Jessica Alba
-
ఆ ఆరుగురి గురించి క్లుప్తంగా....
వాషింగ్టన్: జీవితంలో పైకి రావాలంటే ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని, ఉత్తమ వేతనాలు కలిగిన ఉన్నత పదవులను అధిష్టించాలని మనలో చాలా మంది భావిస్తారు. మనకు నచ్చిన రంగంలో రాణించాలంటే. పేరు ప్రఖ్యాతులతో పాటు అస్తుపాస్తులు అపారంగా సంపాదించాలంటే ఉన్నత విద్యలు అభ్యసించాల్సిన అవసరం ఏమీలేదని, రాణించాలనుకున్న రంగం పట్ల సరైన అవగాహన, అందుకు అవసరమైన తెలివితేటలు, అంతకన్నా చేసే పని పట్ల చిత్తశుద్ధి, అకుంఠిత దీక్ష ఉంటే సరిపోతుందని ప్రపంచంలో ఇప్పటికే ఎంతో మంది నిరూపించారు. వారిలో ఆరుగురి గురించి క్లుప్తంగా.... బిల్‌గేట్స్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బిల్‌గేట్స్ పర్సనల్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ప్రోగామ్ అభివృద్ధిపై తన 13వ ఏటనే దృష్టిని కేంద్రీకరించారు. 1973లో హార్వర్డ్ యూనివర్శిటీలో చేరారు. డిగ్రీ పూర్తిచేయకుండానే కాలేజ్ చదవుకు స్వస్తి చెప్పారు. ‘మైక్రోసాఫ్ట్’ను స్థాపించారు. కంపెనీని ఉన్నతస్థాయికి తీసుకెళ్లి పేరు ప్రఖ్యాతులతోపాటు అపార అస్తులను సంపాదించారు. అయినా తృప్తి పడకుండా వర్ధమాన దేశాల్లో పేదరికాన్ని సాధ్యమైనంత మేరకు తగ్గించి, ప్రజలకు కావాల్సిన ఆరోగ్య సౌకర్యాలను అందుబాటులోకి తేవాలన్న సత్సంకల్పంతో ‘బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్’ను స్థాపించి సామాజిక సేవ చేస్తున్నారు. స్టీవ్ జాబ్స్ మరో పర్సనల్ కంప్యూటర్ పయనీర్. పోర్ట్లాండ్లోని రీడ్ కాలేజీలో చేరారు. మధ్యలోనే కాలేజీ చదువుకు స్వస్తి చెప్పారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆపిల్ కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరయ్యారు. యూనివర్శిటీ చదువును మధ్యలో వదిలేయడం పట్ల ఆయన ఎన్నడూ పశ్చాతపడలేదు. పైగా మంచిపని చేశానని చెప్పుకున్నారు. ‘తల్లిదండ్రులు తమ జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్మును యూనివర్శిటీ చదువుల పేరిట తగలేయడం ఇష్టం అనిపించలేదు. అందుకే చదువును అర్ధాంతరంగా వదిలేసాను. అప్పుడు నేను జీవితంలో ఏం కావాలనుకుంటున్నానో కూడా నాకు క్లారిటీ లేదు. ఆరోజున పునరాలోచించి చదువు మానేయడం నేను జీవితంలో తీసుకున్న మంచి నిర్ణయాల్లో మంచి నిర్ణయం’ అని ఆయన వ్యాఖ్యానించారు. స్టీవ్ జాబ్స్ పిక్సర్ అనే సంస్థను కూడా స్థాపించారు. తొలి యానిమేటెడ్ సినిమాను నిర్మించిన ఈ సంస్థను తర్వాత డిస్నీ కొనుగోలు చేసింది. జెస్సికా ఆల్బా ‘సిన్ సిటీ’ లాంటి అవార్డు సినిమాల ద్వారా ఆమె మనకు ముందుగానే పరిచియం. ఆమె దానికే పరిమితం కాకుండా 2011లో వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు. ‘హానెస్ట్ కంపెనీ’ని ఏర్పాటు చేశారు. ఈకో ఫ్రెండ్లీ హౌజ్‌హోల్డ్ క్లీనింగ్ ఉత్పత్తులను ప్రారంభించారు. తాజా అంచనాల ప్రకారం ఇప్పుడు ఆమె కంపెనీ ఆస్తుల విలువ వంద కోట్ల డాలర్లు. డిగ్రీ కూడా చదవని ఆమె, వ్యాపార రంగంలో స్వీయకృషితో పైకొచ్చిన అమెరికా సంపన్నుల్లో ఒకరిగా 2015లో ప్రత్యేక గుర్తింపును పొందారు. రిచర్డ్ బ్రాన్సన్ పదో తరగతి కూడా చదువుకోలేదు. 16వ ఏటనే తన చదువుకు స్వస్తి చెప్పారు. మ్యూజిక్ ఆల్బమ్స్ ద్వారా వందల కోట్ల డాలర్లను ఆర్జించారు. ‘రోలింగ్ స్టోన్స్, సెక్స్ పిస్టల్స్’ కళాకారులతో కాంట్రాక్టులు కుదుర్చుకొని ప్రపంచ ప్రఖ్యాతి చెందారు. ‘చదువు ముఖ్యం కాదని నేను చెప్పడం లేదు. ఓ సైంటిస్ట్ కావాలన్నా, టెక్నీషయన్ కావాలన్నా, మేథమెటీషియన్ కావాలన్నా చదువు తప్పనిసరి. సక్సెస్ఫుల్ వ్యాపారవేత్త కావాలంటే బిజినెస్ స్కూల్‌కు వెళ్లి చదవుకోవాల్సిన అవసరం లేదు. జీవితాన్ని, అందులోని అనుభవాలను చదువుకుంటే చాలు’ అని ఆయన తన గురించి చెప్పుకున్నారు. బ్రాన్సన్ వర్జినీయా మొబైల్ ఫొన్ కంపెనీని స్థాపించారు. నోకియా బూమ్ రాకముందు ఈ ఫోన్లను బాగా అమ్ముడుపోయేవి. మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్బుక్ వ్యవస్థాపకుల్లో ఒకరైన జుకర్‌బర్గ్ 2004లో సంస్థను స్థాపించారు. దానిపై దృష్టిని కేంద్రీకరించడం కోసం హార్వర్డ్ యూనివర్శిటీలో చదువుకు స్వస్తి చెప్పారు. నెలకు 150 కోట్ల యూజర్లు కలిగిన ఫేస్బుక్ ఆస్తి 25వేల కోట్ల డాలర్లు. ‘ఏ రిస్క్ తీసుకోకపోవడమే జీవితంలో మనిషి చేసే అతి పెద్ద రిస్క్. యూనివర్శిటీ చదువుకు స్వస్తి చెప్పడం రిస్కే కావచ్చు. కానీ ఆ రిస్క్ నాలాంటి వాళ్లకు ఎంతో కలసొచ్చింది’ అని ఆయన తన గురించి చెప్పుకున్నారు. ఓప్రా విన్ప్రే మిసి్సిసీపిలో జన్మించిన విన్ప్రే జీవితంలో కటిక దరిద్య్రాన్ని అనుభవించారు. టీనేజీలోనే ప్రెగ్నెన్సీ సమస్యను ఎదుర్కొన్నారు. ఉన్నత చదువులను అభ్యసించాలనే లక్ష్యంతో టెన్నీస్ స్టేట్ యూనివర్శిటీలో చేరారు. అక్కడ వివిధ కళల్లో ఆరితేరారు. అక్కడ చదువు కొనసాగిస్తున్నప్పుడు స్థానిక రేడియో స్టేషన్లో ఉద్యోగం వచ్చింది. చదువుకు స్వస్తి చెప్పారు. కష్టపడి పనిచేశారు. ప్రపంచంలోనే మంచి రేడియో షో హోస్ట్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. స్వయం కృషితో అమెరికాలో పైకొచ్చిన సంపన్నుల్లో ఐదో వ్యక్తిగా మన్ననలు అందుకున్నారు. ‘జీవితంలో వైఫల్యం అనేది ఏదీ ఉండదు. ప్రతి వైఫల్యం జీవితానికి ప్రత్యామ్నాయ దారి చూపుతుంది’ అని ఆమె చెప్పారు. -
హెయిర్‘కట్’!
