చివరి ఫొటో పంపిన జపాన్ ‘స్లిమ్’ ల్యాండర్. చంద్రుడిపై షియోలి బిలంలో రాత్రి కమ్ముకోబోతుండగా సాయం సంధ్యకు కాస్త ముందుగా ల్యాండర్ తన కెమెరాలో బంధించిన ఆఖరి ఛాయాచిత్రాన్ని విడుదల చేసిన ‘జాక్సా’. జాబిలిపై రాత్రి అంటే... రెండు వారాలపాటు చీకటి. కనీస ఉష్ణోగ్రతలు మైనస్ 200 డిగ్రీల ఫారన్హీట్ అంటే మైనస్ 123 డిగ్రీల సెల్సియస్ దాకా పడిపోతాయి. ప్రస్తుతం నిద్రాణ స్థితిలోకి వెళ్లిన ‘మూన్ స్నైపర్’.
జాబిలిపై రాత్రివేళల్లో నమోదయ్యే అత్యల్ప ఉష్ణోగ్రతలను తట్టుకుని మనుగడ సాగించేలా ల్యాండరును పొందించలేదు. చంద్రుడి ఉపరితలంపై తలకిందులుగా దిగడంతో చావు తప్పి కన్ను లొట్టపోయి, ఆఖరి క్షణంలో సుడి కుదిరి ఇప్పటికే ల్యాండర్ ఒకసారి చచ్చి బతికినంత పని అయిన సంగతి తెలిసిందే.
చంద్రుడిపై 14-15 రోజుల అతి తీవ్ర చలి రాత్రిని ల్యాండర్ ఎలాగోలా తట్టుకుని లక్కీ ఛాన్సుతో మరోసారి బతికితే సూర్యుడు పుణ్యమాని సోలార్ ప్యానెళ్ల సౌరశక్తి సాయంతో ఈ నెల మధ్యం నాటికి ల్యాండరును మళ్లీ పని చేయిస్తామని ‘జాక్సా’ అంటోంది. కానీ... ఇది ‘పగటి కల’. చంద్రుడిపై రాత్రి వేళల మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల ధాటికి మన ‘ఇస్రో’ చంద్రయాన్-3‘ విక్రమ్’ ల్యాండర్ మూగబోయినట్టే జపాన్ ‘మూన్ స్నైపర్’ కూడా శాశ్వత నిద్రలోకి జారుకున్నట్టే భావించాలి.
Comments
Please login to add a commentAdd a comment