖ్యంగా చివరి సారిగా ఎపుడు ఉద్వేగానికి లోనయ్యారని అడిగినప్పుడు కోవిడ్-19 ఉదృతి సమయంలో ప్రపంచవ్యాప్తంగా మృత దేహాలతో ఉన్న ట్రక్లు క్యూలో ఉన్న దృశ్యాన్ని, అలాగే గత నెలలో భారత దేశంలో నెలకొన్న పరిస్థితి చూసి కన్నీళ్లొచ్చాయని చెప్పుకొచ్చారు. తమిళనాడులో పుట్టి చెన్నైలో పెరిగిన గూగుల్ సీఈఓ తాను అమెరికన్ పౌరుడినే అయినప్పటికీ తనలో భారతమూలాలు చాలా లోతుగా పాతుకుపోయాయన్నారు. భారతీయత తనలో కీలక భాగమని ఆయన పేర్కొన్నారు. భద్రత కోసం ఒకేసారి 20 ఫోన్లు వాడతా వివిధ ప్రయోజనాల నిమితం ఒకేసారి 20 ఫోన్లను ఉపయోగిస్తున్నానని సుందర్ పిచాయ్ వెల్లడించారు. కొత్త టెక్నాలజీను పరీక్షించేందుకు ఫోన్‌ను నిరంతరం మారుస్తూ ఉంటానని చెప్పారు. పెద్ద టెక్ కంపెనీలను నడిపే సాంకేతిక నిపుణుల వ్యక్తిగత టెక్ అలవాట్లను తెలుసుకోవడం చాలా సాయపడుతుంద న్నారు. దీంతోపాటు తన పిల్లల కోసం కేటాయించే సమయం, స్క్రీన్ సమయం, పాస్వర్డ్ మార్పులు సహా తన టెక్ అలవాట్లను పంచుకున్నారు. అలాగే పన్ను వివాదాస్పద అంశంపై స్పందిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద పన్ను చెల్లింపు దారులలో తాము ఒకరమనీ, ముఖ్యంగా యూఎస్‌లో ఎక్కువగా చెల్లిస్తున్నామన్నారు. గత దశాబ్దంలో సగటున 20 శాతానికి పైగా పన్నులు చెల్లించామని తెలిపారు. కాగా నాసా అపోలో మూన్ ల్యాండింగ్ వార్షికోత్సవం సందర్భంగా బ్లూ ఆరిజిన్ అంతరిక్ష విమానం న్యూ షెపర్డ్ వ్యోమనౌక బెజోస్ సుమారు 100 కిలోమీటర్లు లేదా 328వేల అడుగులు ఎగురుతుందని భావిస్తున్నారు. జెఫ్ బెజోస్ అతని సోదరుడు మార్క్ బెజోస్, ఇతర వ్యోమగాములతో కలిసి అంతరిక్షంలోకి ప్రవేశించ నున్నారు. నిజానికి రోదసీయాత్ర చేసిన తొలి బిలియనీర్‌గా రికార్డు సృష్టించాలని బెజోస్ భావించారు. ఈ వ్యూహాలతో కార్యాచరణలో ఉండగానే అనూహ్యంగా బెజోస్ కంటే ముందే రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ ఫైట్‌లో నింగిలోకి వెళ్లి ఆ రికార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. -
నమ్మశక్యం కాని అనుభవం
హ్యూస్టన్: అంతరిక్షం నుంచి భూగోళాన్ని వీక్షించడం నమ్మశక్యం కాని, జీవితాన్ని మార్చే గొప్ప అనుభవమని ఇండియన్ అమెరికన్, తెలుగు బిడ్డ శిరీష బండ్ల పేర్కొన్నారు. వర్జిన్ గెలాక్టిక్ సంస్థకు చెందిన వీఎస్ఎస్ యూనిటీ–22 స్పేస్‌షిప్‌లో రిచర్డ్ బ్రాన్సన్, మరో నలుగురితో కలిసి ఆమె ఆదివారం అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. రోదసిలో తనకు ఎదురైన అనుభవాన్ని శిరీష సోమవారం ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో వెల్లడించారు. స్పేష్‌షిప్‌లో అంతరిక్షంలోకి వెళ్లడం, క్షేమంగా భూమిపైకి తిరిగి రావడం.. మొత్తం ప్రయాణం ఒక అద్భుతమన్నారు. తన అనుభవాన్ని వర్ణించడానికి ‘నమ్మశక్యం కాని’ కంటే మరో ఉత్తమమైన పదం కోసం వెతుకుతున్నానని, ప్రస్తుతానికి ఆ పదమే తన మదిలో మెదులుతోందని అన్నారు. రోదసి నుంచి మన భూమిని వీక్షించడం ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. రోదసిలోకి వెళ్లాలన్నది తన కల అని, అదిప్పుడు సాకారమయ్యిందని ఆనందం వ్యక్తం చేశారు. వ్యోమగామి కావడం చిన్నప్పటి నుంచి తన లక్ష్యమని చెప్పారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బిలియనీర్ చారిత్రక రోదసీ యానం: జెఫ్ బెజోస్ స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ చారిత్రక రోదసీ యాత్ర విజయవంతంపై మరో బిలియనీర్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ స్పందించారు. రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ ఫైట్‌లో అంతరిక్షంలోకి అడిగిడిన సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. నింగికి ఎగిసే క్షణాలకోసంఎదురు చూస్తున్నాం.. ఆ క్లబ్‌లోకి చేరడానికి తమకు ఉత్సాహంగా ఉందంటూ ఇన్‌స్టాలో ఒక పోస్ట్ పెట్టారు. మరోవైపు అంతరిక్షంలోకి అడుగుపెట్టాలన్న బెజోస్ కల త్వరలోనే నెరవేరబోతోంది. బెజోస్స్ కు చెందిన స్పేస్ కంపెనీ బ్లూ ఒరిజన్ రూపొందించిన తయారు చేసిన న్యూ షెపర్డ్ రాకెట్లో సోదరులిద్దరూ రోదసీలోకి అడుగుపెట్టనున్నారు. జెఫ్ బెజెస్, అతడి సోదరుడు మార్క్ బెజోస్ సహా వ్యోమగాములతో మరికొద్ది రోజుల్లో ( 2021, జులై 20వ తేదీ) న్యూ షెపర్డ్ రోదసీలోకి టేకాఫ్ తీసుకోనుంది. కాగా అంతరిక్ష సంస్థ వర్జిన్ గెలాక్టిక్‌కు చెందిన మానవసహిత వ్యోమనౌక వీఎస్ఎస్ యూనిటీ-22లో రోదసిలోకి పయనమవుతున్న సందర్భంగా కూడా ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఈ సంఘటన తనకు ఒక జీవిత అనుభవాన్ని మిగిల్చిందని, ఏదో మాయాజాలంలా అనిపించిందంటూ బ్రాన్సన్ సంతోషం వ్యక్తం చేశారు. అంతరిక్షం నుంచి భూమిని చూస్తున్న అనుభూతి అద్బుతంగా ఉందని బ్రాన్సన్ పేర్కొన్నారు. ఇంత అద్భుతమైన స్పేస్‌పోర్ట్‌ను సృష్టించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. తమని ఇంత దూరం తీసుకురావడానికి చేసిన కృషికి బ్రాన్సన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా చరిత్ర సృష్టించిన శిరీషను బ్రాన్సన్ తన భుజాలపై ఎత్తుకున్న ఫోటోగా వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Jeff Bezos (@jeffbezos) -
రోదసిలో తెలుగు ఖ్యాతి
హ్యూస్టన్: వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్వేస్, వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ టూరిజం కంపెనీ వ్యవస్థాపకుడు, బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ లేటు వయసులో అపూర్వమైన సాహస యాత్ర విజయవంతంగా పూర్తిచేశారు. అంతరిక్ష పర్యాటకానికి బాటలు వేస్తూ సొంత స్పేస్‌షిప్‌లో రోదసిలోకి ప్రయాణించి క్షేమంగా తిరిగి వచ్చారు. ఈ యాత్రలో 71 ఏళ్ల బ్రాస్నన్‌తోపాటు తెలుగు బిడ్డ శిరీష బండ్లతో సహా ఐదుగురు పాలుపంచుకున్నారు. వర్జిన్ గెలాక్టిక్ సంస్థకు చెందిన స్పేస్‌షిప్ ‘వీఎస్ఎస్ యూనిటీ–22’తో కూడిన ట్విన్ ఫ్యూజ్‌లేజ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆదివారం అమెరికాలోని న్యూమెక్సికో రాష్ట్రంలో ఎడారిలో ఏర్పాటు చేసిన ‘స్పేస్‌పోర్టు అమెరికా’ నుంచి ఆదివారం ఉదయం 10.40 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. వాతావరణం అనుకూలించకపోవడంతో 90 నిమిషాలు ఆలస్యంగా ఈ యాత్ర ప్రారంభమయ్యింది. బ్రాన్సన్ భార్య, కుటుంబ సభ్యులతో సహా 500 మందికిపైగా జనం ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. 8.5 కిలోమీటర్లు(13 కిలోమీటర్లు) ప్రయాణించాక ఫ్యూజ్‌లేజ్ ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి ‘వీఎస్ఎస్ యూనిటీ–22’ విడిపోయింది. వెంటనే అందులోని రాకెట్ ఇంజన్ ప్రజ్వరిల్లింది. బ్రాన్సన్తోపాటు మరో ఐదుగురు ప్రయాణిస్తున్న ఈ సబ్ ఆర్బిటాల్ టెస్టుఫ్టైట్ భూమి నుంచి 55 మైళ్లు (88 కిలోమీటర్లు) నింగిలో ప్రయాణించి, రోదసిలోకి ప్రవేశించింది. అందులోని ఆరుగురు (ఇద్దరు పైలట్లు, నలుగురు ప్రయాణికులు) కొన్ని నిమిషాలపాటు భారరహిత స్థితిని అనుభూతి చెందారు. అనంతరం స్పేస్‌షిప్ తిరుగుప్రయాణం మొదలుపెట్టింది. భూవాతావరణంలోకి ప్రవేశించి, తన చుక్కానులను గ్లైడింగ్‌లుగా మార్చుకొని భూమిపైకి అడుగుపెట్టింది. రన్‌వేపై సురక్షితంగా ల్యాండయ్యింది. మొత్తం గంటన్నరలో ఈ ప్రక్రియ పూర్తయ్యింది. బెజోస్ కంటే ముందే.. రోదసిలోకి వెళ్లడానికి ఇదొక అందమైన రోజు అంటూ ఆదివారం ఉదయం బ్రాన్సన్ ట్వీట్ చేశారు. స్పేస్ టూరిజంలో తన ప్రత్యర్థి అయిన ఎలాన్ మస్క్‌తో కలిసి దిగిన ఫొటోను పోస్టు చేశారు. వచ్చే ఏడాది నుంచి రోదసి పర్యాటక యాత్రలకు శ్రీకారం చుట్టాలని వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఔత్సాహికుల నుంచి తగిన రుసుము వసూలు చేసి, రోదసిలోకి తీసుకెళ్లి, క్షేమంగా వెనక్కి తీసుకొస్తారు. ఇందులో భాగంగా ‘వీఎస్ఎస్ యూనిటీ–22’లో యాత్ర చేపట్టారు. కేవలం గంటన్నరలో రోదసిలోకి వెళ్లి రావొచ్చని వర్జిన్ గెలాక్టిక్ సంస్థ నిరూపించింది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సైతం స్పేస్ టూరిజం దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన ఈ నెల 20న సొంత రాకెట్ షిప్లో రోదసి యాత్ర చేపట్టనున్నారు. బెజోస్ కంటే ముందే రోదసిలోకి వెళ్లాలన్న సంకల్పమే బ్రాన్సన్ను ఈ యాత్రకు పురికొల్పినట్లు సమాచారం. బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్ కంపెనీని 2004 నెలకొల్పారు. రోదసి యాత్ర కోసం ఇప్పటికే 600 మందికిపైగా ఔత్సాహికులు ఈ కంపెనీ వద్ద రిజర్వేషన్లు చేసుకోవడం గమనార్హం. ఒక్కొక్కరు 2,50,000 డాలర్ల (రూ.1.86 కోట్లు) చొప్పున చెల్లించారు. మొదట టిక్కెట్ బుక్ చేసుకున్నవారిని వచ్చే ఏడాది ప్రారంభంలో రోదసిలోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. 17 సంవత్సరాల కఠోర శ్రమ తమను ఇంతదూరం తీసుకొచ్చిందని బ్రాన్సన్ పేర్కొన్నారు. యాత్ర అనంతరం ఆయన తన బృంద సభ్యులకు అభినందనలు తెలిపారు. సొంత స్పేస్‌షిప్‌లో రోదసి యాత్ర చేసిన తొలి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. 70 ఏళ్లు దాటిన తర్వాత రోదసిలోకి వెళ్లిన రెండో వ్యక్తిగా మరో రికార్డు నెలకొల్పారు. 1998లో 77 ఏళ్లు జాన్ గ్లెన్ రోదసి యాత్ర చేశారు.. శిరీష అంతరిక్షయాత్ర రాష్ట్రానికి గర్వకారణం ఏపీ గవర్నర్, ఏపీ సీఎం ప్రశంసలు సాక్షి, అమరావతి: గుంటూరులో జన్మించిన బండ్ల శిరీష అంతరిక్షయాత్రను విజయవంతంగా పూర్తిచేసుకోవడంపై ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో శుభాకాంక్షలు తెలిపారు. ఆమె అంతరిక్షయాత్ర రాష్ట్రానికి గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. ఆమె భవిష్యత్‌లో మరింత ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. మన శిరీష రికార్డు ఏరోనాటికల్ ఇంజనీర్ శిరీష బండ్ల(34) రోదసిలో ప్రయాణించిన మూడో భారత సంతతి మహిళగా రికార్డు సృష్టించారు. ఈ యాత్రలో తాను భాగస్వామి కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆమె జూలై 6న ట్వీట్ చేశారు. రోదసి యాత్రను ప్రజలకు సైతం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న వర్జిన్ గెలాక్టిక్ కంపెనీలో పని చేస్తుండడం తనకు గర్వకారణమని పేర్కొన్నారు. శిరీష బండ్ల ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో జన్మించారు. ఆమెకు నాలుగేళ్లు ఉన్నప్పుడు తల్లిదండ్రులు అమెరికా వెళ్లి, స్థిరపడ్డారు. శిరీష హ్యూస్టన్‌లో పెరిగారు. భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ గతంలో అంతరిక్ష యాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ ఇప్పటిదాకా అంతరిక్షంలోకి వెళ్లిన ఏకైక భారతీయుడిగా రికార్డుకెక్కారు. -
ఖర్చు ఎక్కువైనా సరే అనుకునేవారు ఓసారి ట్రై చేయొచ్చు
అంతరిక్షంలో సరికొత్త రేస్ మొదలైంది. గగన వీధుల్లో సరదాగా చక్కర్లు కొట్టే రోజు వచ్చేస్తోంది. ఆదివారం వర్జిన్ గెలాక్టిక్ సంస్థ.. 20న బ్లూఆరిజిన్ కంపెనీ తమ స్పేస్ ఫ్లైట్లను పంపుతున్నాయి. స్పేస్ ఎక్స్ సంస్థ అంతరిక్ష యాత్రలకు సిద్ధమవుతోంది. ఖర్చు కాస్త ఎక్కువైనా సరే.. ఓసారి అంతరిక్ష ప్రయాణం చేయాలనుకునే వారు ఓసారి ట్రై చేయొచ్చు. ఈ స్పేస్ టూరిజం విశేషాలు తెలుసుకుందామా? –సాక్షి సెంట్రల్ డెస్క్ ఇన్నాళ్లూ స్పేస్.. ప్రయోగాలకే.. వాణిజ్యపరంగా అంతరిక్ష యాత్రలు నిర్వహించేందుకు పలు దేశాలు, కొన్ని సంస్థలు చాలా ఏళ్ల కిందే ప్రయత్నా లు మొదలుపెట్టాయి. స్పేస్ టెక్నాలజీ చాలా క్లిష్టమైనది. రాకెట్లు, స్పేస్ షటిల్స్, ఇతర పరికరాలకు పెద్ద మొత్తంలో ఖర్చవుతుంది. దీంతో పెద్ద దేశాలకు చెందిన ప్రభుత్వ అంతరిక్ష సంస్థలు మాత్రమే అంతరిక్ష యాత్రలు చేపట్టగలిగాయి. అవి కూడా అన్వేషణలు, ప్రయోగాలకే పరిమితం అయ్యాయి. అయితే 2001 ఏప్రిల్ 30న రష్యా తొలిసారిగా శాస్త్రవేత్తలు కాకుండా సాధారణ వ్యక్తిని వాణిజ్యపరంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. రష్యాకు చెందిన సోయూజ్ రాకెట్ ద్వారా ‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)’కు వెళ్లిన అమెరికన్ వ్యాపారవేత్త డెన్నిస్ టిటో తొలి అంతరిక్ష యాత్రికుడిగా నిలిచాడు. ఏడు రోజులు అంతరిక్షంలో ఉన్నందుకు 2కోట్ల డాలర్లు (ఇప్పుడు మన కరెన్సీలో రూ.147 కోట్లు) చార్జిగా చెల్లించాడు. తర్వాత మరికొందరు మా త్రమే అంతరిక్ష యాత్రలకు వెళ్లగలిగారు. విపరీతమైన ఖర్చు, స్పేస్‌లోకి వెళ్లేందుకు అవకాశాలు తక్కువగా ఉండటమే దీనికి కారణం. ప్రైవేటు కంపెనీల రాకతో.. డెన్నిస్ టిటో ఘటన తర్వాత అంతరిక్ష యాత్రలకు వెళ్లాలనుకునే వారి సంఖ్య పెరిగింది. ఈ క్రమంలోనే పలు ప్రైవేటు కంపెనీలు తెరపైకి వచ్చా యి. ధనిక వ్యాపారవేత్తలు రిచర్డ్ బ్రాస్నన్ వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ, అమెజాన్ యజమాని జెఫ్ బెజోస్ బ్లూఆరిజిన్ కంపెనీని, టెస్లా ఓనర్ ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీని స్థాపించి ప్రయోగాలు మొదలుపెట్టారు. అవన్నీ ఇటీవలే ఓ కొలిక్కి వచ్చాయి. మనుషులను తీసుకుని అంతరిక్షంలోకి వెళ్లి, తిరిగి సురక్షితంగా ల్యాండ్ అయ్యే స్పేస్ షటిల్స్‌ను వారు అభివృద్ధి చేశారు. ఇద్దరూ సొంత స్పేస్ ఫ్లైట్లలో.. ఆదివారం జరిగే అంతరిక్ష యాత్ర లో వర్జిన్ గెలాక్టిక్ యజమాని రిచర్డ్ బ్రాస్నన్, కొందరు కంపెనీ ఉద్యోగులు స్పేస్‌లోకి వెళ్తున్నారు. 20న బ్లూఆరిజిన్ నిర్వహించనున్న యాత్రలో జెఫ్ బెజోస్, మరికొందరు అంతరిక్షంలో చక్కర్లు కొట్టి రానున్నారు. ఇద్దరూ కూడా తమ సొంత కంపెనీల స్పేస్ ఫ్లైట్ల గగన విహారానికి వెళ్తుండటం గమనార్హం. ఈ యాత్రలతో అంతరిక్ష పర్యాటకానికి దారులు తెరుచుకున్నట్టేనని నిపుణులు చెప్తున్నారు. స్పేస్ కంపెనీల మధ్య పోటీ పెరుగుతుండటంతో టూర్ వ్యయం కూడా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. ఏయే కంపెనీలు.. ఎప్పుడెప్పుడు? స్పేస్ ఎక్స్ ఈ సంస్థ తమ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ‘ది క్రూ డ్రాగన్’ స్పేస్ షటిల్‌ను ఇప్పటికే విజయవంతంగా నిర్వహిస్తోంది. ప్రస్తుతం నాసా శాస్త్రవేత్తలను, పరికరాలను ఐఎస్ఎస్కు తీసుకెళ్లడానికి, తిరిగి తీసుకురావడానికి వినియోగిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ‘ఇన్స్పిరేషన్4’ పేరిట తొలి వాణిజ్య యాత్ర చేపట్టనున్నారు. అందులో నలుగురు ప్యాసింజర్లు స్పేస్ టూర్‌కు వెళ్తున్నారు. అయితే దీనికి అయ్యే చార్జీలను బయటపెట్టలేదు. ఇదే సంస్థ భవిష్యత్తులో విస్తృతంగా అంతరిక్ష యాత్రలు చేపట్టేందుకు ‘స్టార్ షిప్’ స్పేస్ ఫ్లైట్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ రాకెట్ ద్వారా 2023లో చంద్రుడిపైకి యాత్ర చేపడతామని ప్రకటించింది. జపాన్‌కు చెందిన యుసకు మెజవా అనే వ్యాపారవేత్త అందులో ఇప్పటికే సీటు బుక్ చేసుకున్నారు. ఆక్సిమ్ స్పేస్ స్పేస్ ఎక్స్, నాసా సంస్థలతో కలిసి ఆక్సిమ్ స్పేస్ సంస్థ అంతరిక్ష యాత్రలకు ప్లాన్ చేస్తోంది. 2022 జనవరిలో నలుగురు ఎనిమిది రోజుల స్పేస్ టూర్‌కు వెళ్లనున్నారు. దీనికి ఒక్కొక్కరు 5.5 కోట్ల డాలర్లు (సుమారు రూ.400 కోట్లు) చెల్లిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన రాకెట్, స్పేష్ షటిల్‌ను ఈ యాత్రలకు వినియోగించనున్నారు. బ్లూ ఆరిజిన్ ఈ సంస్థ తమ న్యూషెపర్డ్ పునర్వినియోగ రాకెట్ ద్వారా ఇప్పటికే పలు ప్రయోగాలు నిర్వహించింది. ఈ నెల 20న జెఫ్ బెజోస్, మరో ఐదుగురు సిబ్బంది, శాస్త్రవేత్తలు ఈ రాకెట్ ద్వారా కాసేపు అంతరిక్షంలో చక్కర్లు కొట్టి రానున్నారు. త్వరలోనే పూర్తిస్థాయి వాణిజ్య యాత్రలను ప్రారంభిస్తామని బ్లూఆరిజిన్ ప్రకటించింది. వర్జిన్ గెలాక్టిక్ వీఎస్ఎస్ యూనిటీ ప్రత్యేక విమానం ద్వారా ‘స్పేస్ షిప్ టూ’ స్పేస్ వెహికల్‌ను భూమికి 10 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి అంతరిక్షంలోకి స్పేస్ షటిల్‌ను ప్రయోగించడం ఈ సంస్థ ప్రత్యేకత. ఇప్పటికే పలుమార్లు విజయవంతంగా ప్రయోగించింది. తాజాగా ఆదివారం తొలి ఫ్లైట్ జరగనుంది. వచ్చే ఏడాది నుంచి వాణిజ్యపరంగా అంతరిక్ష యాత్రలను మొదలుపెట్టనుంది. కొద్ది నిమిషాల్లోనే ముగిసే ఈ టూర్ల కోసం ఇప్పటికే 600 మంది టికెట్లు బుక్ చేసుకున్నట్టు ప్రకటించింది. ఒక్కొక్కరికి 2.5 లక్షల డాలర్లు (రూ.18.5 కోట్లు) చార్జిగా నిర్ణయించింది. ఇదే వరుసలో మరిన్ని కంపెనీలు కూడా.. రష్యా స్పేస్ ఏజెన్సీ తమ సోయూజ్ రాకెట్ ద్వారా ఇప్పటికే అంతరిక్ష యాత్రలు నిర్వహిస్తుండగా.. బోయింగ్ కంపెనీ స్పేస్ టూరిజం కోసం స్టార్‌లైనర్ స్పేస్ ఫ్లైట్‌ను అభివృద్ధి చేస్తోంది. ది డ్రీమ్ ఆఫ్ గేట్‌వే ఫౌండేషన్ భూమి చుట్టూ తిరుగుతూ ఉండే అంతరిక్ష హోటల్ ‘వోయేజర్ స్టేషన్’ను ప్లాన్ చేస్తోంది. దానికి సంబంధించి పనులు జరుగుతున్నాయి. కొన్ని నిమిషాల నుంచి... కొన్ని రోజుల దాకా.. అంతరిక్ష యాత్రలు అంటే.. కొన్ని నిమిషాలు గడిపి తిరిగిరావడం నుంచి కొద్దిరోజులు ఐఎస్ఎస్లో ఉండటం దాకా వేర్వేరుగా ఉంటాయి. అంతరిక్షంలోకి వెళ్లి గుండ్రంగా ఉన్న భూమిని, కాస్త దగ్గరగా చంద్రుడిని, సువిశాల విశ్వాన్ని వీక్షించడానికి చేసే సాధారణ స్పేస్ ఫ్లైట్లు అరగంట నుంచి గంటలో ముగుస్తాయి. వీటికి ఒక స్థాయి ధనికులు కూడా భరించే స్థాయిలో కొన్ని లక్షల నుంచి ఒకట్రెండు కోట్ల వరకు చార్జీలు ఉంటాయి. ఐఎస్ఎస్లో కొద్దిరోజులు గడపడం, భూమి చుట్టూ పరిభ్రమించడం సుదీర్ఘ యాత్రల కిందికి వస్తాయి. వీటికి పదుల కోట్లలో ఖర్చు అవుతుంది. నాసా కూడా రంగంలోకి.. అంతరిక్ష రంగంలో పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్న అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా స్పేస్ టూరిజంపై దృష్టి పెట్టింది. భవిష్యత్తులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (ఐఎస్ఎస్ను) ప్రైవేటుకు అప్పగించి.. తాము అందులో ఓ వినియోగదారుడిగా కొనసాగాలని భావిస్తోంది. ఇప్పటికే నాసాకు చెందిన వ్యోమగాములు, పరికరాలను ఐఎస్ఎస్కు తీసుకెళ్లేందుకు స్పేస్ ఎక్స్, బోయింగ్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. కొన్నేళ్లలో అంతరిక్ష యాత్రలు చేపడతామని, వెళ్లి రావడానికి అయ్యే ఖర్చును నిర్ధారించాల్సి ఉందని నాసా ఇప్పటికే పేర్కొంది. ఐఎస్ఎస్లో గడిపితే ఒక్కో టూరిస్టు రోజుకు 35 వేల డాలర్లు (రూ.11 లక్షలు) చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. -
అంతరిక్షంలో తెలుగు ధీర
అంతరిక్షం అచ్చ తెలుగులో ‘నమస్కారం’ అనే పలకరింపు విననుంది. కోట్లాదిమంది తెలుగువారి చారిత్రక, జీవన పరంపరకు ప్రతినిధిగా ఒకరు తన వద్దకు వచ్చినందుకు అది విస్మయపు ముచ్చటపడనుంది. యుగాలుగా తల ఎత్తి తెలుగువారు దిగంతాలలో చూపు గుచ్చి ఉంటారు. ఇవాళ పై నుంచి ఒక తెలుగమ్మాయి మనకు చేయి ఊపి హాయ్ చెప్పనుంది. అవును. చరిత్రలో తొలిసారిగా తెలుగు ధీర శిరీష బండ్ల అంతరిక్ష ప్రయాణం కట్టనుంది. అంతరిక్షయానం చేయాలని అందరికీ ఉంటుంది. అయితే ఇది సామాన్యుల ఊహకు అందేది కాదు. శ్రీమంతులు అందుకోగల ఆలోచనా కాదు. అంతరిక్ష శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులకు మాత్రమే సాధ్యమయ్యే ఈ జాబితాలో ‘కమర్షియల్ స్పేస్‌క్రాఫ్ట్’ ద్వారా ఇటీవల అత్యంత సంపన్నులు చేరుతున్నారు. టెస్లా సి.ఇ.ఓ ఎలాన్ మస్క్ నుంచి అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ వరకూ అంతరిక్షం అంచులు తాకాలనువారు ఈ రేస్‌లో ఉన్నారు. అటువంటిది– ఈ అద్భుత ప్రయాణం చేసే అవకాశం మన తెలుగింటి అమ్మాయి బండ్ల శిరీషకు దక్కింది. ఇది ఒక చరిత్రాత్మక అవకాశం. తెలుగువారి చరిత్రలో తొలి అంతరిక్ష యానం చేసిన వ్యక్తిగా/మహిళగా బండ్ల శిరీష ఎప్పటికీ నిలిచిపోతుంది. వర్జిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత రిచర్డ్ బ్రాన్సన్తో కలిసి మరో తొమ్మిదిరోజుల్లో శిరీష రోదసిలో అడుగుపెట్టబోతోంది. చీరాలలో పుట్టింది గుంటూరు జిల్లా తెనాలికి చెందిన రాపర్ల వెంకట నరసయ్య, రమాదేవిల కుమార్తె అనూరాధ సంతానం శిరీష. అనురాధ భర్త డాక్టర్ బండ్ల మురళీధర్ ఒక్లహామా స్టేట్ యూనివర్సిటీలో ప్లాంట్ వైరాలజీలో పీహెచ్డీ చేసి అమెరికాలో స్థిరపడడంతో చీరాలలో పుట్టిన శిరీష నాలుగేళ్ల వయసులో తన అక్క ప్రత్యూషతో అమెరికా వెళ్లింది. శిరీష విద్యాభ్యాసం అంతా అక్కడే జరిగింది. చిన్నప్పటి నుంచి స్పేస్సైన్స్ను అమితంగా ఇష్టపడే శిరీష పర్డ్యూ యూనివర్సిటిలో ఏరోనాటికల్ అండ్ అస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్ డిగ్రీ అయ్యాక కమర్షియల్ స్పేస్‌ఫ్లైట్ ఫెడరేషన్ (సీఎస్ఎఫ్)లో ఏరోస్పేస్ ఇంజినీర్‌గా పనిచేస్తూ అధునాతన విమాన విడిభాగాలను రూపొందించేది. మరోపక్క జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసింది.‡ఈ క్రమంలోనే 2015లో రిచర్డ్ బాన్సన్ ‘స్పేస్‌ఫ్లైట్’ సంస్థ ‘వర్జిన్ గెలాక్టిక్’ లో ప్రభుత్వ వ్యవహారాల మేనేజర్‌గా చేరిన అంచెలంచెలుగా ఎదిగి పరిశోధనా విభాగంలో వైస్‌ప్రెసిడెంట్ బాధ్యతలు నిర్వహిస్తోంది. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తో్తన్న వర్జిన్ ఆర్బిట్ వ్యహారాలను చూస్తూ, మరోపక్క అమెరికన్ ఆస్ట్రోనాటికల్ అండ్ ఫ్యూచర్ స్పేస్ లీడర్స్ ఫౌండేషన్ బోర్డు డైరెక్టర్లలో సభ్యురాలిగా, పర్డ్యూ యూనివర్సిటీ యంగ్ ప్రొఫెషనల్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యురాలిగా ఉంది. ఫలితంగా ఆమెకు అంతరిక్షయానం అవకాశం దక్కింది. బ్రాన్సన్తో కలిసి వర్జిన్ గెలాక్టిక్ నిర్వహించనున్న నాలుగో స్పేస్ ట్రిప్పులో వర్జిన్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ తనతో కలిపి మొత్తం ఆరుగురు టీమ్‌తో పాల్గొననున్నాడు. మిగిలిన ఐదుగురిలో ఇద్దరు పైలట్లు, ముగ్గురు స్పేస్ స్పెషలిస్టులు ఉన్నారు. శిరీష ఈ స్పేస్ స్పెషలిస్టుల్లో ఉంది. ఈ నెల 11వ తేదీన తెల్లవారుజామున వీరి స్పేస్‌క్రాఫ్ట్ న్యూమెక్సికో నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. దీనితో అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి ప్రైవేటు ధనిక వ్యక్తిగా రిచర్డ్ బ్రాన్సన్, స్పేస్‌లో అడుగుపెట్టిన తొట్టతొలి తెలుగమ్మాయిగా శిరీషలు చరిత్ర సృష్టించనున్నారు. కల్పనా చావ్లా తర్వాత భారత్‌లో పుట్టి స్పేస్‌లో అడుగుపెట్టబోతున్న రెండో మహిళగానూ, రాకేష్ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తరువాత భారత సంతతి నుంచి అంతరిక్షంలోకి వెళ్లనున్న నాలుగో వ్యోమగామిగా శిరీష నిలవడమే గాక ఈ మిషన్‌లో వెన్నెముకగా పనిచేయనుంది. ఈ క్రూ టీమ్‌లో శిరీషతోపాటు బెత్ మోసెస్ అనే మరో మహిళ కూడా ఉన్నారు. నా మనసంతా అంతరిక్షమే ‘‘నేను చిన్నప్పటి నుంచి వ్యోమగామి అయి అంతరిక్షంలోకి వెళ్లాలని అనుకునేదాన్ని. ఎప్పుడూ అందుకు సంబంధించిన ఆలోచనలతో నా మనసు నిండిపోయి ఉండేది. హ్యూస్టన్‌లో మా ఇంటికి దగ్గర్లో జాన్సన్ స్పేస్ సెంటర్ ఉండేది. ఆ సెంటర్‌ను సందర్శించినప్పుడల్లా నా కోరిక మరింత బలపడేది. ముందు పైలట్ అవ్వాలి ఆ తర్వాత నాసాలో వ్యోమగామి అవ్వాలి అనుకుని ఆ దిశగా అడుగులు వేద్దామనుకున్నాను. కానీ స్కూల్లో ఉన్నప్పుడే నా కంటి చూపు సరిగా ఉండేది కాదు. దీంతో పైలట్టే కాదు ... ఆస్ట్రోనాట్ కూడా కాలేను అనుకున్నాను. అయితే 2004లో తొలి ప్రైవేటు వాహనం అంతరిక్షంలోకి వెళ్లిందని తెలిసి నాసా ద్వారానే కాదు వ్యోమగామి అయ్యేందుకు మరో మార్గం ఉందనిపించింది. దీంతో అప్పుడు ఏరో స్పేస్ ఇంజినీర్ అయ్యి వాణిజ్య స్పేస్ సెక్టార్లో పని చేయవచ్చని అనుకున్నాను. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదివేటప్పుడు మైక్రో గ్రావిటీ గురించి పూర్తిగా తెలుసుకున్నాను. ఆ తరువాత నేను సీఎస్‌ఎఫ్‌లో చేసిన ఉద్యోగానుభవం నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. నా చిన్ననాటి కల ఈరోజు తీరనున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ శిరీష గతంల ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. తాతయ్య మాట ‘శిరీషకు ఊహ తెలిసినప్పటి నుంచి అంతరిక్షంపై ఆసక్తి కనపరిచేది. వయసుతోపాటు, ఆకాశం, విమానాలు, రాకెట్లపై ఆసక్తి పెరుగుతూనే వచ్చింది. నాలుగేళ్ల వయసులో ఓ రోజు ఇంట్లో కరెంటు పోతే ఒంటరిగా భయపడుతోన్న అమ్మమ్మకు ధైర్యం చెప్పింది’ అని తాతయ్య నరసయ్య సాక్షితో చెప్పారు. ‘2016లో మా వివాహ స్వర్ణోత్సవానికి తల్లిదండ్రులతో కలిసి శిరీష ఇక్కడకు వచ్చింది. చదువు, ఉద్యోగంతో ఎంత బిజీగా ఉన్నా తరచూ ఫోనులో మా యోగక్షేమాలు తెలుసుకునేది. చిన్నపిల్లగానే మాకు తెలిసిన శిరీష ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్లనుందని చెబుతుంటే ఆశ్చర్యంగా, అంతకుమించిన సంతోషంగా ఉంది’ అన్నారు. – పి.విజయ, సాక్షి ఫీచర్స్ డెస్క్ ఇన్పుట్స్: బి.ఎల్. నారాయణ, సాక్షి, తెనాలి -
వర్జిన్ ఆస్ట్రేలియాను కొంటాం..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడిపరమైన ఆంక్షలతో కుదేలైన వర్జిన్ ఆస్ట్రేలియా (వీఏ) కొనుగోలుపై దేశీ విమానయాన సంస్థ ఇండిగోలో అతి పెద్ద వాటాదారు అయిన ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ కసరత్తు చేస్తోంది. వీఏ విక్రయ ప్రక్రియలో పాల్గొనేందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. ఇండిగో ఇద్దరు ప్రమోటర్లలో ఒకరైన రాహుల్ భాటియాకు చెందిన ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్‌కు కంపెనీలో అత్యధికంగా 37.8% వాటా ఉంది. మరో ప్రమోటరు రాకేశ్ గంగ్వాల్, ఆయన కుటుంబానికి 36.64% వాటాలు ఉన్నాయి. బ్రిటన్ వ్యాపారవేత్త రిచర్డ్ బ్రాన్సన్ సహ వ్యవస్థాపకుడిగా 2000లో వర్జిన్ ఆస్ట్రేలియా ఫుల్ సర్వీస్ ఎయిర్‌లైన్స్‌గా కార్యకలాపాలు ప్రారంభించింది. కొన్నాళ్లుగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఈ సంస్థ.. ఇటీవల కరోనా వైరస్‌పరమైన ఆంక్షల కారణంగా మార్చిలో అన్ని సర్వీసులు రద్దు చేయడంతో మరింత కుదేలైంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి సుమారు 887.60 మిలియన్ డాలర్ల రుణం వస్తుందని ఆశించినప్పటికీ.. అది సాధ్యపడలేదు. దీంతో ఏప్రిల్ 21న దివాలా చట్టాల కింద రక్షణ కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. సంస్థలో సుమారు 16,000 మంది ఉద్యోగులు ఉన్నారు. -
ఒబామాకు బిజినెస్ టైకూన్ సవాల్..!
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రముఖ వ్యాపారవేత్త రిచర్డ్ బ్రన్సన్ ఓ సవాల్ విసిరారు. హవాయ్ లో సేదతీరుతున్న సందర్భంగా కైట్ సర్ఫింగ్‌లో తనతో పోటీపడి గెలవాలని ఒబామాను బ్రన్సన్ కోరారు. కైట్ సర్ఫింగ్‌తో పాటు ఫాయిల్ బోర్డింగ్ లలో పోటీ పడ్డారు. రిచర్డ్ కేవలం 50 మీటర్ల వరకు వెళ్లి నీళ్లల్లో పడిపోగా, ఒబామా దాదాపు 100 మీటర్ల వరకు వెళ్లి సవాల్ లో నెగ్గారని బ్రన్సన్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఏది ఏమైతేనేం చివరికి ఈ గేమ్‌లో ఒబామానే విజయం సాధించారు. వర్జిన్ గ్రూప్ అధినేత బ్రన్సన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో ఏకంగా 54వేలకు పైగా వ్యూస్, 10వేలకు పైగా లైక్స్ సొంతం చేసుకుంది. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎక్కువగా సూట్లో అధికారులతో కనిపించే ఒబామా.. ప్రస్తుతం హాయిగా సేదతీరుతున్నారు. ఫ్యామిలీతో టూర్స్ ప్లాన్ చేస్తున్నారని ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్లు కామెంట్ చేస్తున్నారు. అధ్యక్షుడిగా ఒబామాను చాలా మిస్సవుతున్నామని మరికొందరు తెగ బాధపడిపోతున్నట్లు పేర్కొన్నారు. గత నెలలో పదవీకాలం ముగియడంతో ఒబాబా అధ్యక్ష పీఠం నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. -
సాగర తీరంలో ఒబామా షికారు
అమెరికా అధ్యక్ష పదవి బాధ్యతలు ముగిసిన వెంటనే బరాక్ ఒబామా సెలవులు ఎంజాయ్ చేస్తున్నారు. తన భార్య మిషెల్ తో కలిసి సముద్ర తీరంలో సెలవులు గడుపుతున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త రిచర్డ్ బ్రాన్సన్, మరికొంత మందిలో కలిసి ఒబామా దంపతులు సరదాగా గడుపుతున్న దృశ్యాలు, ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. నలుపు రంగు టీ-షర్ట్, షార్ట్ ధరించి భార్యతో కలిసి బీచ్ లో ఒబామా నడుస్తున్న ఫొటోలు, దృశ్యాలు చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఒబామా ఆహార్యం చూసి ఆశ్చర్యపోతున్నారు. సాధారణ దుస్తుల్లో ఒబామా చాలా బాగున్నారని, ఆయన స్టైల్ అదిరిందని కామెంట్లు పెట్టారు. ఆయన మళ్లీ రాజకీయాల్లోకి రారని కొంత మంది పేర్కొన్నారు. ట్విటర్ లో పోస్టు చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది. ఫిబ్రవరి 1న షేర్ చేసిన ఈ వీడియోకు 1.5 లక్షల లైకులు వచ్చాయి. 78 వేల మందిపైగా రీట్వీట్ చేశారు. కాగా, ఒబామా మళ్లీ అమెరికా అధ్యక్షుడు కావాలని ప్రజలు కోరుకుంటున్నట్టు పబ్లిక్ పాలసీ పోలింగ్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. -
'చనిపోతానని అనుకున్నా'
లండన్: బ్రిటన్ వ్యాపారవేత్త, 'వర్జిన్' వ్యవస్థాపకుడు సర్ రిచర్డ్ బ్రాన్సన్(66) ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో తన ఇద్దరు పిల్లలతో కలిసి సైక్లింగ్ చేస్తున్న సమయంలో ఆయన ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఆయన వర్జిన్ వెబ్సైట్ ద్వారా వెల్లడించారు. ప్రమాదానికి గురి కాగానే తాను చనిపోతున్నట్లు భావించానని బ్రాన్సన్ వెల్లడించారు. ముఖంపై గాయాలతో ఉన్న ఫోటోలను ఆయన పోస్ట్ చేశారు. ప్రమాదంలో తలకిందులుగా పడిపోయానని, ఒక్కసారిగా మొత్తం చీకటిగా మారిందని తెలిపారు. అదృష్టవశాత్తూ దవడ, భుజాలకు మాత్రమే తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. కేవలం హెల్మెట్ ధరించడం మూలంగానే ప్రాణాలతో బయటపడినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. -
ఆ ఆరుగురి గురించి క్లుప్తంగా....
వాషింగ్టన్: జీవితంలో పైకి రావాలంటే ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని, ఉత్తమ వేతనాలు కలిగిన ఉన్నత పదవులను అధిష్టించాలని మనలో చాలా మంది భావిస్తారు. మనకు నచ్చిన రంగంలో రాణించాలంటే. పేరు ప్రఖ్యాతులతో పాటు అస్తుపాస్తులు అపారంగా సంపాదించాలంటే ఉన్నత విద్యలు అభ్యసించాల్సిన అవసరం ఏమీలేదని, రాణించాలనుకున్న రంగం పట్ల సరైన అవగాహన, అందుకు అవసరమైన తెలివితేటలు, అంతకన్నా చేసే పని పట్ల చిత్తశుద్ధి, అకుంఠిత దీక్ష ఉంటే సరిపోతుందని ప్రపంచంలో ఇప్పటికే ఎంతో మంది నిరూపించారు. వారిలో ఆరుగురి గురించి క్లుప్తంగా.... బిల్‌గేట్స్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బిల్‌గేట్స్ పర్సనల్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ప్రోగామ్ అభివృద్ధిపై తన 13వ ఏటనే దృష్టిని కేంద్రీకరించారు. 1973లో హార్వర్డ్ యూనివర్శిటీలో చేరారు. డిగ్రీ పూర్తిచేయకుండానే కాలేజ్ చదవుకు స్వస్తి చెప్పారు. ‘మైక్రోసాఫ్ట్’ను స్థాపించారు. కంపెనీని ఉన్నతస్థాయికి తీసుకెళ్లి పేరు ప్రఖ్యాతులతోపాటు అపార అస్తులను సంపాదించారు. అయినా తృప్తి పడకుండా వర్ధమాన దేశాల్లో పేదరికాన్ని సాధ్యమైనంత మేరకు తగ్గించి, ప్రజలకు కావాల్సిన ఆరోగ్య సౌకర్యాలను అందుబాటులోకి తేవాలన్న సత్సంకల్పంతో ‘బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్’ను స్థాపించి సామాజిక సేవ చేస్తున్నారు. స్టీవ్ జాబ్స్ మరో పర్సనల్ కంప్యూటర్ పయనీర్. పోర్ట్లాండ్లోని రీడ్ కాలేజీలో చేరారు. మధ్యలోనే కాలేజీ చదువుకు స్వస్తి చెప్పారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆపిల్ కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరయ్యారు. యూనివర్శిటీ చదువును మధ్యలో వదిలేయడం పట్ల ఆయన ఎన్నడూ పశ్చాతపడలేదు. పైగా మంచిపని చేశానని చెప్పుకున్నారు. ‘తల్లిదండ్రులు తమ జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్మును యూనివర్శిటీ చదువుల పేరిట తగలేయడం ఇష్టం అనిపించలేదు. అందుకే చదువును అర్ధాంతరంగా వదిలేసాను. అప్పుడు నేను జీవితంలో ఏం కావాలనుకుంటున్నానో కూడా నాకు క్లారిటీ లేదు. ఆరోజున పునరాలోచించి చదువు మానేయడం నేను జీవితంలో తీసుకున్న మంచి నిర్ణయాల్లో మంచి నిర్ణయం’ అని ఆయన వ్యాఖ్యానించారు. స్టీవ్ జాబ్స్ పిక్సర్ అనే సంస్థను కూడా స్థాపించారు. తొలి యానిమేటెడ్ సినిమాను నిర్మించిన ఈ సంస్థను తర్వాత డిస్నీ కొనుగోలు చేసింది. జెస్సికా ఆల్బా ‘సిన్ సిటీ’ లాంటి అవార్డు సినిమాల ద్వారా ఆమె మనకు ముందుగానే పరిచియం. ఆమె దానికే పరిమితం కాకుండా 2011లో వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు. ‘హానెస్ట్ కంపెనీ’ని ఏర్పాటు చేశారు. ఈకో ఫ్రెండ్లీ హౌజ్‌హోల్డ్ క్లీనింగ్ ఉత్పత్తులను ప్రారంభించారు. తాజా అంచనాల ప్రకారం ఇప్పుడు ఆమె కంపెనీ ఆస్తుల విలువ వంద కోట్ల డాలర్లు. డిగ్రీ కూడా చదవని ఆమె, వ్యాపార రంగంలో స్వీయకృషితో పైకొచ్చిన అమెరికా సంపన్నుల్లో ఒకరిగా 2015లో ప్రత్యేక గుర్తింపును పొందారు. రిచర్డ్ బ్రాన్సన్ పదో తరగతి కూడా చదువుకోలేదు. 16వ ఏటనే తన చదువుకు స్వస్తి చెప్పారు. మ్యూజిక్ ఆల్బమ్స్ ద్వారా వందల కోట్ల డాలర్లను ఆర్జించారు. ‘రోలింగ్ స్టోన్స్, సెక్స్ పిస్టల్స్’ కళాకారులతో కాంట్రాక్టులు కుదుర్చుకొని ప్రపంచ ప్రఖ్యాతి చెందారు. ‘చదువు ముఖ్యం కాదని నేను చెప్పడం లేదు. ఓ సైంటిస్ట్ కావాలన్నా, టెక్నీషయన్ కావాలన్నా, మేథమెటీషియన్ కావాలన్నా చదువు తప్పనిసరి. సక్సెస్ఫుల్ వ్యాపారవేత్త కావాలంటే బిజినెస్ స్కూల్‌కు వెళ్లి చదవుకోవాల్సిన అవసరం లేదు. జీవితాన్ని, అందులోని అనుభవాలను చదువుకుంటే చాలు’ అని ఆయన తన గురించి చెప్పుకున్నారు. బ్రాన్సన్ వర్జినీయా మొబైల్ ఫొన్ కంపెనీని స్థాపించారు. నోకియా బూమ్ రాకముందు ఈ ఫోన్లను బాగా అమ్ముడుపోయేవి. మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్బుక్ వ్యవస్థాపకుల్లో ఒకరైన జుకర్‌బర్గ్ 2004లో సంస్థను స్థాపించారు. దానిపై దృష్టిని కేంద్రీకరించడం కోసం హార్వర్డ్ యూనివర్శిటీలో చదువుకు స్వస్తి చెప్పారు. నెలకు 150 కోట్ల యూజర్లు కలిగిన ఫేస్బుక్ ఆస్తి 25వేల కోట్ల డాలర్లు. ‘ఏ రిస్క్ తీసుకోకపోవడమే జీవితంలో మనిషి చేసే అతి పెద్ద రిస్క్. యూనివర్శిటీ చదువుకు స్వస్తి చెప్పడం రిస్కే కావచ్చు. కానీ ఆ రిస్క్ నాలాంటి వాళ్లకు ఎంతో కలసొచ్చింది’ అని ఆయన తన గురించి చెప్పుకున్నారు. ఓప్రా విన్ప్రే మిసి్సిసీపిలో జన్మించిన విన్ప్రే జీవితంలో కటిక దరిద్య్రాన్ని అనుభవించారు. టీనేజీలోనే ప్రెగ్నెన్సీ సమస్యను ఎదుర్కొన్నారు. ఉన్నత చదువులను అభ్యసించాలనే లక్ష్యంతో టెన్నీస్ స్టేట్ యూనివర్శిటీలో చేరారు. అక్కడ వివిధ కళల్లో ఆరితేరారు. అక్కడ చదువు కొనసాగిస్తున్నప్పుడు స్థానిక రేడియో స్టేషన్లో ఉద్యోగం వచ్చింది. చదువుకు స్వస్తి చెప్పారు. కష్టపడి పనిచేశారు. ప్రపంచంలోనే మంచి రేడియో షో హోస్ట్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. స్వయం కృషితో అమెరికాలో పైకొచ్చిన సంపన్నుల్లో ఐదో వ్యక్తిగా మన్ననలు అందుకున్నారు. ‘జీవితంలో వైఫల్యం అనేది ఏదీ ఉండదు. ప్రతి వైఫల్యం జీవితానికి ప్రత్యామ్నాయ దారి చూపుతుంది’ అని ఆమె చెప్పారు. -
వారానికి మూడు రోజుల పనిదినాలా?
న్యూఢిల్లీ: వారానికి ఐదు, ఆరు రోజుల పనిదినాలంటే విసిగెత్తిపోయే ఉద్యోగులకు ఊరట కలిగించే వార్తను ప్రపంచ వ్యాపార దిగ్గజాలు అందించారు. ఉద్యోగుల నుంచి మెరుగైన ఫలితాలను ఆశించడానికి వారానికి మూడు పనిదినాలుండాలనే ఓ ప్రతిపాదనను వ్యాపార దిగ్గజాలు కార్లోస్ స్లిమ్, రిచర్డ్ బ్రాన్సన్ లు తీసుకొచ్చారు. రోజుకు 11 గంటలపాటు మూడు రోజుల పనిదినాలను ఉంటే ఎలా అనే తాజా ప్రతిపాదన భారతీయ పరిస్థితులకు సరితూగవని హెచ్ఆర్ నిపుణులు పెదవి విరిచారు. భారతీయ పరిశ్రమలకు, ఉద్యోగాలు ఈ తాజా ప్రతిపాదన అనుకూలంగా ఉండదని పలు కంపెనీలు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. కస్టమర్ సర్వీస్, రిటైల్, ఎంటర్ టైన్ మెంట్, హెల్త్ కేర్ రంగాల్లో మూడు పనిదినాల్లంటే కుదరదు అని ఎస్ఏపీ లాబ్స్ ఇండియా హెచ్ఆర్ టి.శివరాం తెలిపారు. గంటల ప్రతిపాదికన పనిచేసే ఉద్యోగులకు తాజా ప్రతిపాదన ప్రతికూలంగా మారుతుందని శివరాం అన్నారు. -
3 రోజుల ఆఫీసు మనకు తగదు..
న్యూఢిల్లీ: వారానికి మూడు రోజులే ఆఫీసు... రోజుకు 11 గంటల పని... ఈ పద్ధతి పాటిస్తే ఉద్యోగుల ఉత్పాదకత పెరుగుతుందంటున్నారు అంతర్జాతీయ ప్రముఖులు. ప్రపంచంలో రెండో అత్యధిక ధనవంతుడు, మెక్సికోకు చెందిన స్లిమ్ కార్లోస్, సుప్రసిద్ధ బ్రిటిష్ వాణిజ్యవేత్త రిచర్డ్ బ్రాన్సన్ తదితరులు ఈ కొత్త పద్ధతిపై అమితాసక్తి చూపుతున్నారు. ‘వారానికి మూడు రోజుల పని, నాలుగు రోజులు సెలవులుండడమే మంచిది. వారానికి ఐదారు రోజులకు బదులు రోజుకు 11 గంటల చొప్పున మూడు రోజులు పనిచేస్తే ఉత్పాదకత పెరుగుతుంది..’ అని వారు చెబుతున్నారు. భారతీయ విశ్లేషకులు మాత్రం ఈ అభిప్రాయంతో విభేదిస్తున్నారు. అనేక రకాల పరిశ్రమలు, ఉద్యోగాల్లో ఈ మోడల్ ఆచరణ సాధ్యం కాదని అంటున్నారు. ‘రోజుకు 11 గంటల పని అంటే రన్నింగ్ రేసు వంటిదే. కస్టమర్ సర్వీసు, రిటైల్, ఎంటర్టైన్మెంట్, హెల్త్‌కేర్ వంటి రంగాలకు కొత్త పద్ధతి అనువుగా లేదు. ఉత్పాదకత కీలకమైన వర్ధమాన దేశాల్లో మరిన్ని ఉద్యోగాలు కల్పించాల్సిఉంది. అందుకే, ఈ పద్ధతి భారత్‌కు తగినట్లుగా లేదు’ అని శాప్ ల్యాబ్స్ ఇండియా హెచ్ఆర్ హెడ్ టి.శివరామ్ చెప్పారు. ‘కొత్త మోడల్లో ఉద్యోగులు వారానికి 33 గంటలే పనిచేస్తారు. గంటల లెక్కన జీతం చెల్లిస్తారు. వారానికి 40 గంటల పనితో పోలిస్తే ఉద్యోగులకు వేతనాలు తగ్గుతాయి. ఆ లోటు పూడ్చుకోవడానికి మరో ఉద్యోగం వెతుక్కోవాలి’ అని అంటాల్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ మేనేజింగ్ పార్ట్నర్ జోసెఫ్ దేవాసియా పేర్కొన్నారు. -
వన్నె తగ్గని వర్జిన్ యజమాని!
సినిమా రంగంలో ప్రముఖుడిగా వెలుగుతూ, వ్యాపారవేత్తగా కోట్ల రూపాయల వ్యవహారాలను చక్కదిద్దుతూ... ఖాళీ సమయంలో థ్రిల్లిచ్చే గేమ్స్‌ను ఆడుతూ గడిపేయడం... ఇది ఏ రంగుల కల లాంటి జీవితం గురించో వర్ణన కాదు. రిచర్డ్ బ్రాసన్ వ్యక్తిగత జీవనశైలి గురించి వర్ణన. చాలా మందికి కల లాంటి జీవితాన్ని గడుపుతున్నాడాయన. హాలీవుడ్లో సినిమా స్టార్‌గా, వర్జిన్ మొబైల్ యజమానిగా, సముద్రాలపై సాహసక్రీడలతో జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. స్కూల్లో బ్రాసన్ తీరును గమనించి ఒక మాస్టారు... ‘‘రేయ్ నువ్వు అయితే కోటీశ్వరుడివి అవుతావు. లేకుంటే జైల్లో పడి, అక్కడే జీవితాన్ని ముగిస్తావు...’’ అనే వారట. మరి మాస్టారి మాటలపై గురి కుదిరిందో ఏమో కానీ కుర్ర బ్రాసన్ వెంటనే స్కూల్ మానేశాడు. చదువు మానేసి జీవితంలో సెటిలయ్యే మార్గాలను అన్వేషించడం మొదలుపెట్టాడు. అప్పటికి అతడికి 16 యేళ్లు, ఒక సాదాసీదా కుర్రాడు. కనీసం చదువు కూడా లేదు. అయితే ఏదో ఒకటి సాధించాలన్న తపన మాత్రం ఉంది. అదే అతడి చేత ఎన్నో ప్రయోగాలను చేయించింది. గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగేలా చేసింది. తీరా ఒకస్థాయికి చేరాక ఆ వెల్లువలో కొట్టుకుపోలేదు. సక్సెస్ కేవలం వ్యాపారంతోనూ, డబ్బుతోనూ ముడిపడి లేదని తనకు ఇష్టమైన రంగాలవైపు దృష్టిసారించి కొత్త మజాలను ఆస్వాదిస్తున్నాడు! స్కూలు చదువుకు సగంలోనే స్వస్తి చెప్పి ఖాళీగా ఉన్న సమయంలో కొంత పెట్టుబడితో ‘స్టూడెంట్’ అనే మ్యాగజైన్‌ను ప్రారంభించాడు బ్రాసన్. యువత లైఫ్‌స్టైల్‌కు గైడ్‌గా బ్రాసన్ తీర్చిదిద్దిన ఆ పత్రిక సూపర్‌సక్సెస్ అయ్యింది. బ్రాసన్ దశ తిరిగింది. 1970ల నాటికి బ్రిటన్‌లో వీడియో రికార్డ్‌లకు మంచి మార్కెట్ ఉండేది. బ్రాసన్ దృష్టివాటి మీద పడింది. అప్పటికే నాలుగేళ్లుగా పత్రికను వెలువరిస్తున్న ఈయన వీడియో రికార్డ్ డిస్క్ వ్యాపారంలోకి దిగాడు. లండన్‌లో ‘వర్జిన్ రికార్డ్స్’ పేరిట స్టోర్స్‌ను నెలకొల్పాడు. ఆ విధంగా ‘వర్జిన్’గ్రూప్‌కు పునాది పడింది. షాప్‌కు ‘వర్జిన్’ అని పేరు పెట్టడంలోనే బ్రాసన్ చమత్కారమంతా దాగి ఉంది. తన కంపెనీలు, ఐడియాలు ఎన్నటికీ వన్నెతగ్గనివని బ్రాసన్ విశ్వాసం. అందుకే ఆయన కంపెనీకి ఆ పేరు పెట్టుకొన్నాడు. 1999లో వర్జిన్ మొబైల్ కంపెనీని స్థాపించాడు. ప్రస్తుతం ఇండియాతో సహా చాలా దేశాల్లో ఈ నెట్వ ర్క్ అందుబాటులో ఉంది. వర్జిన్ మొబైల్ అధిపతిగా 300 కోట్ల పౌండ్లతో ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ వ్యాపారాల్లో ఒక ప్రముఖుడిగా నిలిచాడు బ్రాసన్. సినిమాలు, సాహసక్రీడలు! వ్యాపారవేత్తగా పనిలో మునిగితేలుతుండటం నుంచి వచ్చిన ఒక రకమైన విరక్తి బ్రాసన్ను సినిమాల వైపు మళ్లించింది. ‘ఫ్రెండ్స్’, ‘బే వాచ్’, ‘ది డే టుడే’వంటి టెలివిజన్ షోలలో బ్రాసన్ నటించాడు. ‘అరౌండ్ వరల్డ్ ఇన్ 80 డేస్’, ‘సూపర్‌మ్యాన్ రిటర్న్స్’ వంటి హాలీవుడ్ సినిమాల్లో కూడా చేశాడు. వ్యాపారం, ఖాళీ సమయాల్లో నటన.. ఇవి మాత్రమేగాక సాహసపూర్వకమైన ఆటల్లో కూడా బ్రాసన్ పేరు పొందాడు. వర్జిన్ మొబైల్స్ తరపునే ‘అట్లాంటిక్ క్రాసింగ్ ఛాలెంజర్’ జరుగుతుంది. ఈ పోటీల్లో బ్రాసన్ కూడా పాల్గొని విజేతగా నిలిచాడు, బెలూన్ ఫ్లైట్‌తో అట్లాంటిక్ మహాసముద్రం దాటాడు. ప్రస్తుతం బ్రాసన్ ఉన్న స్థాయిని బట్టి మాస్టారి అంచనాలు ఒకరకంగా నిజం అయ్యాయని చెప్పవచ్చు!