సినీ జనం ఏం చేసినా న్యూసే. ఎందుకో తెలియదు కానీ.. హాలీవుడ్ అందం జెస్సికా అల్బా తన జుత్తు కత్తిరించుకుంది. ఒంపులు తిరిగి.. వయ్యారాలు ఒలికించిన కురులను.. కురచగా చేసుకుంది. ‘బాబ్డ్ హెయిర్‌లో ఎంత ముచ్చటగా ఉన్నానో...’ అంటూ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసింది. ఈ న్యూ స్టయిల్‌ను తనకు సెట్ చేసిన హెయిర్ స్టయిలిస్ట్కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పడమే కాదు... అతనితో ఫొటో దిగి దాన్ని కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిందీ చిన్నది! -
ఫిట్నెస్ తార!
చాలా సాదాసీదాగా కనిపించే ఈ మహిళ ఇవాళ హాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులకు ఫిట్నెస్ ట్రైనర్. ఆమె దగ్గర ఫిట్నెస్ శిక్షణ పొందుతున్నవారి జాబితాలో జెస్సికా అల్బా, హ్యాలే బెర్రీ, అన్నే హాత్ఎవే, జాక్ ఎఫ్రాన్, బ్రాడ్లీ కూపర్ తదితరులున్నారు. ముఖ్యంగా కాబోయే తల్లులకు ఫిట్నెస్ విషయంలో ఆమె చెబుతున్న సూచనలు ఇవాళ ఎంతోమందిని ఆకర్షిస్తున్నాయి. ఇదే అంశంపై ఈమె పుస్తకం కూడా రాశారు. ‘‘అటు పాశ్చాత్య వ్యాయామ విధానాన్నీ, ఇటు ప్రాచ్య దేశాల ఆహారపుటలవాట్లనూ మేళవించుకొని ముందుకు సాగితే, ప్రసవం తరువాత కూడా అందంగా, ఆహ్లాదంగా ఉంటారు’’ అంటున్న రమోనా జీవిత పుస్తకం నుంచి కొన్ని పుటలు... బి.జీవన్ రెడ్డి ఒంటిని విల్లులా వంచి విన్యాసాలు చేసే జిమ్నాస్ట్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది రమోనా. తీరైన అథ్లెటిక్ శరీరాన్ని కలిగినప్పటికీ ఆ రంగంలో అంతపేరు ప్రఖ్యాతులు తెచ్చుకోలేకపోయింది. అయితే ఈ లాస్ఏంజెలెస్ మహిళ నిరాశకరమైన పరిస్థితుల్లో కూడా ఫిట్‌నెస్‌పై ఏమాత్రం పట్టుకోల్పోలేదు. జిమ్నాస్ట్‌గా ఉన్న నేపథ్యమే ఆమెను ఫిట్నెస్ట్రైనర్గా తీర్చిదిద్దింది. అనేకమందిని తీర్చదిద్దడానికి అవకాశాన్నిచ్చింది. అమెరికాలో జరిగే క్రీడా పోటీలు, స్పోర్ట్స్ ఈవెంట్లలో చీర్‌లీడర్స్‌కు ఎనలేని ప్రాధాన్యత ఉంది. ఐపీఎల్ వంటి టోర్నీల ద్వారా ఈ సంస్కృతి మనకూ పరిచయం అయ్యింది. మరి చీర్లీడర్ల శరీరాకృతి, వారి ఫిట్‌నెస్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పవనసరం లేదు. అలా ప్రేక్షకుల్లో ఉల్లాసాన్ని కలిగించే విన్యాసాలు చేయడానికి అనుగుణంగా చీర్‌లీడర్స్‌ను తీర్చిదిద్దే ఫిట్నెస్ ట్రైనర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది రమోనా. ఒక జిమ్నాస్ట్‌గా తనకు తెలిసిన ఫిట్నెస్ కిటుకులను వారికి చెబుతూ, తీర్చిదిద్దుతూ దాన్నే కెరీర్‌గా మార్చుకొంది. ఎలాంటి ఎక్సర్‌సైజ్‌తో శరీరంలో ఏయే వ్యవస్థలు ప్రభావితం అవుతాయి, ఏ మూమెంట్‌తో ఏ భాగానికి వ్యాయామం అందుతుంది అనే విషయాలను విపులంగా వివరిస్తూ తన దగ్గరకు ట్రైనింగ్‌కు వచ్చే వాళ్లను ఆకట్టుకొంటుంది రమోనా. ఈ నైపుణ్యమే ఆమెను అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు, హాలీవుడ్ స్టార్లకు ఫిట్నెస్ ట్రైనర్ అయేలా చేసింది. ఇప్పుడు హాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తున్న అనేకమంది హీరోయిన్లవి రమోనా తీర్చిదిద్దిన శరీరాకృతులే. ‘‘వారిని చూసినప్పుడు ముచ్చటేస్తుంది...’’ అని హాలీవుడ్ తారలతో తన ట్రైనింగ్ అనుభవాలను వివరిస్తారు రమోనా. అమ్మే స్ఫూర్తి...‘‘నాకు స్ఫూర్తి మా అమ్మ. ఆమె కూడా ఫిట్నెస్ ట్రైనరే. ట్రైనర్‌గా నాకంటూ ప్రత్యేకత సంపాదించడానికి అమ్మ గెడైన్స్ చాలా ఉపయోగపడింది..’’ అంటారు ఈ సెలబ్రిటీ ట్రైనర్. పర్యటన పరమార్థం అదే..! ఫిట్నెస్ ట్రైనర్‌గా కొన్ని వేల మైళ్లు ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. ఇలాంటి సమయంలో కేవలం జిమ్, కసరత్తులు మాత్రమే కాదు... ఆయా నాగరికతలను, అక్కడి ప్రజల జీవనశైలిని పరిశీలిస్తూ, వారి ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకొంటూ వారి శరీర సమతాస్థితిని విశ్లేషించే ట్రైనర్ తనలో నిద్రలేస్తుందని చమత్కరిస్తారు. చదవమని ఒక సలహా..! శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, శరీరాకృతిని తీర్చిదిద్దుకోవడానికి ఎన్నో సలహాలను చెప్పే రమోనా.. మంచి మంచి పుస్తకాలు ఎంపిక చేసుకొని చదవడం మనసుకి స్థిమితాన్ని ఇస్తుందంటారు. మరోకోణం.. జీవితం అంటే సాహసం చేయడం కూడా అంటారు రమోనా. పర్వతారోహణ చేయటం, సహారా ఎడారిలో బైక్‌రైడింగ్ చేయడం ఈమె హాబీలట.. బెంగళూరులోని పిరమిడ్ వ్యాలీలో ధ్యానం చేయడం తనకు ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఆకాంక్ష అని.. భారత పర్యటన ద్వారా దాన్ని నెరవేర్చుకొంటానని చెబుతారు. 3-2-1 ఫిట్నెస్ మంత్ర రమోనామొదటి పుస్తకం ‘ఫీల్ ఫిట్... లుక్ ఫెంటాస్టిక్ ఇన్ 3-2-1’ భారతీయ దేహాలను ఉద్దేశించి రాసినది. ఈ 3-2-1 శిక్షణ విధానం, పౌష్టికాహార ప్రణాళిక చాలా గమ్మత్తుగా ఉంటుంది. ‘‘ఫిట్నెస్ కోసం మానసికంగా సిద్ధపడాలి. శారీరకంగా తయారై, మానసికంగా ముందుకు సాగాలి. నా ఫిట్నెస్ సిద్ధాంతం 3-2-1. అర్థమయ్యేలా చెప్పాలంటే - 3 విడతలుగా కార్డియో వ్యాయాయం చేయాలి. 2 విడతలుగా శారీరక దృఢత్వాన్ని పెంచుకొనే ఎక్సర్సైజ్ చేయాలి. ప్రతి వర్క్ అవుట్‌లోనూ 1 విడత కీలకమైన సెగ్మెంట్ ఉండాలి. పౌష్టికాహారం విషయంలో కూడా 3-2-1 ఫార్ములాను అనుసరించాలి. రోజుకు 3 సార్లు భోజనం చేయాలి. రెండుసార్లు అల్పాహారం తీసుకోవాలి. రోజూ కనీసం 1 లీటరు మంచినీళ్ళు తాగాలి’’ అంటున్నారు రమోనా. ఈ ట్రైనర్ పేరుతో ఉన్న వెబ్సైట్లో కూడా వర్కవుట్ల సమాచారం ఉంటుంది. RAMONA321PRO ఇది ఐస్టోర్‌లో అందుబాటులో ఉన్న రమోనా అప్లికేషన్ పేరు. దీన్ని ఇన్స్టాల్ చేసుకొంటే ఫిట్నెస్ విషయంలో ఆమె సలహాలు, సూచనలు సొంతం చేసుకొన్నట్టే. అలాగే డీవీడీల రూపంలోకూడా రమోనా ఫిట్నెస్ మంత్ర అందుబాటులో ఉంది.