Branson’s Virgin Galactic To Sell Space Flight Tickets Starting At $450,000 - Sakshi
Sakshi News home page

SpaceTour: గుడ్‌ న్యూస్‌, టికెట్ల విక్రయం ప్రారంభం

Published Fri, Aug 6 2021 9:35 AM | Last Updated on Fri, Aug 6 2021 1:03 PM

Branson Virgin Galactic to sell space flight tickets starting at USD 450000 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటన్ వ్యాపారవేత్త సర్ రిచర్డ్ బ్రాన్సన్‌, అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్ బృందం రోదసీ యానాన్ని విజయవంతంగా ముగించుకొని వచ్చిన తరువాత స్పేస్‌ టూరిజంపై  ఏర్పడిన  క్రేజ్‌ అంతా ఇంతా కాదు. నింగిలోకి దూసుకెళ్లి అక్కడినుంచి భూమిని చూడాలన్న ఉత్సాహం, ఉత్సుకత అందరిలోనూ ఏర్పడింది. అయితే ఇది సామాన్య మానవుడికి అందని ద్రాక్షే. కోట్ల ఖరీదు చేసే ఈ అనుభవాన్ని సొంతం చేసుకోవడం ఒక్క శ్రీమంతులకే సాధ్యం. అంతరిక్షయానం చేయాలంటే 3 కోట్ల రూపాయలకు పైమాటే అంటోంది. వర్జిన్ గెలాక్టిక్. తమ స్పేస్ షిప్‌లో సీటు రిజర్వ్‌ చేసుకోవాలని పిలుపు నిస్తోంది.

అంతరిక్ష యాత్ర చేయాలనుకునేవారికోసం బ్రిటన్ బిలియనీర్ స్పేస్ షిప్ కంపెనీ వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్  తాజాగా ఈ  ఆఫర్‌ ప్రకటించారు. చరిత్రాత్మక రోదసీయాత్ర విజయవంతంగా  ముగించుకున్న కొన్ని వారాల తర్వాత స్పేస్‌ విమాన టికెట్ల విక్రయాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు.ఈ విమానంలో సీటు దక్కించుకోవాలంటే 450,000 (సుమారు రూ.3,33,82,682) డాలర్లు చెల్లించు కోవాలి.  అంతేకాదు ఇందుకు మూడు ప్యాకేజీలను  కూడా ప్రకటించింది. సింగిల్ సీట్, మల్టీ-సీట్ ప్యాకేజీ, ఫుల్ ఫ్లైట్ బై అవుట్  ఆఫర్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది. సో.. ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌ కింద టికెట్లు అందబాటులో ఉంటాయి. వచ్చే ఏడాది రెవెన్యూ విమానాలను ప్రారంభించే దిశగా పురోగతి సాధిస్తున్నట్లు స్పేస్-టూరిజం కంపెనీ గురువారం తెలిపింది.వర్జిన్ గెలాక్టిక్ తదుపరి అంతరిక్ష ప్రయాణం సెప్టెంబర్ చివరలో ఉండనుందని అంచనా. తాజా ప్రకటనతో  కంపెనీ  షేర్లు 5 శాతం దూసుకెళ్లడం విశేషం. 

కాగా జూలై 11న అంతరిక్ష సంస్థ వర్జిన్ గెలాక్టిక్‌కు చెందిన మానవ సహిత వ్యోమ నౌక వీఎస్ఎస్ యూనిటీ-22లో బ్రాన్సన్ రోదసీలోకి దూసుకెళ్లాడు. ఈ యాత్రలో భాగంగా  తెలుగు తేజం గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష మరో నలుగురున్నారు. ఆ తరువాత జూలై 20న  అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ బృందం కూడా  'న్యూ షెపర్డ్' రాకెట్‌లో రోదసి యాత్ర పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాది జూన్‌లో వర్జిన్ గెలాక్టిక్ ప్రజలను అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు యుఎస్ ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ నుండి వర్జిన్ గెలాక్టిక్  ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement