ఫిట్‌నెస్ తార!
చాలా సాదాసీదాగా కనిపించే ఈ మహిళ ఇవాళ హాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులకు ఫిట్‌నెస్ ట్రైనర్. ఆమె దగ్గర ఫిట్‌నెస్ శిక్షణ పొందుతున్నవారి జాబితాలో జెస్సికా అల్బా, హ్యాలే బెర్రీ, అన్నే హాత్‌ఎవే, జాక్ ఎఫ్రాన్, బ్రాడ్లీ కూపర్ తదితరులున్నారు. ముఖ్యంగా కాబోయే తల్లులకు ఫిట్‌నెస్ విషయంలో ఆమె చెబుతున్న సూచనలు ఇవాళ ఎంతోమందిని ఆకర్షిస్తున్నాయి. ఇదే అంశంపై ఈమె పుస్తకం కూడా రాశారు. ‘‘అటు పాశ్చాత్య వ్యాయామ విధానాన్నీ, ఇటు ప్రాచ్య దేశాల ఆహారపుటలవాట్లనూ మేళవించుకొని ముందుకు సాగితే, ప్రసవం తరువాత కూడా అందంగా, ఆహ్లాదంగా ఉంటారు’’ అంటున్న రమోనా జీవిత పుస్తకం నుంచి కొన్ని పుటలు...
బి.జీవన్ రెడ్డి
ఒంటిని విల్లులా వంచి విన్యాసాలు చేసే జిమ్నాస్ట్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది రమోనా. తీరైన అథ్లెటిక్ శరీరాన్ని కలిగినప్పటికీ ఆ రంగంలో అంతపేరు ప్రఖ్యాతులు తెచ్చుకోలేకపోయింది. అయితే ఈ లాస్‌ఏంజెలెస్ మహిళ నిరాశకరమైన పరిస్థితుల్లో కూడా ఫిట్‌నెస్‌పై ఏమాత్రం పట్టుకోల్పోలేదు. జిమ్నాస్ట్‌గా ఉన్న నేపథ్యమే ఆమెను ఫిట్‌నెస్‌ట్రైనర్‌గా తీర్చిదిద్దింది. అనేకమందిని తీర్చదిద్దడానికి అవకాశాన్నిచ్చింది. అమెరికాలో జరిగే క్రీడా పోటీలు, స్పోర్ట్స్ ఈవెంట్‌లలో చీర్‌లీడర్స్‌కు ఎనలేని ప్రాధాన్యత ఉంది. ఐపీఎల్ వంటి టోర్నీల ద్వారా ఈ సంస్కృతి మనకూ పరిచయం అయ్యింది. మరి చీర్‌లీడర్ల శరీరాకృతి, వారి ఫిట్‌నెస్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పవనసరం లేదు. అలా ప్రేక్షకుల్లో ఉల్లాసాన్ని కలిగించే విన్యాసాలు చేయడానికి అనుగుణంగా చీర్‌లీడర్స్‌ను తీర్చిదిద్దే ఫిట్‌నెస్ ట్రైనర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది రమోనా. ఒక జిమ్నాస్ట్‌గా తనకు తెలిసిన ఫిట్‌నెస్ కిటుకులను వారికి చెబుతూ, తీర్చిదిద్దుతూ దాన్నే కెరీర్‌గా మార్చుకొంది.
ఎలాంటి ఎక్సర్‌సైజ్‌తో శరీరంలో ఏయే వ్యవస్థలు ప్రభావితం అవుతాయి, ఏ మూమెంట్‌తో ఏ భాగానికి వ్యాయామం అందుతుంది అనే విషయాలను విపులంగా వివరిస్తూ తన దగ్గరకు ట్రైనింగ్‌కు వచ్చే వాళ్లను ఆకట్టుకొంటుంది రమోనా. ఈ నైపుణ్యమే ఆమెను అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు, హాలీవుడ్ స్టార్లకు ఫిట్‌నెస్ ట్రైనర్ అయేలా చేసింది. ఇప్పుడు హాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తున్న అనేకమంది హీరోయిన్లవి రమోనా తీర్చిదిద్దిన శరీరాకృతులే. ‘‘వారిని చూసినప్పుడు ముచ్చటేస్తుంది...’’ అని హాలీవుడ్ తారలతో తన ట్రైనింగ్ అనుభవాలను వివరిస్తారు రమోనా.
అమ్మే స్ఫూర్తి...‘‘నాకు స్ఫూర్తి మా అమ్మ. ఆమె కూడా ఫిట్‌నెస్ ట్రైనరే. ట్రైనర్‌గా నాకంటూ ప్రత్యేకత సంపాదించడానికి అమ్మ గెడైన్స్ చాలా ఉపయోగపడింది..’’ అంటారు ఈ సెలబ్రిటీ ట్రైనర్.
పర్యటన పరమార్థం అదే..! ఫిట్‌నెస్ ట్రైనర్‌గా కొన్ని వేల మైళ్లు ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. ఇలాంటి సమయంలో కేవలం జిమ్, కసరత్తులు మాత్రమే కాదు... ఆయా నాగరికతలను, అక్కడి ప్రజల జీవనశైలిని పరిశీలిస్తూ, వారి ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకొంటూ వారి శరీర సమతాస్థితిని విశ్లేషించే ట్రైనర్ తనలో నిద్రలేస్తుందని చమత్కరిస్తారు.
చదవమని ఒక సలహా..! శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, శరీరాకృతిని తీర్చిదిద్దుకోవడానికి ఎన్నో సలహాలను చెప్పే రమోనా.. మంచి మంచి పుస్తకాలు ఎంపిక చేసుకొని చదవడం మనసుకి స్థిమితాన్ని ఇస్తుందంటారు.
మరోకోణం.. జీవితం అంటే సాహసం చేయడం కూడా అంటారు రమోనా. పర్వతారోహణ చేయటం, సహారా ఎడారిలో బైక్‌రైడింగ్ చేయడం ఈమె హాబీలట.. బెంగళూరులోని పిరమిడ్ వ్యాలీలో ధ్యానం చేయడం తనకు ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఆకాంక్ష అని.. భారత పర్యటన ద్వారా దాన్ని నెరవేర్చుకొంటానని చెబుతారు.
3-2-1 ఫిట్‌నెస్ మంత్ర
రమోనామొదటి పుస్తకం ‘ఫీల్ ఫిట్... లుక్ ఫెంటాస్టిక్ ఇన్ 3-2-1’ భారతీయ దేహాలను ఉద్దేశించి రాసినది. ఈ 3-2-1 శిక్షణ విధానం, పౌష్టికాహార ప్రణాళిక చాలా గమ్మత్తుగా ఉంటుంది. ‘‘ఫిట్‌నెస్ కోసం మానసికంగా సిద్ధపడాలి. శారీరకంగా తయారై, మానసికంగా ముందుకు సాగాలి. నా ఫిట్‌నెస్ సిద్ధాంతం 3-2-1. అర్థమయ్యేలా చెప్పాలంటే - 3 విడతలుగా కార్డియో వ్యాయాయం చేయాలి. 2 విడతలుగా శారీరక దృఢత్వాన్ని పెంచుకొనే ఎక్సర్‌సైజ్ చేయాలి. ప్రతి వర్క్ అవుట్‌లోనూ 1 విడత కీలకమైన సెగ్మెంట్ ఉండాలి. పౌష్టికాహారం విషయంలో కూడా 3-2-1 ఫార్ములాను అనుసరించాలి. రోజుకు 3 సార్లు భోజనం చేయాలి. రెండుసార్లు అల్పాహారం తీసుకోవాలి. రోజూ కనీసం 1 లీటరు మంచినీళ్ళు తాగాలి’’ అంటున్నారు రమోనా. ఈ ట్రైనర్ పేరుతో ఉన్న వెబ్‌సైట్‌లో కూడా వర్కవుట్‌ల సమాచారం ఉంటుంది.
RAMONA321PRO
ఇది ఐస్టోర్‌లో అందుబాటులో ఉన్న రమోనా అప్లికేషన్ పేరు. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకొంటే ఫిట్‌నెస్ విషయంలో ఆమె సలహాలు, సూచనలు సొంతం చేసుకొన్నట్టే. అలాగే డీవీడీల రూపంలోకూడా రమోనా ఫిట్‌నెస్ మంత్ర
అందుబాటులో ఉంది.