జాబిల్లిపై అడుగుపెట్టేందుకు ఇంకో దేశం సన్నద్దమైంది. అన్నీ సవ్యంగా సాగితే భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8:50 గంటలకు చందమామ ఉపరితలంపై జపాన్ ప్రయోగించిన ల్యాండర్ దిగనుంది. దీని అసలు నామధేయం ‘స్లిమ్’ విశదీకరిస్తే... స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్. ఇది 730 కిలోల వ్యోమనౌక. చంద్రుడిపై ‘స్లిమ్’ సజావుగా దిగితే ఆ ఘనత సాధించిన ఐదో దేశంగా జపాన్ అవతరిస్తుంది. ఆ పనిలో ఈసరికే సఫలమైన నాలుగు దేశాలు అమెరికా, రష్యా, చైనా, భారత్. ‘స్లిమ్’ మిషన్ కోసం జపాన్ ఏరో స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా) నిర్దేశించిన లక్ష్యం... ‘స్నైపర్’ పేరులోనే ఉంది. సూక్ష్మ/బహుదూరపు లక్ష్యాలను గురి తప్పకుండా గన్ సాయంతో ఛేదించే మిలిటరీ స్నైపర్ లాంటిదే ఈ మూన్ స్నైపర్ కూడా! చెప్పాలంటే... పిన్ పాయింట్ ల్యాండింగ్. జాబిలిపై ముందుగా నిర్ణయించిన లక్ష్యిత ప్రదేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ 100 మీటర్ల లోపే అంటే... కచ్చితంగా గీసిన గిరిలోపే (100 మీటర్ల వ్యాసం లోపే) ల్యాండరు దిగాల్సివుంటుంది!
పటలంపైనే ప్రావారం!
చంద్రమధ్యరేఖ (ఈక్వేటర్)కు దక్షిణంగా ‘సీ ఆఫ్ నెక్టార్’ సమీపంలోని షియోలి బిలం వాలుపై జపాన్ ల్యాండర్ కాలుమోపనుంది. ఈ ప్రదేశం ప్రత్యేకత ప్రస్తావనార్హం. మన భూమికి బాహ్య పొర ‘భూపటలం’ (క్రస్ట్), లోపలి పొర ‘ప్రావారం’ (మాంటిల్), మధ్యలో ‘కేంద్రకం’ (కోర్) ఉన్నట్టే చంద్రుడిలోనూ ఆ తరహా పొరలు ఉంటాయి. ‘మూన్ స్నైపర్’ దిగే ప్రదేశంలో చంద్రుడి ఉపరితలంపైనే చంద్రుడి ‘ప్రావారం’ దర్శనమిస్తుంది. (బహుశా ఉల్కలు, గ్రహశకలాలు ఢీకొట్టడం వల్లనో, చంద్రుడి అంతర్గత మార్పుల వల్లనో ప్రావారం కాస్తా వెలుపలికి చొచ్చుకొచ్చి పటలంలోనే... అది కూడా ఉపరితలంపైనే అందుబాటులో ఉన్న విశేష ప్రదేశం అది).
‘సీ ఆఫ్ నెక్టార్’ అనేది చంద్రుడిపై గతంలో సంభవించిన అగ్నిపర్వత చర్య వల్ల ఏర్పడిన సమతల ప్రదేశమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గ్రహశకలాల వంటివి ఢీకొని ఏర్పడిన బిలం ‘షియోలి క్రేటర్’ ఈ ‘సీ ఆఫ్ నెక్టార్’ మైదానంలోనే ఉంది. భూచంద్రుల మూలాన్వేషణలో ఈ ప్రదేశంలోని శిలలు కీలకమని టోక్యో విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ టొమోకత్సు మొరోట (స్పెషలైజింగ్ ఇన్ లూనార్ అండ్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్) వ్యాఖ్యానించారు.
మూడో యత్నం ఫలించేనా!
జపాన్ నిరుడు సెప్టెంబరు 7న H-11A రాకెట్ సాయంతో తనెగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి ‘స్లిమ్’ను ప్రయోగించింది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.830 కోట్లు. ఇది ఒన్ వే మిషన్. అంటే... వ్యోమనౌక గానీ, చంద్రుడి నమూనాలు గానీ భూమికి తిరిగిరావు. నౌక జాబిలిపై దిగడంతోనే ఖేల్ ఖతం. దానికి అప్పగించిన పని అక్కడితో సమాప్తం. జాబిలి నేలపై ల్యాండరును క్షేమంగా దించేందుకు జపాన్ చేస్తున్న మూడో ప్రయత్నం ఇది. 2022లో ‘ఒమతెనాషి’ ల్యాండరును చంద్రుడిపై దించే తొలి ప్రయత్నంలో ‘జాక్సా’ దానితో సమాచార సంబంధాలు కోల్పోవడంతో మిషన్ విఫలమైంది. నిరుడు రెండో యత్నంలో జపాన్ ప్రైవేటు అంకుర (స్టార్టప్) సంస్థ ‘ఐ స్పేస్ ఇంక్’ కూడా హకుతో-ఆర్-1ను జాబిలిపై దింపబోయి విఫలమైంది.
ఆ ల్యాండర్ దిగే క్రమంలో చంద్రుడిపై కూలిపోయింది. ఇక మన చంద్రయాన్-3 ‘విక్రమ్’ ల్యాండరుకు ముందు రష్యాకు చెందిన ‘లూనా-25’ ల్యాండర్ సైతం చంద్రుడిపై దిగబోతూ కుప్పకూలి ధ్వంసమైన సంగతి తెలిసిందే. అమెరికన్ స్టార్టప్ ‘ఆస్ట్రోబోటిక్’ గత వారం ఓ ల్యాండర్ ప్రయోగించింది. కానీ ఇంధనం లీక్ సమస్యతో ఆ మిషన్ మీద ఆశలు వదిలేసుకున్నారు. జపాన్ గతంలో రెండు చిన్న గ్రహశకలాలపై (ఆస్టరాయిడ్లపై) వ్యోమనౌకల్ని పిన్ పాయింట్ ల్యాండింగ్ చేయడంలో సఫలీకృతమైంది.
కానీ గ్రహశకలాలతో పోలిస్తే గురుత్వాకర్షణ అధికంగా ఉండే చంద్రుడిపై దిగడం మాత్రం సంక్లిష్ట కార్యం. ‘స్లిమ్’లో బేస్ బాల్ సైజున్న గుండ్రటి రోవర్ (రోలింగ్ రోబో)ను పంపారు. ‘జాక్సా’, జపాన్ బొమ్మల తయారీ కంపెనీ ‘టకారా టోమీ’ ఈ రోవరును రూపొందించాయి. జాబిలిపై దిగిన వ్యోమనౌకను అది ఫొటోలు తీస్తుంది. ‘స్లిమ్’ మిషన్ విజయవంతమైతే అంతరిక్ష రంగంలో జపాన్ దశ తిరిగినట్టే. ఒకవేళ శుక్రవారం (జనవరి 19) నాటి ప్రయత్నం కుదరకపోతే ‘స్లిమ్’ను జపాన్ వచ్చే నెల 16న చంద్రుడిపై దింపే ప్రయత్నం చేస్తుంది.
- జమ్ముల శ్రీకాంత్
Japan Spacecraft Moon Landing: జపాన్ గురి కుదిరేనా? చంద్రుడిపై ‘షార్ప్ షూటర్’!
Published Thu, Jan 18 2024 10:31 PM | Last Updated on Fri, Jan 19 2024 9:48 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment