
మీలో ఆశలు రేకిత్తించి వాటిని సాధించేందుకు ఓదారి చూపే ప్రతి వ్యక్తి గురువే. అలా అందరి జీవితాల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది గురువులు తారసపడుతారు. అలాంటి వారి సలహాలు, సూచనలు సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేందుకు ఉపయోగపడుతాయి. అలా గురువుల సాయంతో కొందరు వ్యాపారాల్లో స్థిరపడి మరెందరికో ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటి వ్యాపార దిగ్గజాలు తమ గురువుల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. అవేంటో తెలుసుకుందాం.
వారెన్‌బఫెట్
జీవితంలో కష్టనష్టాలు వారెన్‌బఫెట్‌కి అనేక పాఠాలు నేర్పాయి. తన తండ్రి హోవార్డ్ బఫెట్, కోచ్ బెంజమిన్ గ్రాహం, భార్య సుసాన్ బఫెట్ నుంచి ఎన్నో ఆర్థికపాఠాలు నేర్చుకున్నట్లు ఆయన చెప్పారు. సొంతంగా డబ్బు సంపాదించడం ఎలాగో తన తండ్రి నుంచి నేర్చుకున్నట్లు తెలిపారు. పెట్టుబడి నిర్వహణకు సంబంధించిన ఎన్నో విషయాలు ఆయన నేర్పించారని పేర్కొన్నారు.

బిల్‌గేట్స్
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్ తనకు వారెన్‌బఫెట్ ఎన్నో విషయాల్లో మార్గనిర్దేశం చేశారని చెప్పారు. హార్వర్డ్ యూనివర్సిటీలో మధ్యలో చదువు మానేసిన తర్వాత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నానని తెలిపారు. ఆ సమయంలో వారెన్‌బఫెట్ దీర్ఘకాల లక్ష్యాలతో డబ్బు ఎలా సంపాదించాలో నేర్పించినట్లు చెప్పారు.

జెఫ్‌బెజోస్
అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్‌బెజోస్ వారెన్‌బఫెట్, జేపీ మోర్గాన్ ఛైర్మన్ జామీ డిమోన్, డిస్నీ సీఈఓ బాబ్ ఇగర్‌లను తన గురువులుగా భావిస్తున్నట్లు చెప్పారు. వారెన్‌బఫెట్ తన పుస్తకాల్లో ఎన్నో విషయాలు పంచుకుంటారని, దాదాపు అన్నింటిని చదవడానికి ఇష్టపడతానని బెజోస్ అన్నారు. సంక్షిష్టమైన కంపెనీ ద్వారా పెట్టుబడి పెడుతూ డబ్బు ఎలా సంపాదించాలో డిమోన్‌ను చూసి నేర్చుకోవాలన్నారు. దీర్ఘకాలిక లక్ష్యాలను ఎలా నెరవేర్చుకోవాలో ఇగర్ ద్వారా తెలుసుకున్నానని చెప్పారు.

ఇలాన్‌మస్క్
ఎక్స్(ట్విటర్), టెస్లా, స్పేస్‌ఎక్స్ వంటి కంపెనీల అధినేత ఇలాన్‌మస్క్ స్పేస్‌ఎక్స్ బిజినెస్ డెవలప్‌మెంట్ హెడ్ జిమ్ కాంట్రెల్‌ను గురువుగా భావిస్తారు. మస్క్ కంపెనీలో పనిచేస్తున్న ఉన్నతాధికారులకు కాంట్రెల్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు. యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్‌జాబ్స్ పుస్తకాలు ఇప్పటికీ చదువుతున్నట్లు మస్క్ చెప్పారు. అవి తనకు మార్గదర్శకాలుగా పనిచేస్తాయని వివరించారు. బెంజమిన్ ఫ్రాంక్లిన్, నికోలా టెస్లా, థామస్ ఎడిసన్, ఐసాక్ న్యూటన్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ పుస్తకాలు ఎంతో ప్రేరణ ఇస్తాయన్నారు.

ఇదీ చదవండి: 2.75 లక్షల ఫోన్ నంబర్లకు చెక్
మార్క్ జుకర్‌బర్గ్
మెటా వ్యవస్థాపకులు మార్క్ జుకర్‌బర్గ్ యాపిల్ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్‌ను ఎంతో ఆరాధించేవారు. మేనేజ్‌మెంట్ నిర్వహణతోపాటు కంపెనీకి ప్రత్యేకంగా బ్రాండింగ్ ఎలా తీసుకురావాలో స్టీవ్ దగ్గరి నుంచి నేర్చుకున్నట్లు మార్క్ తెలిపారు.

Comments
Please login to add a commentAdd a comment