రోదసిలో తెలుగు ఖ్యాతి | Virgin Galactic launches Richard Branson, others into space | Sakshi
Sakshi News home page

రోదసిలో తెలుగు ఖ్యాతి

Published Mon, Jul 12 2021 3:11 AM | Last Updated on Mon, Jul 12 2021 10:19 AM

Virgin Galactic launches Richard Branson, others into space - Sakshi

హ్యూస్టన్‌:  వర్జిన్‌ అట్లాంటిక్‌ ఎయిర్‌వేస్, వర్జిన్‌ గెలాక్టిక్‌ స్పేస్‌ టూరిజం కంపెనీ వ్యవస్థాపకుడు, బిలియనీర్‌ రిచర్డ్‌ బ్రాన్‌సన్‌ లేటు వయసులో అపూర్వమైన సాహస యాత్ర విజయవంతంగా పూర్తిచేశారు. అంతరిక్ష పర్యాటకానికి బాటలు వేస్తూ సొంత స్పేస్‌షిప్‌లో రోదసిలోకి ప్రయాణించి క్షేమంగా తిరిగి వచ్చారు. ఈ యాత్రలో 71 ఏళ్ల బ్రాస్నన్‌తోపాటు తెలుగు బిడ్డ శిరీష బండ్లతో సహా ఐదుగురు పాలుపంచుకున్నారు. వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థకు చెందిన స్పేస్‌షిప్‌ ‘వీఎస్‌ఎస్‌ యూనిటీ–22’తో కూడిన ట్విన్‌ ఫ్యూజ్‌లేజ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఆదివారం అమెరికాలోని న్యూమెక్సికో రాష్ట్రంలో ఎడారిలో ఏర్పాటు చేసిన ‘స్పేస్‌పోర్టు అమెరికా’ నుంచి ఆదివారం ఉదయం 10.40 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. వాతావరణం అనుకూలించకపోవడంతో 90 నిమిషాలు ఆలస్యంగా ఈ యాత్ర ప్రారంభమయ్యింది.

బ్రాన్‌సన్‌ భార్య, కుటుంబ సభ్యులతో సహా 500 మందికిపైగా జనం ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. 8.5 కిలోమీటర్లు(13 కిలోమీటర్లు) ప్రయాణించాక ఫ్యూజ్‌లేజ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ నుంచి ‘వీఎస్‌ఎస్‌ యూనిటీ–22’ విడిపోయింది. వెంటనే అందులోని రాకెట్‌ ఇంజన్‌ ప్రజ్వరిల్లింది. బ్రాన్‌సన్‌తోపాటు మరో ఐదుగురు ప్రయాణిస్తున్న ఈ సబ్‌ ఆర్బిటాల్‌ టెస్టుఫ్టైట్‌ భూమి నుంచి 55 మైళ్లు (88 కిలోమీటర్లు) నింగిలో ప్రయాణించి, రోదసిలోకి ప్రవేశించింది. అందులోని ఆరుగురు (ఇద్దరు పైలట్లు, నలుగురు ప్రయాణికులు) కొన్ని నిమిషాలపాటు భారరహిత స్థితిని అనుభూతి చెందారు. అనంతరం స్పేస్‌షిప్‌ తిరుగుప్రయాణం మొదలుపెట్టింది. భూవాతావరణంలోకి ప్రవేశించి, తన చుక్కానులను గ్లైడింగ్‌లుగా మార్చుకొని భూమిపైకి అడుగుపెట్టింది. రన్‌వేపై సురక్షితంగా ల్యాండయ్యింది. మొత్తం గంటన్నరలో ఈ ప్రక్రియ పూర్తయ్యింది.  

బెజోస్‌ కంటే ముందే..
రోదసిలోకి వెళ్లడానికి ఇదొక అందమైన రోజు అంటూ ఆదివారం ఉదయం బ్రాన్‌సన్‌ ట్వీట్‌ చేశారు. స్పేస్‌ టూరిజంలో తన ప్రత్యర్థి అయిన ఎలాన్‌ మస్క్‌తో కలిసి దిగిన ఫొటోను పోస్టు చేశారు. వచ్చే ఏడాది నుంచి రోదసి పర్యాటక యాత్రలకు శ్రీకారం చుట్టాలని వర్జిన్‌ గెలాక్టిక్‌ కంపెనీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఔత్సాహికుల నుంచి తగిన రుసుము వసూలు చేసి, రోదసిలోకి తీసుకెళ్లి, క్షేమంగా వెనక్కి తీసుకొస్తారు. ఇందులో భాగంగా ‘వీఎస్‌ఎస్‌ యూనిటీ–22’లో యాత్ర చేపట్టారు. కేవలం గంటన్నరలో రోదసిలోకి వెళ్లి రావొచ్చని వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ నిరూపించింది. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ సైతం స్పేస్‌ టూరిజం దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన ఈ నెల 20న సొంత రాకెట్‌ షిప్‌లో రోదసి యాత్ర చేపట్టనున్నారు.

బెజోస్‌ కంటే ముందే రోదసిలోకి వెళ్లాలన్న సంకల్పమే బ్రాన్‌సన్‌ను ఈ యాత్రకు పురికొల్పినట్లు సమాచారం. బ్రాన్‌సన్‌ వర్జిన్‌ గెలాక్టిక్‌ కంపెనీని 2004 నెలకొల్పారు. రోదసి యాత్ర కోసం ఇప్పటికే 600 మందికిపైగా ఔత్సాహికులు ఈ కంపెనీ వద్ద రిజర్వేషన్లు చేసుకోవడం గమనార్హం. ఒక్కొక్కరు 2,50,000 డాలర్ల (రూ.1.86 కోట్లు) చొప్పున చెల్లించారు. మొదట టిక్కెట్‌ బుక్‌ చేసుకున్నవారిని వచ్చే ఏడాది ప్రారంభంలో రోదసిలోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. 17 సంవత్సరాల కఠోర శ్రమ తమను ఇంతదూరం తీసుకొచ్చిందని బ్రాన్‌సన్‌ పేర్కొన్నారు. యాత్ర అనంతరం ఆయన తన బృంద సభ్యులకు అభినందనలు తెలిపారు. సొంత స్పేస్‌షిప్‌లో రోదసి యాత్ర చేసిన తొలి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. 70 ఏళ్లు దాటిన తర్వాత రోదసిలోకి వెళ్లిన రెండో వ్యక్తిగా మరో రికార్డు నెలకొల్పారు. 1998లో 77 ఏళ్లు జాన్‌ గ్లెన్‌ రోదసి యాత్ర చేశారు..  
శిరీష అంతరిక్షయాత్ర రాష్ట్రానికి గర్వకారణం

ఏపీ గవర్నర్, ఏపీ సీఎం ప్రశంసలు
సాక్షి, అమరావతి: గుంటూరులో జన్మించిన బండ్ల శిరీష అంతరిక్షయాత్రను విజయవంతంగా పూర్తిచేసుకోవడంపై ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో శుభాకాంక్షలు తెలిపారు. ఆమె అంతరిక్షయాత్ర రాష్ట్రానికి గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. ఆమె భవిష్యత్‌లో మరింత ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.  

మన శిరీష రికార్డు  
ఏరోనాటికల్‌ ఇంజనీర్‌ శిరీష బండ్ల(34) రోదసిలో ప్రయాణించిన మూడో భారత సంతతి మహిళగా రికార్డు సృష్టించారు. ఈ యాత్రలో తాను భాగస్వామి కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆమె జూలై 6న ట్వీట్‌ చేశారు. రోదసి యాత్రను ప్రజలకు సైతం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న వర్జిన్‌ గెలాక్టిక్‌ కంపెనీలో పని చేస్తుండడం తనకు గర్వకారణమని పేర్కొన్నారు. శిరీష బండ్ల ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో జన్మించారు. ఆమెకు నాలుగేళ్లు ఉన్నప్పుడు తల్లిదండ్రులు అమెరికా వెళ్లి, స్థిరపడ్డారు. శిరీష హ్యూస్టన్‌లో పెరిగారు. భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌ గతంలో అంతరిక్ష యాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన వింగ్‌ కమాండర్‌ రాకేశ్‌ శర్మ ఇప్పటిదాకా అంతరిక్షంలోకి వెళ్లిన ఏకైక భారతీయుడిగా రికార్డుకెక్కారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement