వాషింగ్టన్: జీవితంలో పైకి రావాలంటే ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని, ఉత్తమ వేతనాలు కలిగిన ఉన్నత పదవులను అధిష్టించాలని మనలో చాలా మంది భావిస్తారు. మనకు నచ్చిన రంగంలో రాణించాలంటే. పేరు ప్రఖ్యాతులతో పాటు అస్తుపాస్తులు అపారంగా సంపాదించాలంటే ఉన్నత విద్యలు అభ్యసించాల్సిన అవసరం ఏమీలేదని, రాణించాలనుకున్న రంగం పట్ల సరైన అవగాహన, అందుకు అవసరమైన తెలివితేటలు, అంతకన్నా చేసే పని పట్ల చిత్తశుద్ధి, అకుంఠిత దీక్ష ఉంటే సరిపోతుందని ప్రపంచంలో ఇప్పటికే ఎంతో మంది నిరూపించారు. వారిలో ఆరుగురి గురించి క్లుప్తంగా....
బిల్‌గేట్స్
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బిల్‌గేట్స్ పర్సనల్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ప్రోగామ్ అభివృద్ధిపై తన 13వ ఏటనే దృష్టిని కేంద్రీకరించారు. 1973లో హార్వర్డ్ యూనివర్శిటీలో చేరారు. డిగ్రీ పూర్తిచేయకుండానే కాలేజ్ చదవుకు స్వస్తి చెప్పారు. ‘మైక్రోసాఫ్ట్’ను స్థాపించారు. కంపెనీని ఉన్నతస్థాయికి తీసుకెళ్లి పేరు ప్రఖ్యాతులతోపాటు అపార అస్తులను సంపాదించారు. అయినా తృప్తి పడకుండా వర్ధమాన దేశాల్లో పేదరికాన్ని సాధ్యమైనంత మేరకు తగ్గించి, ప్రజలకు కావాల్సిన ఆరోగ్య సౌకర్యాలను అందుబాటులోకి తేవాలన్న సత్సంకల్పంతో ‘బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్’ను స్థాపించి సామాజిక సేవ చేస్తున్నారు.
స్టీవ్ జాబ్స్
మరో పర్సనల్ కంప్యూటర్ పయనీర్. పోర్ట్‌లాండ్‌లోని రీడ్ కాలేజీలో చేరారు. మధ్యలోనే కాలేజీ చదువుకు స్వస్తి చెప్పారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆపిల్ కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరయ్యారు. యూనివర్శిటీ చదువును మధ్యలో వదిలేయడం పట్ల ఆయన ఎన్నడూ పశ్చాతపడలేదు. పైగా మంచిపని చేశానని చెప్పుకున్నారు. ‘తల్లిదండ్రులు తమ జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్మును యూనివర్శిటీ చదువుల పేరిట తగలేయడం ఇష్టం అనిపించలేదు. అందుకే చదువును అర్ధాంతరంగా వదిలేసాను. అప్పుడు నేను జీవితంలో ఏం కావాలనుకుంటున్నానో కూడా నాకు క్లారిటీ లేదు. ఆరోజున పునరాలోచించి చదువు మానేయడం నేను జీవితంలో తీసుకున్న మంచి నిర్ణయాల్లో మంచి నిర్ణయం’ అని ఆయన వ్యాఖ్యానించారు. స్టీవ్ జాబ్స్ పిక్సర్ అనే సంస్థను కూడా స్థాపించారు. తొలి యానిమేటెడ్ సినిమాను నిర్మించిన ఈ సంస్థను తర్వాత డిస్నీ కొనుగోలు చేసింది.
జెస్సికా ఆల్బా
‘సిన్ సిటీ’ లాంటి అవార్డు సినిమాల ద్వారా ఆమె మనకు ముందుగానే పరిచియం. ఆమె దానికే పరిమితం కాకుండా 2011లో వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు. ‘హానెస్ట్ కంపెనీ’ని ఏర్పాటు చేశారు. ఈకో ఫ్రెండ్లీ హౌజ్‌హోల్డ్ క్లీనింగ్ ఉత్పత్తులను ప్రారంభించారు. తాజా అంచనాల ప్రకారం ఇప్పుడు ఆమె కంపెనీ ఆస్తుల విలువ వంద కోట్ల డాలర్లు. డిగ్రీ కూడా చదవని ఆమె, వ్యాపార రంగంలో స్వీయకృషితో పైకొచ్చిన అమెరికా సంపన్నుల్లో ఒకరిగా 2015లో ప్రత్యేక గుర్తింపును పొందారు.
రిచర్డ్ బ్రాన్సన్
పదో తరగతి కూడా చదువుకోలేదు. 16వ ఏటనే తన చదువుకు స్వస్తి చెప్పారు. మ్యూజిక్ ఆల్బమ్స్ ద్వారా వందల కోట్ల డాలర్లను ఆర్జించారు. ‘రోలింగ్ స్టోన్స్, సెక్స్ పిస్టల్స్’ కళాకారులతో కాంట్రాక్టులు కుదుర్చుకొని ప్రపంచ ప్రఖ్యాతి చెందారు. ‘చదువు ముఖ్యం కాదని నేను చెప్పడం లేదు. ఓ సైంటిస్ట్ కావాలన్నా, టెక్నీషయన్ కావాలన్నా, మేథమెటీషియన్ కావాలన్నా చదువు తప్పనిసరి. సక్సెస్‌ఫుల్ వ్యాపారవేత్త కావాలంటే బిజినెస్ స్కూల్‌కు వెళ్లి చదవుకోవాల్సిన అవసరం లేదు. జీవితాన్ని, అందులోని అనుభవాలను చదువుకుంటే చాలు’ అని ఆయన తన గురించి చెప్పుకున్నారు. బ్రాన్సన్ వర్జినీయా మొబైల్ ఫొన్ కంపెనీని స్థాపించారు. నోకియా బూమ్ రాకముందు ఈ ఫోన్లను బాగా అమ్ముడుపోయేవి.
మార్క్ జుకర్‌బర్గ్
ఫేస్‌బుక్ వ్యవస్థాపకుల్లో ఒకరైన జుకర్‌బర్గ్ 2004లో సంస్థను స్థాపించారు. దానిపై దృష్టిని కేంద్రీకరించడం కోసం హార్వర్డ్ యూనివర్శిటీలో చదువుకు స్వస్తి చెప్పారు. నెలకు 150 కోట్ల యూజర్లు కలిగిన ఫేస్‌బుక్ ఆస్తి 25వేల కోట్ల డాలర్లు. ‘ఏ రిస్క్ తీసుకోకపోవడమే జీవితంలో మనిషి చేసే అతి పెద్ద రిస్క్. యూనివర్శిటీ చదువుకు స్వస్తి చెప్పడం రిస్కే కావచ్చు. కానీ ఆ రిస్క్ నాలాంటి వాళ్లకు ఎంతో కలసొచ్చింది’ అని ఆయన తన గురించి చెప్పుకున్నారు.
ఓప్రా విన్‌ప్రే
మిసి్సిసీపిలో జన్మించిన విన్‌ప్రే జీవితంలో కటిక దరిద్య్రాన్ని అనుభవించారు. టీనేజీలోనే ప్రెగ్నెన్సీ సమస్యను ఎదుర్కొన్నారు. ఉన్నత చదువులను అభ్యసించాలనే లక్ష్యంతో టెన్నీస్ స్టేట్ యూనివర్శిటీలో చేరారు. అక్కడ వివిధ కళల్లో ఆరితేరారు. అక్కడ చదువు కొనసాగిస్తున్నప్పుడు స్థానిక రేడియో స్టేషన్లో ఉద్యోగం వచ్చింది. చదువుకు స్వస్తి చెప్పారు. కష్టపడి పనిచేశారు. ప్రపంచంలోనే మంచి రేడియో షో హోస్ట్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. స్వయం కృషితో అమెరికాలో పైకొచ్చిన సంపన్నుల్లో ఐదో వ్యక్తిగా మన్ననలు అందుకున్నారు. ‘జీవితంలో వైఫల్యం అనేది ఏదీ ఉండదు. ప్రతి వైఫల్యం జీవితానికి ప్రత్యామ్నాయ దారి చూపుతుంది’ అని ఆమె చెప్పారు.
ఆ ఆరుగురి గురించి క్లుప్తంగా....
Published Mon, Aug 1 2016 8:38 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM
Advertisement
Advertisement